Showing posts with label దేవాపి మహర్షి బోధనలు. Show all posts
Showing posts with label దేవాపి మహర్షి బోధనలు. Show all posts

దేవాపి మహర్షి బోధనలు - 131


🌹. దేవాపి మహర్షి బోధనలు - 131 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 108. స్వస్వరూప జ్ఞానము 🌻


సద్గురువును భ్రూమధ్యమున ధ్యాన మార్గమున వివరముగ దర్శించుట గూర్చి ముందు పాఠములలో తెలిపితిని. తేజోమయమగు అతని రూపమును ఆ విధముగ దర్శించు సాధన యందు మీకు పట్టు చిక్కిన వెనుక, నీవు భ్రూమధ్యమున సద్గురువు పాదముల చెంత కూర్చున్నట్లుగా దర్శించుటకు ప్రయత్నింపుము. నీ ముందు నీవు కూర్చున్నట్లు భావింపుము. నీ ముఖమును, రూపమును వివరముగ ఏకాగ్రతతో దర్శించుము.

శ్రద్ధ, భక్తి, నిరంతరత్వము, సద్గురువు అనుగ్రహము కారణముగ నీకు నీవు గోచరించుట ప్రారంభమగును. నీకు గోచరించు నీవు, నీకన్న తేజోమయముగ నుందువు. అపుడు నీవు “అది నేనే”, “అతడు నేనే”, “అతడే నేను” అని భావింపుము. దీనినే సంస్కృతమున “సో హం" అందురు. అతడు నీవైనప్పుడు, నీ వెవడవో కూడ నీకు తెలియును. అతడు తేజోమయుడు.

నీవు మృణ్మయుడవు. అప్పటి నీ భావన యిట్లుండును. "నేను తేజోమయుడను. ఈ మృణ్మయుడు నా గృహము, నా నివాసము, నా దేహము. అది నేను కాదు. నా నుండి అది ఏర్పడినది. దాని యందింతకాలము నీర, క్షీర న్యాయముగ కలిసి యున్నది. ఇపుడు విడిపడి నేను 'నేనుగ' నున్నాను. నా దేహమునందుండి పనులు చేయుదును.

అటుపైన దేహమును విడిచెదను. దాని నుండి విడిపడుటచే మరణించను. అది మరణించును. నేనుందును.” ఇట్టి క్షరాక్షరజ్ఞానము నీకు కలుగును. ఇది ధ్యానము వలననే సాధ్యము. కేవలము భావించుట వలన సాధ్యము కాదు. ఈ ధ్యానము సాధ్యపడుటకు కాలము, కర్మము కలసిరావలెను. అందులకై పరహిత కార్యములందు దీర్ఘకాలము సమర్పితుడవై జీవించవలెను. స్వార్థపరులకు యిది అసాధ్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


24 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 130


🌹. దేవాపి మహర్షి బోధనలు - 130 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 107. స్వస్వరూప దర్శనము 🌻


మైత్రేయ మహర్షి జీవుని పునరుత్థానమునకే అవతరించి యున్నాడు. అతని బోధనలన్నియు జీవుడు తనకు తాను శాశ్వతుడనని, నశింపనివాడనని, జననమరణముల కతీతుడనని తెలియ చేయుటకే. అది అతని ప్రధాన కార్యక్రమము. తూర్పుదేశములందు యీ అవగాహన జీవతత్త్వమున యిమిడి యున్నది. అనుభూతియే యింకను కొదవ. దానికి యోగసాధనమే మార్గము.

అందుచే అతని అనుయాయులమైన మేము అందరమును పై విషయములు బోధించుచు, వివిధ యోగసాధనా మార్గముల నందించు చున్నాము. అష్టాంగయోగమునకు కూడ అతడే అధిపతి. భాగవత మార్గమున విశ్వప్రేమను రుచి చూపుటకు కూడ అతడే ఉపదేశకుడు. భూమిపై అయన జీవనము కేవలము మానవుల పునరుత్థానము కొరకే.

మైత్రేయమహర్షి జాతికి స్ఫూర్తినిచ్చు విషయమున నిర్విరామముగ కృషిచేయుచు, మావంటి వారిని ప్రతినిత్యము హెచ్చరిక చేయుచునుండును. ఆయనెపుడూ మాతో పలుకు వాక్యము “త్వర పడుడు, ఆలస్యము పనికి రాదు. ఆనందమందరికిని అందవలెను. కర్తవ్యమున ఏ మాత్రము అలసత్వముండరాదు.” ఆయన పలుకు నప్పుడు అహర్నిశలు కృషిచేయుచున్న మాకు కూడయింకను చేయ వలసిన పని చాల మిగిలి యున్నదనిపించును. ఆయన దర్శనము, వాక్కులు మాలోనికి చొచ్చుకొనిపోయి యినుమడించిన ఉత్సాహము ఏర్పడును.

ఆయనను గూర్చి స్మరించినప్పుడెల్ల నాకిట్లనిపించు చుండును. “ఈ మైత్రేయుని కెంత కరుణ! ఈ రోజుననే జాతి అంతయు మేల్కాంచి ఆనందమయ లోకములలో ప్రవేశింపవలెనని తపన చెందు చున్నట్లుగ గోచరించును. జగన్మాతకు ఎంత కరుణ కలదో, ఆ కరుణ అంతయు ఆయన చూపుల నుండి ప్రసరించి, మేల్కొనిన వారిని కూడ మరింత మేలుకొల్పును కదా! ఆయన కన్నులు అనిర్వచనీయ మగు కరుణాపూరితము !!


