సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 10

Image result for secret doctrine by Madame Blavatsky
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 10 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 


🍃 . అంతరంగము 🍃

2. 84 లక్షల జీవరాశులలో మానవుడొక్కడే మనస్సు కలిగి బుద్ధి ద్వారా విచక్షణా జ్ఞానము కలిగి, ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, తెలిసిన, తెలుసుకొనగల్గిన జీవి.

3. అన్ని పనుల్లో ముఖ్యమైనది, ప్రతి మనిషి తన జీవితములో సాధించవల్సింది యోగము. అనగా జీవాత్మ పరమాత్మను పొందే మార్గము. అందుకే సర్వశ్రేష్ఠమైన యోగజ్ఞానమనే మహ సాగరమును మధించి వెలికి తీసిన సారాంశములను సాధకులకు సామాన్య పాఠకులకు అందించుటకే ఈ పుస్తకమును తయారు చేయుట జరిగింది.

4. అతి జఠిలమైన యోగసాధనను సులువుగా అర్థం చేసుకొనుటకు, ఆచరించుటకు అనువుగా స్వయం అనుభవాలను, అనుభూతులను ఇందులో చొప్పించుట జరిగినది.

5. యోగ విషయాలు అనేకం ఒకేచోట ఒకే గ్రంథములో లభించుట చాలా అరుదు. అందుచే ఈ గ్రంథము సాధారణ సాధకులకు అందుబాటులో, సాధకులకు మార్గదర్శిగా ఉపయోగపడగలదు. అనేక మంది యోగుల, మహర్షుల బోధనలు, సాధనా విశేషములను, యోగ ఫలితములు ఇందు నిక్షేపింపబడినవి. ప్రాచీన యోగ సాధనలు, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, క్రియా విధానాలు, సాధకులు ఎదుర్నొనే సమస్యలు, సమాధి స్థితి, క్రియా స్థితులు ఇందు తెలియజేయబడినవి. యోగము నిరంతర సాధన ద్వారా అనుభవ పూర్వకముగా తెలుసుకొనవలసి ఉంటుంది.

6. ఈ అనంత కాలంలో మానవ జీవితము ఒక బుడగ లాంటిది. దీనిని సద్వినియోగము చేసుకున్న, మానవ జీవిత ధ్యేయము సఫలమౌతుంది. సాధన చేయాలంటే మానవ భౌతిక శరీరం మాత్రమే అనువైనది. మిగిలిన దివ్యాత్మలకు, ఇతర జీవరాశులకు ఇంతటి మహత్తర జన్మ, గొప్ప అవకాశము లేదు. దేవతలైనా ముక్తి పొందాలంటే మానవ జన్మ ఎత్తవలసిందే.

7. భగవంతుని పొందుటకు భక్తి, జ్ఞాన, కర్మ, ధ్యాన, క్రియా యోగములు అత్యంత ఆవశ్యకములు. మోక్ష స్థితికి అనేక మార్గములు ఇందు సూచించ బడినవి. ముముక్షువులకు ఇది అత్యంత ఆవశ్యకము.

సర్వయోగ సమన్వయమే ఈ పుస్తకము యొక్క ప్రధాన ధ్యేయము. నిరంతరం సాధన చేయుచు ఇలాంటి అధ్యాత్మిక గ్రంథ పఠనమును కొనసాగిస్తూ, మనస్సును ఎల్లప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నము చేయుట అత్యవసరము. మనస్సు ఒక దయ్యాల కార్ఖాన అని పలుకుటచే దానిని సరైన మార్గములో నడిపించుట మన విధి.

8. జీవితములో అనేక ఒడిదుడుకులను, సమస్యలు, సంఘటనలను యోగ సాధన ద్వారా అధిగమించవచ్చును. యోగ సాధన వలన అనేక శారీరక మానసిక అధ్యాత్మిక శక్తులు లభించగలవు. నిరాశ, నిస్పృహ, అశాంతి, సంశయము ఉన్న వారికి యోగసాధన మార్గదర్శి. అజ్ఞానమును పోగొట్టి ఆరోగ్యమును పొందుట, ఈతి బాధలు, రోగముల నివారణకు యోగసాధన అత్యంత ఆవశ్యకము.

9. అనేక కోట్ల విలువ గల మాణిక్యములు, పచ్చలు, నవరత్నముల కన్నా విలువైన ఆధ్యాత్మిక, యోగ రత్నములను వజ్రాయుధము వంటి యోగ సూత్రములు ఈ గ్రంథము ద్వారా అందించబడుచున్నాయి. ఇట్టి మహా రత్నములను పొంది అభ్యాసం చేయువారికి మోక్ష సామ్రాజ్యము కరతలామలకము.
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