సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 4

Image result for madame blavatsky secret doctrine
🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 4 🌹
✍️ సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🌹 గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) 🌹
4 వ భాగము

🍃 మూడవ స్థితి 🍃

141. మూడవ స్థితిలో సృష్టి ప్రళయ స్థితిలోంచి మేల్కొనబోతున్న స్థితిని తెలుపుతుంది. ఒక చేతనత్వములో లయమై ఉన్న గ్రహములు చేతనత్వపు వివిధ కేంద్రములు, అతి ఉచ్ఛ తలములలో అనగా ఇంద్రియాతీత స్థాయిలో, ప్రపంచ నిర్మాణం గూర్చి ఇందు తెల్పబడింది.

142. చివరిదైన 7వ అనంతములో చేతన ప్రకంపనలు వ్యాపించి, పద్మము యొక్క మొగ్గవలె తల్లి లోపలి నుండి బయటకు వచ్చినది.

143. అనంతకాల చక్రములో క్రమగతిన ఏర్పడిన ఖండ కాలములను చివరి 7 ప్రకంపనాలు మరల మానవ సృష్టి మేల్కొనుటకు కారణమవుతుంది. 

144. వ్యక్తిగత స్థాయిలో ఈ ప్రకంపనలు శ్వాసను సూచిస్తాయి. నిజానికి శ్వాస వాయువు కాదు. ఆకాశము యొక్క స్పందన వలన ఏర్పడిన ప్రభావము.

145. మరణ సమయమున (నిద్రకు ముందు) దేనిని తలచుకుంటూ శరీరమును వదులునో (మేల్కొనునో) అదే స్వరూపాన్ని పొందును.

146. అంత్య కాలములో ఎవరు ఏ భావములతో హృదయమందు స్పందనలు కలిగి ఉంటాడో, అవే కారణ బీజాలుగా మారి, ఆ భావాన్ని అనుసరించి అట్టి స్థితిని పొందుతారు. మేల్కొన్నపుడు ఆ మార్పును చూడగల్గాలి.

147. నిరంతర ''నామ జపం'' యొక్క స్పందనలు అభ్యసిస్తూ వుండిన ఆ చేతనత్వమే సిద్ధిస్తుంది.

148. సాధకుడు బ్రహ్మాండములో ఏ లోకములోనైనా చేతనత్వముతోనైనా, స్పందనలో (శ్వాస) మార్పు తెచ్చుకొని సంపర్కము సాధించవచ్చు.

149. కాలతత్త్వమంతా సంవత్సరాల (యుగాల) సంఖ్యలలో నిబిడీ కృతమైన శక్తులలో ఉన్నది.

150. శ్వాస యొక్క కాలమును బట్టి జీవ జంతువుల ఆయుః ప్రమాణము (చేతనత్వము) ఎలా మారుతుందో యోగులు క్రియా యోగము ద్వారా తెలియబర్చారు.

151. ఈ శ్వాస ప్రకంపనలు అగ్ని, జల తత్త్వములతో (మనస్సు, ప్రాణము) తన ప్రభావము చూపినపుడు, నిద్రాణమై ఉన్న సంస్కారములు 'ఉబ్బటం' మొదలవుతుంది. ఇదంతా నిద్రాస్థితిలోనే జరుగుచున్నదని మనం గమనించాలి.

152. ఈ శ్వాస స్పందనలు కొనసాగిన కొలది, తన శ్వాస యొక్క తీవ్ర వేగముతో ప్రపంచాన్ని చుట్టుకుంటూ, విత్తనం చీకటిలో నివసిస్తూ, శ్వాస ప్రకంపనలచే ఆవరింపబడి, నిద్రాణమైయున్న ప్రాణ జలముల విత్తనాన్ని ఉబ్బిస్తూ ఉంటాయి.

153. ఈ నిద్రాణమైన ప్రాణ జలములను నారాయణ తత్వముగా గుర్తించాలి. ఇంకను బ్రహ్మ విష్ణు నాభి నుండి ఉత్పత్తి కాలేదు. అందువలన చీకటి అతీంద్రియ స్థాయిలో ప్రాణ జలముల మీద నూతన సృష్టికి, ఆత్మ స్థాయిలో ఉన్న మూల ప్రకృతి మీద స్పందనలు కల్గిస్తుంటాయి. వ్యక్తిగత స్థాయిలో ఈ ప్రాణ జలాలను శ్రద్ధగా ఉపయోగించాలి.

154. చీకటి అనే తల్లి గర్భములో కాంతి తన ఒంటరి కిరణాన్ని దింపినపుడు, ఆ కిరణము చీకటిలోని (తల్లి) అండమును ఛేదించి పులకింపజేస్తుంది. అపుడు శాశ్వత విత్తనము బ్రహ్మాండముగా (ఘనీభవిస్తుంది) రూపొందుతుంది.