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


22 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 129


🌹. దేవాపి మహర్షి బోధనలు - 129 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 106. సద్గురు రూప ధ్యానము 🌻


నీ సద్గురువు యొక్క ముఖారవిందమును అతని రూపమును, నీవు వివరముగ ధ్యానము నందు దర్శించుట నీకెన్నియో విధములుగ మేలు చేయును. అతని సహకారమున నీవు చాల విషయములను దర్శనము చేయగలవు. నీ దృష్టికి చేయవలసిన ప్రణాళిక దర్శన మగును. బోధనలు వ్రాతపూర్వకముగ దర్శనమగును. నీ వద్దకు రాబోవు మనుష్యులు, వస్తువులు, ధనము కూడ ముందుగనే దర్శన మగును. వానిని వినియోగించు ప్రణాళికలు కూడ దర్శనమగును. దివ్యమగు విషయములెన్నియో గోచరించును. క్రమముగ యితర గ్రహముల నుండి కూడ వలసిన ప్రశక్తి కూడ లభించును. మేమట్లే గ్రహగోళాదుల నుండి మీకెన్నియో విలువైన విషయములను కొనివచ్చి పంచుచున్నాము. ఇందు ఆశ్చర్యపడవలసినదేదియు లేదు.

మీ ఆజ్ఞా కేంద్రము సర్వలోకములకు ముఖద్వారము. నీవచ్చట దర్శనమునకై చేయు నిరంతర సాధన, నీ గురువు యొక్క సహకారము కారణముగ యిట్టివి జరుగగలవు. క్రమముగ మీ మూడవకన్ను తెరవబడగలదు. అప్పుడు నీకు క్రమముగ అనంతవిశ్వము, అందు పని చేయుచున్న అనేకానేక ప్రజ్ఞలు, శక్తులు పరిచయము కాగలవు. నీవు ఒక అయస్కాంతమువలె వానినాకర్షించ గలవు. మీకు ఈ విధమైన మేలుకొలుపు నందించిన సద్గురువును మార్గమును మాత్రము మరువకుము. మరచినచో నిశీధిని (చీకటి యందు) ఆలంబనము లేక గజిబిజి కాగలవు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 128


🌹. దేవాపి మహర్షి బోధనలు - 128 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 105. దైవ నిర్ణయము 🌻


యాత్రికుడొకడు ఓడ నెక్కుచు నుండగ అతని బంగారపు నగల మూట దొంగిలింపబడెను. అందరును కలత పడుచు, “దొంగ, దొంగ” అని “పట్టుకొనుడు పట్టుకొనుడు” అని “అయ్యో అయ్యో” అని అరచుచు అలజడి గావించిరి. యాత్రికుడు మాత్రము దొరకక పారిపోయిన దొంగ వైపు చూచి తోటి యాత్రికులతో నిర్లిప్తముగ "దైవ నిర్ణయము” అని మృదువుగ పలికినాడు. అందరును అతని వైపుర్యముగ చూచినారు. అతనిని గూర్చి కొందరు ప్రశంసించుకొనిరి. మరికొందరు పాపమనిరి. మరికొందరు "కర్మ” యనిరి. మరికొందరు “అశ్రద్ధ" యనిరి. ఇంకొందరు “దొంగిలింపబడినది, దొంగిలింపబడినది" అని పలికిరి.

ఓడ కదిలినది- అది పెద్ద ప్రయాణము. మూడు పగళ్ళు, రాత్రుళ్ళ గడచిన వెనుక సముద్ర మధ్యమున ఓడ తుఫానుకు గురియైనది- సముద్ర మధ్యమున గల ఒక రాతిని గుద్దుకొని, ఓడ బీటలు వారినది. పడవ మునుగుట మొదలిడినది. ప్రయాణికు లందరును ప్రాణములు చేత బట్టుకొని సముద్రములోనికి దుమికిరి. ఎవరి ప్రయత్నము వారు గావించిరి. యాత్రికుడు ఓడ నుండి చెదిరి పడిన ఒక చెక్కముక్క ఆధారముగ ద్వీపము నొకటి చేరినాడు. ద్వీప వాసులు అతని నాదరించి శుశ్రూషలు చేసి స్వస్థత కూర్చిరి.

ద్వీపవాసులు యాత్రికునితో నిట్లనిరి “నీవు పయనించిన ఓడ సముద్ర మధ్యమున మునిగినది. వందలాది యాత్రికులు ప్రాణములు కోల్పోయినారు. నీ వొక్కడివే మిగిలినావు. నీ అదృష్టమేమిటో తెలియకున్నది. నీవు మిగులుట ఒక అద్భుతము.” యాత్రికుడిట్లని సమాధాన మిచ్చెను. “నేను ఓడ ప్రయాణమునకు కొన్న టిక్కెట్టు ఖరీదు చాల ఎక్కువ. ఖరీదైన టిక్కట్టుతో ఓడ ఎక్కితిని. అది దైవనిర్ణయము. ఓడ మునుగుట దైవనిర్ణయము. నేను మిగులుట దైవనిర్ణయము.” అంతా దైవనిర్ణయమని తెలియుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


18 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 127


🌹. దేవాపి మహర్షి బోధనలు - 127 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 104. పెద్దరికము 🌻


అకస్మాత్ సంఘటనలలో చెదరకుండుట ఒక సాధన. ఆశ్చర్యపడుట, నిశ్చేష్టుడగుట సర్వసామాన్యము. కలవరపడుట, ఆనందోత్సాహముతో తబ్బిబ్బగుట, ఇవి అన్నియు సర్వసామాన్యములే. ఇట్లగుట చిన్నపిల్లలవంతు. అప్పటికప్పుడు నవ్వుదురు. వెంటనే ఏడురు. ఇది పిల్లల తత్త్వము.

అట్లుకాక అన్ని సమయముల యందు, సన్నివేశముల యందు, ఒకేతీరున ప్రశాంతముగ నిర్లిప్తముగ నుండుట పెద్దరికము. ఇది వయస్సును రది కాదు. జీవి

లోతును బట్టి వచ్చునది. జీవచైతన్యము సెలయేరువలె సాగినచో నిర్మలముగ నుండును. దూకుట, పడుట జరిగినచో బురదగ నుండును.

ఈ సాధనకు ఒక సత్యమును గ్రహించవలసి యున్నది. “ఎప్పుడు ఎక్కడ, ఎవరికైనను ఏదైనను జరుగవచ్చును.” సృష్టిలో అకస్మాత్ విషయమేమియును లేదు. గ్రహింపు గలవారికి అకస్మార్లు లేవు. అన్నియును సృష్టి యందు క్రమముగనే జరుగును. లోదృష్టి యున్నప్పుడే అది గమనింపబడును. లేనప్పుడు గమనింపబడవు. ఈ అవగాహనతో నిత్యజీవితమును గడుపువారికి విద్యుత్ ఘాతములు (Shocks) అనునవి ఉండవు. ఈ స్థితి జేరుటకు ఒక సులభమగు మార్గమున్నది.

మీ గురువు లేక దైవము యొక్క రూపమునే మొదలు ధ్యానమందు స్థిరపరచుకొనుడు. ఆయన చేతన యందు మీ చేతన లయము చేయుటకు ప్రయత్నింపుడు. వారిలో మీరు లీనమైనట్లు భావింపుడు. తత్ఫలితముగ మీ యందు వారే వసించియున్నట్లు భావింపుడు. ఇది చాల వివరముగ జరుగవలెను.

అప్పుడు మీ గురువు లేక దేవత యొక్క ఎఱుకయే మీ ఎఱుకగ పనిచేయగలదు. సంకల్ప మాత్రమున మీ మనోఫలకముపై మీ సద్గురువు యొక్క రూపముగానీ, మీరు ఆరాధించు దైవము యొక్క రూపముగాని స్పష్టముగ దర్శించ గలిగిననాడు మీకు ఈ సిద్ధి కలుగును. అట్లు జరిగినచో అపుడు, ఆకస్మికములగు అపాయములు, అద్భుతములేమియు నుండవు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


16 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 126


🌹. దేవాపి మహర్షి బోధనలు - 126 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 103. బహుముఖత్వము 🌻

మరియొక సాధన చెప్పుచున్నాను. మీరొక చేయితో పనిచేయు చున్నప్పుడు రెండవ చేతితో మరియొక పని చేయుగలరా? సామాన్య ముగ చేయలేరు. రెండు చేతులతో రెండు భిన్నమైన పనులను చేయుట ప్రయత్నింపుడు. అట్లే ఒకే సమయమున రెండు భిన్నమైన ఉత్తరములు, చెప్పుటకు ప్రయత్నింపుడు. ఇద్దరు వ్యక్తులతో ఒకేసారి (Alterna-tingగా) మాట్లాడుటకు ప్రయత్నింపుడు. అట్లే వాహనము నడుపుచు మాట్లాడుటకు ప్రయత్నింపుడు. మీరు వాదన చేయుచున్నప్పుడు, ఎదుటి వ్యక్తి అసహనమునకు గురి అగుచున్నచో చటుక్కున వాదన మార్గమును మార్చుడు.

పై విధముగ చేయుటలో మీచేతనను ఒకే సమయమున రెండు విధములుగ ప్రవహింపచేయు అలవాటేర్పడును. అట్లు చేయుటలో చేతన ప్రవాహము సన్నగిల్లరాదు. ఒకే చైతన్యము రెండు రకములుగ ప్రవహించుటచే సృష్టి ఏర్పడుచున్నది. మీ నుండి కూడ సృష్టి జరుగుట కిదియొక ప్రక్రియ. ఉదాహరణకు, మా ప్రియశిష్యుడు జ్వాలా కూలుడు ఒకే సమయమున రెండు కాదు, మూడు పనులు చేయుట నేర్చెను. అతడు హిమాలయములలో నివసించుచు అదే సమయమున జర్మనీలోను, అమెరికాలోను కూడ పనిచేసి చూపించెను.

ఏకోన్ముఖ కార్యము కలియుగ నైజము. బహుముఖ కార్యములు దివ్యస్థితి. ఇది మేమందరము శ్రీకృష్ణుని వద్ద నేర్చినాము. అతడు యోగేశ్వరుడు. ఒకే సమయమున పదిచోట్ల పది పనులు గావించెడి వాడు. అతడు ఒకే సమయమున తన ఎనిమిద మంది భార్యలతో ఎనిమిది అంతఃపురములలో కలిసియుండుట చూపించి నారద మహర్షినే అబ్బుర పరచినాడు. సాధన నుండి యిట్టి సిద్ధులు పొంద వచ్చును. తీరిక సమయములలో దీనికి సంబంధించిన కసరత్తులు చేయుట తప్పుకాదు. ఇట్టి సాధనల వలన చైతన్యము బహు ముఖములుగ వికసించగలదు. పశువులు కూడ ఏకోన్ముఖత కలిగి యున్నవి. మానవులంతకన్న చాల శక్తివంతులు. ఇది తెలియుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 125


🌹. దేవాపి మహర్షి బోధనలు - 125 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 102. ఒక సాధన 🌻

కన్నులు మూసిగాని కన్నులు తెరచిగానీ ఒక రమ్యమగు దృశ్యమును ఊహించి చూచుట నేర్చుడు. అట్లే ఊహించి వినుట నేర్చుడు. ఉదాహరణకు కనులు మూసుకొని కైలాస పర్వతమును చూచుట, తిరుపతి వెంకటేశ్వరుని చూచుట, బెజవాడ కనకదుర్గను చూచుట యిత్యాది దూరపు ప్రాంతముల నున్న మనవారిని చూచుట. ఈ చూచుటలో వివరములు చూచుట కూడ చేయవలెను.

ఇట్లే వినుట కూడ చేయవచ్చును. పరధ్యానమున కనపడుట, వినపడుట కన్న, నిర్దేశించి చూచుట, వినుట మిన్న అయిన విషయము. మొదటిది జబ్బు. అందు మన సంకల్పమేమీ లేదు. రెండవది దూరదృష్టి, దూరశ్రవణము. ఇట్లు అభ్యాసము గావించుట వలన మీ యందు దూరదృష్టి, దూరశ్రవణము ఏర్పడగలవు. పై విధముగ సూక్ష్మదేహమున నున్న నీ సభ్యులనుగాని, దివ్య దేహముననున్న ఒక దేవతనుగాని చూచుటకు ప్రయత్నించినచో క్రమముగ గురుదర్శనము, దైవదర్శనము కూడ కాగలదు. దీని వలన మీ మనస్సునకు అతీంద్రియ శక్తి పెరుగును.

అందునకే ధ్యానమున, ఒకే రూపము నెప్పుడునూ చూచు అభ్యాసమీయబడినది. దీని కారణముగ వినపడనివి వినబడుట, కనబడనివి కనపడుట అను మరియొక సిద్ధి కలుగును. ఇట్టి సాధనలకు ఓర్పు, నిరంతరత్వము చాల ముఖ్యము. శ్రద్ధ కూడ చాల అవసరము. ఈ మూడు గుణములతో సూక్ష్మలోకము, స్టూలలోకమంత నిజమై నిలచును. ఇది ఒక సాధన.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


12 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 124


🌹. దేవాపి మహర్షి బోధనలు - 124 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 101. నిస్పృహ 🌻

మీలో కొంత మంది సద్గురువు నాహ్వానించి (ధ్యానమున) మీకున్న సమస్తమైనటువంటి బాధల్ని కుండపోతగా వారి ముందు పోస్తూ వుంటారు. చాలా సేవ చేస్తున్నాము కదా! “మా కెందుకీ బాధలు, కష్టాలు” అని ప్రశ్నించెదరు. ఇటువంటి సత్యభామ బుద్ధి (ఆరోపణ బుద్ధి) మానుకోవటము ఉత్తమము. ఆరోపణలు చేయటానికి ఆవాహన మెందుకు? ఎప్పుడూ ఆరోపణలు చేసే వారి దగ్గరికి మీకు వెళ్ళబుద్ధి అవుతుందా? మాకు వెళ్ళ బుద్ధి అవుతుంది. పిలుస్తే వస్తాము, కాని మీ బాధలు ఆరోపణలు మా రాకను గుర్తింపనీయవు.

మీరు బాధలలో నున్నప్పుడు మీరు చేయవలసినదల్లా మేమందించిన బోధనలు చదువుకొనుచు, మనో ప్రశాంతత మనో వైశాల్యతను పొందుచుండవలెను. అట్లుకానిచో క్రమముగ మీకు భక్తి తగ్గును. అనుమానము పెరుగును. మీ చేతన ఘర్షణకు గురి అగును. మేము అనంత ప్రేమను, ఆదరణను ఎప్పుడూ ప్రసరించుచునే యుందుము.

మీరు యోగమున నిలచి సేవను పెంచుడు. మాతో అనుసంధానము కూడ పెంచుడు. అప్పుడు మీ సమస్యలకు పరిష్కారములు దొరకును. మాతో మీ అనుసంధానమును యిట్టి సమయమున పెంచుకొనవలెను కాని ఆరోపణలతో తెంపుకొనరాదు. ప్రతినిత్యము కత్తిపీట ముందు కూర్చుని ఉల్లిపాయలు కోయుచు ఏడ్చుచున్న వారి వలె మీరు మాకు గోచరించుదురు. దీని వలన ఎట్టి ప్రయోజనము లేదు. పై తెలిపిన సూత్రములను పాటింపుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం

Join and Share

భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom

www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



10 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 123


🌹. దేవాపి మహర్షి బోధనలు - 123 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 100. శంబళ 🌻


శంబళ, ఒక దివ్యాశ్రమము. భూమిపై జరుగు దివ్య కార్యక్రమములకు ప్రధాన కేంద్రము. అన్ని ఆశ్రమములకాధారము. దివ్య జీవనులకు శంబళ దివ్యానుభూతి. శాశ్వత సత్యము. ఇతరులకు అది పుక్కిటి పురాణము. శంబళను గూర్చి అనేకానేకములుగ వదంతులున్నవి. కొందరికది, మరుగుపడిన దివ్యసంపద. మరికొందరికి అది భూగర్భితమైన ప్రాచీన గ్రామము. ఇంకొందరికి అది ఆకసమున తేలుచుండు సూక్ష్మమగు ఆశ్రమము. తెలిసినవారు శంబళను భూమికి దివ్యరాజధానిగ తెలుపుదురు.

అందు భూమిని పాలించు ఏకైక చక్రవర్తి యగు సనత్కుమారుడు, వసించియున్నాడని భావింపుడు. అతడు శ్రీకృష్ణుడు భూమిపై సంచరించినపుడు, ప్రద్యుమ్నుడై అతనికి జన్మించినాడని తెలుపుదురు. శ్రీకృష్ణుడు దేహత్యాగము చేసిన వెనుక మరల సనత్కుమారునిగ స్వస్థానమున నిలచి పరమ గురువుల పరంపరకు అండగ నిలచియున్నాడని కూడ తలతురు. అతడే భూమిని, భూమి జీవులను పరిపాలించుచు వారి పరిణామమునకై కృషి సలుపుచున్నాడని భావింతురు.

సనత్కుమారుడు సనక సనందనాదులతో నొక త్రిభుజముగ నేర్పడి బ్రహ్మలోకము నుండి భూలోకము వరకు నొక చైతన్య సూత్రమును సంధించియుంచినాడని, తత్కారణముగ భూమి జీవులు బ్రహ్మలోకమునకు చేరుటకు వలసిన మార్గము తెరచి యున్నదని మైత్రేయాదులు తెలుపుదురు.

