సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) -39

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) -39 🌹 
39 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగ మాయ - 2 🍃 

280. శరీరములోని వివిధ భాగములు, నాడులు, షడ్చక్రములు, కుండలిని, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, త్రిగుణములు ఇవన్నియూ పరస్పర ఆధారములై తమ తమ ధర్మములను నిర్వర్తించుచున్నవి. అలానే ఆత్మ, అంతరాత్మ, జీవాత్మ, పరమాత్మలు కూడా మాయా శబలితమై వర్తించుచున్నవి.

281. భ్రాంతియె భ్రమ. లేని వస్తువును ఉన్నట్లు తలంచుటయె భ్రమ. తాడుయందు పాము, ఎండమావులలో కనిపించే నీరు, శరీరమె తాను అనుకొనుట ఇవన్నియూ భ్రమలే అగును. ప్రతి ఒక్కరు మాయలో పుట్టి, మాయలో మరణిస్తున్నారు. స్వేచ్ఛా, మోక్షము, ముక్తి అనునవి మాయను జయించినప్పుడు లభిస్తాయి. 

282. మాయకువశమైన వాని లక్షణములు: పుణ్య పాపకర్మలు చేయుట, మంచి చెడు కర్మలు, మూఢత్వము, అజ్ఞానము, రాక్షస స్వభావము, సంసారము, దుఃఖము, రాగద్వేషములు, అహంకారములు మొదలగునవి. దీనిని బంధము అందురు. 

283. దివ్య దృష్టి లేనిదే మాయమర్మమును తెలుసుకొనుటకు వీలులేదు. భగవంతుని శక్తి విశేషము, యోగమాయ. భగవంతుని గ్రహించకుండా మాయ అవహించి ఉన్నది. ఈ మాయా తెర తొలగాలంటే ఆత్మ దర్శనం అవసరము. యోగ శక్తి ద్వారా భగవంతుడు అనేక అవతారములు దాల్చుచూ జగత్తును ఉద్ధరించుచున్నాడు. 

284. ఎఱుక అనగా గుర్తు, సాక్షి స్థితి, జ్ఞప్తి, స్పురణ. జీవుడు ఎఱుక స్వభావుడు. ఎఱుక ఒక కల. పరిపూర్ణత్వములో తోచిన ఎఱుకయె కల. మాయను తెలుసుకోవాలంటే ఎఱిగే ఎఱుక అవసరము. సృష్టికి కారణము ఎఱుక. ఎఱుక లేని దశయె నిర్గుణము. లేని ఎఱుకను తెలుసుకొని చివరకు ఆ లేని ఎఱుకను విడువవలెను. 

పంచ జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకొనేది మనస్సు అనే ఎఱుక. ఈ జగత్తుకు మూలము ఎఱుక. సుషుప్తి అవస్థనుండి తనంతట తాను ఎవరు పిలువకయె ఎఱుక వచ్చినది. అచల పరిపూర్ణముచేత ప్రకృతి, పురుషులు పుట్టలేదు. ఈ రెండు మాయయె. ఎఱుకకు మూలము మాయయె. ఎఱుక లేని స్థితియె పరిపూర్ణము. మనకండ్లకు కనబడు ఎఱుకలేని ఎఱుక ఇంద్రజాల భంగిమవలె ఇది కనిపించి చివరకు ఏమియూ లేకుండా పోవును. 

285. అఖండ ఎఱుకయె బ్రహ్మము. జీవుడు పిండాండ రూపము. ఈశ్వరుడే బ్రహ్మము. 

286. బట్టబయలు, ఉత్త బట్టబయలు ఏమి లేనిది. నిరాకారమె బట్టబయలు. పరబ్రహ్మ స్వరూపమే బట్టబయలు. ఇది సర్వత్రా సర్వవేళలందు నిండియున్నది. దీనికి నాశనంలేదు. దీనిని తెలుసుకొనిన బ్రహ్మమును తెలుసుకొన్నట్లే. ఇట్టి బట్టబయలుగా ఉండు పరబ్రహ్మ యందు ఎఱుకను విడచుటయె సాధకుని లక్ష్యము. అఖండ ఎఱుక పోతే బయలే. 

