సిద్దేశ్వరయానం - 10 Siddeshwarayanam - 10

🌹 సిద్దేశ్వరయానం - 10 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🌹సిద్దేశ్వరయానం 🌹

Part-10

🏵 బృందావన సంఘటన 🏵

సిద్ధనాగుడు :


ఇందూ! బర్సనా లో ఈ పరిణామం ఊహించినదే. అయితే నీవు తెలుసుకో వలసినవి మరికొన్ని ఉన్నవి. రాధాకృష్ణులు గోలోక నాయికా నాయకులు సమస్త బ్రహ్మాండములకు అధీశ్వరులు. వారిప్పుడు దివ్యశరీరాలతో బృందావనంలో ఉండి కల్పాంతం దాకా భక్తులను అనుగ్రహిస్తారు. మీ అష్టసఖులు అక్కడి నుండి వచ్చినవారే. కానీ వారి వలె కాక సహజమార్గంలో మానవజన్మయెత్తటం వల్ల పూర్వజన్మ స్మృతి లేదు. ఉశీనరరాజకుమారి పసిబిడ్డగా ఉన్నప్పుడు రావల్ గ్రామం నుండి మీ రాజదంపతులు తెచ్చి పెంచుకొన్నారు. గోలోకంలో జరిగిన ఒక సంఘటనలో కృష్ణుని సఖుడైన శ్రీదాముడు రాధా ప్రేమతత్వాన్ని తెలుసుకోలేక అజ్ఞానంతో రాసేశ్వరిని శపించాడు. భక్తుడిచ్చిన శాపాన్ని అనుభవించటం కోసం మీ రాజకుమారిలో రాధాపరమేశ్వరి తన అంశను ఉంచింది. ఆ శాపఫలం రాజకుమారి తపస్సు పరిమితి వందసంవత్సరాలు. ఆ విషయాలు నీవు కలలో చూచావు. శ్రీకృష్ణునిలోని గోలోకనాధుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మధురకు వెళ్ళిన నారాయణ కృష్ణుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి నూట ఇరవైయయిదు సంవత్సరాలు భౌతికశరీరంలో ఉండి తన లోకానికి వెళ్ళిపోతాడు.

కష్టసుఖాలు, ఇబ్బందులు ఎలా ఉన్నా రాజకుమారిని విడిచి పెట్టి మీరుండలేరు. అందువల్ల రాబోయే కాలం నీవు ఆమెతో ఉండాలి.

ఇందు మీరు చెప్పింది సత్యం. రాజకుమారితో లేని స్థితిని ఊహించలేను. అయితే మన జీవితమేమిటి?

సిద్ధ - ప్రస్తుతానికింతే.

ఇందు :

నా కోసం మిమ్ము పెండ్లి చేసుకోకుండా ఉండమని అనలేను. అది న్యాయం కాదు.

సిద్ధ :

న్యాయము ధర్మము అంత సులభంగా నిర్వచించ గలిగినవి కావు. నా జీవితం నీతో ముడిబడి ఉన్నది. నాగవంశానికి చెందిన వ్యక్తిగా మా మహారాజు వాసుకి నాకు కొన్ని బాధ్యతలను అప్పగించారు. పరజాతి స్త్రీకి పుట్టిన నాయందు ఆయనకు అభిమానం లేదు. అందుచేత వారి ఆజ్ఞలను జాగ్రత్తగా ఆచరించవలసి ఉంటుంది. లేకపోతే వారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఆ కర్తవ్యాలను నెరవేరుస్తూ తపస్సు చేసుకోవాలి. సిద్ధగురువుల అనుగ్రహాన్ని సంపాదించాలి. ఈ పనులు చేసుకొంటూ నిన్ను జాగ్రత్తగా చూచుకోవాలి. నేను కామమును జయించిన విరాగిని కాదు. కాని తొంభై సంవత్సరాలు ఆగగలను. తపస్సు పూర్తియై శరీరాన్ని విడిచి పెట్టేముందు రాధారాజకుమారి నీకు పెండ్లి చేసుకోటానికి అనుమతి నిస్తుంది. ఆ తరువాత బృందావనంలో మనం సుఖంగా ఉంటాము.

