Showing posts with label సర్వయోగ సమన్వయము. Show all posts
Showing posts with label సర్వయోగ సమన్వయము. Show all posts

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 52

 


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 52 🌹 
52 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ప్రాణాయామము - 2 🍃 

391. అభ్యాస యోగములో శ్వాసను ఓంకారముతో పీల్చి బయటకు పోకుండా ఆపి, ప్రాపంచిక విషయములపై మనస్సు పోకుండా నశింపజేయుటయే అభ్యాస యోగమని పేరు. దీని ద్వారా ఇంద్రియములను అరికట్టుట, మనస్సును హృదయమునందు స్థిరపర్చుట, ప్రాణవాయువును బ్రహ్మరంధ్రమున నిలుపుట, ఓం కారము ఉచ్ఛరించి శ్వాసను లయింపజేయుట జరుగును. 

392. ప్రాణాయామమునకు మనస్సుకు చాలా సన్నిహిత సంబంధమున్నది. ఇది మనస్సు యొక్క చంచలత్వమును నశింపజేయును. మనస్సు బహిర్ముఖము కాకుండును. మనస్సు ప్రాణములు పరస్పరము నిరోధించబడును. కావున సాధకుడు యోగాభ్యాసము నందు కొంత సమయము ప్రాణాయామ సాధనలో కేటాయించిన మనస్సు నిశ్చలమగును. 

393. సాధకులు ప్రాణాయామము చేయునపుడు 'ఓం' అను మంత్రముతో పీల్చి 'ఓం' అను మంత్రముతో వదలవలెను. అలానే 'సోహం' మంత్రమును కూడా ప్రాణాయామముతో జతపర్చాలి. శ్వాసను పీల్చినపుడు 'సో' అనియూ వదలినపుడు 'హం' అనియూ ఉచ్చరించుచుండవలెను. పీల్చుచున్నప్పుడు బ్రహ్మ భావమును పెంచుకొనుచు, వదలుచున్నప్పుడు జీవ భావము తగ్గించుకొనవలెను. చివరకు నేనే బ్రహ్మమును అని దీని భావము. 'అజప' గాయత్రిలో 'సోహం', 'హంసో' అని జపించిన, నీవే నేను, నేనే నీవు అని సాధన చేసినట్లగును. ఈ విధముగా సోహం మంత్రమును సర్వకాల సర్వావస్థలందును జపము చేయు వారికి మరుజన్మ ఉండదు. 

394. ప్రాణాయామ సాధనా విధానము: మొదట కుడిముక్కును కుడిచేతి బొటన వ్రేలితో నొక్కిపెట్టి, ఎడమ ముక్కుతో గాలిని పూర్తిగా పీల్చి నింపవలెను. ఆసమయములో బ్రహ్మ తత్త్వములో ఉండి జగత్తు తనలో లీనం అవుతున్నట్లు భావించాలి. అలా ఉంచగలిగినంత సేపు ఉంచాలి. తరువాత ఎడమ నాశికను మూసి, నిలిపి ఉంచిన గాలిని కుడి నాశిక గుండా బయటకు వదలాలి. అట్టి శూన్యక కుంభకములో ఉండగలిగినంత సేపు ఉండి, తరువాత కుడి నాశికను ద్వారా గాలిని పీల్చి, నిల్పి ఉంచి ఎడమ నాశిక ద్వారా గాలిని బయటకు వదలాలి. ఇపుడు ఒక రౌండు పూర్తి అయినట్లు. రెండవ రౌండు మొదట తెల్పినట్లు ఎడమ ముక్కుతో పీల్చి బిగబెట్టి కుడిముక్కుతో వదలాలి. మరల కుడి ముక్కుతో పీల్చి బిగించి ఎడమ ముక్కుతో వదలాలి ఇలా చేయగల్గినన్ని రౌండ్లు కనీసము 5 సార్లు ఒక వారము చేసిన తరువాత, ఒక్కొక్క రౌండు పెంచుకుంటు 10 రౌండ్ల వరకు చేయవచ్చు. సాధారణముగా 10 రౌండ్లు సరిపోతాయి. ఇలా 10 రౌండ్లు పూర్తి చేయుటకు 5 నుండి 10 నిమిషములు పట్టవచ్చు.

395. ప్రాణాయామములో ఇంకొక విధానము: పైన తెల్పినట్లు ఏ విధమైన పూరక శూన్యక కుంభకములు లేకుండా ఆపకుండా చేస్తూ పోవాలి. ఇలా చేయుటకు మొదట పదిరౌండ్లతో మొదలపెట్టి 20, 30, 50 పెంచుకుంటూ 108 రౌండ్ల వరకు చేయవచ్చు. అందుకు షుమారు 5 నిమిషములు చాలు. 

396. ప్రాణాయామములో మూడవ విధానము: కుడి ముక్కు నొక్కి పెట్టి ఎడమ ముక్కుతో శ్వాసను వదులుతూ పీల్చుకుంటూ అదే ముక్కుతో 10, 20, 30, 108 రౌండ్లవరకు క్రమముగా పెంచుకుంటూ చేయాలి. దీనికి చంద్రభేది ప్రాణాయామమని పేరు. 

397. ప్రాణాయామములో నాలుగవ విధానము: ఎడమ ముక్కు నొక్కి పెట్టి కుడి ముక్కుతో శ్వాసను వదులుతూ పీల్చుకుంటూ అదే ముక్కుతో 10, 20, 30, 108 రౌండ్ల వరకు క్రమంగా పెంచుకుంటూ చేయాలి. దీనికి సూర్యభేది ప్రాణాయామమని అంటారు. 

398. ప్రాణాయామములో ఐదవ విధానము: ఈ పద్ధతిలో రెండు ముక్కుల ద్వారా శ్వాసను వదులుతూ పీల్చుకుంటూ అలానే 10, 20, 30, 108 రౌండ్ల వరకు పెంచుకుంటూ పోవాలి. దీనికి భస్త్రికా ప్రాణాయామమని పేరు. 

399. ప్రాణాయామములో ఆరవ విధానము: ఈ పద్ధతిలో రెండు ముక్కుల ద్వారా శ్వాసను గట్టిగా వదులుతూ ఉండాలి. ప్రత్యేకంగా పీల్చుకోవలసిన పనిలేదు. దీనికి కపాలభాతి అని పేరు. ఈ పద్ధతిలో శ్వాసను ప్రత్యేకముగా పీల్చకపోయినప్పటికి ఒక సారి వదలి మరల రెండవ సారి వదలినపుడు మధ్యలో కొంత సమయము మనకు తెలియకుండానే కొంచము శ్వాసను తీసుకొనుట జరుగుతుంది. ఈ ప్రాణాయామము వలన లోపల ఉన్న చెడు అంతా వేగముగా ఊడ్చిపెట్టినట్లు బయటకు నెట్టివేయబడుతుంది. కొత్త శక్తిని నింపుకొనుటకు వీలవుతుంది. తలలో ఉన్న అడ్డంకులు (బ్లాక్సు) తొలగిపోతాయి. 

400. ప్రాణాయామములో ఏడవ విధానము (శ్రీతలి):- ఈ పద్ధతిలో నాలుకను ముందుకు చాపి మడత పెట్టి నోటి ద్వారా గాలిని పూర్తిగా పీల్చుకొని నోరు మూసి ముక్కుతో గాలిని వదలాలి. అలా నాలుక ద్వారా పీల్చుకుంటూ ముక్కు ద్వారా వదులుతున్నప్పుడు శరీరములోని వేడిగాలి. బయటకు వెళ్ళి సమత్వ స్థితి ఏర్పడుతుంది. ఇది కూడా 10, 20, 30, 108 సార్లు చేయవచ్చు.
🌹 🌹 🌹 🌹 🌹


29 Apr 2019

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 51

 


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 51 🌹 
51 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 పరాణాయామము - 1 🍃 

380. మనిషి, అనారోగ్యానికి కారణము ప్రాణ సంచారము. శరీరములో సమానముగా ప్రసరించకుండుట అని గ్రహించాలి. అందుకు కారణము చిత్త ఏకాగ్రత లేకపోవుట. చంచల మనస్సు, రజోగుణ విజృంభణ కారణముగా ప్రాణ సంచారము సమస్థితిలో జరుగుట లేదు. 

381. ప్రాణాయామము అభ్యాసము ద్వారా ఎక్కువ తక్కువలుగా నున్న ప్రాణశక్తిని, లోపములను తెలుసుకొని సమస్థితిలో ఉంచుకొని వివిధ కేంద్రాలకు పంపిణి చేయుట జరుగుతుంది. అపుడు అనారోగ్యము తొలగిపోవును. 

382. యోగ సాధనలో ప్రాణాయామము ఒక అంశము. యోగం యొక్క అష్ఠాంగములలో ప్రాణాయామము ఒక అంగము మాత్రమే. స్థిర ప్రాణము నుండి చంచల ప్రాణావస్థకు దిగినవాడి పేరు జీవుడు. తిరిగి స్థిర ప్రాణుడగుటయే ఆత్మ స్థితి. 

383. ప్రాణాయామము ద్వారా సాధకుడు భౌతిక ప్రాణశక్తులను వశపర్చుకొని ఉశ్చ్వాస నిశ్వాసముల గతిని క్రమపర్చును. యోగమునకు ప్రాణాయామము మొట్టమొదటి ఆవశ్యకత. 

384. ప్రాణాయామము అనగా ప్రాణ ''నిగ్రహత'' అని అర్థము. ఉశ్చ్వాస నిశ్వాసములను తగ్గించుటయే ప్రాణాయామ ముఖ్య ఉద్దేశము. ప్రాణవాయువును అపానములో చేర్చుటే ప్రాణాయామము. ప్రాణాన్ని వశంచేసుకోవటమే ప్రాణాయామము యొక్క ముఖ్య ఉద్దేశము. క్రమముగా ప్రాణమును బిగబట్టుచూ చేయు సాధన ప్రాణాయామాభ్యాస మనబడును. అనేక శారీరక వ్యాయామములు శరీరమునకు చెందినవి. ప్రాణాయామము ఉశ్చ్వాస నిశ్వాసములకు సంబంధించిన వ్యాయామము. 

385. అపానవాయువు నందు ప్రాణ వాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమము చేయుటే ప్రాణాయామము. యమనియమాలలో ఇది 4వది. 

386. ప్రాణాయామములో పూరక, రేచక, కుంభకములు కలవు. 1) బయటి వాయువును లోపలకు పీల్చుట పూరకమందురు. ఇదియె ఉశ్చ్వాసము. ప్రాణమును హోమము చేయుటను పూరకమందురు. రేచకమనగా లోపలి వాయువును ముక్కురంధ్రముల ద్వారా బయటకు వదులుట. ఇదియె నిశ్వాస క్రియ. కుంభకమనగా లోపలకు పీల్చిన గాలిని, వెంటనే బయటకు వదలక వీలైనంత సేపు నిలిపి ఉండుటను పూరక కుంభకమంటారు. గాలిని వదలిన తరువాత వెంటనే పీల్చక, నిలిపి ఉంచుటను రేచక కుంభకమని అంటారు. ఈ రెంటిని అంతఃకుంభకమని, బాహ్యకుంభకమని కూడా అంటారు. బాహ్య కుంభకాన్ని శూన్యక కుంభకమని కూడా అంటారు. 