అతడే ఈ భూమికి జీవమని, ప్రధాన చేతనమని, మేము తెలిసియున్నాము. అతడు మైత్రేయునికి కొండంత అండగ నిలచి అతని ఆశయ పరిపూర్తికై వలసిన సహాయ సహకారము లందించుచు అనాదిగనున్నాడు. అతడు చక్రవర్తి. మైత్రేయుడు గురువు. ఒకరు రాజు, మరియొకరు పురోహితుడు. మేమందర మతని ఋత్విక్కులము. మీరందరతని పిల్లలు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


8 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 122


🌹. దేవాపి మహర్షి బోధనలు - 122 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 99. శిష్య దురాచారము 🌻


బుద్ధునికి దేవదత్తుడు, ఏసుక్రీస్తునకు జూడాసే తీరని ద్రోహము చేసినట్లు చరిత్ర పుటల కెక్కినది. చరిత్ర పుటల కెక్కక సద్గురువులకు ద్రోహము గావించిన వారు కోకొల్లలు. సద్గురు వందించిన బోధలనను యథాతథముగ గ్రహించుటయే మొదలు కష్టము. ఎవరి స్వభావమును బట్టి వారు బోధనలను అవగాహన చేసుకొందురు. సద్గురువు బోధనకన్న శిష్యుని అవగాహన భిన్నముగ నుండవచ్చును. ఇది సర్వసామాన్యము.

ఈ కారణముగ బోధనలను మరల మరల శ్రద్ధగ వినవలెను. తాను వింటినని, తెలుసుకొంటినని అనుకొనువాడు అహంకారి. ఒకటికి పదిమార్లువిని తన అవగాహనను అవకాశమున్నప్పుడు సద్గురువు వద్ద పరిశీలించు కొనవలెను. ఇది మొదటి మెట్టు. తాను పొందిన అవగాహనను ఆచరణలోనికి కొనివచ్చుటకు దీనితో ప్రయత్నింపవలెను. అట్టి దీక్షకు శ్రద్ధ, భక్తి, సంకల్పబలము, ప్రధానమై నిలచును. ఆచరణ మార్గముననే బోధన ఆకళింపు కాగలదు. ఇది రెండవ మెట్టు.

ఆచరణమున ఆకళింపైన బోధనమును సహాధ్యాయులతో, బంధుమిత్రులతో వారి ఆసక్తిని బట్టి పంచుకొనుట మూడవ మెట్టు. ఇది బాధ్యతాయుతమైన శిష్యత్వము. ప్రస్తుత కాలమున బోధనలందుకొని అవగాహన చేసుకొనక, తామాచరించక ఇతరుల కందించువారు కోకొల్లలుగ నున్నారు. ఈ స్వభావము శిష్యులలో ఈనాడు కొత్తగ ఏర్పడినది కాదు. ద్వాపర యుగ ఆరంభము నుండి యిట్టి ప్రవర్తనము మొలకెత్తినది. ఇది దురాచారము.

ఈ దురాచారము వలన శిష్యునికి హాని కలుగును. జీవితము ముందునకు సాగుతున్న కొలది మానసికముగ పలుమార్లు గాయపడు చుండును. క్రమముగ గురుశిష్య సంబంధ సూత్రము తెగును. ముందు జన్మలలో మరల గురువునకై అన్వేషణము జరుగును. ఈ దురాచారము సద్గురువును కూడ బాధించును. పై కారణముగ సద్గురు శిష్యుల నంగీకరించుటకు వ్యామోహపడరాదు. కలియుగమున శిష్యవ్యామోహము గురువునకు, దురాచారము శిష్యునకు హెచ్చగుచున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


06 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 121


🌹. దేవాపి మహర్షి బోధనలు - 121 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 98. యుక్తాహారము 🌻


సున్నితమగు మానవ చైతన్యమునకు మాంసాహారము అపాయకరము. చచ్చినవానిని, చంపిన వానిని తినుట వలన అతని చైతన్యమునకు అవస్థితులేర్పడును. ఎంత నిర్మూలించినను మాంస ఖండమున రక్తముండును. అట్టిమాంస ఖండములను తినుటవలన రక్తము త్రాగిన వారగుదురు. మాంసము తినకూడదనుటకు కారణమిది యొక్కటియే. రక్తమునకు మాంసమునకు విడదీయరాని బంధమున్నది.

రక్తపు ప్రభావము మాంసముమీద మిక్కిలిగ యున్నది. అట్టి మాంసమును భుజించుట వలన రక్త పిపాసుల బుద్ధులు, మానవ మేధస్సును చేరును. అంతియేకాదు దీని వలన రకరకములగు వ్యాధులు కూడ మానవ దేహమున పుట్టును. ఈనాడు భూమిపై జరుగు మారణ హోమమంతయు హింసా ప్రవృత్తి, రాక్షసత్వము, రక్తాహారము వలననే!

రక్తము త్రాగువారు, భుజించువారు రాక్షసులు కాక ఎట్లుందురు? ఇట్టివారి నుండి పుట్టు భావము లన్నియు రక్తదాహమును కోరుచునేయుండును. కల్లోలములు పుట్టించుట, యుద్ధములు చేయుట, శాంతిని భంగపరచుట అను వినాశకర కార్యములయందు యిట్టివారి జీవచైతన్యము యిమిడి పోయినది.

పై విషయమును గూర్చి శాస్త్రజ్ఞులు నిశితముగ శాస్త్రీయమగు ప్రయోగములు చేయవలసిన అవసరమెంతయునున్నది. జంతు వధశాల వద్ద గల వాతావరణమును పరిశీలించినచో పై సూచించిన సత్యములు తెలియగలవు.

ఇట్టి మానవ ప్రవర్తన యందు మార్పు రానిచో నూతనయుగమారంభమే కాదు. మానవులకు తెరతొలగింపు యుండదు. దీనిని గూర్చి ప్రభుత్వము, వైద్యము, విద్య కృషి చేయవలసిన అవసరమెంతయు గలదు. రక్తాహారమే ప్రస్తుత కాలమున మానవజాతి అలజడికి మూల కారణము. యుకాహారమే పరిష్కారము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 120


🌹. దేవాపి మహర్షి బోధనలు - 120 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 97. మొండితనము 🌻


సంకల్పబలము వేరు, మొండితనము వేరు. మొండితనము మూర్ఖము. అది అజ్ఞానముతో కూడియుండును. యిట్టివారు, తమ మొండితనము కారణముగ జీవితమున బరువు పెంచుకొందురు. మొండి గుఱ్ఱమును రౌతు ఎట్లు విసర్జించునో, మొండి వానిని సత్కర్మ విసర్జించును. మొండితనము గలవారు, ప్రజ్ఞా కేంద్రమునకు పక్ష వాతము కలిగింతురు.