ఇందు :

స్వామీ! మీరు మహాపురుషులు కారణజన్ములు. మీరు చెప్పిన గోలోకము అక్కడి నా స్థానము ఇవేవీ నాకు తెలియవు. నాకు తెలిసింది ఒక్కటే. నేను మీ కోసము జీవిస్తాను. నా సమస్తము మీది. ఆ ఆశ నన్ను నిలబెడుతుంది.

సిద్ధ :

ఇక మీ గ్రామానికి వెళ్ళి హిమాలయ ప్రయాణానికి సిద్ధముకా! కృష్ణమాయ, రాధాదేవి సంకల్పంవల్ల మీ తల్లిదండ్రులు కాదనరు. ఇక హిమాలయాలకు చేరుకొన్నతర్వాత అప్పుడప్పుడు మీ గ్రామానికి వెళ్ళి రావటానికి నీకు అనుమతి లభిస్తుంది. మామూలుగా ప్రయాణం సుదీర్ఘకాలం పడుతుంది. కానీ నేనొక పద్ధతి చెపుతాను. నీకు అనుమతి రాగానే నన్నుస్మరించు. నీకొక సిద్ధమంత్రాన్ని చెపుతాను. దానిని జపించగానే నేనెక్కడ ఉన్నా నాకు తెలుస్తుంది. నాకు ఆకాశగమనశక్తి లేదు గాని మహావేగంగా ప్రయాణం చేయగలశక్తి ఉన్నది. నిన్ను నేను పట్టుకొని శీఘ్రంగా మీ యింటికి చేరుస్తాను. అక్కడి నుండి రాజకుమారి దగ్గరకు తీసుకు వెళ్తాను. అయితే ఈ రహస్యం ఎవరికీ చెప్పవద్దు. అందరికీ పట్టే ప్రయాణకాలమే నీకూ పట్టినట్లు చెపుదువుగాని. వెళ్ళివచ్చే ఈ మధ్యకాలంలోని సమయములు నా ఆశ్రమంలో ఉందువుగాని. కామరహితమైన నియమబద్ధమైన ప్రేమ సంసారం గడుపుదాము.

ఇందు :

నా అర్హతను మించి మహానుగ్రహం చూపిస్తున్నారు. ధన్యురాలిని.

సిద్ధ :

ఇందూ! నన్ను పట్టుకొని యుండు. నిన్ను మీ గ్రామంలో మీ యింటి పరిసరంలోకి చేరుస్తాను. తరువాత హిమాలయాలలో కలుద్దాము.

ఇందు :

ప్రాణేశ్వరా ! మిమ్ము ఆహ్వానించే మంత్రం చెపుతానన్నారు.

సిద్ధ :జాగ్రత్తగా విను.

ఈ మంత్రంతో సంబంధం లేకుండా నేను నిన్ను ఎప్పుడూ కనిపెట్టి ఉంటాను. ఆ ప్రాంతాలకు నేను తరచూ వస్తూ ఉంటాను. కైలాస పర్వతంలో రాధాదేవి తపస్సు చేయబోయే గుహకు దూరప్రదేశాలలో దత్తాత్రేయ గుహ, హనుమంతుని గుహ ఉన్నవి. దగ్గరలో పార్వతీదేవి తపస్సు చేసిన గౌరీకుండమున్నది. ఇవన్నీ నా సంచార ప్రదేశాలు. నీకు ఏ ఇబ్బందీ ఉండదు. జాగ్రత్త!

ఇందు :మీ అనుగ్రహము మీకరుణ నన్నెప్పుడూ కాపాడుతూ ఉండాలి.

సిద్ధ : తథాస్తు!

( సశేషం )

🌹🌹🌹🌹🌹