🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 11 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃. అనేక జన్మల సాధనా ఫలితమే యోగము 🍃
10. అనాదిలో సత్య యుగమునందు అవతరించిన యోగము నాశరహితమైన పరమార్థ లక్ష్యమునకు సాధన. భారత దేశం యోగ భూమి. యోగాలకు పుట్టినిల్లు. అనేక మంది యోగులకు జ్ఞానులకు భారతదేశం పుట్టినిల్లు. శ్రీకృష్ణుడు గీత యందు యోగాన్ని గూర్చి తెలుపుతూ తాను యోగ రహస్యమును మొదట సూర్యునికి తెలిపినట్లు, సూర్యుడు తన కొడుకు మనువుకు, మనువు తన కొడుకు ఇక్ష్వాకునకు తరువాత వంశాను గతంగా ఇతర రాజులకు తెలిపినట్లు చెప్పియున్నాడు.
11. యోగాన్ని గూర్చి వేదములు ఉపనిషత్తులు, గీత, శ్రీయోగవాసిష్ఠము, పతంజలి యోగ సూత్రములు, స్మృతులు, పురాణములు ఇతిహాసముల ద్వారా తెలియుచున్నది. సత్యము అనగా బ్రహ్మము. అట్టి బ్రహ్మమును పొందు మార్గమే సత్యయోగము. అప్పటి కృత యుగమే సత్య యుగము. సత్య యోగమునకు మూలము సత్యము, ధర్మము. యోగము అనగా కలియుట లేదా ఐక్య మొందుట.
12. యోగమును గూర్చి అర్థము కావాలంటే యోగ సాధన అత్యావశ్యకము. జీవాత్మ పరమాత్మలో ఐక్యమగుటయే యోగము. కార్యము ఫలించినను ఫలించకుండినను సమత్వ స్థితిలో ఉండుటయే యోగము. కర్మలయందు నేర్పరి తనము, అనాసక్తిగా కర్మలను ఆచరించుట, చిత్త వృత్తులను నిరోధించుట యోగము. నిశ్చల సమాధిస్థితి, ఆత్మ దర్శనం పొందుటయే యోగము. సర్వత్ర వ్యాపించి యున్న పరమాత్మ యందు ఐక్యమై తానే సర్వము, అను స్థితిని పొందుటయే యోగము.
13. జ్ఞానేంద్రియములను కర్మేంద్రియాలను అంతః కరణ చతుష్టయము ద్వారా జరుగు క్రియలందు ఆసక్తిని నిరోధించుటయే యోగము. షట్చచక్రాల ప్రభావం వలన కలిగిన గుణాలను, తత్త్వాలను చివరిదైన సహస్రారములో లయింప చేయుటయే యోగ సాధన.
14. ఖగోళములో జరిగే క్రియలను, మార్పులను, దివ్య దృష్టిచే అంతరమున గమనించుటయే యోగ గమనము.
15. ప్రాపంచిక దృశ్య విషయ వృత్తులను విచారణ, విషయములనుండి మరల్చుట, హృదయస్తమగు ఆత్మ యందు, స్వ స్వరూపమునందు మనస్సును బంధించుటయే యోగ క్రియ.
16. ఏకాగ్రత అన్నా, ధ్యానమన్నా, సమాధిస్థితి అన్నా, శూన్య స్థితి అన్నా, యోగములోని అంగము.
17. యోగమనగా ప్రాణాయామము, ప్రాణక్రియ అని చెప్పబడినది. శ్వాసను 'ఓం' అను ప్రణవ మంత్రముతో అనుసంధించుట వలన బ్రహ్మ భావన పొందుచున్నాడు. మోక్షమునకు ప్రాణాయామము కూడా ఒక సాధనము.
18. పరమాత్మ తత్త్వమైన ఆత్మ దేహమునందు ఉంచబడి బ్రహ్మమే అగుచున్నది. అంతరాత్మ, పరమాణువు, క్షేత్రజ్ఞుడు అయిన ఆత్మ తత్త్వమును తెలుసుకొను మార్గమే యోగము. ఆత్మానుభూతులను గూర్చి అన్వేషణ చేయుటయే యోగము. భగవంతుని వద్దకు చేర్చు ఏకైక మార్గమే యోగము.
19. ఆనంద పారవశ్యకమంతా రహస్య యోగములోనే యున్నది. మానవ స్థితులనుండి మానవాతీత స్థితికి చేరుటయే యోగము.
20. పురుష, బ్రహ్మత్వముల కలయికయే యోగము. ఇదియే అర్థనారీశ్వర విధానం.
21. యోగమును పొందుటకు గృహాన్ని వదిలి అరణ్యాలకు, ఆశ్రమాలకు పోవలసిన అవసరం లేదు. ఎవరి ఇంటిలో వారు కుటుంబ సభ్యులతోనే ఉంటూ యోగ సాధన చేయవచ్చు. దేహమే దేవాలయము. అంతటా ఉన్న సాక్షాత్ పరబ్రహ్మం శరీరంలో కూడా వున్నాడు.
22. ఎవరికి ఏది అవసరమో, ఎంత అవసరమో వారు యోగాభ్యాసము వలన పొందవచ్చు. భిన్న భిన్న తత్వములను సమన్వయ పరచి ఒకే లక్ష్యమైన పరబ్రహ్మతత్వమును అందించునదే, జ్ఞానయోగము.
23. గత జన్మల కర్మలను నశింపజేసి కర్మవిముక్తులను చేయునది యోగము. మోక్షము పొందాలంటే కర్మ బంధాలు రద్దు కావాలి. లేనిచో తిరిగి తిరిగి జన్మలు తీసుకోకతప్పదు.
24. యోగమును అనుభవము పొందుట ద్వారానే సాధించవలెను. కేవలము అవగాహన జ్ఞానము, జ్ఞానానుభూతి పొందుట చాలదు.
25. యోగాంగములైన గ్రంథపఠనము, సత్ సంగము, విచారణ, మననము, చింతన, నిరంతర అభ్యాసము, ధ్యానము, ఏకాగ్రత, అనుభూతి అనునవన్నియు సాధించినపుడే ఆత్మదర్శనము ప్రాప్తించును.
🌹 🌹 🌹 🌹 🌹