సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 21

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 21 🌹
21 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. Prasad Bharadwaj

🍃 సాధనా చతుష్టయము - 3 🍃

110. యోగసాధన వలన నాభియందు యోగాగ్ని జనించి వారివారి సుకృత, దుష్కృత కర్మలు, నశించి చివరకు సాధకులు బ్రహ్మైక్యము పొందుదురు.

111. సాధన ప్రారంభించి పూర్తికాకపోయినను తగిన ఫలము లభించును. మిగిలిన సాధనను మరుజన్మలో కొనసాగించి సిద్ధింప చేసుకొనవచ్చు.

112. ఆత్మ సాధన ద్వారా, వివిధ అనుభూతుల ద్వారా, ఆనంద పారవశ్యమును పొంది తుదకు పరమశాంతిని పొందును.

113. యోగసాధన వలన అనారోగ్యము నశించి సమస్త రోగములు దోషములు తొలగిపోవును.

114. ప్రతిగృహము ఒక యోగాశ్రమముగా మార్చుకొని సర్వులకు మార్గదర్శకముగా మార్చుకొనవచ్చును.

115. కుల, మత, జాతి, భేదము లేకుండా సర్వులకు ఆమోదయోగ్యమై, వ్యక్తి ఆటంకాలకు వీలు లేకుండా ఉండుట యోగము యొక్క ప్రత్యేకత.

116. భారతీయ యోగ ప్రాశస్త్యము, యోగ గ్రంథములు విదేశాలలో ప్రచారమై, యోగశక్తికి వారు ఆకర్షితులగుచున్నారు.

117. యోగము కల్ప వృక్షము, కామధేనువు, చింతామణి వంటిది అగుటయేగాక మోక్ష సిద్ధిని ప్రసాదించును.

118. యోగాగ్ని శరీరముగా గల వానికి వార్ధక్యముగాని, మరణముగాని తన అధీనములోనుండి సదా ఆరోగ్యవంతునిగా ఉంచును.

119. యోగాభ్యాసి శరీరము తేలికగా ఉండును. కంఠధ్వని స్పష్ఠముగా, మృదువుగా ఉండుటయేగాక శరీరము సుగంధమును వ్యాపింపజేయును. తేజోవంతముగా శరీరము ఉండును. ఎట్టి ప్రదేశములందైనను, శ్మశానమునందైనను, యోగి ఆనందమగ్నుడై యుండును.

120. ఇట్టి యోగమును సర్వ మానవాళి సద్వినియోగపర్చుకొని, పఠనము, శ్రవణము,అనుష్ఠానము ద్వారా దుఖఃములు, రోగములు తొలగించుకొని సుఖప్రాప్తి పొందుదురుగాక.

🌹 🌹 🌹 🌹 🌹