పట్టు, విడుపులు గలవారే జీవన ప్రవాహమున తేలియాడువారు. మూర్ఖత వినాశకారణమై జీవుని పతనము కావింతురు. మొండితనము, మూర్ఖత, కరుడు గట్టిన అహంకారము- ఈ మూడింటిని ప్రతివారు విమర్శించుకొని, వీనిని విడచి సంకల్ప బలమున స్థిరపడుట ఉత్తమము. మొండివారు ఎంతో దూరము ప్రయాణము చేయలేరు.

కారణమేమనగా వారి మొండితనము అపాయ కారణములను సృష్టించుచుండును. వాటిని ఎదుర్కొనుటలో మొండివారు అలసి సొలసి పోవుదురు. ఇంతలో శరీరము కృశించి నశింతురే కాని మొండితనము వదలదు. మొండితనమున ప్రవేశించిన వారిని, ఆ మొండితనమే మొసలియై పట్టును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


31 Jul 2021

దేవాపి మహర్షి బోధనలు - 119


🌹. దేవాపి మహర్షి బోధనలు - 119 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 96. పనితనము 🌻

కొందరు పరమగురువుల బృందముల గూర్చి మాటాడరు. తలవంచుకొని వారి పని వారు చేయుచుందురు. మరికొందరు గురువులను గూర్చి అధికముగ మాట్లాడుదురు. మా అనుభవమున రెండవ తెగవారే మా బృందమునకు ద్రోహము చేయుదురు. మాకు అధికముగ మాటాడువారన్నచో భయము. మౌనముగ పనిచేయువారు మా దృష్టిలో శ్రేయస్కరులు. అధిక భాషణము అపాయకరము. పనిచేయువారికది తగదు.

మమ్మనుసరించువారికి పగలు పనిచేయుట, రాత్రి నిద్రించుట అని యుండదు. పగలుబట్టి పనికాదు. పనిని బట్టి పగలు. పని యున్నచో వారికి పగలు, రాత్రి తేడా యుండదు. ఇట్టివారే పనిని ప్రేమింపగలవారు. అట్టివారిని మేము ప్రేమింతుము. ఇట్టిపనివారు ఉల్లాసముగ నృత్యము, గీతము అనుభవించు చున్నట్లుగ పనిచేయు చున్నప్పుడు మేమును వారితో వంత కలుపుదుము.చేయవలసిన పనియందు యిట్టి ప్రీతికలుగుట ఉత్తమోత్తమ స్థితి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


28 Jul 2021

దేవాపి మహర్షి బోధనలు - 114


🌹. దేవాపి మహర్షి బోధనలు - 114 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 92. జ్ఞానము - భాష - 2 🌻


మా అనుయాయులు చాలా మంది జ్ఞానమును ప్రాచీన భాషల నుండి జనాదరణ గల భాషలలోనికి భౌగోళికముగ మార్చుచు నున్నారు. మరికొందరు భాష పతనము కాకుండ కూడ ప్రయత్నము చేయుచున్నారు.

భాషయందుగల వికృతి పలుకు వాని యందు కూడ ప్రవేశింప గలదు. వికృతముగ భాషించు వారు క్రమముగ వికృతమగు స్వభావము చెందుట తథ్యము. వాక్కునకు అమితమగు శక్తి కలదు. దాన్ని పవిత్రముగ ఉచ్చరించినచో, ఉచ్చరించువాడు పవిత్రుడగు చుండును.

అపవిత్రముగ నుచ్చరించినచో అపవిత్రుడగు చుండును. నిర్లక్ష్యముగ నుచ్చరించినచో లక్ష్యము లేనివాడగును. శ్రద్ధగ నుచ్చరించినచో శ్రద్ధను పొందువాడగును. శ్రద్ధయే సమస్త విద్యలకు ముఖద్వారము. భాషణమునందలి శ్రద్ధ మిమ్ములను ఉత్తమోత్తమ స్థితికి గొనిపోగలదు. జ్ఞానమునకు యిది తొలిమెట్టు. సరళముగను, స్వచ్చముగను, స్పష్టముగను పదముల నుచ్చరింపుడు. సరియగు పదములను సరితూకముగ నెంచుకొని వినియోగింపుడు. మీ భాషణము ప్రశాంత ప్రవాహమై ప్రవహించుట ముఖ్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


16 Jul 2021

దేవాపి మహర్షి బోధనలు - 113


🌹. దేవాపి మహర్షి బోధనలు - 113 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 92. జ్ఞానము - భాష - 1 🌻


జ్ఞానము అందరి కొరకును నిర్దేశింపబడినది. దానినే కొందరికే పరిమితము చేయుట ధర్మము కాదు. సూర్యుని వెలుగు, వాయువు, నీరు, భూమి అందరికిని నిర్దేశింపబడినవి. అట్లే జ్ఞానము కూడను. అందరికి అందుబాటులో జ్ఞానము నుంచుట పెద్దల కర్తవ్యము. అందుకొనుటకందరు రుచి చూపించక పోవచ్చును. కాని అందుబాటులోనుంచుట మాత్రము కర్తవ్యమై యున్నది.