387. కుంభక ప్రాణాయామములో గాలి పీల్చినపుడు ప్రాణవాయువు శరీర అంతర్భాగములకు లోతుగా వెళ్ళి అందున్న కణజాలముకు శక్తినొసంగును. అలానే రేచక కుంభకములో లోతైన అంతర్భాగములో గల చెడు పదార్థములను సేకరించి బయటకి నెట్టివేయును. కావున పూరకము వలన కణజాలము శక్తివంతము, రేచకము వలన చెడు తొలగి శరీరమంతయు ఆరోగ్యవంతమగును. 

388. పూరక రేచక కుంభకముల వలన శరీరాంతర్భాగములో గల వెన్నెముకలో ఉన్న ఇడ, పింగళ, సుషుమ్న నాడులు చైతన్యవంతమై మూలాధారములో ఉన్న కుండలిని ఊర్ధ్వముఖమై సహస్రారములో ప్రవేశింపజేయును. శివ శక్తుల సమ్మేళనము ఏర్పడి బ్రహ్మానంద స్థితి కల్గి ముక్తికి మార్గము ఏర్పడును. 

389. పూరక రేచక కుంభకములతో పాటు కేవల కుంభకము ఒకటి కలదు. అందులో పూరకంతో రేచకంతో పనిలేకుండా అకస్మాత్తుగా శ్వాసను కుంభించి బిగబెట్టినచాలు. దీని వలన శరీరము కాయకల్పమగును. ఆయుర్వృద్ధి అగును. 

390. 2 నయనేంద్రియముల మధ్య, 2 ముక్కు ద్వారముల యొక్క పై భాగమున, ఈ మూడు కలిసే కూడలిని భ్రూమధ్యము (త్రివేణి సంగమము) అని అంటారు. శ్వాస ఎడమ కుడి ముక్కు రంధ్రముల ద్వారా ఆడుచుండును. ఈ రెండును భ్రూమధ్యమున చేరి ఒక చోట కలసి అచట నుండి సహస్రారమునకు చేరును. అచట కుండలిని శక్తిని ప్రజ్వలింపజేయును. ఆవేడిమికి బ్రహ్మ కపాలమునందు గల అమృతము కరిగి చుక్కలుచుక్కలుగా కారుచుండును. అదే ఆనంద స్థితి. జ్యోతి స్వరూపమును దర్శించు స్థితి.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #BookofDzyan #Theosophy

28 Apr 2019

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 50

 


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 50 🌹 
50 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగం చేయాలంటే శరీరం తప్పనిసరి - 3 🍃 

374. ప్రాణమయ శరీరము(ప్రాణ శక్తి): ఈ స్థూల శరీరము పనిచేయాలంటే అందుకు కావలసిన శక్తిని అందించునదే ప్రాణమయ శరీరము. ఒక వాహనము నడవాలంటే ఇంధనము కావాలి. అలానే ఈ శరీరమునకు ప్రాణ శక్తి ఇంధనము. ఈ ప్రాణ శక్తిని ఉత్పత్తి చేసే నాడులు చక్రములు. ఈ ప్రాణమయ శరీరములోనే ఉన్నవి. 

375. యాతనా శరీరము స్థూల సూక్ష్మ శరీరాలకు అనుసంధానముగా వ్యవహరిస్తున్నది. స్థూల సూక్ష్మ శరీరముల క్రియలు ఈ యాతన శరీరమునకు తెలియవు. స్థూల శరీరం లేకపోయినా, స్వర్గ నరకాలను అనుభవించేది యాతనా శరీరమే.

376. ఆత్మ శరీరము: 

మృత్యువును జయించిన వారు ఈ శరీరమును ధరిస్తారు. వీరు సత్యలోకాలలో యోగులుగా ఉంటారు. జనన మరణాలుండవు. అపుడపుడు దైవ కార్య నిమిత్తము భూమిపై అవతరిస్తుంటారు. 

377. ఇడ, పింగళ, సుషుమ్న నాడులు యోగమందు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి మూలాధారము వద్ద మొదలై ఆజ్ఞాచక్రము వరకు వెన్నుపూసలో ఉంటాయి. మధ్య నున్న సుషుమ్న నాడి ఆజ్ఞాచక్రమును దాటి బ్రహ్మ రంధ్రము వరకు వ్యాపించి కుండలిని శక్తిని చేరుతుంది. 

378. మూలాధార చక్రానికి ఉన్న త్రికోణానికి ఎడమవైపున వున్నది ఇడనాడి. కుడివైపున వున్నది పింగళనాడి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నది సుషుమ్న నాడి. ఇది మూలాధారము నుండి సహస్రారము వరకు వ్యాపించి బ్రహ్మ రంధ్రములో చేరి బ్రహ్మానందమును అనుభవించును. ఇవిగాక 72,000 నాడులు, ఉపనాడులు వెన్నుపూస నంటి ఉండి పని చేయుచుండును. 

379. షట్‌ చక్రాలు: 1) మూలాధారము 2) స్వాధిష్ఠానము 3) మణిపూరకము 4) అనాహతము 5) విశుద్ధము 6) ఆజ్ఞా 7) సహస్రారము. 

1. మూలాధార చక్రము: గుదస్థానమున కలదు వినాయకుడు అధినేత. 4 దళములు కలిగి ఉండును.

2. స్వాధిష్ఠాన చక్రము: 6 దళములు. బ్రహ్మ దీనికి అధిష్ఠాన దేవత. లింగస్థాన మందుండును. 
3. మణిపూరక చక్రము: 10 దళములతో విష్ణువు అధిష్ఠాన దేవతగా ఉండును. నాభిస్థానమునందు కలదు. 4. అనాహత చక్రము:- ఇది హృదయ స్థానము నందు కలదు. 12 దళములు. రుద్రుడు అధిష్ఠాన దేవత.

5. విశుద్ధ చక్రము:- ఇది కంఠ స్థానమున 16 దళములతో ఉన్నది. దీనికి జీవుడు అధిష్ఠాన దేవత.

6. ఆజ్ఞా చక్రము:- ఇది 2 దళములతో ఈశ్వరుడు అధిష్ఠాన దేవతగా ఉండును. భ్రూమధ్యమున ఇది వెలుగొందుచుండును. ఇదే మూడవ నేత్రము.

7. సహస్రార చక్రము:- యోగ ప్రయాణములో చివరి స్థానము సహస్రారము. ఇది జ్యోతిర్మయ స్థానము. శ్రీ గురుమూర్తి దీనికి అధిష్ఠాన దేవత. ఈ వేయి రేకుల మధ్య అష్టదళ పద్మముండును.

8. కుండలిని: ఇది మూలప్రకృతి. దీనిని ఈశ్వరి, మహామాయ, జగదాంబ, పరాశక్తి అని అంటారు. దీనికి సహస్ర దళములు కలవు. జీవుని నడిపించే ఈ కుండలిని కొన్ని వేల నాడులతో షడ్జక్రాల ద్వారా సహస్రారమున చేరి బ్రహ్మానంద స్థితిని పొందుతుంది.

9. కుండలిని లేక మాయా శక్తి ప్రేరణలో చక్ర స్థానమందున్న దళములుకదలి, జీవుడు ప్రారబ్ధమునను భవించుటకు ప్రేరణ పొందును. త్రిగుణముల కారణముగా ఆగామికర్మ చేయుటకును ప్రేరణ పొందును.

10.చంచల ప్రాణాన్ని ఊర్థ్వ ముఖముగా నున్న ఆజ్ఞా చక్రములో స్థిరముగా నిలుపు యోగమును ఊర్థ్వ రేతస్సు అందరు. సహస్రారములో ఆత్మ సాక్షాత్కారము పొందిన వాడిని ఊర్థ్వ రేతస్కుడు అందురు.

🌹 🌹 🌹 🌹 🌹

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 49


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 49 🌹 
49 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగం చేయాలంటే శరీరం తప్పనిసరి - 2 🍃 

364. ఈ శరీరము 25 తత్త్వములతో విరాజిల్లుచున్నది. అందు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణములు, 5 విషయములు, 4 అంతఃకరణ చతుష్టయము, 25వది జీవాత్మ. 

1. జ్ఞానేంద్రియములు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము.
2. కర్మేంద్రియములు: కాళ్ళు, చేతులు, నోరు, గుదము, జననేంద్రియము.
3. పంచప్రాణములు: ప్రాణ,అపాన,ఉదాన,సమాన, వ్యాన వాయువులు.
4. విషయ పంచకము: భూమికి వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశమునకు వినికిడి. ఇవి జీవుని యందు గల విషయాసక్తి.
5. అంతఃకరణ చతుష్టయము: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. 25వది జీవాత్మ. 26వది పరమాత్మ.

365. పంచ ప్రాణములు కాక ఉపప్రాణములు 5 కలవు. 1) నాగవాయువు: ఇది మాటలను పలికించును. వాంతి, త్రేన్పులను తెప్పించును. 2) కూర్మవాయువు: కనురెప్పలు తెరచుట, మూయుట చేయును. 3) క్రుకురము: తుమ్ములు వచ్చునట్లు చేయును, ఆకలి దప్పికలు కలుగజేయును. 4) దేవదత్తము: ఆవులింతలు కలుగుజేయును. 5) ధనుంజయవాయువు: శిశువును గర్భము నుండి బయటకి నెట్టి వేయును. శవంలో ఉబ్బించి తరువాత పోవును. 

366. ఈ శరీరము యొక్క గుణములు: 1) కామము 2) క్రోధము 3) లోభము 4) మోహము 5) మదము 6) మాత్సర్యము 7) దంబము 8) దర్పము 9) ఈర్ష్య 10) అసూయ మొదలగునవి. 

367. శరీర రకములు: 1) స్థూల శరీరము 25 తత్వములతో కూడి కర్మలు చేస్తూనే యోగ మార్గాలను అనుసరిస్తూ ముక్తిని పొందుటకు అవసరమై ఉన్నది. అందుకే ''శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం'' అన్నారు. కంటికి కనిపించని షడ్చక్రాలు, కుండలిని, ఇడా పింగళ, సుషుమ్ననాడులు, ఈ శరీరములోనే ఉన్నవి. ఇవే యోగ మార్గములు. 

368. అజ్ఞాన స్వరూపమైన కారణ శరీరము నుండే ఈ స్థూల శరీరము ఏర్పడినది. ఈ శరీరము 7 జానల పొడవు, 4 జానల వలయము, 70 ఎముకలు, 40 ఫలముల రక్తము, 23 కోట్ల రోమములు, 192 సంధులు, 8 ఫలముల గుండె, 360 ఫలముల మాంసము, 1 సోలెడు పైత్యము, 1 సోలెడు శుక్లములతో ఏర్పడినది. 