అఖండ ఎఱుకనగా కోటి సూర్యుల కాంతిగా వెలుగుతూ ''ఓం'' అనే ప్రణవము, అందుండి వివిధ నాదములుగా వెలువడుతున్నది. ఇది నీవు కాదు. నీ నిజ స్వరూపము బట్టబయలు. అదియె శాశ్వతము, సత్యము, నిర్మలము, అనాది. ఇది సర్వత్రా నిగూఢముగా వ్యాపించి యున్నది. 

287. అచల పరిపూర్ణము అనగా ఆత్మ, మనస్సు స్పందించక స్థిరముగా, నిశ్చలముగా ఉండి తిరిగి ఏకాలమందునూ చలింపకున్నచో దానిని అచలము అంటారు. ఇట్టి స్థితిలో వ్యక్తి వికార రహితుడై రూప నామములు లేక, జననమరణములు లేక స్త్రీ, పురుష నపుంసక భేదములు లేక ఉండుటయె అచల పరిపూర్ణమంటారు. ఇది భావాతీతము. త్రిగుణ రహితము. 

288. సృష్టికి పూర్వము ఈ విశ్వమంతయు అసంగుడైన నిర్వికార పరబ్రహ్మ స్థితి యందుండెను. అదియె అఖండ జ్యోతి. ఈ జ్యోతి నుండియె మాయాశక్తి ప్రతిఫలించినది. ఆ మాయా శక్తియె సృష్టి నిర్మాణమునకు మూలము. ఈ మాయా శక్తికి సత్వ గుణము ప్రధానము. అందుండి మొదట ఈశ్వరుడు ఏర్పడి, మాయను తన వశము చేసుకొని దాని యందే నివసించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

కుసుమ హరనాథ్ పసిడి పలుకులు 153: 🌹

🌹 *కుసుమ హరనాథ్ పసిడి పలుకులు 153:* 🌹

*నిప్పులమీద క్రమాను గతంగా గాలిని విసరక పోతే దానమీద బూడిద పొర క్రమ్మేస్తుంది. అదేవిధంగా హరిని గురించిన విషయాలను నిత్యమూ చర్చించు కోకుండా ఉన్నామంటే, మన మనస్సుల మీద మడ్డి (మురికి) పేరుకొని పోతుంది. ఆ కారణంగా ఆ అగ్ని యొక్క తేజస్సు (వేడి మన అనుభవం లోనికి రాదు!*

*ఈ కారణంగానే ఈ భక్తి లతను నిత్యమూ శ్రవణమూ, కీర్తనమూ అనే జలాలతో తడుపుతూ ఉండాలి! అప్పుడే అది క్రమంగా వృద్ధి పొంది పూలతో,ఫలాలతో నిండి,మనకు నిత్యానందాన్ని ప్రసాదిస్తుంది.*

*తీర్థస్థలాలలో సామాజిక బంధాలు - కట్టుబాట్లు ఉండవు. మనస్సు సహజంగానే వినమ్రమై (వంగి)వ్యక్తి తన అంతస్తును - హోదాను - మరచి పోయేటట్లు చేస్తుంది. పుణ్యతీర్థ దర్శనం వలన కలిగే మహనీయమైన ఫలితాలలో ఇది ఒకటి.*

*సత్సాంగత్యం లభించ నప్పుడు - సత్ శాస్త్రములను,సత్ గ్రంధములను పఠించండి!*
*(పా..హ..4వ, భాగంలో,153వ, లేఖ నుండి) జై కుసుమహర!!*
🌹🌹🌹🌹🌹
🙏 *ప్రసాద్*

జీవిత లక్ష్యం

🌹 జీవిత లక్ష్యం 🌹

✍ ఆనందసాయి స్వామి

దైవాన్ని గుర్తించి నోరెత్తకుండా తన పని తాను చేసుకుపోవడమే ఆధ్యాత్మికతలో ఉన్న పరమ రహస్యం.

చాలామంది సాధకులు భగవంతుణ్ని తెలుసుకున్న తరవాత మౌనం వహించారు. ఎందుకు? ఈశ్వరుడు ఆడిస్తున్న నాటకాన్ని సాక్షిగా చూస్తూ లోపల పరమానందాన్ని వాళ్లు పొందుతున్నారు. ఇది నిజమా, ఇదే నిజమా?

