Showing posts with label మాస్టర్ ఇ.కె. గారి సందేశములు. Show all posts
Showing posts with label మాస్టర్ ఇ.కె. గారి సందేశములు. Show all posts

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 179


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 179 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సంసారి - గృహస్థు 🌻

సంసారికి మోక్షం లేదు. ఇది తిరుగులేని సిద్ధాంతం, అయితే దీని భావం గృహస్థుకు మోక్షం లేదని కాదు. సంసారం అంటే భార్యాపిల్లలూ అని కాదు అర్థం. సంసారం అంటే కోరికలు. కోరికలు ఉన్న వానికి మోక్షం లేదు.

బాహ్యానికి గృహస్థుడుగా ఉన్నప్పటికీ కోరికలు లేకుండా ఉండగలిగితే వాడు సంసారి కాడు. వానికి మోక్షం కరతలామలకమే. బాహ్యానికి సన్న్యాసిగా ఉన్నప్పటికీ వానికి ఏమాత్రమైనా కోరికలుంటే వానికి మోక్షం గగనకుసుమమే. వాడు సన్న్యాసీ కాడు, గృహస్థుడూ కాడు, సామాన్య సంసారీ కాడు భ్రష్టుడు‌.


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


14 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 178


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 178 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సగుణము - నిర్గుణము-2 🌻


సాధన అన్నది గుణమే కాని, నిర్గుణము కాదు. ఏ గుణముల నభ్యసించుట వలన గుణాతీతమగు శాశ్వత సత్యము అనుభవింపబడునో అట్టి గుణములు ఉపాసింపబడనిచో సాధన జరుగదు.

గుణములకును , అంతర్యామికిని ఎప్పుడునూ అవినాభావ సంబంధమున్నది. గుణములు అంతర్యామికి దేహధాతువుల వంటివి. అందు సద్గుణములు ఆరోగ్యవంతమైన దేహమును , దుర్గుణములు వ్యాధిగ్రస్తమైన దేహమును తెలియజేయును.


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


12 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 177


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 177 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సగుణము - నిర్గుణము 🌻


దైవసాధనలో పరిశుద్ధమయిన పరబ్రహ్మము నిర్గుణమనియు, దానిని సాధించువారు గుణముల నుండి విముఖత చెందవలెననియు నొక మతము. నిర్గుణ స్థితియే ఆనందమనియు , తద్భిన్నములు ఆనందేతర స్థితులనియు వీరి వాదము.

పరబ్రహ్మము నిర్గుణమను మాట నిజమే కాని, అది గుణములను చూచి భయపడునది కాదు. దాని యందు గుణములు అంగాంగీ భావముతో నుండి జీవప్రజ్ఞనుండి, ఈశ్వర ప్రజ్ఞ వరకు సోపాన క్రమముగ నేర్పడును.


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


10 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 176


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 176 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మోక్షము - వినాశము - 2 🌻


మంచుగడ్డలు నీటిపై తేలుచున్నపుడు నీరుగా నున్న ద్రవ్యము ననుసరించి మంచుగడ్డగా నున్న అదే ద్రవ్యము ప్రవర్తించును. మంచుగడ్డ ప్రవహించు దిక్కు మున్నగునవి నీటి ప్రవాహము ననుసరించి యుండును. అనగా మంచుగడ్డలోని అదే ద్రవ్యమునకు పరాధీనత , నీటిలోని అదే ద్రవ్యమునకు స్వామిత్వము కలుగును.

అదే విధముగా త్రిగుణములతో బద్ధుడుగా జీవుడును , త్రిగుణాత్మక ప్రకృతికి ప్రభువుగా ఈశ్వరుడును వర్తించుచున్నారు. ఈ బద్ధస్థితి ఉన్నంత తడవును జీవునకు బోధపడదు. బోధపడుట యనగా ఈశత్వము నందు మేల్కొనుట. అదియే మోక్షము.


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


08 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 175

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 175 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మోక్షము - వినాశము - 1 🌻


నా పనులు అని వేరుగా కొన్నిటిని ఏర్పరుచుకొని నెరవేర్చు చుండుటయే అహంకారము. అహంకారము దేవుని పనికి సమర్పణమైనపుడు జన్మ సమస్తము చక్కగా నిర్వహింపబడును. అదియే మోక్షము. అట్లుగాక అహంకారమునకు సొంత పని అని వేరుగా ఏర్పడినచో దురహంకారమగును. దానివలన అసురత్వము , వినాశము కలుగును.

