సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 37

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 37 🌹 
37 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 శరీరావస్థలు 2 🍃 

260. తురీయ స్థితి పొందాలంటే నిరంతర శాస్త్ర పఠనము సజ్జన సాంగత్యము గురుశుశ్రూష, నిరంతర అభ్యాసము అవసరము. 

261. తురీయ స్థితిలో సంకల్పములు ఉద్భవించవు. జఢత్వముండదు. వికల్పముండదు. మిగిలిన జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులు, చిత్తము యొక్క రూపములు. అసత్యములు. తురీయము వాస్తవ రూపము. ఈ మూడవస్థలకు సాక్షిమాత్రుడే తురీయుడు. 

262. నాలుగు అవస్థలు ప్రతి అవస్థలోనూ ఉండును. అలానే తురీయములోనూ నాలుగు అవస్థలు ఉండును. అని మొత్తము షోడశావస్థలు (16). 

263. మనస్సు మృతి చెందిన స్థితియె సమాధి స్థితి. ఈ స్థితియె యోగి యొక్క పరమావధి. సమాధి స్థితి నిద్రావస్థ కాదు, మగత కాదు, స్వప్నము కాదు, అజ్ఞానము కాదు. పూర్ణ ప్రజ్ఞయె సమాధి. ఇది ఊరక కూర్చుండుటయె. ఆత్మ తత్త్వ బోధయె సమాధి. 

264. సమాధి స్థితికి చేరడానికి చేయు నిరంతర సాధనయె యోగము. యోగమనగా సమాధి. సమాధి అనగా సమత్వ స్థితి. బ్రహ్మ కపాలము, భ్రూమధ్యము నందు, హృదయ కవాటము నందు బాహ్య ప్రపంచమును మరచి అంతరంగమున సంచరించుటను సమాధి అందురు. గాలి లేని చోట ఉన్న దీపమువలె నున్న నిశ్చలస్థితియె సమాధి స్థితి.

265. సమాధికి సంయమమని పేరు. భోగేచ్ఛ లేకపోవుట, ఔదార్యము, సౌందర్యము, వైరాగ్యములలో కూడా పరమానంద స్థితిలో నుండుటయె సమాధి స్థితి. 

266. ఎవరు నిత్యము ఆత్మ విచార తత్పరులై ఉండునో, బాహ్య దృష్టి శూన్యుడై, అంతర్ముఖుడై ఉండునో , వారికి అదే సమాధి స్థితి. 

267. యోగ సిద్ధులు సమాధి స్థితికి ప్రతిబంధకాలు వాటిని కోరరాదు. అరిషడ్వర్గాలు అంతరించి పోవాలి. ఆత్మ, మనస్సు కలిసిపోగా, మనోలయమగును. ఆత్మ అద్వయమై యుండును. . 

268. సమాధి అనగా నిష్ఠ. ఈ స్థితిలో ధ్యానము, మంత్రము, జపము, పూజలు అనేవి ఆగి పోవును. దీనికే ఆత్మ నిష్ఠ, జ్ఞాన నిష్ఠ, యోగ నిష్ఠ, బ్రహ్మ నిష్ఠ అని పేర్లు. చిత్త స్వాధీనము, మనోక్షయమే సమాధి. 

269. సమాధి స్థితిలో అనేక రకములు: 1) సవికల్ప సమాధి: ఇది ఎరుతో కూడి ఉండును. 2) నిర్వికల్ప సమాధి స్థితి: సాధకుడు శాంత స్థితిలో ఉండును. సత్వ, రజో, తమో గుణములు నశించి ఉండును. 3) నిర్బీజ సమాధి స్థితి: ఈ స్థితిలో కర్మ బీజాలు నశిస్తాయి. సంస్కారములు నశిస్తాయి. మిగిలిన అనేక సమాధి స్థితులు సవితర్న, శబ్దానువిద్ధ, దృశ్యానువిద్ధ మొదలగునవన్నీ సవికల్పమే. 

270. సమాధి వలన ప్రయోజనములు:- 1) సంస్కారములు నశించును. 2) అతీంద్రియ జ్ఞాన మేర్పడును. 3) జ్ఞాన నేత్రము తెరుచుకొనును. వివిధ లోకాల దర్శనమవుతుంది. 4) కుండలిని యొక్క ఊర్ధ్వ అధో ప్రయాణాలను గమనించవచ్చు. 5) వ్యక్తి జీవన్ముక్తుడగును. 6) ఇదే బ్రహ్మానంద స్థితి. 7) మోహము నశించును. 8) దేహమందలి సూక్ష్మ శరీరములు తెలియబడును. 9) సోమరితనము, భోగ లాలసత్వము, తమో గుణము తొలగును. ప్రజ్ఞ కేవలమగును.
🌹 🌹 🌹 🌹 🌹