సిద్దేశ్వరయానం - 11 Siddeshwarayanam - 11

🌹 సిద్దేశ్వరయానం - 11 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🌹సిద్దేశ్వరయానం 🌹

Part-11

🏵 కలియుగం 🏵


కలియుగం ప్రారంభమైంది. భౌతికంగా శ్రీకృష్ణదేవుడు శరీరాన్ని పరిత్యజించిన తరువాత ప్రపంచంలో చాలా మార్పులు వచ్చినవి. బృందావనము, ఆ ప్రాంత ప్రదేశాలు అన్నింటికి రాజధానిగా ఉండే మధురకు శ్రీకృష్ణుని మునిమనుమడయిన 'వజ్రుడు' రాజయినాడు. పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళిపోయినారు. అర్జున పౌత్రుడయిన పరీక్షిత్తు కురుసామ్రాజ్యానికధిపతి అయి సుమారు 60 సంవత్సరాలు పరిపాలించి మునిశాపం వల్ల తక్షక సర్పదష్టుడై మరణించాడు. అతని కుమారుడు జనమేజయుడు రాజై ఉదంక మహర్షి ప్రేరణవల్ల సర్పయాగం చేశాడు. తమజాతి వారు లక్షలమంది యాజ్ఞికుల మంత్రశక్తి చేత ఆకర్షింపబడి హోమకుండంలో పడి దగ్ధమయినారు. నాగరాజుల పరాక్రమాలు, దివ్యశక్తులు బ్రహ్మదండ ప్రభావంముందు పనిచేయలేదు. నాగప్రభువు, వాసుకి చెల్లెలయిన జరత్కారువునకు అదే పేరు గల మహర్షికి పుట్టిన అస్తీకుడనే మహర్షి సర్పయాగాన్ని ఆపించాడు. సర్పకులంలో మూడువంతులు నశించి పోయినవి. రాధాగోవిందుల అనుగ్రహం వల్ల తనకే ప్రమాదం జరుగలేదు తనవారిలో ఎందరు మిగిలి ఉన్నారో ఒక్కసారి తన స్వస్థానానికి వెళ్ళి చూచిరావాలని అనిపించింది.

బృందావనం నుండి బయలుదేరి కౌరవరాజ్యాన్ని దాటి మగధసామ్రాజ్యము లోనికి ప్రవేశించాడు. జరాసంధుని వంశం వారు అక్కడ పరిపాలిస్తున్నారు. ఆ రాజ్యం నుండి బయలుదేరి హిమాలయ ప్రాంతాలకు చేరి, బ్రహ్మపుత్రానదీ ప్రాంతం ద్వారా ప్రాగ్జ్యోతిష పురం చేరుకొన్నాడు. తన ఇష్టదేవత అయిన కామాఖ్య కాళీ ఆలయానికి వెళితే ఆనందస్వరూపిణిగా ఆమె దర్శనమిచ్చింది. ఆనాడు వసిష్ఠుని వాక్కువల్ల కాళీదేవి అదృశ్యమైన సంగతి తనకు గుర్తున్నది. తరువాత జరిగిన సంఘటనలను అక్కడ విన్నాడు. కాళీదేవి ఎక్కడకు పోయిందో తెలియక నరకాసురుడు శుక్రాచార్యుని ఆహ్వానించి మళ్ళీకాళీదేవిని రప్పించమని ఆహ్వానించాడు. తిరుగులేని వసిష్ఠుని వాక్ ప్రభావాన్ని ఎరిగిన శుక్రుడు దేవిని తాను తిరిగి రప్పించలేనని చెప్పి అసురనాధుని సంతృప్తి కోసం కొన్ని యజ్ఞాలు చేసి అదనపు శక్తులు సమకూర్చి వెళ్ళిపోయినాడు. ఆ తరువాత కొంత కాలానికి శ్రీకృష్ణుడు తన ముద్దుల భార్య అయిన సత్యభామతో కలిసి నరకాసురుని మీదికి యుద్ధానికి వచ్చాడు. యుద్ధరంగంలోకి ప్రవేశించిన నరకుడు తన శత్రువైన కృష్ణుని వెనుక తనకు వరము లిచ్చిన కాళీదేవి ఉండటాన్ని గమనించాడు. తనకిక పరాజయం తప్పదని గ్రహించిన నరకుడు కృష్ణునితో పోరాడి వీరమరణం చెందాడు. శ్రీకృష్ణుడు కాళీదేవిని మరలా కామాఖ్య పీఠంపై ప్రతిష్ఠింపచేసి నరక పుత్రుడైన భగదత్తుని రాజును చేసి నరకుడు చెరపట్టిన 16000 మంది రాజకుమారికలను వివాహమాడి తనతో ద్వారకకు తీసుకొని వెళ్ళాడు. ఆ భగదత్తుడు తన తండ్రిని చంపిన కృష్ణుని మీది కోపంతో మహాభారతయుద్ధంలో దుర్యోధనుని పక్షంలో చేరి సంగ్రామంలో అర్జునుని చేత సంహరించబడ్డాడు. ఆ భగదత్తుని పుత్రుడు ఇప్పుడు రాజ్యమేలుతున్నాడు.

సిద్ధనాగుడు కామాఖ్య నుండి బయలుదేరి తన జన్మభూమికి చేరాడు. అక్కడ తన వంశీయులు, బంధుమిత్రులు ఇతనిని చూచి ఎంతో సంతోషించారు. అచ్చట అన్ని వంశాలవారు సర్పయాగానంతరము ఎవరెవరు మిగిలి ఉన్నారో లెక్క పెట్టుకొనే స్థితిలో ఉన్నారు. తెలిసినవారందరిని చూచి పలకరించి హతశేషులను పరామర్శించిన తరువాత ఒకనాడు హఠాత్తుగా తన బాల్యమిత్రుడు శివనాగుడు కనిపించాడు. పట్టరాని ఆనందంతో చెట్టాపట్టా లేసుకొని ఇద్దరూ ఒక తోటలో కూర్చున్నారు. కుశల ప్రశ్నలు అయిన తరువాత ఇక్కడి విశేషాలు చెప్పవలసినదిగా అతడు శివనాగును ప్రశ్నించాడు. శివనాగుడు ఇలా అన్నాడు. "మిత్రుడా! చిన్నప్పటి నుండి మన ఇద్దరి అభిరుచులు ఒక్కటే. ఏదో సాధించాలన్న తపన మన పూర్వులయిన నాగరాజుల వలె తపస్సు చేసి పరమేశ్వరానుగ్రహం పొందాలన్న బలమైన కోరిక మన యిద్దరికీ ఉండేది. కదా? నీ మార్గంలో నీవు అన్వేషిస్తూ ఎటో వెళ్ళిపోయినావు. నా మార్గంలో నేనూ బయలుదేరాను. మన కులపెద్ద అయిన వాసుకి పరమశివుని భక్తులలో ఒకడని తెలుసు గదా ! అతడు నన్ను శివుని గూర్చి తపస్సు చేయమని ప్రేరేపించాడు. సమస్త భారతదేశానికి మణిమకుటమయిన శివక్షేత్రం వారణాసి, అక్కడికి వెళ్ళి గంగాస్నానం చేసి విశ్వనాధుని దర్శించి కాశీ క్షేత్రమంతా తిరుగుతున్నాను.

నా పూర్వ పుణ్యవశాన భోగనాధుడనే ఒక యోగితో పరిచయమయింది. అగస్త్యమహర్షి శిష్యుడైన ఆ మహానుభావుడు వేలఏండ్ల నుండి జీవిస్తున్నవాడు. ఆయన పాదములు ఆశ్రయించాను, సేవించాను. ఆ యోగి వర్యుడు దయతో నన్ను శిష్యునిగా స్వీకరించాడు. ఆ మహర్షి అప్పుడప్పుడు ఉత్తరకురుభూములలో హిమాలయ పర్వతాలకవతల సుదూర ప్రాంతంలో ఉన్న సుమేరు పర్వత భూములకు వెడుతూ ఉంటాడు. నన్ను కూడా తనతో తీసుకొని వెళ్ళాడు. హ్రస్వాంగులు పీతవర్థులు అయిన చీనజాతి వారి స్థానమిది.

పరకాయప్రవేశ విద్య శక్తివలన మా గురువుగా రొకసారి అచ్చటి స్థానికుని మృతశరీరంలో ప్రవేశించి కొంతకాలం దానిలో ఉండి ఆ దేశీయులకు తాంత్రిక విద్యలు నేర్పారు. నా చేత కూడా ఆయన ఎన్నో చిత్ర విచిత్ర సాధనలు చేయించారు. ఓషధీ పరిజ్ఞానాన్ని నేర్పారు. మూలికా రహస్యాలను తెలిపారు. ఒక వస్తువును మరొక వస్తువుగా మార్చే విద్య, బంగారాన్ని తయారుచేసే విధానం ఆ మహాయోగి నా కుపదేశించారు. ఆయన ఆజ్ఞవలన కొంతకాలం కాశీలో ఉన్నాను. హిమాలయాల లోని దేశాలన్నీ నాకు సుపరిచితమైనవి. వారి అనుగ్రహం వల్ల సర్పయాగం నుండి నేను రక్షించబడ్డాను. నీ సంగతులేమిటో తెలుసుకోవాలని ఉన్నది. నీవు కామాఖ్య వెళ్ళావని అక్కడ నుండి బృందావనం వెళ్ళావని మాత్రం విన్నాను. తరువాత సంగతులు నీవు చెప్తే వింటాను.”

( సశేషం )

🌹🌹🌹🌹🌹