155. విష్ణువు నాభి నుండి ఒంటరి కిరణము 'బ్రహ్మ' బహిర్గతము అయింది. అది అండము (చీకటి) లోతులలో పడటం అనగా దివ్య ఆలోచన, లేక బుద్ధి మూల ప్రకృతిని స్పందింపజేస్తుంది.

156. అండము కన్య లక్షణములతో తపించుట చేత లేక వేడి చేయుట చేత అది పొదుగుట మొదలవుతుంది.

157. బ్రహ్మకు ఆ అనంత జలరాశిలో (చీకటి) ఎలా సృష్టి మొదలుపెట్టాలో తెలియక పోవుటచే జలముల (స్పందనల) కదలిక వల్ల శబ్దము వికసించింది. తపతప అని రెండు సార్లు వినిపించింది. ఈ నిరంతర స్పందన వలన వేడి పుట్టి మెల్లగా అందున్న విత్తనము ఆకాశ తత్త్వమగు లోకాలలోకి పయనిస్తుంది. అదే బ్రహ్మాండముగా ఏర్పడుతుంది.

158. గుడ్డు ఏ విధముగా లోపల ఉన్న జీవితము యొక్క స్పందనల వలన పగిలి, అశాశ్వత భౌతిక రూపము వేడి వలన ఏర్పడుతుందో. సృష్టి కూడా అదే పద్ధతిని అనుసరిస్తుంది.

159. గ్రుడ్డు ప్రపంచము యొక్క సంకేతముగా ఏర్పడి శక్తిగా ఉపయోగపడి, అంతము లేని వృత్తముగా అనంతములో గుర్తుగా ఉపయోగపడుతుంది.

160. ఈ గుర్తు పరమాణువు నుండి గ్రహము వరకు, మనిషి నుండి దేవతల వరకు వృత్తాకారముగా ఉంటుంది. దానినే తోకను నోటితో పట్టుకున్న సర్పము యొక్క సంకేతముగా అందరు సూచిస్తారు.

161. బ్రహ్మాండము ఎక్కడెక్కడ ఏర్పడుతుందో అక్కడక్కడ శాశ్వతత్వము, అనంత తత్వము, పునరుజ్జీవింపబడుట, పునర్మించబడుట జరుగుతుంది.

162. స్వీయశక్తితో స్వయం ఉత్పత్తి యొక్క రహస్యం ఏవిధంగా అండములో వేడి మరియు తేమ కనిపించని సృజనాత్మకత శక్తి వల్ల జరుగుతుందో, అదేవిధానం బ్రహ్మాండములో జరుగుతుంది. కనుక అండమును సృష్టికి సంకేతముగా ఉపయోగించుట జరుగుతుంది.

163. హిరణ్య గర్భుడు 7 సహజ భూతముల ద్వారా ఆవరింపబడి ఉంటాడు. అందులో మనస్సు, బుద్ధి, చిత్తము వీటిలో అహంకారము కూడా చేర్చబడింది. ఇవి రహస్యమయ స్థితిలో ఉంటాయి. భౌతిక స్థితిలో పృథ్వి, జలము, అగ్ని, వాయువు ఉంటాయి.

164. అండమును పక్వ స్థితిలోకి తేవాలంటే దానికి తగిన వేడి (ఆలోచన), తేమ(వనరులు, ప్రాణశక్తులు) సమీకరించి దానిని ఉపయోగించి అభివృద్ధి చేసుకొని కార్యసిద్ధి అయ్యేవరకు నిరంతర సంకల్పములతో ప్రేరణ ఇస్తుండాలి.

165. నిద్ర మత్తు వీడక ముందే, ప్రక్కమీద కూర్చొని ముందు తన శరీర ప్రకంపనలు తెల్లని, చల్లని, ధవళ కాంతిలో ప్రతి అణువు స్పందిస్తుందని భావించాలి.

166. మన శరీరము నుండి మూడు అంగుళముల వరకు అన్నమయ కోశము గులాబీ రంగులో వ్యాపించి ఉన్నట్లు గుర్తించాలి; ప్రాణమయ కోశము తదుపరి మూడు అడుగుల వరకు పసుపు రంగులో శరీరము చుట్టూ వ్యాపించి ఉన్నట్లు; శిరస్సు పై మూడు అడుగుల చుట్టూరా పై నుండి క్రింది వరకు మనోమయ కోశము పసుపు రంగులో ఉన్నట్లు; తదుపరి సుమారు 18 అడుగుల వృత్తాకార పరిధి స్థూల, ప్రాణ, మనోమయ కోశము; ధవళ, గులాబి, పసుపు ఆవరణల మీదుగా ఆకుపచ్చ రంగులో విజ్ఞానమయ కోశము ఆవరించి ఉందని భావించాలి. అటు తరువాత సుదూర అనంతము వరకు ఆకాశము తనని ఆవరించి ఉందని అది నీలాకాశము ఒక గ్రుడ్డుగా తనను ఆనందమయకోశం ఆవరించి ఉందని భావించాలి.