హిమాలయములలోని నదీ ప్రవాహములలో మంచుగడ్డలు పుట్టి , తేలుచు ప్రయాణము చేసి , కరగిపోవుచుండును. పుట్టుట, కరగిపోవుట అను స్థితులకు ముందు , తర్వాత ఆ ప్రవాహముండును. మంచుగడ్డ కట్టుకొనునపుడు దాని లోపల ప్రవాహజలమే గడ్డకట్టి యుండును. అట్లే దేహముల యందు నారాయణుడును.

.... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹🌹🌹🌹🌹

06 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 174


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 174 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. "ఉచ్చరిత వాక్యము" 🌻


అసలు, తలంపు అనునది ఎట్లు ఆవిర్భావమొందునో పరిపూర్ణముగా అవగతము చేసికొందుము గాక. మనలో తలంపు, కల్పింపబడిన పిమ్మట, ఒక తలంపు నెలకొనునని మనము ఎరుగుదుము. ఇది మన మనస్సులో పయనము గావించుచు, ఒక నిండయిన అభిప్రాయముగా రూపొందును‌ అంతట, వ్యక్తీకరణమును కాంక్షించును. అందులకు గాను ఒక వాక్యమును ఎంపిక చేసికొనును.

అంతట పదములను ఎంపిక చేసికొని, వాక్యముగా కూర్పుచేయును. అప్పుడు మాత్రమే, మనకు తెలిసిన భాషకు సంబంధించి, మన స్మృతి పథమును బట్టి, ఆవశ్యకములగు ధ్వని సంపుటులను ఎన్నుకొనును. అపుడు వాక్యముగా ఉచ్చరితమై బాహ్యమున వెలువడును. దీనినే మనము "ఉచ్చరిత వాక్యము" అని అనుచున్నాము...

...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


04 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 173


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 173 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భక్తి యోగము - 2 🌻


ఒక్కొక్కడు తన పరిసర రూపములను ఇతరులుగా గమనించును గనుక ఇతరులను గూర్చిన మంచిచెడ్డలను నిర్ణయించుచు కాలము వ్యర్థము చేసికొని చెడిపోవును .

అట్లుగాక ఇతరుల రూపమున ఒక్కడే సంచరించు చున్నాడనియు, వాడే భగవంతుడనియు స్మరించు చున్నచో , ఇతరులలోని సద్గుణములు, సత్ప్రవర్తనములు, ఇతరులు ఆచరించు సత్కార్యములు, భగవంతునివిగా తెలిసి, అతని గుణకీర్తనము చేయుట సాధ్యపడును. ఇదియే భక్తి యోగము .


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹



02 Apr 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 172


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 172 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భక్తి యోగము - 1 🌻


సంస్కృతంలో పరమ ప్రేమకే "భక్తి" అని పేరు. భక్తిని అభ్యాసము చేయు మార్గమునకే భక్తి యోగమని పేరు. మన తలంపులను పరిశుద్ధము గావించు కొనుటకును, వానికి చక్కని రూపు కల్పించుటకును, మన భావములతో సుందర శిల్పము సృజించుటకు భక్తియోగమే శ్రేష్ఠమయిన మార్గము.

భావబలమే అంతిమ శక్తి. మన నుండి దేనినయినను, ఇది కల్పింపగలదు. సముచిత పథము‌ కల్పింపబడినచో, అది మనకును, ఒరులకును స్వర్గమును సృజించి, మనలను దైవ సామ్రాజ్యమున నిలుపును. అనుచితముగా కల్పింప బడినపుడు, దీని వలన రాజ్యములు వినాశమునకు గురియగును. దానితో మానవ జీవితము వికారమయిన శిథిలముల కట్టయగును‌.

