🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 3🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
3 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴

2. ముముక్షుత్వము

అంతట సభనలంకరించి యున్న వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు, ఇతర మంత్రులు, సామంతులు, దశరధుడు మొ|| వారందరు, రాముని వాక్యములు విని పులకిత శరీరులై, రాముని కలత తీర్చుటకు ఎవ్విధమైన సమాధానము లభించునో అని కుతూహలురై యుండిరి. అలానే సిద్ధులు రాముని ప్రశ్నలకు పులకించి, పుష్పవర్షము కురిపించి సభలోకి ప్రవేశించి ఉపవిష్ఠులై, సమాధానములు వినుటకు కుతూహలురైరి. వారిలో నారదుడు, దేవతలు, వ్యాసుడు, మరీచి, దుర్వాసుడు, అంగీరసుడు, వాత్సాయనుడు, భరద్వాజుడు, వాల్మీకి, ఉద్దాలకుడు మొ|| మునులు, వేదవేద్యులగు తత్వజ్ఞులు ఉపవిష్ణులై యుండిరి.

రాముని వాక్యములు, విచారయుతములు, జ్ఞానబోధకములు, ఆర్యోచితములు, స్ధిరములు, సంతోషదాయములైయున్నవి. అట్టి వాక్యములకు సమాధానములు వినుటకై ఎల్లరు కుతూహలురై వుండిరి. అపుడు శ్రీవాల్మికి రామునుద్దేశించి నీ ప్రశ్నలన్నియు, జ్ఞానయుతములైయున్నవి. నీవు తెలుసు కొనవలసినది ఇంకేమియులేదు అని పల్కి వ్యాసపుత్రుడైన శుకుని బుద్ధి నీ బుద్ధి కూడ జ్ఞానమును పొందియు అంతర శాంతిని కోరుచున్నది అని పల్కెను.

అంత శ్రీరాముడు, శుకుడు విచారబుద్ధి వలన జ్ఞానము పొందియు మొదట శాంతిని పొందక తదుపరి శాంతిని ఎట్లు పొందగల్గెనని ప్రశ్నించెను. అందుకు విశ్వామిత్రుడు శుకదేవుని వృత్తాంతమును తెల్పెను. శుకుడు వ్యాసుని కుమారుడు. అతడు తేజస్వి, శాస్త్రజ్ఞుడు, ప్రాజ్ఞుడు, రూపుదాల్చిన యజ్ఞము. సంసారగతిని, దాని మాలిన్యమును చింతించుట వలన అతడు వివేకి అయ్యెను. అతడు చాలాకాలము విచారణ జరిపి చివరకు సత్యమును గ్రహించెను. అయినను అతడు శాంతిని పొందలేదు. క్షణ భంగురములైన విషయముల నుండి విరక్తి కల్గెను.

ఒక పర్యాయము శుకుడు తండ్రియైన వ్యాసుని భక్తితో ఇట్లు ప్రశ్నించెను. ''ఈ సంసారాడంబరమెట్లు ఉదయించినది. ఇది ఎంతకాలము, ఎట్లు, ఎచ్చట వుండును? దీని అంతమేది? ఇది దేహేంద్రియాది సంఘాతమా? లేక అందుకు వ్యతిరేకమైనదా? అని ప్రశ్నించెను''. వ్యాసుడు అందుకుతగిన ప్రత్యుత్తర మిచ్చినప్పటికి శుకుడు తృప్తి నొంద లేదు. అపుడు వ్యాసుడు తానంతకు మించి చెప్పగల్గినదేదియు లేదు. జనకుడను రాజు ఒకడు గలడు. అతని కడకేగిన అతడు నీకు తగిన సమాధానము చెప్పగలడని పలకగా, శుకుడు తండ్రి సలహా మేరకు విదేహ నగరమునకు ఏతెంచి, ద్వారము వద్ద తన రాకను జనకునకు తెలియబంపెను. జనకుడు ద్వార పాలకుని మాటవిని ఏ మాత్రము బదులివ్వలేదు. శుకుడు ఏడురోజులట్లే ద్వారము చెంతయూరకుండెను. తదుపరి లోనికి ప్రవేశింప అనుమతి నొసంగెను. శుకుని పరీక్షింపనెంచి జనకుడు మరల ఒక వారము దినముల వరకు రాజదర్శనము లభించదని తెలియపర్చెను. వారము దినములలో శుకునకు అందమైన యువతులు, భోజన వస్తువులు విలాస ద్రవ్యములు పంపి శుకునకు బరిచర్యలు నొసర్చెను.

శుకుడు దుఃఖ స్వరూపము గల ఆభోగ్యవస్తువులకు ఏవిధముగ చలింపక స్ధిరచిత్తుడై యుండెను. అపుడు జనకుడు శుకదేవుని స్వభావమును గ్రహించి, అతనిని పిలువనంపి, రప్పించి అతనికి వందన మొనర్చి ఇట్లు పల్కెను. నీవు జగత్తు నందలి కర్తవ్యములన్నింటిని నెరవేర్చితివి కృతకృత్యుడవైతివి.

నీవేమి పని మీద వచ్చితివని ప్రశ్నించెను. అందుకు శుకుడు జనకుని గురువుగా ఎంచి, ఈ సంసారాడంబర మెట్లు ఉదయించి, ఎట్లు ఉపశమించునో తెలుపమని పల్కెను. అపుడు జనకుడు వ్యాసుడు చెప్పిన సమాధానమే చెప్పెను. అపుడు శుకుడు ఆ విషయము తనకు తెలుసుననియు, శాస్త్రములు కూడ అట్లే తెలుపుచున్నవని పల్కెను. నిస్సారమగు ఈ సంసారము అజ్ఞానము నుండి వెలువడుచున్నది. అజ్ఞానము నశించిన, ఇదియు నశించునని పల్కెను. ఈ విషయము ఎంత వరకు సత్యమో తెలియబర్చి తనకు శాంతి నొసంగుమని కోరెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్