వివేక చూడామణి 20

🌹 *వివేక చూడామణి* 🌹
*20 వ భాగము*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
🍃  *బ్రహ్మము 3* 🍃
*237, 238. ఏది ఏవిధముగా పలికినప్పటికి ఈ విశ్వము ఉన్నతమైన బ్రహ్మమే అయి ఉన్నది. అదే నిజము. అది కాక వేరేది లేదు. అదే జ్ఞాన సారము. పవిత్రమైనది, కళంకములేనిది, మొదలు, అంతము లేనిది ఏమీ చేయనిది బ్రహ్మానంద స్థితి యొక్క అసలైన సారము.*
*మాయ వలన సృష్టించబడిన అనేక పదార్థములలో మాయ వలన మార్పు తెచ్చినది అదియే విజ్ఞానము, శాశ్వతము, బాధలకు లోనుకానిది, ఎల్లపుడు ఉండేది, విభజింపబడనిది, కొలతలకు అందనిది, ఆకారము లేనిది వేరు చేయుటకు వీలు లేనిది, పేరు లేనిది, స్వయం ప్రకాశమైనది, నిర్వికారమైనది, స్థిరమైనది ఆ బ్రహ్మమే.*
*239. పండితులైన వారు బ్రహ్మము యొక్క పూర్తి సత్యమును మరియు బ్రహ్మానికి దానిని తెలుసుకొనే వారికి, తెలుసుకొనే దానికి, తెలిసినది అనే భేదము లేదు. అది స్థిరమైనది. ఉన్నతమైన జ్ఞానానికి సారభూతమైనది.*
*240. దానిని విసరివేయటానికి, తీసుకొనుటకు వీలులేనిది. ఎందువలనంటే అది పదార్థము కాదు. మనస్సుకు, మాటలకు అందనిది. కొలుచుటకు వీలు లేనిది. మొదలు, చివర లేనిది. అదే మొత్తమైనది. అదే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ. అది కీర్తి ప్రతిష్టలకు అందనిది.*
*241, 242. ఆ విధముగా సృతుల ప్రకారము ''తత్వమసి'' అదే నీవు అనే మాట మరల మరల బ్రహ్మానికి వర్తింపజేస్తూంది. అదే, జీవుడు, ఈశ్వరులకు భేదము లేదిని తెలుపుతుంది. జీవేశ్వరుల సంబంధము భాష పరముగా కాకుండా అవి ఒక్కటే అయినప్పటికి వ్యతిరేకముగా చెప్పబడుచున్నది. ఎలా అంటే సూర్యుడు దాని ప్రకాశము లేక వెచ్చదనము వలె. అలానే రాజు సేవకుడు. బావి సముద్రము, మేరుపర్వతము అణువు వలె రెండు ఒక్కటే అయినప్పటికి వేరువేరుగా పిలువబడుచున్నది.*
🌹🌹🌹🌹🌹🌹🌹
🙏 *ప్రసాద్*

గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) 19th part

🌹 *గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌)* 🌹
*19 వ భాగము*
✍ రచన : *పేర్నేటి గంగాధరరావు*
🍃 *సాధనా చతుష్టయము - 1* 🍃
*94. యోగ విద్య యందు సాధకునికి నాలుగు రకములైన సాధన సంపత్తులు అవసరము.*
*1. నిత్యానిత్య వస్తు వివేకము.*
*2. ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము.* 
*3. శమ దమాది షట్‌ సంపత్తి.*
4. ముముక్షత్వము*
*95. నిత్యానిత్య వస్తు వివేకమనగా ప్రపంచమంతయు మాయయని, నశ్వరమని, ఆత్మ ఒక్కటె నిత్యమని, నాశరహితమని భావించుట.*
*96. ఇహా ముత్రార్థ ఫల భోగ విరాగము అనగా ఇహలోక, స్వర్గలోక సుఖములందు వైరాగ్యము.*
*97. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, భక్తి అను ఆరింటిని షట్‌ సంపత్తి అంటారు.*
*1. శమమనగా: అంతరింద్రియ నిగ్రహము, నిశ్చల సమాధి.*
*2. దమమనగా: బాహ్యేంద్రియ నిగ్రహము, విరక్తి వైరాగ్యములు.*
*3. ఉపరతి అనగా అరిషడ్వర్గములను జయించుట, విషయాసక్తి వీడుట.* 
*4. తితీక్ష అనగా సుఖఃదుఃఖములను ఓర్చుకొనుట, విషయ సమత్వము.*
*5. శ్రద్ధ అనగా గురువు యందు వేదాంత వాక్యములందు నమ్మకము కలిగి శ్రవణము, విచారణ చేయుట.*
*6. భక్తి అనగా గురువులను పూజించుట. శుశ్రూష చేయుట.*
*98. ముముక్షత్వము అనగా మోక్షము పొందుట యందు అభిలాష కలిగి అందుకు తగిన సాధన, యోగాభ్యాసము చేయుట, గురువులను ఆశ్రయించుట, శ్రవణాదులు చేయుట.*
*99. దివ్య దృష్టి గురువు ద్వారానూ, భగవంతుని అనుగ్రహము ద్వారాను పొందవచ్చు. అభ్యాసంతో దివ్యదృష్టిని అనగా జ్ఞాననేత్రములను(మూడవ కన్ను) పొందవచ్చు. దీని వలన ఆత్మానుభూతి పొందవచ్చు. వ్యాసుడు సంజయునకు, శ్రీకృష్ణుడు అర్జునునకు, బ్రహ్మంగారు సిద్థయ్యకు దివ్య దృష్టిని ప్రసాదించిరి.*

