సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) -39

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) -39 🌹 
39 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగ మాయ - 2 🍃 

280. శరీరములోని వివిధ భాగములు, నాడులు, షడ్చక్రములు, కుండలిని, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, త్రిగుణములు ఇవన్నియూ పరస్పర ఆధారములై తమ తమ ధర్మములను నిర్వర్తించుచున్నవి. అలానే ఆత్మ, అంతరాత్మ, జీవాత్మ, పరమాత్మలు కూడా మాయా శబలితమై వర్తించుచున్నవి.

281. భ్రాంతియె భ్రమ. లేని వస్తువును ఉన్నట్లు తలంచుటయె భ్రమ. తాడుయందు పాము, ఎండమావులలో కనిపించే నీరు, శరీరమె తాను అనుకొనుట ఇవన్నియూ భ్రమలే అగును. ప్రతి ఒక్కరు మాయలో పుట్టి, మాయలో మరణిస్తున్నారు. స్వేచ్ఛా, మోక్షము, ముక్తి అనునవి మాయను జయించినప్పుడు లభిస్తాయి. 

282. మాయకువశమైన వాని లక్షణములు: పుణ్య పాపకర్మలు చేయుట, మంచి చెడు కర్మలు, మూఢత్వము, అజ్ఞానము, రాక్షస స్వభావము, సంసారము, దుఃఖము, రాగద్వేషములు, అహంకారములు మొదలగునవి. దీనిని బంధము అందురు. 

283. దివ్య దృష్టి లేనిదే మాయమర్మమును తెలుసుకొనుటకు వీలులేదు. భగవంతుని శక్తి విశేషము, యోగమాయ. భగవంతుని గ్రహించకుండా మాయ అవహించి ఉన్నది. ఈ మాయా తెర తొలగాలంటే ఆత్మ దర్శనం అవసరము. యోగ శక్తి ద్వారా భగవంతుడు అనేక అవతారములు దాల్చుచూ జగత్తును ఉద్ధరించుచున్నాడు. 

284. ఎఱుక అనగా గుర్తు, సాక్షి స్థితి, జ్ఞప్తి, స్పురణ. జీవుడు ఎఱుక స్వభావుడు. ఎఱుక ఒక కల. పరిపూర్ణత్వములో తోచిన ఎఱుకయె కల. మాయను తెలుసుకోవాలంటే ఎఱిగే ఎఱుక అవసరము. సృష్టికి కారణము ఎఱుక. ఎఱుక లేని దశయె నిర్గుణము. లేని ఎఱుకను తెలుసుకొని చివరకు ఆ లేని ఎఱుకను విడువవలెను. 

పంచ జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకొనేది మనస్సు అనే ఎఱుక. ఈ జగత్తుకు మూలము ఎఱుక. సుషుప్తి అవస్థనుండి తనంతట తాను ఎవరు పిలువకయె ఎఱుక వచ్చినది. అచల పరిపూర్ణముచేత ప్రకృతి, పురుషులు పుట్టలేదు. ఈ రెండు మాయయె. ఎఱుకకు మూలము మాయయె. ఎఱుక లేని స్థితియె పరిపూర్ణము. మనకండ్లకు కనబడు ఎఱుకలేని ఎఱుక ఇంద్రజాల భంగిమవలె ఇది కనిపించి చివరకు ఏమియూ లేకుండా పోవును. 

285. అఖండ ఎఱుకయె బ్రహ్మము. జీవుడు పిండాండ రూపము. ఈశ్వరుడే బ్రహ్మము. 

286. బట్టబయలు, ఉత్త బట్టబయలు ఏమి లేనిది. నిరాకారమె బట్టబయలు. పరబ్రహ్మ స్వరూపమే బట్టబయలు. ఇది సర్వత్రా సర్వవేళలందు నిండియున్నది. దీనికి నాశనంలేదు. దీనిని తెలుసుకొనిన బ్రహ్మమును తెలుసుకొన్నట్లే. ఇట్టి బట్టబయలుగా ఉండు పరబ్రహ్మ యందు ఎఱుకను విడచుటయె సాధకుని లక్ష్యము. అఖండ ఎఱుక పోతే బయలే. 

అఖండ ఎఱుకనగా కోటి సూర్యుల కాంతిగా వెలుగుతూ ''ఓం'' అనే ప్రణవము, అందుండి వివిధ నాదములుగా వెలువడుతున్నది. ఇది నీవు కాదు. నీ నిజ స్వరూపము బట్టబయలు. అదియె శాశ్వతము, సత్యము, నిర్మలము, అనాది. ఇది సర్వత్రా నిగూఢముగా వ్యాపించి యున్నది. 

287. అచల పరిపూర్ణము అనగా ఆత్మ, మనస్సు స్పందించక స్థిరముగా, నిశ్చలముగా ఉండి తిరిగి ఏకాలమందునూ చలింపకున్నచో దానిని అచలము అంటారు. ఇట్టి స్థితిలో వ్యక్తి వికార రహితుడై రూప నామములు లేక, జననమరణములు లేక స్త్రీ, పురుష నపుంసక భేదములు లేక ఉండుటయె అచల పరిపూర్ణమంటారు. ఇది భావాతీతము. త్రిగుణ రహితము. 

288. సృష్టికి పూర్వము ఈ విశ్వమంతయు అసంగుడైన నిర్వికార పరబ్రహ్మ స్థితి యందుండెను. అదియె అఖండ జ్యోతి. ఈ జ్యోతి నుండియె మాయాశక్తి ప్రతిఫలించినది. ఆ మాయా శక్తియె సృష్టి నిర్మాణమునకు మూలము. ఈ మాయా శక్తికి సత్వ గుణము ప్రధానము. అందుండి మొదట ఈశ్వరుడు ఏర్పడి, మాయను తన వశము చేసుకొని దాని యందే నివసించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment