సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 26

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 26 🌹 
26 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మనస్సును జయించాలంటే - 2 🍃 

162. ప్రాణాయామము వలన మనస్సు ఆత్మ యందు నిశ్చలమై ఉండును. ప్రాణాయామములోని పూరక, కుంభక, రేచకములు మూడు విధములుగా మనోలయానికి తోడ్పడును. వీటన్నింటికి స్వప్రయత్నము ముఖ్యావశ్యకము.

163. శుద్ధమైన ఆహారము వలన మనస్సు శుద్ధి అగును. సాత్విక ఆహరము వలన మనసు సాత్వికమగును. సాత్విక అణువులు మనస్సును శుద్ధి చేయును. సత్వగుణ ప్రధానమైన మనసే శాస్త్ర జ్ఞానమును, గురుబోధను గ్రహించగలుగును. శాస్త్రపఠనము, శ్రవణము, వైరాగ్యము, సజ్జనసాంగత్యము, గురుశుశ్రూష ముముక్షువుకు ఆవస్యకము.

164. దీర్ఘ కాలము నిరంతర శ్రద్ధతో, నమ్మకంతో సాధన చేసిన మనస్సును నిగ్రహించవచ్చును. అభ్యాసము వలన ఎంతకష్టమైన దానినైనా సాధించవచ్చు.

165. ఎవరు తమ మనస్సును జయించెదరో వారు ఈ సమస్త భూ మండలమందు సౌభాగ్య వంతులు, శాంత పురుషులు, సత్పురుషులు, సాధుచిత్తులు. వారే ముక్తులు.

166. విషయారణ్యములోని అజ్ఞానమను బురదతో మనస్సు కళంకమైనది. దానిని ఆత్మానాత్మ వివేకమను జలముతో శుభ్రము చేయవలెను.

167. బెస్తవాడు నీటిలోని చేపను నీటి నుండి వేరుచేసి బంధించినట్లు సాధకడు తాను విలక్షణమై మనస్సును వెదకి పట్టుకొనవలెను. తదుపరి ఆ చేపవలె మనస్సు గిలగిల కొట్టుకుని నశిస్తుంది. చంచలమైన మనస్సను కోతిని, భక్తి సాధన అను తాటితో కట్టివేసి, దానిని బుజ్జగించి వశము చేసుకున్న అది మనకు ముక్తిని సిద్ధింపచేస్తుంది.

168. వృక్షమగు మనస్సు యొక్క మూలమును సమూలముగా పెకిలించి వేయని ఎడల, దాని కొమ్మలచివరలను మాత్రమే నరికిన, అది తిరిగి వేల కొలది కొమ్మలుగా పెరిగి మహా వృక్షమై మరల తిరిగి వృద్ధి పొందును. మనసు యొక్క మూలము మూలావిద్య, కనుక మూలావిద్య నశించవలెను.

169. మనస్సును మనస్సు చేతనే స్వాధీన పర్చుకొనవలెను. సూక్ష్మమైన శుద్ధ మనస్సు చేత మలిన మనస్సును తుడిచివేయవలెను. ఇది ఎట్లనగా పలుచని వస్త్రమును కుట్టుటకు సన్నని సూది కావలెను. దబ్బనము పనికిరాదు కదా! అట్లే సూక్ష్మ మనస్సు చేతనే వాసనామయమైన స్థూల రూప మనస్సును జయించవలెను. వజ్రమును వజ్రము చేత భేదించినట్లు మనస్సును మనస్సుతోనే జయించాలి. మదించిన ఏనుగును అదుపు చేయవచ్చును గాని మనస్సును జయించుటకు ఉపాయము కావలెను. ఆ ఉపాయము సంకల్పము చేయకుండుటయే! ప్రాణ క్రియ అనే అంకుశముచే సంకల్పము లుడిగిపోవును.

170. ప్రారంభ దశలో సాధకుడు చిత్తవృత్తుల నుండి మనస్సుని నిరోధించలేడు. అందుకు ముందుగా ధ్యానం, యోగము, జ్ఞానము, ఆత్మవిచారణ ద్వారా సూక్ష్మమైన తాత్కాలిక నిర్వికల్ప స్థితిని పొందిన తుదకు ఆత్మ ప్రాప్తించగలదు. ప్రతి దినము నిరంతరము అభ్యాసము చేయవలెను.

171. శరీరమునకు వ్యాధి ఉన్నట్లు మనస్సుకు కూడా వ్యాధి కలదు. తలంపులే మనస్సుకున్న వ్యాధి. ఈ వ్యాధికి మందు ధ్యానము, జ్ఞానము. శరీర వ్యాధికి కారణము వాతము, పిత్తము, కఫము. మనోవ్యాధికి కారణము మూడు గుణములు.
🌹 🌹 🌹 🌹 🌹