జ్ఞానము, కాలమును బట్టి భాషను మార్చుకొను చుండును. ప్రాచీన భాషలయందు గల జ్ఞానమును ప్రాంతీయ భాషలలోనికి కొని తెచ్చుట ఒక మహా యజ్ఞము. భాష భావమును తెలుపుటకే కదా! దివ్యభావమును ప్రాంతీయ భాషలోనికి, ప్రాచీన భాష నుండి గొని వచ్చుట వలన జ్ఞానము యొక్క అందుబాటు మిక్కుటముగ నుండును. అట్లు కానిచో ఆవశ్యకత యున్న తావులకు జ్ఞానమందదు. ప్రస్తుత కాలమున భాష అంతకంతకును అవస్థితి చెందుచు నున్నది. కావున జ్ఞానము కూడ అట్టి భాషలలోనికి కొని రావలెనా? అను ప్రశ్నపుట్టును.

వికారము చెందిన భాష నుండి జ్ఞానము నందించుట సులభము కాదు. కావున భాష వికారము చెందకుండుటకై చేయు ప్రయత్నము కూడ లోకహిత కార్యముగ కన్పట్టును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Jul 2021

దేవాపి మహర్షి బోధనలు - 112


🌹. దేవాపి మహర్షి బోధనలు - 112 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 91. భౌతికలోక సత్యము - 2 🌻


ధర్మము నాచరించు వారికే క్రమముగ సమానత్వ మననేమో తెలియును. ధర్మనిష్ఠ బాధ్యతగ నిర్వర్తించు వారకే స్వతంత్రత అననేమో తెలియును. అట్టివారి మధ్యే సోదరత్వము వెల్లి విరియును. భౌతిక ప్రపంచమున జీవుడు కర్తవ్యమును, సృష్టి ధర్మములను నెరిగి ప్రవర్తించుట ద్వారా బుద్ధి లోకములలోనికి ప్రవేశించినపుడు పై మూడు అంశములు అవగాహన కాగలవు.

శ్రీరాముని జీవితమున ఈ మూడు అంశములను గమనించవచ్చును. అతడు సర్వ స్వతంత్రుడు. ఆ స్వాతంత్ర్యము అతనికి కర్తవ్య నిర్వహణము నుండి ధర్మాచరణము నుండి వికసించినది.

బాధ్యత పడక కర్తవ్యము నెరుగక ధర్మము నెరుగక జీవించు జీవులకు సోదరత్వము, సమానత్వము, స్వతంత్రము ఎండమావులవంటివి. చట్టములెన్ని ఏర్పరచినను ఈ ఆశయములను పొందలేరు. వీని పేర విధ్వంసమే జరుగుచు నున్నది.

స్వతంత్రమని, సమానత్వమని అగ్రరాజ్యములు, అగ్రవర్ణములు బలహీనులను హింసించుటయే మానవజాతి చరిత్రగ సాగుచున్నది. ఈ మూడు ఆశయములు వ్యక్తిగతముగ సిద్ధించగలవే గాని సామాజికముగ సిద్ధింపవు. అవతార పురుషులు దిగి వచ్చినను భౌతికలోకమున నుండు శాశ్వత సత్యమిదియే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


12 Jul 2021

దేవాపి మహర్షి బోధనలు - 111


🌹. దేవాపి మహర్షి బోధనలు - 111 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 91. భౌతికలోక సత్యము - 1 🌻


సోదరత్వము, సమానత్వము, స్వతంత్రము అనుభావములకు భౌతిక ప్రపంచమున అస్థిత్వము లేదు. ఇవి సూక్ష్మము దివ్యము అయిన లోకములకు సంబంధించినవి. అమృతత్వలోకములకు

సంబంధించినవి. సూక్ష్మలోకమున సృష్టిధర్మములు పరిపూర్ణముగ నవగాహనము కాగలవు. భౌతిక లోకమున అవగాహన వక్రత చెంది యుండును. స్వభావమునకు బానిసలైన జీవులకు స్వాతంత్ర్యము మృగ్యము.

స్వభావమే బలీయమై జీవుని ఆశయములు దానికి లోబడి యుండుటచే జీవునకు స్వాతంత్ర్యము లేదు. స్వాభావిక భావములు స్వతంత్ర్యమునకై ప్రయత్నించినపుడు అవి పరస్పర విరుద్ధములై, ధర్మవిరుద్ధములై ఘర్షణ చెందును. సమానత్వము స్వభావమునకు లోబడిన వారికి అసాధ్యము. అందరూ జీవులే అను భావనము తెలిసియున్నప్పటికిని స్వభావము నందు సమానత లేకుండుట వలన సమానత్వము సిద్ధింపదు.

సమర్థులు, అసమర్థులు సమానులు కారు. తెలిసినవారు తెలియని వారు సమానులు కారు. స్వభావము వైవిధ్యమై యున్నప్పుడు సమానత్వము అసాధ్యమగును. దివ్యము, అమృతము అగులోకముల యందు సత్పురుషులు ఏర్పరచుకొన్న సోదరత్వము సమానత్వము స్వతంత్రత ధర్మమున కనుగుణమై యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹


10 Jul 2021

దేవాపి మహర్షి బోధనలు - 110


🌹. దేవాపి మహర్షి బోధనలు - 110 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 90. మానవ లక్షణము - 2 🌻

ప్రతి ఆధ్యాత్మిక సంఘమును, సూక్ష్మలోకముల నుండి గమనించు మాకు, యిదియే మరల మరల కన్పట్టుచున్నది. ఒక సోదర బృందమున, ఆశయమొక్కటే యున్నను దానిని నిర్వర్తించు విధానమున పలువురికి పలుభావము లేర్పడుచుండును.

దానికి కారణము సభ్యుల స్వభావ వైవిధ్యము. అందరును ఒకే స్థితిని చేరిన ప్రజ్ఞను కలిగి యుండరు కదా! వాని స్వభావమందలి వైవిధ్యములే వారి వైవిధ్య ధోరణికి కారణము. వైవిధ్యమగు భావములను సమన్వయించుట సులభమగు విషయము కాదు. దీనికి సహనము ముఖ్యము. అట్టి సహనము కలవాడే బృందమును నడుపుట శ్రేయస్కరము.