...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


31 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 171


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 171 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 6 🌻


ఉద్వేగము వలన అవతలి వ్యక్తులను వస్తువులను మనకు చెందిన వానిగా భావించి చిక్కులలో పడుట జరుగును. పరమప్రేమ రూపమయిన భక్తి వలన మనవి అనబడు వానిని చివరకు మనలను గూడ సమర్పించు కొనుట జరుగును. పశుపద్ధతిలో మనము అవతలి వానిని ఇష్టపడినచో, వానిని మనకు చెందిన వస్తువుగా ‌భావించుట జరుగును. మనము అనుకొన్న మంచి పద్ధతిలో అవతలి వాడు నడువ వలెనని ఆశించుట జరుగును. ఈ పద్ధతి వట్టి మూర్ఖత యగును.

అవతలివాడు, తనదయిన రీతిలో తాను వర్తింపనారంభింపగనే, మనలో తీవ్రమగు కఠిన ప్రతిక్రియ ఉప్పతిల్లును. అంతటితో వానిని ద్వేషింప ఆరంభింతుము. ఇట్లగుటకు కారణమేమి? అవతలి వానిని మనము ప్రేమించుటయే. ఇట్టి ప్రేమ నిజమైన ప్రేమ అగునా? ఇదియు ద్వేషమను కాలుష్యముతో గూడినదై సంగమగుచున్నది. మన ప్రేమకు గురిఅయిన వానిని ద్వేషించుటకు కారణము, ఉద్వేగముచే ప్రేరేపింపబడిన భావముల శక్తియే...


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 170


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 170 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 5 🌻

ఇంకొక యధార్థమేమనగా, ఉద్వేగమనునది ఉప్పెన కెరటములుగా మార్పు చెందు చుండును. భక్తి అట్లు గాక, నిశ్చల జలముల వలె మన యందు నిండిపోవును. స్పూర్తితో పుష్టి నొందిన భక్తి (పరమ ప్రేమ) అనభూతి కలిగిన వానిలో దృక్పథము మార్పు చెందుట జరుగదు. నాకు, నీ యెడల ప్రేమను అసత్యపు పేరుతో ఉద్వేగపూరితమైన సంగమున్నచో, అది తప్పక‌ మిక్కిలి ధృడమై తీరును.

మరియు అతి ధృడమైన ద్వేషమును కలిగించకుండ యుండదు. ఉద్వేగ బంధితుడగు జీవుడు పశుప్రాయుడే‌. సెలవు రోజున తన ప్రియ స్నేహితుడు అతని వేరొక స్నేహితునితో కలిసి చరించుట గాంచినచో ఫలితమేమి? తనకు, అవతలి వాని యెడల గల ప్రేమకు ఫలముగా, అసూయా రోషములతో దుఃఖించుట దక్కును. ఇది ఉద్వేగముతో కలుషీకృతమైన ప్రేమ యొక్క ఫలితము.

...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


27 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 169


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 169 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 4 🌻


పరిశుద్ధి చెందిన జలములలో ఏదయిన సంచలనమును కలిగించినను, ఎట్టి అవక్షేపమును అడుగునకు జేరదు. రంగు మార్పు జరుగదు. మనలో ఇట్లు పరిశుద్ధీకరణము చెందిన అనుభూతి యొక్క వాహికను పెంపొందించు కొననగును. అనగా, అనుభూతి తన ద్వారమున అందుకొననగు వాహిక అను మాట. ఇట్టి స్థితినే 'స్పూర్తి' అందురు.

ఇట్టి స్థితిలో మన సంబాషణ, అవతలి వానిలో ఉద్వేగమును గాక, పరమప్రేమ రూపమగు భక్తిని ప్రేరేపించును. భక్తికి, ఉద్వేగమునకు గల వ్యత్యాసము పరిశుద్ధ జలములకు మట్టితో గూడిన మురికి నీటికి గల వ్యత్యాసము వంటిదే. భక్తి అనునది, మన దృక్పథమును ఉదాత్తము గావించి, మనకు అనుభూతి నందించును.


.... ✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


25 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 168


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 168 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 3 🌻


దౌర్భాగ్య వశమున, మన నరులలో 98% మంది, ఉద్వేగమునందే బ్రతుకుచు, ఉద్వేగమను మాలిన్యము నుండియే తలంపులను ఉద్భవింప జేయుచున్నారు. ఫలితమెప్పుడును, తిరిగి ఉద్వేగముతోడి స్పందనయే గదా. అధిక రుచికరమైనది ఏదయిన, ఉద్వేగము యొక్క స్థానమున వెలయ కున్నచో ఈ విపత్తు నుండి బయటపడుట సాధ్యము కాదు. మనలో ఉద్వేగము యొక్క స్థానము గొనవలసినది ఏది? పెద్దలు దీనినే స్పూర్తి అనుచున్నారు.