167. ఈ విధమైన రంగుల భావన నిరంతరము ఉంచుకుంటూ, వెన్నుపూస మీద గల చక్రములో, మూలధారం వద్ద గంధం (వాసన) స్వాధిష్ఠానము వద్ద రుచి, మణిపూరకము వద్ద 'రూపము', అనాహతము వద్ద స్పర్శ, విశుద్ధము వద్ద శబ్దము, ఆజ్ఞా సహస్రారములలో సంకల్పము యొక్క భావనలు చేసుకోవాలి.

168. ఆయా రంగుల తన్మాత్రల భావనలు కొనసాగగా లోపల 7, బయట 7 గా మారుతుంది. కాంతిమయ మండలము అజ్ఞాచక్రములో గడ్డకట్టి పాలవలె తెల్లని పెరుగుగా వ్యాపిస్తుంది. జీవితపు సముద్ర లోయలలో వేరు పెరుగుతుంది.

169. వ్యక్తి జీవితములో ఆజ్ఞాచక్రము కాంతి వలయముగానూ, ఖగోళములో దీనిని పాలపుంత గాను తెలుపుతారు.

170. గుప్త విద్యలో వ్యక్తి యొక్క ఆజ్ఞాచక్రములోను, ఖగోళము యొక్క పాలపుంతలోను అనంత రహస్యాలు నిబిడీకృతమై ఉన్నాయి. భారతీయ ఋషులు దీనిని క్షీరసాగర మథనముగా వర్ణించారు. అందులోనుండి బయటపడిన రత్నాలు లోపల 7 గాను, బయట 7 గాను వర్ణించబడినాయి.

171. వ్యక్తిగత సాధనలో సముద్రమథనం అనగా సంస్కారాలను మార్చుట. తాను చేయుచున్న సాధనల ద్వారా, విశిష్ఠ ధ్యాన పద్ధతుల ద్వారా అరూప స్థితి నుండి రూప స్థాయికి మార్చే విధానమే ఈ మథనము. పెరుగులో ఘనీభవించిన ఆలోచన స్వరూపములను వివిధ ధ్యాన పద్ధతుల ద్వారా వికసింపచేయాలి.

172. క్షీర సాగరములోని ప్రతి చుక్కలో జీవితపు మూలమున్నది. ఆ సముద్రము అగ్ని మరియు వేడి మరియు చీకటి మయమైన తన ఉనికిని కొల్పోయి తానైన సత్యములో విలీనమవుతుంది.

173. చీకటి నుండి వెలుతురు ఉద్భవిస్తుంది. మెల్లమెల్లగా నూతన సృష్టి కాంతిని సంతరించుకొని నిర్దుష్టమైన ఆకృతిని ఏర్పరుస్తుంది.

174. వ్యక్తిగతంగా ఆ రోజు తీసుకున్న సంకల్పము అగ్ని, దానికి కావలసిన ఆలోచనా సరళి వేడి. ఈ ఆలోచనలే నిత్యాగ్నిహోత్రము. ఈ మూడింటి కలయిక ధ్వని. అనగా సంకల్పము, ఆలోచనలు, కర్మలకు మూలము.

175. మనోమయ భూమికి సంబంధించిన అగ్ని తత్వము నుండి ప్రాణమయ జీవితానికి సంబంధించిన జల తత్త్వపు మూల ప్రకృతి ఏర్పడుతుంది. దానిని సూపర్‌ ఆస్ట్రల్‌ లైట్‌ అంటారు. 176. మహా శక్తి బీజాలైన 'క' వర్ణము పృధ్వితత్వము. 'చ' వర్ణము జలతత్వము. 'త' వర్ణము వాయుతత్వము. 'వ' వర్ణము ఆకాశతత్త్వమని గ్రహించాలి.

177. విత్తనము, చీకటి, కాంతి, ఆత్మ ఇవన్నీ కూడా ఒక్కటే. అందులోంచే మిరుమిట్లుగొలిపే కొడుకు కూడా పుట్టింది. అదే బ్రహ్మం, చీకటి సుడిగుండము కాలహంసము.