*జ్ఞానంతో పాటు దివ్య దృష్టి ఉన్నప్పుడు సుదూర ప్రాంతపు దృశ్యములను కూడా దర్శించవచ్చు. బ్రహ్మాండములోని దృశ్యములలో, భవిష్యత్తు సంఘటనలు దివ్య దృష్టి ద్వారా తెలుసుకోవచ్చు. ఈ శక్తిని నిరంతర యోగ సాధన ద్వారా పొందవచ్చు. జనుల మనస్సులోని విషయములు గ్రహించవచ్చు. ఉత్తమమైన అనన్య యోగులు ఈ శక్తిని పొందగలరు. కాని ఇవన్నీ మోక్షమునకు ప్రతిబంధకము.*
*100. యోగసిద్ధి: ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేక శాశ్వతమైన పరబ్రహ్మరూపములోనే లయించి యుండును. అట్టి వారే యోగసిద్ధిని పొందినట్లు. అందుకు కోరికలు త్యజించవలెను. మనస్సును నిగ్రహించవలెను. ఆత్మ స్థితి యందు సర్వమును లయించవలెను. అట్టి యోగికి పునర్జన్మలేదు. సంకల్పరహితుడు మనస్సును ఆత్మ యందు లయించి యుండును. శాంతిని పొందును. సమదృష్టి కల్గి సర్వ జీవరాశులు పరబ్రహ్మ స్వరూపమే అని జీవాత్మ పరమాత్మ ఒక్కటేనని గ్రహించును.*
*101. యోగము సిద్ధించాలంటే దృఢ సంకల్పము, సాధన, వైరాగ్యము, సాధనాఫలితముల కొరకు చూడకుండా సాధన నిరంతరము కొనసాగించుట. భౌతిక తాపత్రయములు వదలివేయుట. సుఖ దుఃఖములకు అతీతుడై ఉండుట. ఇంద్రియ నిగ్రహము, వాసనాక్షయము, భోగరాహిత్యము కలిగి ఉండుట. అట్టి వారే యోగసిద్ధిని పొందగలరు. వారినే యోగారూఢులందురు.*
*102. ఉత్తమ యోగి అయినవాడు నిరంతరము భగవంతుని యందు ఆత్మను లయింపజేయుట, శ్రద్ధ, దైవచింతన కల్గి ఉండును.*
🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*

ఆంజనేయుడు ఆధ్యాత్మికసాధకులకు ఆచార్యుడు

ఆంజనేయుడు ఆధ్యాత్మికసాధకులకు ఆచార్యుడు 

ఆంజనేయుడు శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి, లంకలో ప్రవేశించి, సీతాన్వేషణం చేసి కృతకృత్యుడు అయిన ఘటనల్నీ పరిశీలిస్తే సాధకునికి కావలసినది ఏమిటో తెలుస్తుంది.  

యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర చథా తవ / 
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి //

సాధకునికి నాలుగు లక్షణాలుండాలి. అవి ధృతి (దృఢ నిశ్చయం), దృష్టి (ఏకాగ్ర దృష్టి), మతి (బుద్ధి), దాక్ష్యం (దక్షత / సామార్ధ్యం). 
నూరు యోజనాల పొడవైన సముద్రాన్ని అవలీలగా దాటడం 'దృఢ నిశ్చయం'. తనపర్వతంపై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరిన మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరష్కరించి, గౌరవంగా చేతితో స్పృశించి, కాలవిలంభన చేయక, రామకార్యమనే లక్ష్యసాధనపట్లే ఏకాగ్రతను చూపడం 'దృష్టి'. అంగుష్ఠ పరిమాణమును దాల్చి,సురస అనే నాగమాత నోటిలోనికి ప్రవేశించి, వెన్వెంటనే బయల్పడి, ఆమె ఆశీర్వాదం పొంది, ముందుకు పయనించడం 'బుద్ధి'కుశలత. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని తన శక్తియుక్తులతో సంహరించి, లంకా నగరాధిదేవత లంకిణిని ముష్టిఘాతంచే నిలువరించగలగడం 'సామర్ధ్యం'. 
సాధకునికి తన లక్ష్యాన్ని సాధించాలన్న దృఢమైన నిశ్చయం అత్యవసరం. అలానే తన సాధననుండి ఏమాత్రమూ తొలగక ఏకాగ్రదృష్టిని కలిగియుండాలి. ఈ ఉత్కృష్ట సాధనలో సాధకునికి సాదానారంభంలో ఎన్నో అనుకూల ప్రతికూల బంధకాలు కలగవచ్చు. అనేక సిద్ధులు సిద్ధించవచ్చు. అలానే సాధకుని సామర్ధ్యమును, మానసికస్థైర్యంను, పట్టుదలను పరీక్షించడానికి పెద్దలు పెట్టె పరీక్షలు పలురకాలుగా ఉంటాయి. వీటిని యుక్తితో బుద్ధిబలంతో జయించగలిగే ప్రజ్ఞను కలిగియుండాలి. ప్రతిబంధకాలైన అవరోధాలను పూర్తిగా అధిగమించగలిగే దక్షతను కలిగియుండాలి. ఈ నాలుగు లక్షణాలు కలిగియున్న సాధకుడే కార్యసాధనాసమర్ధుడు.

అంతరింద్రియం / అంతఃకరణ చతుష్టయం

అంతరింద్రియం / అంతఃకరణ చతుష్టయం

శరీరం లోపల అంతర్గముగా నుండు సూక్ష్మతత్త్వములతో కూడియుండిన అంతఃకరణమునే అంతరింద్రియమని అందురు. పంచభూతముల యొక్క సూక్ష్మంశములే మనో, బుద్ధి, చిత్త, అహంకారంలతో కూడిన అంతఃకరణం. ఈ నాలుగింటితో కూడిన అంతఃకరణమునే అంతఃకరణ చతుష్టయం అంటారు. గాలి, అగ్ని, జలము, పృథ్వి, ఆకాశాంశలతో కూడినదే అంతఃకరణం.

అంతఃకరణముది ఆకాశతత్త్వం కాగా, మనస్సుది వాయుతత్త్వం, బుద్ధిది అగ్ని తత్త్వం, చిత్తముది జలతత్త్వం, అహముది పృథ్వితత్త్వం.

మనస్సు :- వాయుతత్త్వం అగుటచే నిరంతరమూ చలించుటకు కారణమగుచున్నది. ఇది చంచలమైనది. సంకల్ప, వికల్పములు దీని కార్యములు. అనిశ్చితస్థితి. చంద్రుడు అధిష్టానదేవత.

బుద్ధి :- అగ్ని అంశమగుటచే నిశ్చయించుగుణం కలిగియున్నది. నిశ్చలస్థితి. నిశ్చయం, మంచి చెడుల విచక్షణాజ్ఞానం దీని లక్షణం. స్వంత సామర్ధ్యం కలది. అధిష్టానదేవత పరబ్రహ్మ.

చిత్తము :- జలాంశమగుటచే మందగమనం దీని స్వభావం. అనేక విధములగు ఆలోచనలు కలది. ప్రాణి కోట్ల వృత్తులన్నియు దీనియందు యుండును. శరీరమునందలి సర్వేంద్రియములను చలింపజేస్తుంది. మహావిష్ణువు అధిష్టానదేవత.

అహంకారం :- పృధ్వీ అంశం. కాఠిన్యస్వభావం. నేను, నాది అను అభిమానమును కల్గించును. ఈ తత్త్వంతో చేయు క్రియలు, వాటిచే ఏర్పడిన గర్వం దీని స్వంతం. కోపం, రోషం, స్వార్ధం మొదలగు వాటికి ఈ అహమే కారణం. అధిష్టానదేవత రుద్రుడు.