369. సూక్ష్మ శరీరము ఇది 17 తత్వములతో ఏర్పడినది. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణములు 5, మనస్సు, బుద్ధి. దీనికి మనోమయ శరీరమని పేరు. ఇది శ్వేత వర్ణము కలిగి ఉండును. 

370. వ్యక్తి నిద్రించుచున్నప్పుడు, ఇంద్రియములు పని చేయుటలేదు. ఆ సమయములో సూక్ష్మ శరీరమే ఆ పనిని నిర్వహించుచున్నది. ఇట్టి సూక్ష్మ శరీరము అగ్నితో కాలదు, కత్తితో నరకబడదు, నీటిలో తడవదు, గాలికి కదలదు, ప్రళయకాలమందును నశించదు. ఈ సూక్ష్మ శరీరమునకు ఒక కారణ శరీరము కూడా కలదు. కారణ శరీరము నశించిన సూక్ష్మ శరీరము కూడా నశించును. తక్షణం జీవాత్మ పరమాత్మ యందు లయించును. 

371. మోక్షము కోరువాడు మొదట సూక్ష్మ శరీరమునకు మూల కారణమైన కారణ శరీరమును జయించవలెను. దానిని జయించాలంటే బ్రహ్మ సాక్షాత్కారము చేత భ్రాంతిని నశింపజేయాలి. కారణ శరీరమే అజ్ఞానము. స్థూల సూక్ష్మ శరీరముల రెంటికి జన్మకారణమైన అవిద్యయె కారణ దేహము. అహంకారము నశించిన కారణ శరీరము నశించి ముక్తి కలుగును. 

372. అహంకారము వలన అవివేకము కలుగును. అవివేకము వలన అభిమానం కలుగును. అభిమానం నుండి కామక్రోధములు, కామక్రోధముల వలన కర్మలు చేయుట, కర్మల నుండి పునఃజన్మలు కలుగును. 

373. మహాకారణ శరీరము కారణ శరీరమునకు మూల కారణము. జీవుడు ప్రత్యగాత్మ అన్న పేరుతో సహస్రారమున నిల్చి, తురీయావస్థను పొంది, ప్రపంచ విషయములనెరుగక తన నిజానందములో ఉండును. అందుకే యోగ సాధన. మహాకారణ శరీరము ఒక ఆధ్యాత్మికత. ఇదే ముక్తికి మార్గము.
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #BookofDzyan #Theosophy

26.Apr.2019

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 48




🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 48 🌹 
48 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగం చేయాలంటే శరీరం తప్పనిసరి - 1 🍃 

356. శరీర శోధనయె యోగము. అందుకే దానిని గూర్చి పూర్తిగా తెలుసుకొనుటయే యోగమార్గము. ఇట్టి శరీరమును పరీక్షించి, పరిశోధించి దాని తత్త్వములను కనుగొని, ఆరోగ్యమును శరీర పునఃనిర్మాణమును తెలుసుకొనవలసి ఉండును. ఇదియే యోగరహస్యము. ఇది దేహాంతర భాగము నందు జరుగవలెను. దీనికి బాహ్యవస్తువులతో పనిలేదు. ఆత్మ, అనాత్మ, మనస్సు, జీవాత్మ, పరమాత్మ, జీవుడు వాటి వివరములు తెలుసుకొనవలెను. దీనినే సాంఖ్య యోగమందురు. పరమాత్మ తత్త్వము కూడా శరీరము నందే కలదు. 

357. బ్రహ్మ జ్ఞానము శరీరము ద్వారానే సాధనతో అనుభూతి చెందవలెను. జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలు శరీరమునకు సంబంధించినవే. అందుకు మౌనము, ధ్యానము, కర్మ, జ్ఞానము శరీరాధారముగా జరుగు క్రియలే. గణపతి, రుద్రుడు, శివుడు మొదలగు చక్రాధిష్ఠాన దేవతలందరు శరీరమందే కొలువుతీరి యున్నారు. 

358. శరీరము ఆరోగ్యముగా, దృఢముగా ఉన్నంత కాలము జీవుడు శరీరములోనే ఉండును. దేహమే దేవాలయము. అహం బ్రహ్మాస్మి. జీవుడే దేవుడు. శరీరము నశ్వరమైనను అందే సర్వశక్తులు, దేవతలు వసించి ఉన్నారు. 

359. శరీరము అను గూడు చర్మముచే కప్పబడినది. మాంసము, నరములు, గ్రంధులు, దుర్వాసనలతో కూడి ఉన్నది. వివిధాలంకారములతో శోభిల్లిన శరీరం స్మశానమున కుక్కలు, గ్రద్దలు, నక్కలకు ఆహారం అగుచున్నది. ప్రథ్వి అంతయు స్మశాన వాటికయే. కాని కేవలం జన్మాదిగా దృఢమైన వాసనలు మాత్రము తన వెంట గొనిపోవు చున్నాడు. 

360. పూర్వము ఋషులు, యోగులు, ముముక్షువులు సాధనలో శరీర ప్రాధాన్యతను గుర్తించి దాని ఆధారముగానే అనేక సిద్ధులు పొందిరి. 

361. ఈ శరీరము మైధునం వలన కలిగినది. నరక సదృశమైన యోని నుండి వెలువడినది. ఎముకలు, మాంసము, చర్మముతో కప్పబడి, మలమూత్రములు, పిత్తము, కఫము, మజ్జ, క్రొవ్వు మొదలగు అనేక మలముల కోశాగారము ఈ శరీరము. 

362. ఒక పదార్థము దాని విభజన అణువుల మయము. ఇంకా వేరు చేయలేని ఒక చిన్న పదార్థమును పరమాణువు అంటారు. ఇవన్నియూ మూల అణువు నుండి వచ్చినవే. అణువు పరిమాణవులుగా విడిపోయాయి. ఇవి సున్నితమైన సూక్ష్మ దర్శినితో కూడా కనబడవు. 

363. జీవుడు స్థూల శరీరమును వదలి సూక్ష్మ శరీరుడై పరలోకములకు పోవును. సూక్ష్మ శరీరము నశించదు. జీవుడు సూక్ష్మ శరీరమును వదలి ఉండడు. జీవుడు ఒక శరీరమును వదలి వేరొక శరీరమును పొందును. కాని సూక్ష్మ శరీర భంగమే మోక్షము, జన్మరాహిత్యము.
🌹 🌹 🌹 🌹 🌹


సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 47

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 47 🌹
47 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 4 🍃

353. ఆత్మ జ్ఞానము, అజ్ఞానము తొలగిన ప్రాప్తించును. స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన కాంతి, జ్ఞానము ఆత్మనుండియె ప్రకాశించును. ఆత్మ తత్త్వ బోధనచే, ఆత్మను పొందవచ్చును. పొగచేత నిప్పు, దుమ్ముచేత అద్దము, మాయచేత గర్భస్థ శిశువు కప్పబడి ఉన్నట్లు, కామముచేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది.

354. ఆత్మదర్శన ఫలితములు:-

1. కర్మలు చేసినను అవి అంటవు.
2. సుఖ,దుఃఖ జనన మరణాది బ్రాంతులు నశించును.
3. భయము, మరణ భయము తొలగిపోవును.
4. వీర్యము, బుద్ధి, తేజస్సు వృద్ధి పొందును.
5. బాహ వ్యాపారమున చంచలముగా కనిపించినప్పటికి అంతరమున మేరు పర్వతమువలె నిశ్చలముగా ఉండును.
6. అహంకారము నశించి, మానసిక వ్యాధులు తొలగును. శరీర ప్రారబ్ధముండును.
7. శాపములు, పాపదృష్టి వీరిపై ప్రభావం చూపలేవు. మానసిక చింతలుండవు.
8. దుఃఖములు, మనోవ్యాధి తొలగును.
9. శాశ్వత సుఖము, పరమశాంతి ప్రాప్తించును.
10. చిత్త భ్రమ తొలగి, చిత్త శాంతి లభించును.

355. ఆత్మదర్శనమునకు సాధనా మార్గములు:

1. ప్రతి క్షణము, భుజించుచున్నను, నిద్రించుచున్నను, కూర్చున్నను, నడుచుచున్నప్పుడు ఎల్లవేలల ఆత్మవిచారణ చేయుచుండవలెను.
2. జనకుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, భగీరదుడు మొదలైన యోగులు నిరంతరము యోగ సాధన చేసిన వారే.
3. శ్రీ వసిష్టులవారి శ్రీ యోగవాసిష్టము, ఆత్మ జ్ఞానము పొందుటకు తోడ్పడును.
4. అనంత దీక్ష, సాధన, నిష్ఠ, మానసికశక్తి ద్వారా కృషి చేయవలెను.
5. అంతరాత్మ ప్రేరణతో ఆత్మను తెలుసుకోవలెను. ఆత్మయె ప్రేరణ.
6. ఆత్మ గ్రంథ పఠనము ద్వారా పొందునదికాదు.
7. దుష్ప్రవర్తన, అశాంతి, ఏకాగ్రత లేనివాడు ఆత్మను పొందలేడు.
8. కోరికలు లేనివాడు, దుఃఖరహితుడు, వాంఛారహితుడు, ఇంద్రియ శుద్ధి కలవాడు, మనోక్షయము, చిత్త శుద్ధి కలవాడు మాత్రమే ఆత్మను తెలుసుకొనగలడు.
9. శారీరక, మానసిక దుర్బలుడు ఆత్మను పొందలేడు. కార్యదక్షత, ఆరోగ్యము, నమ్మకము నిరంతర సాధన కలవారిని ఆత్మ వరించును.
10. అంతరాత్మ యందే పరమాత్మను దర్శించవలెను. ముముక్షువు, శాంతుడు, సమాధి నిష్టుడు, సూక్ష్మ బుద్ధి కలవాడు, దివ్య దృష్టి కలవాడు, సంకల్ప శక్తి కలవాడు మాత్రమే ఆత్మను పొందగలడు.
11. అనుభవజ్ఞుడైన గురువును పొంది ఆత్మ రహస్యము తెలుసుకొని అనుభూతి పొందవలెను.
12.ఆత్మను పొందాలంటే విచారణ, అభ్యాసము, స్వానుభవము, శాస్త్ర జ్ఞానము, గురువాక్యము వీని సమన్వయము వలననే ఆత్మావగాహన కలుగును. స్త్రీలు, పురుషులు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, శూద్రులు, ఛండాలురు, బాలురు, వృద్ధులు, యవ్వనులు, వ్యాధిగ్రస్తులు మొదలగువారందరు ఆత్మ విచారణ చేయవచ్చు.
13. ఆత్మ దర్శనమునకు ఉపయోగపడనివి: వస్తు సంపద, ధనము, మిత్రులు, బంధువులు, తీర్థయాత్రలు, నదీస్నానములు మొదలగునవి.
14. ఆత్మను కేవలము సూక్ష్మ బుద్ధిచేతనే తెలుసుకొనుటకు వీలగును. అంతన్నేత్రంతో హృదయ భాగమున సహజముగా ఏకాగ్రతతో ఆత్మను ధ్యానించి భగవత్‌ సాక్షాత్కారము పొందవచ్చు. భగవంతుని స్వరూపము నిర్వికారము, నిరాకారము. అందువలన సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన వలననే పరమాత్మను పొందవచ్చు. కాని నిర్గుణోపాసన అసాధ్యము. సగుణోపాసన చేయగా చేయగా, అది నిర్గుణోపాసనకు దారి తీయును.