శాస్త్రాలు, గురువులు ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నప్పుడు- విశ్వసించాలి మరి. అన్ని అనుభవాలూ మనకు సూటిగా లభించవు. ఇతరులకు లభించిన దాన్ని ప్రాతిపదికగా తీసుకుని రుజువు చేసుకోవాలి. దీనికి విశ్వాసం కావాలి. అప్పుడే మన లోపల తాళం మనం తెరుచుకోగలం. అంతరంగంలో జరుగుతున్న దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలం.

దైవాన్ని గుర్తించడం అంత సులువైన పని కాదు. అది సాదాసీదా పని కాదు. అందరికీ సాధ్యమయ్యేది కాదు. అలా అని వూరుకుంటే మనం నిజమైన మానవులం కాదు. మనకు ఒక బాధ్యత ఉంది. ధర్మం ఉంది. మన జీవితానికి ఒక ప్రయోజనం ఉంది. అన్నింటికీ మించి పరమార్థం ఉంది. దాన్ని గుర్తించాలి.

నన్ను గుర్తించు అంటూ దేవుడు మన దగ్గరకి రాడు. మన సుఖం కోసం శాంతి కోసం ధన సంపాదన ఎలా అయితే చేస్తున్నామో, ఈశ్వరారాధనా అలాగే చెయ్యాలి. ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పొందాలి. ఈ విషయాన్ని ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి.

లౌకిక జీవనం సుఖవంతం కావడానికి ఎంతోమంది శాస్త్రజ్ఞులు జీవితాలు అంకితం చేశారు. అపార కృషి చేశారు. అలౌకిక మార్గంలో నడిపించి దైవసాన్నిధ్యం కల్పించడానికి ఎందరో మహానుభావులు తపించారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని జీవనం సాగించడం ఉత్తమ మానవుడి లక్ష్యం. ఏది వదిలిపెట్టినా జీవితం పరిపూర్ణం కాదు. వనం ఉండాలి. వసంతం ఉండాలి. అందులో కోయిల ఉండాలి. అప్పుడే పాట హాయిగా ఉంటుంది! హృదయం ఉండాలి. అందులో ప్రేమ ఉండాలి. దగ్గరకు తీసుకునే చేతులు ఉండాలి. అప్పుడే ఆ పరిష్వంగం ఆనంద రసకందాయమవుతుంది.

తీపిని బెల్లం నుంచి వేరు చెయ్యలేం. కాంతిని సూర్యుడి నుంచి వేరు చెయ్యలేం. కెరటాన్ని సముద్రం నుంచి వేరు చెయ్యలేం. మన జీవనం లోంచి ఆధ్యాత్మికతను వేరు చేసి చూసే అవకాశమే లేదు. అవగాహనకు వస్తున్న కొద్దీ దేవుడు మిత్రుడవుతాడు. మార్గదర్శకుడవుతాడు. గురువవుతాడు. చిట్టచివరకు ప్రేమికుడవుతాడు.

ఎక్కడ మనం ఉన్నామో, ఆ ప్రదేశం ఏమిటో, ఎందుకు మనం ఉన్నామో, ఆ స్థితి ఏమిటో, మనల్ని ఇలా ఉంచినవాడితో సంబంధ బాంధవ్యాలు ఎలా జరుపుకోవాలో తెలియకపోతే- మనకు బుద్ధి ఎందుకు? మనిషికి జంతువుకి తేడా ఏమిటి? హేతుబద్ధంగా ఆలోచించడం విజ్ఞానానికే కాదు, వేదాంతానికీ కావాలి. భగవంతుడు రుజువయ్యాడు. దానికి నిజభక్తులే సాక్ష్యం. భగవంతుడు రుజువవుతాడు. ఆధ్యాత్మిక హృదయం వికసించాలి. ఆ దిశలో మనం కళ్లు తెరుచుకుని చూడాలి.

'జీవిత లక్ష్యం ఏమిటి?' అని కొత్తగా వచ్చిన ఓ శిష్యుడు బోధకుణ్ని అడిగాడు.

