సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 46


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 46 🌹
46 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 3 🍃

345. పాలలో నేయి కనబడక ఎలా మరుగున ఉన్నదో అట్లే సకల ప్రాణులందు గల ఆత్మ మాయచే కప్పబడి మరుగై ఉన్నది. త్రిగుణములైన సత్వ రజో తమో గుణములలో ఆవరించబడిన ఆత్మ తెలియబడుటలేదు.

346. పంచకోశములైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములచే ఆత్మ కప్పబడి ఉన్నది. వాటిని తనకంటే వేరని తెలుసుకొన్న, ఆత్మ దర్శనం అగును.

347. బంగారునాణెములు వేర్వేరు రకములున్నట్లే ఆత్మ వేరువేరు పేర్లతో పిలువబడుచున్నది. అవి ప్రత్యగాత్మ, సచ్చిదానంద, నిత్యుడు, నిర్గుణుడు, నిర్వికారుడు, చిదాకాశము, జీవాత్మ, జ్యోతి, చిదాత్మ, అంతర్యామి, అఖండడు, పరమాత్మ, నిర్గుణుడు, బ్రహ్మము, అంతరాత్మ, నిరంజనుడు, నిర్మలుడు మొదలగు పేర్లతోసందర్భోచితముగా ఆత్మ పిలువబడుచున్నది.

348. ఆత్మను పొందినవారి లక్షణములు: సంకల్ప రహితుడు, శుద్ధుడు, నిర్భయుడు, ద్వంద్వ రహితుడు, మాయాతీతుడు అయివుంటాడు.

349. పూజ అనగా ఆత్మ దేవుని ధ్యానించుటయే. వస్తుసామాగ్రి, శబ్దము, పూజాసామాగ్రిలతో బాహ్యముగా భౌతికముగా చేయునది పూజకాదు అది కూడా అజ్ఞానము, అవిద్య, మనస్సు, చిత్తము, అహంకారములతో ఆత్మను ధ్యానించవలెను. తుదకు అన్నీ విడిచిపెట్టి ఆత్మ ధ్యాస స్థిరముకావలెను.

350. ఆత్మ చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడనగా రహస్యముగా చిత్రించునది. అట్లు గుప్తముగా ఉండి జీవుడు చేయు కర్మలను, పాపపుణ్యములను, తలంపులను, ఇతర వికారములను గమనించుచుండును. సాక్షిగా ఉన్నాడు. జీవుని సకలకర్మలకు, జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులకు సాక్షి చిత్రగుప్తుడే.

351. శరీరము సర్వము నాశనముకాగా చివరకు మిగిలినది ఆత్మయే. శరీరమునకు అంటిపెట్టుకొని ఉన్న పంచజ్ఞానేంద్రియములు, కర్మేంద్రియము, అంతఃకరణ చతుష్ఠయము తొలగించిన మిగిలినది ఆత్మయే. అదియే జ్ఞాన దృష్టికి దర్శనం అగును. ఇదియె సాంఖ్యము. స్వస్వరూపమును తెలుసుకొన్నవాడే సాంఖ్యుడు.

352. క్షేత్రమనగా కేవలము పదార్థ సంబంధమైన, పంచభూతాత్మకమైన స్థూల శరీరమే కాదు. అనేక దృశ్యముల మిశ్రమమే క్షేత్రము. కంటికి కనిపించని సూక్ష్మభూతములు కూడా క్షేత్రములే.
🌹 🌹 🌹 🌹 🌹