సహనము, సద్బుద్ధి, సహకారము, సోదరత్వమునకు అత్యంత ఆవశ్యకమగు అంశములు. దీనిని పొందుటకు చైతన్యమును వికాసవంతము చేసుకొనవలెను. ఇతరుల అభిప్రాయములను కూడ పరిగణలోనికి తీసుకొని ఆలోచించుట దీనికి ప్రధానము.

పదికోణముల నుండి ఒకే విషయమును అవగాహన చేసుకొనినచో కార్యనిర్వహణము సమగ్రముగయుండును. సభ్యులందరును పరితృప్తి చెందుదురు. సహకరించుట అనుకరించుటకన్న కష్టమైన పని. “పై వారి ననుకరింతుము. తోటివారితో సహరించము.” ఇది ప్రస్తుత మానవుని లక్షణము.

సశేషం...

🌹 🌹 🌹 🌹


08 Jul 2021

దేవాపి మహర్షి బోధనలు - 109


🌹. దేవాపి మహర్షి బోధనలు - 109 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 90. మానవ లక్షణము -1 🌻


సహకరించుట సామాన్య విషయము కాదు. సహకారమొక ఉత్తమ గుణము. దైనందిన జీవితమున సద్భావములకు, సత్కార్యము లకు, సహకరించుట సాధకునకు అత్యవసరము. దీనికి తరుల భావములను మన్నించగలుగు సద్బుద్ధి యుండవలెను.

ఇతరుల భావములను కొట్టివేయుట, ఇతరుల సత్కార్యములను తిరస్కరించుట, దూషించుట నిరుపయోగము. నీవట్లు చేసినచో నీకును అట్లే జరుగును. ఇట్టి సాధకులెందరో అధ్యాత్మిక సోదరత్వమని ఆరాటపడు చున్నారు. సోదరత్వమునకు సహకారము మొదటి లక్షణము.

సహకరించుట తెలియని వానికి సోదరత్వము లేదు. ప్రతి సాధారణ సాధకుడును తనతో నెవ్వరును సహకరించుట లేదని వాపోవుచుండును. దానికి కారణము తానే. తానితరులతో
సహకరించుట ముఖ్యము. ఇతరులు తనతో సహకరించు వలెననుట అహంకారము.

మొదటిది వినయమగు మార్గము. రెండవది అవిధేయ తను సూచించును. ఉట్టికెక్కలేనమ్మ, స్వర్గమునకు ప్రాకులాడుట యెట్లో, పెద్దలతో సహకరించని పిన్నలకు, దైవీభావమందుట అట్లే అసాధ్యము. ఇట్టి వారి ఆధ్యాత్మిక సోదరత్వ భావము కారుమేఘములతో కూడినదై ఉరుములు, మెరుపులు, గాలివానగ యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


06 Jul 2021

దేవాపి మహర్షి బోధనలు - 108


🌹. దేవాపి మహర్షి బోధనలు - 108 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 89. ప్రదర్శన - దర్శనము 🌻


పునర్జన్మను గూర్చి నీ వెన్నడైన భావింతువా? మరణమును గూర్చి భావింతువా? జన్మించక ముందు మరణించిన వెనుక నీ వెట్లుంటివో ఎప్పుడైన ఆలోచించితివా? ఆలోచించుట సత్సాధకున కవసరము. నీ విప్పటికే లక్షలాది సార్లు పుట్టితివి చచ్చితివికూడ. అన్నిసార్లు పుట్టిచచ్చిననూ, చచ్చిపుట్టిననూ దాని అనుభవము నీకు లేదు కదా! నీవెట్లు పుట్టితివి? ఎట్లు చచ్చితివి? నీకు తెలియనే లేదు కదా!

ఈ రెండు సన్నివేశములు జరుగునప్పుడు నీ వున్నావు. నిద్రకు ముందు, నిద్ర తరువాత నిద్రయందును, మేల్కాంచుట యందును స్వప్నమునందుకూడ నీవున్నావు. ఉండుట సత్యమే. కాని సన్నివేశములు జరుగుచున్నప్పుడు నీవున్నను పరికించలేక పోవుచున్నావు. దీనికి కారణమేమి? కారణ మొకటియే.

నీ యందు సాక్షిగ గమనించు బుద్ధి జనించ లేదు. ఈ సాక్షిత్వము నీయందు జనించవలె నన్నచో దైనందినముగ జరుగు సన్నివేశము లలో గమనించుట నేర్వవలెను. సన్నివేశము నందిమిడి పోవుట కాక దానిని గమనించువానిగ, సన్నివేశమునకీవలగ నుండవలెను.

అన్ని సన్నివేశములయందు నీవు సాక్షిగ నుండి జరుగుచున్న సన్నివేశమును సినిమా చూచినట్లు చూచుటవలె చూడవలెను. చిన్ని చిన్న విషయముల యందు దీనిని ముందు ప్రయత్నింపుము. ఇది అభ్యాసముగ స్థిరపడినచో క్రమముగ నీవు నీ జీవితమును నందలి సన్నివేశములను, నీ సినిమాగ చూడగలవు. ఇట్లు చూచుట నేర్చుటయే తారణమునకు మార్గము. అలసత్వము లేక ప్రయత్నింపుము.

మేమీ విద్య శ్రీకృష్ణుని నుండి నేర్చితిమి. ఆయన సాక్షీభూతులై యుండి కర్తవ్యమును అప్రమత్తతో నిర్వర్తించుచుండిరి. అన్ని మార్పులను చూచుచు వాని యందు మాకర్తవ్యములను నిర్వర్తించుచున్నాము. మా పుట్టుకలు మరణముల కూడ చూచితిమి. మీ పుట్టుకలు మరణములు కూడ చూచుచున్నాము. మీ రూపములు మారుచున్ననూ, జీవులుగ మేము గుర్తించుటకిదియే రహస్యము. మీరు మాకు పరిచితులే. మా సినిమాకథ, మీ సినిమాకథ కూడ చూచుచునుందుము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


04 Jul 2021