 

🌹 🌹 🌹 🌹 🌹

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 46


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 46 🌹
46 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 3 🍃

345. పాలలో నేయి కనబడక ఎలా మరుగున ఉన్నదో అట్లే సకల ప్రాణులందు గల ఆత్మ మాయచే కప్పబడి మరుగై ఉన్నది. త్రిగుణములైన సత్వ రజో తమో గుణములలో ఆవరించబడిన ఆత్మ తెలియబడుటలేదు.

346. పంచకోశములైన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములచే ఆత్మ కప్పబడి ఉన్నది. వాటిని తనకంటే వేరని తెలుసుకొన్న, ఆత్మ దర్శనం అగును.

347. బంగారునాణెములు వేర్వేరు రకములున్నట్లే ఆత్మ వేరువేరు పేర్లతో పిలువబడుచున్నది. అవి ప్రత్యగాత్మ, సచ్చిదానంద, నిత్యుడు, నిర్గుణుడు, నిర్వికారుడు, చిదాకాశము, జీవాత్మ, జ్యోతి, చిదాత్మ, అంతర్యామి, అఖండడు, పరమాత్మ, నిర్గుణుడు, బ్రహ్మము, అంతరాత్మ, నిరంజనుడు, నిర్మలుడు మొదలగు పేర్లతోసందర్భోచితముగా ఆత్మ పిలువబడుచున్నది.

348. ఆత్మను పొందినవారి లక్షణములు: సంకల్ప రహితుడు, శుద్ధుడు, నిర్భయుడు, ద్వంద్వ రహితుడు, మాయాతీతుడు అయివుంటాడు.

349. పూజ అనగా ఆత్మ దేవుని ధ్యానించుటయే. వస్తుసామాగ్రి, శబ్దము, పూజాసామాగ్రిలతో బాహ్యముగా భౌతికముగా చేయునది పూజకాదు అది కూడా అజ్ఞానము, అవిద్య, మనస్సు, చిత్తము, అహంకారములతో ఆత్మను ధ్యానించవలెను. తుదకు అన్నీ విడిచిపెట్టి ఆత్మ ధ్యాస స్థిరముకావలెను.

350. ఆత్మ చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడనగా రహస్యముగా చిత్రించునది. అట్లు గుప్తముగా ఉండి జీవుడు చేయు కర్మలను, పాపపుణ్యములను, తలంపులను, ఇతర వికారములను గమనించుచుండును. సాక్షిగా ఉన్నాడు. జీవుని సకలకర్మలకు, జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులకు సాక్షి చిత్రగుప్తుడే.

351. శరీరము సర్వము నాశనముకాగా చివరకు మిగిలినది ఆత్మయే. శరీరమునకు అంటిపెట్టుకొని ఉన్న పంచజ్ఞానేంద్రియములు, కర్మేంద్రియము, అంతఃకరణ చతుష్ఠయము తొలగించిన మిగిలినది ఆత్మయే. అదియే జ్ఞాన దృష్టికి దర్శనం అగును. ఇదియె సాంఖ్యము. స్వస్వరూపమును తెలుసుకొన్నవాడే సాంఖ్యుడు.

352. క్షేత్రమనగా కేవలము పదార్థ సంబంధమైన, పంచభూతాత్మకమైన స్థూల శరీరమే కాదు. అనేక దృశ్యముల మిశ్రమమే క్షేత్రము. కంటికి కనిపించని సూక్ష్మభూతములు కూడా క్షేత్రములే.
🌹 🌹 🌹 🌹 🌹

సర్వయోగ సమన్వయము -గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 45


🌹 సర్వయోగ సమన్వయము -గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 45 🌹
45 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 2 🍃

335. సమస్త ప్రాణులందును ఆత్మ వున్నది. శరీరము, ఇంద్రియములు, మనస్సు అను వాటితో ఆత్మ కలిసి పోయి ఉన్నది. అయినప్పటికి వాటన్నింటికి సాక్షిగా అతీతముగా ఆత్మ ఉన్నది. మనవరుకు చూస్తే దేహమే దేవాలయము. అందులో ఆత్మయె పరమాత్మ.

336. హృదయకమలమే ఆత్మ స్థానము. సూత్రమునందు మణులు ఉన్నట్లు, అన్ని శరీరము లందు ఆత్మ స్వయం ప్రకాశమై ఉన్నది. హృదయము నందు దాని మధ్యలో ఒక సూక్ష్మ రంధ్రము కలదు. అందులో సర్వ రూపుడగు పరమాత్మ జీవాత్మల రూపములో నిక్షిప్తమై వున్నది. అది ఒక ప్రకాశవంతమైన జ్వాల. సాధకుడు ఆత్మానుభవముతో, ఆత్మగా అందరిలోనూ తానే ఉన్నట్లు తెలిసినచో, అది సూత్రాత్మ అనుభవము.

337. జీవునికి గల ఆయుః ప్రమాణము పూర్తి అయిన తరువాత ఆత్మ శరీరమును వదులుచున్నది. పాము కుబుసము విడిచిన పిదప ఆ కుబుసముతో సంబంధము లేనట్లు శరీరమును వదలును. జలమునందు గల ఆత్మ ఆ సమయములో తన చుట్టూ గల జలము కొద్ది కొద్దిగా తగ్గుచూ పూర్తిగా ఇంకిపోయిన తరువాత ఆత్మ శరీరమును వదలుచున్నది. నాలుక ఎండిపోవును. మరణించు సమయమున తులసి తీర్ధము పోయుటకు కారణము అదే. మెరుపు తీగవలె అది అతి సూక్ష్మముగా ఉండును. ఆత్మకు నారాయణుడని పేరు. నారములనగా జలము అని అర్ధము. ఈ విధముగా జలమునందుండువాడు కనుక నారాయణుడని అంటారు.

338. అంగుష్టము వలె ఆత్మ ఉన్నది. హృదయ గుహ యందు కలదు. మనస్సునకు అనేక తలంపులు కలుగుచుండును. తలంపునకు తలంపునకు మధ్య రేప్పవాల్చునంత క్షణము మాత్రము బయలుగా ఉండును. ఆ స్థలమేదో అదే ఆత్మ క్షేత్రము. దానినే చిదాకాశము అంటారు.

339. ఆత్మ శరీరమందలి అన్ని ప్రదేశములందును సంచరించుచుండును. కాని అందు ముఖ్యమైనవి 1) హృదయ కమలము 2) భ్రూమధ్యము 3) బ్రహ్మ కపాలము. ఇవి యోగసాధనా కేంద్రములు. అందుకే భక్తులు ఈ ప్రదేశములందు విభూతి, తిలకాలను ఉంచుతుంటారు.

340. శిశు రూపమును తయారుచేయునది ఆత్మసత్తాయే. శిశువు హృదయ కమలమందు ఏడవ నెలలో జీవి ప్రవేశించును. సృష్టిలోకి ప్రవేశించిన ఇట్టి జీవాత్మ పరమాత్మలో ఐక్యమై నప్పుడు తిరిగి ఆ జీవుడికి జన్మలుండవు.

341. జీవాత్మ శరీరమును, ఇంద్రియములు తానే అని తలచును. కాని పరమాత్మకు వీటితో సంబంధములేక సాక్షిగా ఉండి గమనించును. ప్రతి జీవి యొక్క బీజము పరమాత్మయే. దేహభావన తొలగిన జీవుడు పరమాత్మను పొందును.

342. జీవుడను పక్షి కర్మఫలములను అనుభవించుటకు బందీయైఉన్నాడు. రెండవ పక్షి అయిన ఈశ్వరుడు వాటిని అనుభవించక కేవలము సాక్షిభూతుడై ఉన్నాడు. నాడులందు తిరుగాడుచున్న ప్రాణమే జీవుడు. జీవుడు త్రిగుణములు, సకలేంద్రియములు, వికారములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, అరిష్వర్గములతో కూడి ఉండును. వీటి నుండి విడుదలయైన జీవుడే పరమాత్మ.

343. సృష్టి యందలి సర్వము బ్రహ్మ స్వరూపములే. జీవుడు ఆ సమస్తములోని వాడగుటచే అట్టి వాడు కూడా బ్రహ్మమే అగును. జీవుడు ఆత్మ స్వరూపుడు. దేహ రక్షణకై నిరంతరము కర్మలు చేయుచుండును. అజ్ఞాని తెలియక, తానువేరు, బ్రహ్మమువేరు అని తలచును.

344. పరబ్రహ్మ యొక్క సూక్ష్మ రేణువులైన కలాపములే జీవుడుగా రూపొందును. జీవునిలోని ఆత్మ స్వయం ప్రకాశమై శరీరమును నడిపించుచున్నది. తాను సాక్షిగా ఉంటుంది. ఆత్మ దర్శనము పొందిన జీవునికి త్రిమూర్తులు వశమగుదురు.

🌹 🌹 🌹 🌹 🌹


22.Apr.2019

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 44

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 44 🌹
44 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 1 🍃

325. ఆత్మదర్శనం పొందాలంటే: ఆత్మ అనగా నేమి, దాని స్థానము దాని లక్షణము, జీవాత్మ,పరమాత్మ అను విషయములను గుర్చి తెలుసుకోవాలి.

326. జీవాత్మ పరమాత్మను పొందుటయే యోగము. అందుకు అంతర్‌ దృష్టితో అంతర్ముఖమై సాధన చేయాలి. ఆత్మ నిర్మలము, అనాది, శాశ్వతము, నాశరహితము. అంతర్‌ ప్రజ్ఞయే దాని రూపము. ప్రకాశవంతమైన వెలుగు, జ్యోతి దర్శనము. ఆత్మయే బ్రహ్మము.

327. పురుషుడు, క్షేత్రజ్ఞుడు, సర్వసాక్షి, వికార రహితుడు, పంచ జ్ఞానేంద్రియములకు, పంచ భూతములకు, అతీతమైనది, పరమాత్మ అంశయైనది ఆత్మ. స్వానుభవములో ఆత్మకు పరమాత్మకు భేదములేదు. ఆత్మ లక్షణము సచ్చిదానందము.