మనము ఉదాత్తమైన దాని నుండి స్పూర్తి నందినచో మన ఉద్వేగములు క్రమముగా క్షాళితములగును మట్టి రేణువులు, అడుగున నిలిచి, నిర్మల జలములు బయటపడుటకు అవకాశము కలుగును. స్వర్ణ రసాయన శాస్త్రవేత్త దీనినే పరిశుద్ధీకరణ విధానమని పేర్కొనెను. మన యందు ఈ విధానము అమలు జరిగినచో అవతలి వారి స్పందనయు పరిశుద్ధముగానే ఉండును.


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


23 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 167


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 167 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 2 🌻


ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు. ఇతరులకు మనము ప్రతికూలపు ఆలోచనను అందించినచో మనకు కూడా వారి నుండి ప్రతికూలపు ఆలోచనయే ఎదురగాక తప్పదు. ఇట్టి వ్యవహారము, ఇరువురు వ్యక్తుల నుడమ వాటిల్లినచో, దాని ప్రభావము సమాజముపై అంతగా ఉండదు. కాని, ఇట్టిదే రెండు వర్గములకో, జాతులకో, దేశములకో ప్రాతినిధ్యము వహించు ఇరువురు వ్యక్తుల నడుమ వాటిల్లినచో ఫలితము వినాశకరమగును.

సంగ్రామము పేరున, మానవ చరిత్ర పుటలలో చాలా బాధాకరములయిన గుణపాఠములు లిఖింపబడినవి. ప్రతి యుద్ధము గూడ, నరుడను జీవిలోని పశుప్రవృత్తి యొక్క చేవ్రాలు మాత్రమే. అనగా మృగ ప్రాయమైన బాధ్యతారహిత పథమున ఆలోచనలను, దృక్పథములను ఉద్భవింప జేయుటయే. ప్రసార కేంద్రము నుండి వెలువడు ఒకే కార్యక్రమమును ఎవరి రేడియో అయినను స్వీకరించును. ఉద్వేగము వలన మనలో ఒక తలంపు పుట్టగనే, ఇతరులలోను అది ఉద్వేగమునే ప్రేరేపించును. అవతలి వ్యక్తి, ఉద్వేగమును అంతయు తనలోన సంలీనము గావించు కొన్నవాడయితే తప్ప, ఇది యథార్థము.


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


21 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 166




🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 166 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 1 🌻


సామరస్యమునకు అనుకూలమగు ఆలోచనను ఉద్భవింపజేసినచో, అది అవతలి వారిలోను ఇట్టి అనుకూల దృక్పథమునే జనింపజేయును. అంతట వారు కూడ అనుకూలమగు ఆలోచనలనే మనకు అందించుట జరుగును. తిరిగి మనలోను సామర్యసానుకూల దృక్పథమే ప్రేరేపితమగును. విధానమంతయు ఒక స్వయం పరితృప్త వలయము వలె పనిచేయును. దాని‌ వలన మనస్సు నిర్మాణాత్మకముగను, సృజనాత్మకముగను అగును. ఈ విషయము తెలియుటకు ముందు, బాధ్యతను ఎరుగని ప్రవృత్తితో తలంపులను ఉద్భవింపజేయుట మూలమున మనము మనకును, ఇతరులకును హాని కలిగించిన వారమైతిమి.

మానవజాతి ఒక్కుమ్మడిగా మానవ ప్రపంచమును సంఘర్షణ దిశగా తోయుచున్నది. ఎల్లరును సంఘర్షణలో దిగబడినవారే. ఆలోచనలను బాధ్యతా రహితముగా ఉద్భవింప జేసిన దాని ఫలితముగాదా ఇది. ఇతరులలోను, మనలోను దృక్పథములను జనింప జేయుటలో అజ్ఞానముతో వ్యవహరించుట‌ వలన ఫలితము గాదా ఇది. ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు.