ఈ అంతఃకరణ చతుష్టయం విజ్రుంభన ఆగి నిర్విషయస్థితి కలుగనంతవరకు అంతరశుద్ధి కలుగదు. అంతఃకరణశుద్ధి కానంతవరకు ఆత్మతత్త్వం గ్రహించలేం.

మౌనం

మౌనం -

                దైవభాష.
              సనాతనం.
              లిపి లేని విశ్వభాష.               ధార్మిక దివ్యత్వానికి ద్వారం.               సనాతన భాషాస్రవంతి. మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు) విజ్రుంభణను ఆపడం. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.
మౌనమంటే -                    నిరంతర భాషణ.                    చింత, చింతన లేని తపస్సు.                    అఖండ ఆనందపు ఆత్మస్థితి.                    విషయ శూన్యావస్థ. యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.
పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదుశాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహంవృత్తి ఏమాత్రం  ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. ఈ మౌనం మూడు రకాలు.
1. వాజ్మౌనం :-




                   వాక్కుని నిరోదించడం. ఈ రకమైన మౌనం వలన పరుషవచనాలు పలుకుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.

2. అక్షమౌనం :-
                
కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక యేకాగ్రనిష్టలో నుండుట. ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యానవైరాగ్యాలు బాగా అలవడుతాయి.


3. కాష్ఠమౌనం :-
      
 
దీనిని మానసిక మౌనమంటారు. మౌనధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనమంటారు. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.




దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా వున్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.

మౌనం -                       దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.                       గురువు మౌనం జ్ఞానానుగ్రహం.                       జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.                       భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన. ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు, మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.
మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధసంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్చలద్వారా, చర్యలద్వారా దేనిని తెలుసుకోలేరో, దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు వుంటాయి, కానీ; మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి.
మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు. పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం బలుమరు బల్కగ పల్కినచో నవి పల్కితినంచు దలంపక యే తలపులు లేక నిరంతర సౌఖ్యసుధారస మానుచు నుండుట ని ర్మలమగు మౌనము మారుతనందన! మానక దీవి భజింపదగున్.                                           - శ్రీ సీతారామాంజనేయ సంవాదం. ఓ వాయుపుత్రా! అవాజ్మనసగోచరమైన బ్రహ్మమే స్వస్వరూపభూతమైనదని నిశ్చయించి, యెప్పటికైనను ఏ మాటలనైనను మాటలాడక యోగి సదా యాత్మానుభవనిష్ఠుడై యుండును. ఒకవేళ మాట్లాడినను 'నేను మాట్లాడితిని' అని తలంపడు. ఇంత యేల? అతనికి సంకల్పములే వుండవు. ఇట్టిస్థితిగలిగి సర్వకాలములయందును స్వస్వరూపానందానుభావమును చెందుచుండుటయే మౌనం. 

'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం, ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.

ధ్యానం ద్వారా దివ్యత్వం

ధ్యానం ద్వారా దివ్యత్వం

ధ్యానం - అహంభావాన్ని చేదించి అతీతమానసమై అంతర్లయగా సాగేది.
ధ్యానం - దివ్యజీవనమునకు దోహదకారి.
ధ్యానం - ఆత్మాన్వేషణకై చేసే అంతర్యానం.
ధ్యానం - అంతరాన్న ఆత్మాపరమాత్మల అనుసంధానం.
ధ్యానం - ఆత్మ స్మృహ.
ధ్యానం - ఆత్మ దర్శనం.

ధ్యానంలో - అహంభావం అంతరిస్తుంది.
ధ్యానంలో - అహంకారం అడ్డుతొలగిపోతుంది.
ధ్యానంలో - ఆభిజాత్యం ఆవిరైపోతుంది.
ధ్యానంలో - అనుమానాలు అదృశ్యమౌతాయి.
ధ్యానంలో - అజ్ఞానం అంతర్దానమౌతుంది.
ధ్యానంలో - అంతర్యామియందు అపరిమితమైన అపేక్ష అంకురిస్తుంది.
ధ్యానంలో - అంతర్భూతంగా ఆధ్యాత్మికత అవతరిస్తుంది.
ధ్యానంలో - ఆరాధన అంతర్వాహినవుతుంది.
ధ్యానంలో - అభ్యాసంచే అన్నివేళలా అన్నింటా అంతటా ఆత్మభావం అలవడుతుంది.
ధ్యానంలో - మనసు అచలమై ఆత్మా ఆవిష్కృతమవుతుంది.