328. భౌతిక వస్తువైన ఒక మంచు ముక్కను తీసుకున్నచో అది వేడికి కరిగి నీరవుతుంది. ఇంకనూ వేడి చేసిన అది అగ్నిగా మారి ఆవిరై సూక్ష్మమై వ్యాపిస్తుంది. అది వాయువులో కలిసి వాయువుగా ఇంకా విస్తరిస్తుంది. ఆ వాయువు ఆకాశములో కలుస్తుంది. ఆకాశము అనేక రకాలైన మూలకములతో నిండి ఉంటుంది. మొదట మనం తీసుకున్న మంచు ముక్క ఇపుడు మూలకములుగా విడిపోయింది. ఆ మూలకములు అణువులుగా విడిపోతాయి. అణువులు పరమాణువులుగానూ, ఆ పరమాణువులు గౌతమ బుద్ధుని వివరణ ద్వారా కలాపములుగానూ, ఆ కలాపములు మరల విడిపోయి అష్ట కలాపములుగానూ విడిపోయి వాటి యందు అవే తిరుగాడు చుండును. ఆ అష్టకలాపమునే శివమందురు. అందులో 8 కలాప అణువులు తమ చుట్టూ తాము తిరుగాడు చుండును. దీనినే శివతాండవము అంటారు. ఒక అష్టకలాపములో 8 సూక్ష్మాతి సూక్ష్మమైన కలాపాలుంటాయి. అవి నాట్యమాడుతూ ఉంటాయి. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన అష్ట కలాపాలకు మూలము బ్రహ్మము.

329. బ్రహ్మం సర్వకాల సర్వావస్థలయందు ఏకం, నిత్యం, విమలం, అచలమై సర్వే సర్వత్రా విస్తరించి ఉన్నది. అట్టి బ్రహ్మం ఒకానొకప్పుడు సృష్టి చేయాలనే సంకల్పం చేసుకున్నప్పుడు, ఆ సంకల్పం యొక్క వత్తిడికి స్పందనలు బయలుదేరి అవి తమ చుట్టూ తాము తిరుగుతూ అష్టకలాపములుగా రూపొంది, అవి కలాపములుగానూ, కలాపములు పరమాణువులుగానూ, పరమాణువులు అణువులుగానూ, అణువులు మూలకములుగానూ, మూలకములు ఆకాశముగానూ, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఏర్పడినది.

330. భూమికి వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశానికి వినికిడి అను పంచ తన్మాత్రలు ఏర్పడినవి. ఇట్లు బ్రహ్మము విశ్వమంత వ్యాపించి తాను అన్నింటి యందు అంతర్లీనమై సాక్షిగా అంటక వున్నది. ఈ విషయమంతా సాధన ద్వారా, యోగము ద్వారా అవగాహన చేసుకొనుటయే జ్ఞానము. అట్టి జ్ఞానమే బ్రహ్మము (ప్రజ్ఞానం బ్రహ్మ).

331. సాక్షిగా సర్వత్ర విస్తరించి ఉన్న ఆత్మ, సాధన ద్వారా యోగిగా వ్యక్తమగుచూ, సాధనలో ముందుకు నడుస్తూ, తానే గురువై సాధన కొనసాగించుటకు తోడ్పడును.

332. ఆత్మ ప్రకాశము ద్వారానే జగత్తు ప్రకాశింపబడుచూ ప్రకాశించుచున్నది. ఈ జగత్‌ అంతయూ ఆత్మచే పరిపూర్ణమై యున్నది. అహం అను అహంభావంతో తానే జ్ఞానరూపమై విరాజిల్లు చున్నది.

333. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ బ్రహ్మానికి ప్రతినిధులై సృష్టి స్థితి లయ కారకులై జగత్తును పాలించుచున్నారు. వారిని తెలుసుకొని వారి ద్వారానే బ్రహ్మమును పొందవచ్చు.

334. మానవులు చేసిన పుణ్య పాప కర్మలు ఆత్మకు అంటవు. ఎట్లనగా, భూమిపై పడిన సూర్య కిరణములకు, భూమిపై గల శుద్ధ అశుద్ధ వాసనలు అంటవు. ఆత్మయె సత్యానంద పరబ్రహ్మము.
🌹 🌹 🌹 🌹 🌹

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 43

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 43 🌹 
43 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మక్ష మార్గము - 3 🍃 

315. దక్షిణాయణము, కృష్ణపక్షములో శరీరము వదిలిన వారు సకామకర్మ యోగ సంబంధమైన ప్రకాశమును పొంది తిరిగి జన్మింతురు. ఆత్మ జ్ఞానములేని, ఫలాపేక్ష కలిగిన వాడు తిరిగి జన్మించును. దక్షిణాయణము అధో మార్గము. 

316. మోక్ష లోక ప్రవేశము దేవతలకు కూడా అసాధ్యము. సాధన కొద్ది బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి లభించును. చిత్తమును, ఇంద్రియములను నిగ్రహించిన వారికి మాత్రమే మోక్షము సాధ్యము. గురువు కేవలము సాంప్రదాయ బద్ధమైన బోధనయే కానీ సాధన మాత్రము సాధకుడే కొనసాగించవలెను. దీనితో పాటు దైవానుగ్రహము కావాలి. స్వయం కృష్ణి, సాధన, విశ్వాసము, శ్రద్ధ, ఆసక్తి, పురుష ప్రయత్నము ద్వారా ఎవరికి వారె ప్రయత్నించవలెను. కాని చరమ సాధనలో గురు కృప అనెడి సహాయము లభించును. 

317. సాధనలో శ్రేష్ఠమైనది:- అజ్ఞానుల కంటే విగ్రహారాధకులు శ్రేష్ఠులు, విగ్రహారాధకుల కంటే నిర్మల బుద్ధితో బ్రహ్మమును ఆరాధించువారు, వారి కంటే అంతరాత్మలో భగవంతుని తెలుసుకొన్నవారు, వారి కంటే సదా పరమాత్మలో మైమరచి ధ్యానించువారు, వారి కంటే తనను తాను మరచి బ్రహ్మానందములో తేలియాడువారు శ్రేష్ఠులు. 

318. సృష్టి నిర్మాణ కాలమందు పరబ్రహ్మము నుండి జీవులుగా కోట్లాదికోట్ల జన్మలు పొంది ఏదో ఒక జన్మలో సాధన ద్వారా ముక్తిని పొందిన వారు చివరకు ఏదో ఒక జన్మలో మోక్షమును పొందుదురు. సాధనను బట్టి ముందు వెనుక ఉండును. 

319. మోక్షమునకు సాధన సంపత్తి: జ్ఞానము, యోగము, ఇంద్రియ నిగ్రహము, రాగద్వేషములు లేకుండుట, ద్వంద్వాతీతుడై సమత్వ స్థితిలో ఉండాలి. అహంకార రాహిత్యము, చిత్త శుద్ధి, మనోనాశము, వాసనాక్షయము, గృహస్థాశ్రమము, ప్రాపంచిక విషయములు త్యజించుట మొదలగునవి కావలెను. 

320. అనేక పేర్లతో నెలకొల్పబడుతున్న ఆధ్యాత్మిక సంస్థలు, ఆశ్రమాలు, కేంద్రాలు, అభ్యాసమునకేగాని మోక్షమునకు ఉపయోగపడవు. చివరికి ప్రతి వ్యక్తి ఎవరికి వారు ఏకాకియై సాధన చేయాలేకాని జన సమూహములతో కూడి చేయునది మోక్ష సాధన కాదు. కుల, మత, జాతి, భేదములు లేని వారై ఉండాలి. అన్ని రకాల బంధముల నుండి విడివడాలి. వేషధారణ, వివిధాలంకారములు సాధనకు అడ్డంకులు. 

321. నీటి మీద నడుచుట, గాలిలో తేలుట, ఉంగరాలు, హారాలు సృష్టించుట మొదలగునవి మోక్షమునకు తోడ్పడవు. నిజమైన యోగులు జనబాహుళ్యానికి, ప్రజాకర్షణకు దూరంగా ఉంటారు. వారికి సిద్ధులు లభించినప్పటికి వాటిని వినియోగించరు, ప్రదర్శించరు. 

322. మానవునకు స్వయముగా విశిష్ఠ జ్ఞానము కలదు. సృష్టిలోని 84 లక్షల జీవ రాశులలో మానవ జన్మ శ్రేష్ఠమైనది. దానిని ఆత్మాజ్ఞానోపార్జనకు ఉపయోగించి ముక్తిని పొందాలి.

323. మోక్షమునకు ఉపయోగపడనివి: జపతపాలు, పూజలు, ఉపాసనలు, తీర్థయాత్రలు, జంతుబలులు, కీర్తి ప్రతిష్ఠలు, యాగములు మొదలగు భౌతిక సాధనలు వలన ముక్తి లభించదు. 

324. కేవలం ఆత్మానుసంధానము, యోగ సాధన వలననె, బ్రహ్మత్వం, అమరత్వం, భగవదనుగ్రహము వలననె ముక్తి లభిస్తుంది అని నిర్ద్వంద్వముగా తెలియుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 42

 

🌹  సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 42 🌹 
42 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మక్ష మార్గము - 2 🍃 

305. పుణ్య కార్యములను కామ్యకర్మలంటారు. సత్రములు, కోనేరులు, దేవాలయములు, చలివేంద్రములు, అన్నదానములు, వస్త్రాదానము మొదలగువాని వలన స్వర్గము లభించునే కానీ మోక్షము లభించదు. కానీ ఆ కార్యములను నిష్కామముగా చేసిన అపుడు ముక్తికి మార్గము లభించును. 

306. మోక్షము, మరణించిన తరువాత పరలోకములో పొందునది కాదు. అది అనుభవించేది కాదు. ఈ జన్మయందే, భౌతిక స్థితిలోనే, జీవించి ఉండగానే పొందవల్సిందే. అందుకు భౌతిక శరీరం కావాలి. ఇది వార్ధక్యములో చేయవల్సింది కాదు. బాల్యము, యవ్వనములందే మోక్ష సాధన ప్రారంభించి కొనసాగించవలెను. వృద్ధుడైన తరువాత శరీరము క్షీణించిన తరువాత చేయు సాధన వలన ఫలితము ఉండదు. అందుకే శరీరము ఆరోగ్యముగా శక్తివంతమై ఉన్నప్పుడు చేయవలయును. కావున ఎవరు ఈ జన్మ యందే తమ శరీరమును విడువక ముందే, కామ క్రోధాది అరిషడ్వర్గములను జయించగలరో వారే సాధకులు, యోగులు, మోక్షార్హులు. 

307. మోక్షాభిలాష కలవానిని ముముక్షువు అందురు. అందుకు తగిన సాధన చేయాలి. 
ముముక్షువు లక్షణము:- ఏ వికారము లేకుండుట. క్రియారహితులు లేక నిష్కామకర్మ చేయువారు, ఆత్మావగాహన కలవారు, గురువు ద్వారా జ్ఞానము పొందుట, సాక్షి స్థితిలో ఉండుట, తలంపులు తలెత్తకుండునట్లు జీవించుట. 

308. జీవన్ముక్తుడు కానివాడు మోక్ష గృహము చేరలేడు. ఒక వ్యక్తి జీవించి ఉండగనే ముక్తిని పొందుటయే జీవన్ముక్తి. జీవన్ముక్తి రహస్యములను తెలుసుకొని దాని ప్రకారము సాధన చేయాలి. యోగి నిస్సంగిగా జీవ యాత్ర సాగిస్తాడు. మానవులలో శ్రేష్ఠుడు జీవన్ముక్తుడు. బ్రహ్మసాక్షాత్కారము పొందిన వాడు. 

309. జీవన్ముక్తుని లక్షణములు:- విగ్రహారాధన చేయనివాడు, పూజలను వదిలినవాడు, సకల మలిన వాసనలు వదిలినవాడు, అహంకార రహితుడు, బ్రహ్మజ్ఞాని, త్యాగశీలి, పరమాత్మ ధ్యానములో ఉన్నవాడు, ఇష్టాఇష్టములు లేకుండుట, విషయాల సుఖదుఃఖాలు శరీరానికేగాని తనకు కాదని తలచుట, తామరాకుపై నీటి బొట్టువలె జీవించుట, జ్ఞానామృతమును పానం చేయుట. 

310. బంధములే మోక్షమునకు ఆటంకములు. మోక్షమనగా విడుదల అని అర్థము. బంధముల నుండి విడుదల కావలెను. అదియె మోక్షము. సర్వ స్వాతంత్రమే విముక్తి. 

311. బాహ్య బంధములు, అంతర బంధములు అని బంధములు రెండు రకములు. 1) బాహ్యబంధము: ఇది శరీరమునకు సంబంధించినది. ధనము, భార్య, బిడ్డలు, వస్తువులు, వాహనాలు, వ్యవహారములు, శబ్దములు, ప్రపంచ విషయములు. 2) అంతరబంధములు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అహంకారము దంభము, దర్పము ఈర్ష్య, అసూయలు రాగము, ద్వేషము మొదలగునవి. 3) స్వభావ బంధములు: సత్వ రజస్‌ తమో గుణములు. 

312. రోదసీలో ఉత్తరాయణ, దక్షిణాయములే మార్గములు. ఉత్తరాయణము మానవ జన్మ రాహిత్యమునకు, దక్షిణాయణము పునఃజన్మలకు మార్గములు. వీటిని అర్చరాది, ధూమ్రాది మార్గములంటారు. 

313. ఉత్తరాయణములో యోగులు, పుణ్యాత్ములు, బ్రహ్మవేత్తలు, మానవ జన్మరాహిత్యమునకు ఈ మార్గమును అనుసరించాలి. శుక్లపక్షము, ఉత్తరాయణము, ఉత్తమగతులకు సరైనది. అంతరిక్షమునందు శుక్లపక్షము పగలు కృష్ణపక్షము రాత్రిగా ఉండును. ఉత్తరాయణ కాలము దేవతల అధీనంలో ఉంది. 

314. భూలోకమున ఒక రాత్రి ఒక పగలు, అంతరిక్షములో 30 రోజులకు సమానము. ఉత్తరాయణము 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉండును. ఉత్తరాయణములో పుణ్యాత్ములు అంతరిక్షమునుండి దేవతల ద్వారా పుణ్యలోకములైన సూర్య చంద్ర లోకములకు చేర్చబడుదురు. అచట నుండి యోగ్యులైన వారిని భగవంతుని యొక్క పరంధామానికి పారిషదులు వచ్చి తీసుకెళ్ళిన తరువాత అపుడు బ్రహ్యైక్యము సిద్ధించును. కావున యోగి అగ్ని, ఆకాశము, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణముల ద్వారా బ్రహ్మమును చేరును.
🌹 🌹 🌹 🌹 🌹


19.Apr.2019

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 41

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 41 🌹 
41 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మక్ష మార్గము - 1 🍃 

296. మోక్ష మనునది ఒక ప్రదేశముకాదు. అది ఒక అనుభూతి. సహజ స్థితి. దీనికి ముక్తి, కైవల్యము, సంపూర్ణ స్వాతంత్య్రము, లయము, ఐక్యము, బంధ విముక్తి, అమృతత్వము, బ్రహ్మత్వము అను పర్యాయ పదములు కలవు. ఇదియె బ్రహ్మానంద ప్రాప్తి. ఇంకను నిర్మాణము, అపవర్గము, పరమ పదము అని కూడా అందరు. 

297. బంధ రహితము పొందినపుడే మోక్షము. బంధ విముక్తి పొందాలంటే మోక్ష సాధన మార్గాలను అనుసరించాలి. పునఃజన్మ రహితమైనదే మోక్షము. ఇది స్వయం ప్రకాశము. జనన, మరణ, విషచక్రము నుండి విముక్తియె మోక్షము. మోక్ష స్థితిని అనుభూతి పొందినవారు కూడా దానిని వర్ణించలేరు.

298. సచ్చిదానందమనగా సత్‌, చిత్‌, ఆనంద రూపము. ఏకరూపమైనది సత్‌. బాహ్య వస్తువులను ఏది గ్రహించునో అది చిత్‌. ఏ ఉపాధి లేని సుఖము ఏదో అదే ఆనందము. 

299. కైవల్యమనగా బ్రహ్మ జ్ఞానము వలన పొందిన ఏకైక సిద్ధి. అఖండ ఆనందమైన మోక్షమే కైవల్యము. ఆత్మ స్వాతంత్య్రమే కైవల్యము. సాధకుని చరమ లక్ష్యము కైవల్యము. దానినే అమృతత్వము అని కూడా అంటారు. 

300. మోక్ష గృహము బయట ఎచటోలేదు. అది మనలోనే ఉన్నది. అది ఉన్నదని తెలియకపోవుటయే అజ్ఞానము. అది తెలుసుకొనుటే జ్ఞానము. అదియే ఆత్మ. ఆత్మ స్థితియె మోక్షము కావున నీ హృదయమందే మోక్ష సామ్రాజ్యము కలదు. దేహమే దేవాలయము. జీవుడే దేవుడు. ''అహం బ్రహ్మాస్మి'' అట్టి బ్రహ్మ స్థితిని అనుభూతి పొందుటయే మోక్షము. మోక్షము ఇంద్రియాతీతమైనది. దేహాతీతమైనది. దేవాలయములలో, పుణ్యతీర్ధములలో, నదీతీరములలో మోక్ష గృహము లేదు. ఎక్కడ ఎప్పుడు భ్రాంతి రహితమో - అప్పుడే అక్కడే ముక్తి లేక మోక్షము. 

301. మోక్షము మరణించిన తరువాత పొందేది కాదు. జీవించి ఉండగనే పొందే స్థితి. జీవన్ముక్తిని పొందుటే మోక్షము. ఇది పరలోక ప్రాప్తి కాదు. జ్ఞాన వైరాగ్య సంపన్నులకు తన అంతరాత్మ యందే మోక్షము కలుగును. ఆత్మ విచారణే మోక్షమునకు మార్గము. నిర్మల చిత్తమే మోక్షము. మోక్షమునకు అంతఃస్ఫూర్తి, జ్ఞానము అవసరము. హృదయమునందు ధ్యానము చేయుట వలన మోక్ష రూపమైన తన స్వరూపము తెలుసుకొనబడును. శరీరమందుగల మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారములు నశించిన తక్షణమే ఆత్మ దర్శనం అగును. అంతఃజ్యోతి దర్శనమే ఆత్మ దర్శనము. 

302. మోక్షము పొందునది జీవాత్మ. ఇది మాయతో కప్పబడి ఉన్నది. జీవాత్మ పరమాత్మ యొక్క అంశయే. జ్ఞానులు మాత్రమే ఈ రహస్యమును తెలుసుకొని మోక్షమును పొందుచున్నారు. అంతర్ముఖియై గమనించిన తేజోవంతమైన దివ్య జ్యోతి దర్శనమై బ్రహ్మానంద స్థితి ఏర్పడును. 

303. దివ్య భోగములు అనుభవించు పరలోకమే స్వర్గము. ఇది ఇంద్రుని లోకము. ఇది భోగవస్తు నిలయము. ఇచట శారీరక, మానసిక శక్తులు, ఆయుర్ధాయము భూలోక మానవుల కంటే ఉన్నతముగా ఉండును. 

304. స్వర్గలోక ప్రాప్తి కలగాలంటే యోగి యజ్ఞయాగాధి కర్మలు, వేదాధ్యయనము, పుణ్య కార్యములు చేయవలెను. స్వర్గ ప్రాప్తి పొంది అందు తగిన పుణ్య ఫలమును అనుభవించిన తక్షణమే ఆ స్వర్గము నుండి వేరేలోకమునకు నెట్టివేయబడును. భూలోకమున జన్మించి మిగిలిన పాపకర్మలు ఏవైన ఉన్నచో వాటిని తొలగించుకొనవచ్చును. అనగా పుణ్య కార్యముల వలన పుణ్య లోకములు, పాప కార్యముల వలన భూలోకము నందు జన్మించవల్సిందే. ఈ విధముగా జీవుడు భూలోకమునుండి స్వర్గము, అచ్చట నుండి భూలోకము జన్మలు తీసుకుంటూ చివరకు ఆత్మ జ్ఞానము పొందినపుడే జన్మ పరంపరలకు ముక్తి లభించును. మోక్షము పొందాలంటే భూలోకములోనే సాధన చేయవల్సి ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 40

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 40 🌹 
40 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగ మాయ - 3 🍃 

289. ఈ మాయా శక్తి యందు కోట్లకొలది రేణువులు ఉత్పత్తి, స్థితి, లయములను పొందుచుండెను. చిత్‌ బ్రహ్మము మాయా శక్తిచే ఆవరింపబడి ఉన్నది. చిదణువు నుండె సృష్టి ఏర్పడుచున్నది. వడ్లగింజ పొట్టుచే మూయబడినట్లు జీవుని మాయా ఆవరించియున్నది. 

290. తల్లి గర్భమున శిశువుకు పూర్ణ జ్ఞానముండును. ఆ స్థితిలో తాను తన పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపకర్మలను తలచుకొనుచూ, పశ్చాత్తాప పడుచూ, ఈ జన్మలోనైనా జ్ఞానముతో సత్కర్మలతో జీవింతునని తలచుకొనుచూ, దుర్గంధ సహితమైన మలమూత్ర నరక కూపమునందు వసించుచుండును. అట్టి స్థితిలో వైష్ణవ మాయ కమ్మి శిశువు అధోముఖముగా తల్లి గర్భమునుండి భౌతిక ప్రపంచమున ప్రవేశించును. 

291. మాయతో ఆవరించి ఉన్న ఆత్మను దర్శించాలంటే జీవుడు తన చుట్టూ ఆవరించి ఉన్న మాయను జయించాలి. అపుడే ఆత్మ సాక్షత్కారమై జీవుడు ఆత్మను దర్శించును. జ్ఞాని అగును. జీవాత్మ పరమాత్మ ఒక్కటే. 

292. పదార్థములన్నియూ మూల ప్రకృతి నుండి ఉద్భవించి అందే లయమగుచున్నది. సమస్త ప్రాణికోటి ప్రళయకాలమున మాయ యందు అణగిఉండి, తిరిగి సృష్టి కార్యమున జన్మించును. కల్పారంభమున భగవంతుడు జీవులను మరల సృజించుచున్నాడు. కాని పరబ్రహ్మ మాయకు అంటనివాడు. 

293. బ్రహ్మకు పగలు ప్రారంభము కాగానే మాయవలన చరాచర ప్రపంచము తెలియుచున్నది. బ్రహ్మకు రాత్రి సమయము కాగానే మాయ లయమై జీవులు అందు అణగి ఉండును. అలానే జీవుడు పగలంతా కోతి వలె సంచరించుచుండును. రాత్రి సమయమున నిద్రించును. 

294. దేవతల, మానవుల కాల ప్రమాణము ఈ క్రింది విధముగా ఉండును. 
దేవతల కాలము మానవుల కాలము 
24 గంటలు 1 సంవత్సరము 
1 నెల 30 సంవత్సరాలు 
1 సంవత్సరము 360 సంవత్సరములు 
1 యుగము 12,000 సంవత్సరములు 
1 మహా యుగము 43,20,000 సంవత్సరములు 
కలియుగము : 4,32,000 సంవత్సరాలు 
ద్వాపరయుగము : 8,64,000 సంవత్సరాలు 
త్రేతాయుగము : 12,96,000 సంవత్సరాలు 
కృతయుగము : 17,28,000 సంవత్సరాలు 
మహా యుగము మొత్తము 43,20,000 సంవత్సరాలు 
1000 యుగములు బ్రహ్మకు 1 పగలు 
1000 యుగములు బ్రహ్మకు 1 రాత్రి 
అనగా 1000 þ 4,32,000 = 43,20,00,000 సంవత్సరాలు బ్రహ్మకు 1 పగలు. 
అలానే బ్రహ్మకు రాత్రి పగలు కలిసి 86,40,00,000 సంవత్సరాలు 1 రోజు. 
బ్రహ్మ యొక్క పగలు కల్పము 
బ్రహ్మ యొక్క రాత్రి ప్రళయము 
బ్రహ్మ యొక్క 30 రోజులు- బ్రహ్మకు 1 నెల 
బ్రహ్మ యొక్క 12 నెలలు - బ్రహ్మకు 1 సంవత్సరము బ్రహ్మకు 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుర్థాయము కావున బ్రహ్మ జీవితము కూడ పరిమితమైనదే అలానే మిగిలిన లోకములు. కేవలము పరబ్రహ్మ మాత్రమే శాశ్వతము. 

295. భ్రాంతి తొలగించుటకు సాధకుని కర్తవ్యములు:- భగవత్‌ ధ్యానము. ధ్యానము వలన జ్ఞానము లభించి భ్రాంతి తొలగును. అపుడు భగవత్‌ ప్రాప్తి లభించును. నిరంతర సాధన, పురుష ప్రయత్నము, శాస్త్ర పఠనము, ఆధ్యాత్మిక విచారణ, దైవ స్మరణ, భక్తి శ్రద్ధల ద్వారా భ్రాంతి తొలగును. స్వస్వరూప జ్ఞానము (ఆత్మ దర్శనం) వలన మాయ తొలగును. మాయను మాయతోనే నశింపజేయవలెను. నిరంతర యోగాగ్నిలో మాయ భస్మం అగును.
🌹 🌹 🌹 🌹 🌹


17.Apr.2019

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) -39

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) -39 🌹 
39 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగ మాయ - 2 🍃 

280. శరీరములోని వివిధ భాగములు, నాడులు, షడ్చక్రములు, కుండలిని, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, త్రిగుణములు ఇవన్నియూ పరస్పర ఆధారములై తమ తమ ధర్మములను నిర్వర్తించుచున్నవి. అలానే ఆత్మ, అంతరాత్మ, జీవాత్మ, పరమాత్మలు కూడా మాయా శబలితమై వర్తించుచున్నవి.

281. భ్రాంతియె భ్రమ. లేని వస్తువును ఉన్నట్లు తలంచుటయె భ్రమ. తాడుయందు పాము, ఎండమావులలో కనిపించే నీరు, శరీరమె తాను అనుకొనుట ఇవన్నియూ భ్రమలే అగును. ప్రతి ఒక్కరు మాయలో పుట్టి, మాయలో మరణిస్తున్నారు. స్వేచ్ఛా, మోక్షము, ముక్తి అనునవి మాయను జయించినప్పుడు లభిస్తాయి. 

282. మాయకువశమైన వాని లక్షణములు: పుణ్య పాపకర్మలు చేయుట, మంచి చెడు కర్మలు, మూఢత్వము, అజ్ఞానము, రాక్షస స్వభావము, సంసారము, దుఃఖము, రాగద్వేషములు, అహంకారములు మొదలగునవి. దీనిని బంధము అందురు. 

283. దివ్య దృష్టి లేనిదే మాయమర్మమును తెలుసుకొనుటకు వీలులేదు. భగవంతుని శక్తి విశేషము, యోగమాయ. భగవంతుని గ్రహించకుండా మాయ అవహించి ఉన్నది. ఈ మాయా తెర తొలగాలంటే ఆత్మ దర్శనం అవసరము. యోగ శక్తి ద్వారా భగవంతుడు అనేక అవతారములు దాల్చుచూ జగత్తును ఉద్ధరించుచున్నాడు. 

284. ఎఱుక అనగా గుర్తు, సాక్షి స్థితి, జ్ఞప్తి, స్పురణ. జీవుడు ఎఱుక స్వభావుడు. ఎఱుక ఒక కల. పరిపూర్ణత్వములో తోచిన ఎఱుకయె కల. మాయను తెలుసుకోవాలంటే ఎఱిగే ఎఱుక అవసరము. సృష్టికి కారణము ఎఱుక. ఎఱుక లేని దశయె నిర్గుణము. లేని ఎఱుకను తెలుసుకొని చివరకు ఆ లేని ఎఱుకను విడువవలెను. 

పంచ జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకొనేది మనస్సు అనే ఎఱుక. ఈ జగత్తుకు మూలము ఎఱుక. సుషుప్తి అవస్థనుండి తనంతట తాను ఎవరు పిలువకయె ఎఱుక వచ్చినది. అచల పరిపూర్ణముచేత ప్రకృతి, పురుషులు పుట్టలేదు. ఈ రెండు మాయయె. ఎఱుకకు మూలము మాయయె. ఎఱుక లేని స్థితియె పరిపూర్ణము. మనకండ్లకు కనబడు ఎఱుకలేని ఎఱుక ఇంద్రజాల భంగిమవలె ఇది కనిపించి చివరకు ఏమియూ లేకుండా పోవును. 

285. అఖండ ఎఱుకయె బ్రహ్మము. జీవుడు పిండాండ రూపము. ఈశ్వరుడే బ్రహ్మము. 

286. బట్టబయలు, ఉత్త బట్టబయలు ఏమి లేనిది. నిరాకారమె బట్టబయలు. పరబ్రహ్మ స్వరూపమే బట్టబయలు. ఇది సర్వత్రా సర్వవేళలందు నిండియున్నది. దీనికి నాశనంలేదు. దీనిని తెలుసుకొనిన బ్రహ్మమును తెలుసుకొన్నట్లే. ఇట్టి బట్టబయలుగా ఉండు పరబ్రహ్మ యందు ఎఱుకను విడచుటయె సాధకుని లక్ష్యము. అఖండ ఎఱుక పోతే బయలే. 

అఖండ ఎఱుకనగా కోటి సూర్యుల కాంతిగా వెలుగుతూ ''ఓం'' అనే ప్రణవము, అందుండి వివిధ నాదములుగా వెలువడుతున్నది. ఇది నీవు కాదు. నీ నిజ స్వరూపము బట్టబయలు. అదియె శాశ్వతము, సత్యము, నిర్మలము, అనాది. ఇది సర్వత్రా నిగూఢముగా వ్యాపించి యున్నది. 

287. అచల పరిపూర్ణము అనగా ఆత్మ, మనస్సు స్పందించక స్థిరముగా, నిశ్చలముగా ఉండి తిరిగి ఏకాలమందునూ చలింపకున్నచో దానిని అచలము అంటారు. ఇట్టి స్థితిలో వ్యక్తి వికార రహితుడై రూప నామములు లేక, జననమరణములు లేక స్త్రీ, పురుష నపుంసక భేదములు లేక ఉండుటయె అచల పరిపూర్ణమంటారు. ఇది భావాతీతము. త్రిగుణ రహితము. 

288. సృష్టికి పూర్వము ఈ విశ్వమంతయు అసంగుడైన నిర్వికార పరబ్రహ్మ స్థితి యందుండెను. అదియె అఖండ జ్యోతి. ఈ జ్యోతి నుండియె మాయాశక్తి ప్రతిఫలించినది. ఆ మాయా శక్తియె సృష్టి నిర్మాణమునకు మూలము. ఈ మాయా శక్తికి సత్వ గుణము ప్రధానము. అందుండి మొదట ఈశ్వరుడు ఏర్పడి, మాయను తన వశము చేసుకొని దాని యందే నివసించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 38

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 38 🌹 
38 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగ మాయ - 1 🍃 

271. యోగాభ్యాసకుని ప్రథమ కర్తవ్యము ప్రకృతి స్వరూపమైన మాయలో తాను ఎలా చిక్కుకున్నది, దాని లక్షణములు, స్వభావము, దాని నుండి ఎలా బయటపడాలి అను విషయమును తెలుసుకొనుట. 

272. గాఢాంధ కారమైన మాయా స్వరూపమును తెలుసుకొని, అది ఎలా మన యొక్క జ్ఞానమును, ప్రజ్ఞ, వివేకము, ఆలోచనను, మనస్సును, చిత్తమును కప్పి వేయుచున్నదో గ్రహించవలెను. 

273. మాయను జయించుట సులభము కాదు. మునిపుంగవుడైన నారదుడు కూడా శ్రీవిష్ణువు యొక్క మాయలో ఎలా క్షణములో సంసారము, భార్య, పిల్లలు, సుఖ సంతోషాలకులోనై దుఃఖమును అనుభవించాడో మనకు తెలుసు. 

274. మానవ సృష్టి ఆరంభమునందు ఈ మాయా తత్త్వమును గూర్చి యోగులు చర్చిస్తూ దాని నుండి బయటపడు మార్గమును, సాధనా విధానమును మనకు అందించి ఉన్నారు. సాధారణ మానవుడు దీనిని తొలగించుకొనుట కష్టము. 

