✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. భావ బలము - 1 🌻
సామరస్యమునకు అనుకూలమగు ఆలోచనను ఉద్భవింపజేసినచో, అది అవతలి వారిలోను ఇట్టి అనుకూల దృక్పథమునే జనింపజేయును. అంతట వారు కూడ అనుకూలమగు ఆలోచనలనే మనకు అందించుట జరుగును. తిరిగి మనలోను సామర్యసానుకూల దృక్పథమే ప్రేరేపితమగును. విధానమంతయు ఒక స్వయం పరితృప్త వలయము వలె పనిచేయును. దాని వలన మనస్సు నిర్మాణాత్మకముగను, సృజనాత్మకముగను అగును. ఈ విషయము తెలియుటకు ముందు, బాధ్యతను ఎరుగని ప్రవృత్తితో తలంపులను ఉద్భవింపజేయుట మూలమున మనము మనకును, ఇతరులకును హాని కలిగించిన వారమైతిమి.
మానవజాతి ఒక్కుమ్మడిగా మానవ ప్రపంచమును సంఘర్షణ దిశగా తోయుచున్నది. ఎల్లరును సంఘర్షణలో దిగబడినవారే. ఆలోచనలను బాధ్యతా రహితముగా ఉద్భవింప జేసిన దాని ఫలితముగాదా ఇది. ఇతరులలోను, మనలోను దృక్పథములను జనింప జేయుటలో అజ్ఞానముతో వ్యవహరించుట వలన ఫలితము గాదా ఇది. ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే కల్పింపక తప్పదు.
✍️. మాస్టర్ ఇ.కె. 🌻
🌹 🌹 🌹 🌹 🌹
19 Mar 2022
No comments:
Post a Comment