"ఈ జీవితంలో ఎంతో బ్రహ్మానందం ఉంది. కాని, మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు. ఏదో సాధించాలని పరుగులు తీస్తున్నాం. జీవించడమే ప్రాతిపదికగా ఉన్న జీవితాన్ని ఓ సాధనంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఆశయాల కోసం తీస్తున్న పరుగులే మనలో ఉద్విగ్నతను పెంచు తున్నాయి" అని బదులిచ్చాడు ఆయన.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

అక్షర సత్యా లు 1

🌹 *అక్షర సత్యాలు*🌹

🌻 *మనుషులు సాధారణంగా మిత్రుల  జీవితాలను అనుకరిస్తుంటారు. కనుక వారి నడవడికను చూడాలి.*

🌻 *కోపంతో ఏది మొదలైనా అది చివరకు తల దించుకునేలా చేస్తుంది.*

🌻 *అంతా ఐపోయింది, ఇంకేమీ లేదు . అని అనుకున్న చోట ఆగిపోక ప్రక్కకు తిరుగు మరోదారి కనిపిస్తుంది. అపుడు నీ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది.*

🌻 *కల్లా కపటం లేని నవ్వే ఓక దివ్య ఔషధం.*

🌻 *బాధ్యత తో చేసేపని చక్కగా ఉంటుంది. ప్రేమతో చేసే పని అందంగా వుంటుంది.*

🌻 *సాధన లేకుండా విజయాన్ని ఆశించడం, ఎడారిలో మంచి నీటికోసం వెతకడం వంటిది.*

🌻 *ప్రతికూల మైన వాతావరణం నుంచే క్రమశిక్షణ నేర్చుకోవాలి.*

🌻 *మంచుకన్న  చల్లనైనది, మల్లె కన్న తెల్లనైనది,  అమ్మప్రేమ ఒక్కటే.*

🌻 *కొంతకాలం వచ్చాక గురువును ముంచి పోయాను అనుకోవడం పెద్ద మాయ..!!*

🌻 *మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైనది...ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది..*
*ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది..*
*ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది..!!*

🌻 *ధర్మం అనేది మన అంతరాత్మ లోనుంచి పైకి సహజంగా ఉబికేది.*

🌻 *పువ్వు జీవితం ఒక్క రోజే, కానీ అది ఉన్న కాలాన్ని నవ్వుతూ ,అందంగా వికశిస్తుంది .అలాగే మనం కూడా మన జీవితాన్ని బాధతోనో,ద్వేషం తోనో కాకుండా సంతోషంతో ,ప్రేమతో జీవిద్దాం.*

🌻 *నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు .అది ఆత్మహత్య కంటే ఘోరం.*

🌻 *స్నేహం చేస్తే శత్రువు కూడా మిత్రువు గా అయ్యేలా చెయ్యాలి.*
*దేవుడు కూడా గర్వపడేలా జీవించాలి.*

🌻 *పర్వతం ఎత్తు చూసి జెంకితే శాశ్వతముగా కిందనే ఉండి పోతాము ...అదే సాహసించి ఒక్కో  అడుగు వేస్తే  శిఖరాగ్రము మీది కి చేరుతాము...*

🌻 *మన బాధలకు వ్యక్తులు కారణం అనుకోవడం ఒకరకమైన అమాయకత్వం. అజ్ఞానం.బాధలకు మూలం మన చంచలమైన మనసే కారణం..!!*

🌻 *మానసిక గందరగోళాన్ని సమస్యగా పరిగణించి మరింత పెంచుకోకండి. జ్ఞానితో మాట్లాడటం లేదా సాధనం పెంచడం చేస్తే ఇట్టే అది వెళ్లి పోతుంది..!!*

🌻 *ఏది పంచినా ,పంచకున్నా అదిసరిగ్గా అందాలి అంటే నిస్వార్ధం, నిరహంకారం అతి ముఖ్యం..!!*
🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*

పాజిటివ్ థింకింగ్ పవర్

🌹 *Power of positive thinking - పాజిటివ్ థింకింగ్ పవర్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు...*🌹

మనం చేయాల్సిన అన్ని పనులూ బాధ్యతగా, ఎవరికీ ఇబ్బందీ లేకుండా సకాలంలో పూర్తి చేసినప్పుడు లభించే సంతృప్తి ముందు ఏదీ సాటిరాదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈరోజు చెయ్యాల్సిన పనులు సక్రమంగా పూర్తి చేశాను అనే ఫీలింగ్ ఒక్కటి చాలు, అలసిపోయి కంటి నిండా నిద్రపోవడానికి! వర్క్ పట్ల గౌరవం లేనప్పుడే టెన్షన్లు, ప్రెజర్, రకరకాల సైకలాజికల్ ఇష్యూస్ మొదలవుతాయి. మార్నింగ్ 4.30 నుండి రకరకాల పనుల మీద అలసిపోయి మూతలుబడుతున్న కళ్లతో రాసిన రైటప్ ఇది!
మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు.. బయటి ప్రపంచపు ఆలోచనలన్నీ ఒకటొకటిగా మాయమైపోయి.. శరీరం, జ్ఞానేంద్రియాలూ అన్నీ ఉనికిని కోల్పోయి.. ఓ ప్రత్యేకమైన స్థితి వస్తుంది. నిశ్చల స్థితి! అదంటే నాకు చాలా ఇష్టం. బయటకు రాబుద్ధి కాదు.

ఊగిసలాడే ఆలోచనలు, దానికి తగ్గట్లే ఉండే శ్వాస volume నుండి అసలు శ్వాస తీసుకుంటున్నామా లేదా అన్నది కూడా డౌట్‌గా ఉండే అలౌకిక స్థితి వరకూ ప్రయాణానికి పట్టేది నాకు ఐదు నిముషాలు మాత్రమే. ఆ స్థితిలోకి వెళ్లినప్పుడు ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటే తప్పించి ఏ ఆలోచనా రాదు. చుట్టూ మనుషులు, సమాజం, ఈ గొడవలు, మన అనవసరమైన ఎమోషన్స్ అన్నీ పక్కన పడేసి.. చివరకు మన శరీరాన్ని కూడా మర్చిపోయే స్థితిలో ఒకటే అన్పిస్తుంది.. "కాస్త పట్టించుకోవడం మానేస్తే మాయమయ్యే ఈ ప్రపంచం గురించి ఇంతగా ఆలోచించడం, ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం అవసరమా" అని!

మనమెంత, మన జ్ఞానమెంత, మన డబ్బెంత.. ఇవన్నీ ఆలోచనల్లోంచి తుడిచేస్తే క్షణాల్లో మాయమయ్యే టెంపరరీ థింగ్స్. ఇవన్నీ జీవితాంతం ఆలోచనల్లో మనం మోస్తున్నామంటే ఇగో పెరగక ఏమవుతుంది? కళ్లు మూసుకుంటే మాయమయ్యే ప్రపంచంలో నీ ఆరణ్య రోదనలు, ఆవేశాలూ ఏమాత్రం అర్థం పర్థం లేనివీ! నేను చాలాసార్లు నేను చేసిన పనులన్నీ అప్డేట్ చేస్తుంటాను. కానీ మరుక్షణమే నా మనస్సు వాటి నుండి డిటాచ్ అవుతుంది. అది నాకూ, నాతో క్లోజ్‌గా ఉండే కొంతమందికే తెలుసు. మనం అనుకుంటున్నట్లు ఇక్కడేమీ లేదు. ఓ ప్రవాహం మాత్రమే. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయే ఓ ఫ్లవర్ లాంటోళ్లం. బ్రతికున్నన్నాళ్లూ మంచిగా ఉంటూ సువాసనలు వెదజల్లి వెళ్లిపోవాలి తప్పించి ఇదే శాశ్వతం అనుకుంటే కష్టం. ధ్యానం, ఫిలాసాఫికల్ థాట్స్ నాకు నేర్పిన సత్యం అది!!

నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని తొందరగా బ్లాక్ చేసేయండి. లేదంటే వాళ్ళ  నెగటివ్ కామెంట్స్ గురించి ఆలోచిస్తే బ్రెయిన్ పవర్ తగ్గుతుంది. అంతే కాకుండా మానసికంగా
కృంగిపోతారు . నెగటివ్ గా మాట్లాడే మనుషులతో స్నేహం చేయకూడదు. ఆరోగ్యానికి కూడా చేటు. పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల , మానసిక ప్రశాంతత దొరుకుతుంది, జీవితం ఆనందమయం
అవుతుంది. పాజిటివ్ గా ఆలోచించడం అలవడుతుంది. ప్రతి రోజు కాసేపు యోగా చేస్తే పాజిటివ్ ఆలోచన అలవడుతుంది. 
పాజిటివ్ గా ఆలోచిస్తే ఉన్నత స్థాయికి వెళ్ళగలం. అదే నెగటివ్ గా ఆలోచిస్తే .. జీవితం నెగటివ్ గా మిగిలిపోతుంది.
🌹🌹🌹🌹🌹🌹
ధన్యవాదములు
🙏 ప్రసాద్