178. చీకటి నుండి సరూప స్థితిలో పుత్రునిగా ధవళాకృతిలో జన్మంచినపుడే మొదటిసారి శబ్దోత్పత్తికి తగిన వాతావరణము ఏర్పడుతుంది.

179. సాధకుడు మెల్లమెల్లగా నిద్రాస్థితి నుండి జాగ్రదావస్థ వైపు ప్రయాణిస్తున్నాడు.

180. కాంతి చల్లని జ్వాల. జ్వాలయె అగ్ని. అగ్ని వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ వేడి జలమును ఇస్తుంది. ఆ జలమే మహామాత యొక్క ప్రాణము.

181. కాంతి, జ్వాల, అగ్ని, వేడి, జలము, ప్రాణము ఇవన్నీ విద్యుత్తుకు సంబంధించిన పదములు. అగ్నికి సృజనాత్మకత, పరిపాలన, నాశక శక్తులున్నాయి. వెలుతురు మన దివ్య పితరుల యొక్క తత్త్వము. జ్యోతి పదార్ధము యొక్క మనస్సు.

182. వ్యక్తిగత సాధనలో వ్యక్తి తన ''బ్రెయిన్‌ వేవ్సు'' యొక్క విద్యుత్‌ స్వభావము అధ్యయనం చేయాలి.

183. చల్లదనము వేడి అనేవి సాపేక్ష పదాలు. మంత్రాన్ని మననం చేయుట ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి కారణమవుతాయి. మస్తిష్కం ద్వారా మనం పొందే స్పందనలు ఆజ్ఞలు విద్యుత్‌ పరమైనవే అని గ్రహించాలి. 184. జలము అనేది ఒక పదార్థమునకు లావణ్యం ఇచ్చుటయె కాక, జలమే శాపాలు, వరదానాలు, దక్షిణలు, దానాలు ఇవ్వాలన్నా ముఖ్యమైన అవసరము.

185. ఆధ్యాత్మిక సాధనలో ఉచ్ఛ స్థితికి చేరుకోవాలంటే ప్రాయశ్చిత్తం ముఖ్యమైన సాధన అని కర్మ సిద్ధాంతము వలన అవగాహనం అవుతుంది.

186. ఆత్మ పదార్థములకు తల్లి, తండ్రి సంబంధమును కలుగజేసి, చీకటిని, కాంతిని ఏకం చేయడమైంది. ఈ విధముగా పునర్జన్మలు ఏర్పడతాయి.

187. విద్యుత్‌ శక్తికి లంబ దిశలో అయిస్కాంత శక్తి పనిచేస్తుంది. ఉత్తర దిశ నుండి బ్రహ్మాండీయ శక్తులు ప్రవేశించి దక్షణ ధృవము నుండి బయటకు వెళిపోతాయి. ఈ మధ్య కాలంలో పృథ్వి తనకు కావలసిన వనరులను సమీకరించుకుంటుంది. ఈ విధంగా విద్యుత్‌ శక్తిని 'రామ్‌' అని, అయస్కాంత శక్తిని 'కృష్ణ' చైతన్యముగా చెప్పవచ్చు.

188. ఇడ, పింగళ నాడులు:- ఇడ భూమి, తల్లి. పింగళ పురుషుడు, అగ్ని. పింగళ శ్వాస, అగ్ని ఇడ శ్వాస భూమిపై పడినపుడు ప

దార్థము వేడెక్కి వ్యాకోచము చెందుతుంది. తల్లి శ్వాస 'ఇళ' సంకోచము చెందుతుంది. ఈ శ్వాస కోశ వ్యాకోచ సంకోచాల ఫలితముగా శ్వాస వాయువు ద్వారా పుత్రులు జన్మింస్తారు. అనగా క్రొత్త జన్మ జరుగుతుంది.

189. శ్వాస మానసిక స్థితిని నియంత్రణ చేయును. వ్యక్తిగత సాధనలో అనులోమ విలోమ ప్రాణాయామములో సృష్టి జరుగుతుంది.

190. పింగళ నాడి ద్వారా ఉష్ణము మనోమయ కోశపు అణువుల స్వరూపాన్ని వ్యాకోచింపజేసి, ఇడనాడి ద్వారా సంకోచింపజేసి, అవసరమైన రూపాన్ని సిద్ధపురుషులు రూపొందిస్తుంటారు. 191. సృష్టి బీజరూపంలో ఉన్న, కాలము తనలోని విశ్వ ప్రాణ శక్తి ద్వారా బీజములను పక్వపరచి సరూప స్థాయికి దింపుతుంది. ఈవిధముగా పై స్థాయి ప్రతిబింబాలుగా ప్రపంచాలు కాలపరిధిలో వాటివాటి వంతు వచ్చినపుడు ఏర్పడతాయి.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