సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 24

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 24 🌹
24 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మనస్సు దాని వికారములు - 3 🍃

140. మనస్సు ఒక మహా సముద్రము వంటిది. అందు తలంపులు అలల వలె లెక్కలేనన్ని పుట్టుచూ గిట్టుచున్నవి. వాటి జ్ఞాపకాలు మనస్సునందే నిలచియుండును. జ్ఞాపకాలే వాసనలు. కలలుకనేది మనస్సే. ఒక సంకల్పమునకు మరొక సంకల్పమునకు ఒక్కోసారి సంబంధము ఉండదు. ఒక్కొక్క సారి గొలుసుకట్టుగా వస్తాయి. నిద్రలో మనస్సు కారణ రూపంగా ఉంటుంది. సుఖదుఃఖాలకు, స్వర్గనరకాలకు మనస్సే కారణము. నీటిలో అలలు, తరంగములు ఉన్నంత వరకు క్రింది భాగము కనబడదు. అలానే మనో సంకల్పములు, భావనలు, ఉన్నంత కాలము అంతరమున వున్న ఆత్మ దర్శనము కాదు.

141. మనస్సు దేహమును, ఇంద్రియములను క్షోభపెట్టుచున్నది. ఒక్కోసారి అకారణముగా క్షోభించును. అనేక జన్మల వాసనలు, సంస్కారములు పొంది అజ్ఞానము వలన సంపూర్ణ స్వతంత్రముతో విచ్ఛలవిడిగా విర్రవీగుచున్నది. వ్యభిచారము చేయుచున్నది.

142. మనస్సు పిచ్చి పట్టిన కోతిలాంటిది. అట్టి కోతికి సారాతాపించిన, సారాతాపించిన కోతికి తేలుకుట్టిన దాని వికారములు ఎట్లుండునో, మనస్సు యొక్క వికారములు కూడా అట్లే ఉండును. ఇలాంటి మనస్సును స్వాధీనము చేసుకొనుట ఎంతటి కష్ట సాధ్యమో సాధకులు గ్రహించాలి.

143. మనస్సుకు క్షేత్రము శరీరము. స్థూల, సూక్ష్మ శరీరములు లేనిచో మనస్సు లేదు. మనస్సు తన పరికరములైన స్థూల, సూక్ష్మ శరీరములను అంటిపెట్టుకొని వుండును.

144. మంచి చెడులను తెలుసుకొను విచక్షణా జ్ఞానము, స్వార్థపూరిత మనస్సుకు ఉండదు. బంధ మోక్షములకు మనస్సే కారణము. మనస్సు స్వాధీనమైనప్పుడు అన్ని బంధములనుండి విముక్తి పొందుచున్నది. అప్పుడు సాధకుడు ఆత్మగా స్థిరమై, నిత్యమై యుండును.

145. క్షణ కాలములో మనస్సు స్వర్గ, భూలోక, పాతాళ లోకములందు సంచరించి అలపులేక తన శరీరమునందు ప్రవేశించు చున్నది.

146. అంతఃకరణ చతుష్టయములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములకు వాసనలతో కూడిన మనస్సే కారణము. జాగ్రత్‌, స్వప్న, అవస్థలందు మనస్సు పనిచేయును. సుషుప్తా అవస్థ యందు మనస్సు తాత్కాలికముగా లయించుచున్నది.

147. బట్ట బయలు అనగా మనస్సు కదలకుండా శాశ్వతముగా ఆగుట. అదే పరబ్రహ్మ స్థితి. మనస్సును జయించనిచో పరబ్రహ్మోపాసన చేయలేడు.

148. మనస్సు పరుగిడుట వలననె జీర్ణ కోశము, ప్రేగులు పనిచేసి ఆకలి దప్పులు కలుగునట్లు చేయుచున్నది. శరీరములోని దశ వాయువులు కర్మానుసారమైన మనస్సు వలననె పనిచేయు చున్నవి.

149. త్రాటిచే పశువులు ఈడ్వబడినట్లు మనస్సుచే మానవులు ఈడ్వబడుచున్నారు. పక్షుల రెక్కల వలె మనస్సు చంచలమైనది. ఎద్దు, ముక్కు తాడుచే ఈడ్వబడినట్లు, ఎలుకలు తామున్న ఇంటికే కన్నము వేయునట్లు, మానవుడు మనస్సుచే ఈడ్వబడుచున్నాడు. సాలె పురుగు తాను కట్టిన గూటిలోనే చిక్కి చచ్చినట్లు, మానవుడు మనసనే గూడులో చచ్చి పుట్టి చచ్చుచున్నాడు.

150. ప్రజ్ఞావంతుడు, గంభీరుడు, శూరుడు, స్థిరబుద్ధి గలవానిని కూడా మనస్సు చలింపజేయును. మనస్సు శరీరములో వున్నను శరీరమునకు వేరుగా స్వతంత్రించి ఉన్నది. మనసు కోరే భోగములకు శరీరము, ఇంద్రియములు పరికరములుగా నున్నవి.

151. కామము, సంకల్పము, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము, అధైర్యము, లజ్జ, బుద్ధి, భయము ఇవన్నీయూ మనో రూపములే. నేను నేను అని పలికేది మనస్సే. కలల రూపము మనస్సే. సవికల్ప సమాధి అనుభవములు మనస్సే. సంకల్పమే మనస్సు. సాక్షి, జ్ఞానము, ఎరుక, మరుపు మనస్సుకే. మనస్సే విషయాకారము. మనస్సున్నంతవరకు త్రిపుటి ఉండును. త్రిపుటి రహితమే ముక్తి.
🌹 🌹 🌹 🌹 🌹