✍️. మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹


19 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 165


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 165 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. వాదనలు వ్యర్థము 🌻


ఏ నరుడైనను స్వల్పకాలము దేనిని గూర్చి వాదనలోనికి దిగినను రోషము, పంతములు కలుగును. అనగా బాధ కలుగును. అది కలిగినంత కాలము వాని ఆయుర్దాయము వ్యర్థమై పోయి‌నట్లే.

ఏ నరుఁడే నొక నిమిషంబైన వృథావాదగతిని హరిపదకమల
ధ్యానానందుఁడు గాడే నా నరునకు నాయు వల్ప మగు మునినాథా!

వయస్సు‌ను బట్టి రోగము , ముసలితనము మున్నగు లక్షణములు వచ్చుట సిద్ధుల యందు పనిచేయదు.

మనస్సు , ఇంద్రియములు స్థూలదేహమునకు కోరికల రూపమున దాస్యము చేయుచున్నచో రోగము, ముసలితనము కనిపించును. అట్లుగాక ఇంద్రియములు , మనస్సు , బుద్ధి యోగమున భగవంతుని యందు వసించుట అభ్యాసమైనచో దేహము కూడ వానిమనుసరించి జీవింపవలసి వచ్చును. అప్పుడు రోగము, వయస్సు పనిచేయవు.

✍🏼. మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


17 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 164


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 164 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వాంతర్యామి 🌻


లోకమున దుఃఖమునకు కారణము ఎవ్వరని మానవులు అనేక సిద్ధాంతములను కనిపెట్టిరి. తమకు సుఖదుఃఖములను ఇచ్చు ప్రభువుగా దేవునిపై కొందరు నిందారోపణము చేసిరి. తప్పు చేయుట అనగా హాని కల్గించుటయే తన చెడునడవడిని సరిచేసికొనుట తన చేతిలోని పనియే. దానిని అంగీకరించుటకు భయపడి తనకన్న శక్తిమంతమైనదేదో తన చేత చేయించుచున్నదని నమ్ముట దౌర్భల్యము గాని సత్యముకాదు. జీవుడు మంచిగా గాని, చెడుగా గాని ప్రవర్తించుటకు గ్రహస్థితులు కారణమని సిద్ధాంతము చేసికొందురు. ఆత్మ వంచనము చేసికొనుచున్నారు.

చేసిన కర్మయొక్క ఫలమే మనచేత నిత్యము మంచి చెడ్డ పనులు చేయించుచున్నదని కొందరు నిర్ణయింప జూచుచున్నారు. కొందరి ప్రకారము సృష్టి అంతయు స్వాభావికముగా జరుగుచున్నది. దీనిని గ్రహించుట సాధ్యము కాదు నిరోధించుటకు అధికారము లేదు. మానవుని ప్రవర్తనలో గల మంచి చెడ్డలు కూడ స్వాభావికముగా జరుగుచున్నవని వారి మతము. దీని వలన ఒకరితో ఒకరు కలహించుకొని జాతి నశించును. ఇతరుల వలన మనకు దుఃఖము కలిగినపుడు వారు చేసిరని దుఃఖింప పనిలేదు. తర్కమునకు, నిర్ణయమునకు లొంగని వాడు సర్వాంతర్యామి. వాని లీలయే సర్వము. ఇంతకన్నా సత్యము లేదు.

✍️. మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹


15 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 163


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 163 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻


మహనీయులు దేవుని అస్తిత్వమునందు‌ శరణాగతి చెంది, జీవయాత్ర సాగింతురు. వీరు తమ‌ హృదయములందు ఎనిమిది అంగుళముల‌ కొలత కలిగిన దివ్యదేహునిగా సర్వాంతర్యామిని ధ్యానింతురు. అనగా ఎనిమిది ప్రకృతులలోని వానిని తెలియుదురు. చూపుడు వ్రేలు‌ కొలతగా హృదయమున శ్రీహరిని ధ్యానింతురు. అనగా చూపడు వ్రెలితో ఎవ్వనిని చూపినను, ఏ వస్తువును చూపినను, వాని యందు భగవంతుడు జ్ఞప్తి రావలెను గాని ఆయా వ్యక్తులు, వస్తువులు‌గాదు.

స్వామిని చతుర్భుజుడుగా ధ్యానింపవలెను. అనగా తాను నిలబడిన తావున నుండి నాలుగు దిక్కుల వరకు కనుపించునంతమేర దేవుని బాహువులు రక్షించుచున్నవని తెలియవలెను. మందర ధారియగు కూర్మమూర్తిగా భావింపవలెను. అనగా జగత్తును ధరించు‌ శక్తిగా తెలియవలెను.

దేవుని గూర్చి మనకు ఎంత గొప్ప అభిప్రాయమున్నను, అది అభిప్రాయమే గాని దేవుడు కాదని గ్రహింపవలెను. సాధన చేయుచున్నప్పుడు కలుగు స్వప్న సాక్షాత్కారములు మున్నగు అనుభవములకు మురిసి పొంగినచో, ఇంక ఆ పైకి పోవుట జరుగదు. ఇట్టివి మన కోరికల సాక్షాత్కారములే కాని, దేవుని సాక్షాత్కారములు గావు. భగవంతుని‌ సాక్షాత్కారమనగా సృష్టిలోని జీవుల రూపములోని సాక్షాత్కారమే. మిగిలినదంతయు జీవులల్లుకొన్న పాండిత్యమనియు తెలియవలెను.


.✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


13 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 162


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 162 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విషువత్ - 2 🌻


సంవత్సరాదిని నిర్ణయించుటకు వేదఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈ దినమును స్థాపించెడి వారు. ఈ బిందువు నుండి సమస్త ఖగోళ గణితములను లెక్కించెడివారు. ఈ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్యరేఖపై కొంచెము వెనుకకు నడుచు చుండును. ఈ నడచుటనే "గవామయము" అను యజ్ఞముగా వేద ఋషులు గుర్తించిరి. ఈ బిందువుతోపాటు సంవత్సరాది కూడ వెనుకకు నడచు చుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి.

'నల్లలేడి యందు దృష్టి నిలిపి వింటియందెక్కు పెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరుగెత్తుచున్న పినాకపాణి వలె నున్నావు.' అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును. నాటకము మొత్తము నందును చాంద్ర సంవత్సరము యొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చాంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను.

ఈ బిందువునకై భూమధ్యరేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి‌ ధ్రువుని కాలముననే పుట్టినది.


....✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


11 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 161


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 161 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విషువత్ పుణ్యకాలము - 1 🌻


దక్షిణాయనము నుండి ఉత్తరాయణమునకు సూర్యుడు సంవత్సరమున కొకమారు భూమధ్యరేఖను ఖండించును. ఆ ఖండించిన దినమును విషువత్ పుణ్యకాల మందురు. ఇది ప్రతి సంవత్సరము మార్చి 21 వ తేదీనాడు జరుగును.

ఆ దినమున భూమధ్యరేఖపై నిలిచి కొలిచినచో అహోరాత్రములు సమభాగములుగా నుండును. ఈ బిందువును వేదములలో , పురాణములలో యజ్ఞమృగము అందురు. మృగమనగా వెదుక బడునది అని అర్థము.

ఈ బిందువే సౌర సంవత్సరమునకు సంవత్సరాది.

✍🏼. మాస్టర్ ఇ.కె. 🌻

🌹🌹🌹🌹🌹


09 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 160


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 160 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సంస్కృతి-సమానత -2 🌻


ఈ దేశ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మతమనే మసిపూసిన అద్దంలో నుంచి చూసి తిరస్కరించడం ప్రధాన కారణం. అన్ని రంగాల్లోను పాశ్చాత్య సంస్కృతిని ఆదర్శంగా తీసికొని వారి నుంచి అవి, ఇవి యాచించడం, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవడం మొదలైన ఎన్నో కారణాలున్నాయి.

అంతేకాక బ్రిటీషు పాలనకు ముందు ప్రతి గ్రామంలో ఉన్న అన్ని వర్ణాలవారు ఐకమత్యంతో ఒకే కుటుంబ సభ్యులు వలె పరస్పరత్వంతో మెలిగేవారు. అందరి మధ్య సామరస్య భావన, సమానత అప్రయత్నంగా నెలకొని ఉండేవి. 'విభజించి పాలించడము' (Divide and Rule) అనే పద్ధతి వలన వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా గజిబిజి చేయబడింది. అప్పటి నుండి గ్రామ వాసుల మధ్య సామరస్యం దెబ్బ తిన్నది.


....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


07 Mar 2022