275. మాయ అనగా మోహము, భ్రాంతి, భ్రమ, కల అని సాధారణముగా భావిస్తుంటాము. కానీ మాయయె ఎరు. మూల ప్రకృతియె మాయ. ఇది సత్యము కాదు. అసత్యము కాదు. స్వరూప జ్ఞానము మరచుటయె మాయ. సత్వ రజ స్థమోగుణములు మాయ నుండియె ఏర్పడుచున్నవి. లేనిది ఉన్నట్లు భ్రమ పడుటయె మాయ. సమస్యలు, వాసనలు, చంచలత్వము, విషయ సంస్కారములు మున్నగునవన్నియూ ఏకమైనదియె మాయ యగును. ఆశ, ఆసక్తి, ప్రీతి, బంధము, ఆకర్షణ, వ్యామోహములుగా మాయ వ్యక్తమగును.

276. ఈ పదునాలుగు లోకములు, దేవత్వము, మానవత్వము, సంకల్ప, రూప నామములు, ప్రకృతి పురుషులు సుఖ దుఃఖములు, అనుభవములన్నియూ మాయలోని భావములే. 

277. స్వప్నములో ఏనుగులు, గుర్రములు, స్త్రీలు, పదవులు, సంభాషణలు మొదలగునవి స్వప్నము పూర్తి అయిన తర్వాత జాగ్రదావస్థలో మాయమగును. అలానే ఇప్పుడు ఎరుకలో ఉన్న ఈ శరీరము, ఇల్లు, భార్యా, పుత్రులు, ప్రపంచము ప్రతి క్షణము, రోజురోజుకు, జన్మజన్మకు కొంతకాలమునకు ఎలా లేకుండా పోవునో ఇవన్నియూ మాయలో తోచినవే. 

278. సృష్టి రహస్యములు తెలిసినవాడే సత్య జ్ఞాని. మోక్ష పదవులు, లోక భ్రాంతులు, దేహ భ్రాంతులు కేవలము స్వప్నతుల్యములు, మాయలోని భావములు. ఏ క్షణమున మనిషికి జ్ఞానోదయము కలుగునో ఆ క్షణమునే మాయ అంతమై పోవును. అవన్నియూ లేనివే అగును. కాని జీవుడు మాయకు అధీనుడు. ఈశ్వరుడు మాయను జయించినవాడు. సత్వరజోతమో గుణములను పొరలు తొలగినప్పుడే జీవుడు బ్రహ్మమగుచున్నాడు. 

279. భక్తి, వైరాగ్య సాధనలతో, ఆత్మను శరణుజొచ్చిన మాయను దాటవచ్చు. భగవదాశ్రయము, శరణాగతి, ఆత్మ చింతన అభ్యాసం చేసినప్పుడే మాయను దాటగలము. 

280. శరీరములోని వివిధ భాగములు, నాడులు, షడ్చక్రములు, కుండలిని, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, త్రిగుణములు ఇవన్నియూ పరస్పర ఆధారములై తమ తమ ధర్మములను నిర్వర్తించుచున్నవి. అలానే ఆత్మ, అంతరాత్మ, జీవాత్మ, పరమాత్మలు కూడా మాయా శబలితమై వర్తించుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 37

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 37 🌹 
37 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 శరీరావస్థలు 2 🍃 

260. తురీయ స్థితి పొందాలంటే నిరంతర శాస్త్ర పఠనము సజ్జన సాంగత్యము గురుశుశ్రూష, నిరంతర అభ్యాసము అవసరము. 

261. తురీయ స్థితిలో సంకల్పములు ఉద్భవించవు. జఢత్వముండదు. వికల్పముండదు. మిగిలిన జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులు, చిత్తము యొక్క రూపములు. అసత్యములు. తురీయము వాస్తవ రూపము. ఈ మూడవస్థలకు సాక్షిమాత్రుడే తురీయుడు. 

262. నాలుగు అవస్థలు ప్రతి అవస్థలోనూ ఉండును. అలానే తురీయములోనూ నాలుగు అవస్థలు ఉండును. అని మొత్తము షోడశావస్థలు (16). 

263. మనస్సు మృతి చెందిన స్థితియె సమాధి స్థితి. ఈ స్థితియె యోగి యొక్క పరమావధి. సమాధి స్థితి నిద్రావస్థ కాదు, మగత కాదు, స్వప్నము కాదు, అజ్ఞానము కాదు. పూర్ణ ప్రజ్ఞయె సమాధి. ఇది ఊరక కూర్చుండుటయె. ఆత్మ తత్త్వ బోధయె సమాధి. 

264. సమాధి స్థితికి చేరడానికి చేయు నిరంతర సాధనయె యోగము. యోగమనగా సమాధి. సమాధి అనగా సమత్వ స్థితి. బ్రహ్మ కపాలము, భ్రూమధ్యము నందు, హృదయ కవాటము నందు బాహ్య ప్రపంచమును మరచి అంతరంగమున సంచరించుటను సమాధి అందురు. గాలి లేని చోట ఉన్న దీపమువలె నున్న నిశ్చలస్థితియె సమాధి స్థితి.

265. సమాధికి సంయమమని పేరు. భోగేచ్ఛ లేకపోవుట, ఔదార్యము, సౌందర్యము, వైరాగ్యములలో కూడా పరమానంద స్థితిలో నుండుటయె సమాధి స్థితి. 

266. ఎవరు నిత్యము ఆత్మ విచార తత్పరులై ఉండునో, బాహ్య దృష్టి శూన్యుడై, అంతర్ముఖుడై ఉండునో , వారికి అదే సమాధి స్థితి. 

267. యోగ సిద్ధులు సమాధి స్థితికి ప్రతిబంధకాలు వాటిని కోరరాదు. అరిషడ్వర్గాలు అంతరించి పోవాలి. ఆత్మ, మనస్సు కలిసిపోగా, మనోలయమగును. ఆత్మ అద్వయమై యుండును. . 

268. సమాధి అనగా నిష్ఠ. ఈ స్థితిలో ధ్యానము, మంత్రము, జపము, పూజలు అనేవి ఆగి పోవును. దీనికే ఆత్మ నిష్ఠ, జ్ఞాన నిష్ఠ, యోగ నిష్ఠ, బ్రహ్మ నిష్ఠ అని పేర్లు. చిత్త స్వాధీనము, మనోక్షయమే సమాధి. 

269. సమాధి స్థితిలో అనేక రకములు: 1) సవికల్ప సమాధి: ఇది ఎరుతో కూడి ఉండును. 2) నిర్వికల్ప సమాధి స్థితి: సాధకుడు శాంత స్థితిలో ఉండును. సత్వ, రజో, తమో గుణములు నశించి ఉండును. 3) నిర్బీజ సమాధి స్థితి: ఈ స్థితిలో కర్మ బీజాలు నశిస్తాయి. సంస్కారములు నశిస్తాయి. మిగిలిన అనేక సమాధి స్థితులు సవితర్న, శబ్దానువిద్ధ, దృశ్యానువిద్ధ మొదలగునవన్నీ సవికల్పమే. 

270. సమాధి వలన ప్రయోజనములు:- 1) సంస్కారములు నశించును. 2) అతీంద్రియ జ్ఞాన మేర్పడును. 3) జ్ఞాన నేత్రము తెరుచుకొనును. వివిధ లోకాల దర్శనమవుతుంది. 4) కుండలిని యొక్క ఊర్ధ్వ అధో ప్రయాణాలను గమనించవచ్చు. 5) వ్యక్తి జీవన్ముక్తుడగును. 6) ఇదే బ్రహ్మానంద స్థితి. 7) మోహము నశించును. 8) దేహమందలి సూక్ష్మ శరీరములు తెలియబడును. 9) సోమరితనము, భోగ లాలసత్వము, తమో గుణము తొలగును. ప్రజ్ఞ కేవలమగును.
🌹 🌹 🌹 🌹 🌹

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 36

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 36 🌹 
36 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 శరీరావస్థలు 1 🍃 

254. యోగులు సాధనలో చేరవల్సిన చివరి స్థితి ''తురీయ'' స్థితి. అది సాధించుటకు ముందు క్రమముగా 1) జాగ్రదావస్థ 2) స్వప్నావస్థ 3) సుషుప్తావస్థ నాల్గవది తురీయావస్థ. తురీయావస్థకు చేరిన తర్వాత అతని స్థితి 'సమాధి' స్థితి. ఇది అపుడు సహజముగా ఏర్పడి యుండును. 

255. జాగ్రదావస్థలో; దర్శనము, స్పర్శ, కర్తృత్వముతో సకల వ్యవహారములు చేయుచుండును. ఇందులో నేత్రములు ప్రధానమైనవి. ఈ స్థితిలో మనస్సు అనేక విషయములందు ఆసక్తి, అభిమానము, ప్రీతి, కలిగి విహరించును. ఇంద్రియముల ద్వారా బాహ్యసంస్కారములను అనుభవించుట జాగ్రత్‌ స్థితి. ఈ స్థితిలో, అంతిమ సమాధి స్థితికి కావల్సిన సమస్త విషయములు గ్రహించి ఎల్లప్పుడు ఎరుకలో వుండును. పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయముల ద్వారా ఎరిగుచున్న ఎరుకయె జాగ్రత్‌స్థితి.

256. స్వప్నావస్థ: ఈ అవస్థలో సాధకుడు మనోరూపుడు, భావరూపుడై ఉండును. అతనిని ''తైజసుడు'' అని అందురు. ఈ స్థితిలో జాగ్రత్‌ వస్తు సముదాయమంతా మనోభావరూపములో దర్శించును. తెలిసీ తెలియని స్థితి, జ్ఞాపకము ఉండి లేని స్థితి ఉండును. శ్వాస ప్రాణవాయువుతో కలిసినప్పుడు స్వప్నజాగ్రత్‌ స్థితి ఏర్పడును. 

257. సుషుప్తావస్థ: చిత్తము దృశ్యరహితమైనపుడు, క్షీణ చిత్తము కలవారికి జాగ్రత్తునందే సుషిప్తి అగును. వాస్తవముగా విషయములు జ్ఞాపకము లేకుండా మరపు స్థితిలో వుండును. జడ స్థితిలో ఉండును. సుషుప్తిలో ఇది ఏమీ తెలియని స్థితి. జగత్‌ వస్తు వృత్తుల యొక్క నివృత్తి, తురీయదృశ్యమే జాగ్రత్తలో సుషుప్తి స్థితి. సుషుప్తిలో జాగ్రత్‌ స్థితిని పొందినవాడు జీవన్‌ముక్తుడు. సాధకుడు జాగ్రత్‌లో కూడా సుషుప్తిలో ఉండును. స్వప్నములేని నిద్రావస్థ సుషిప్తి ఈ స్థితిలో సర్వవృత్తులు అణగి ఉండును. 

258. తురీయావస్థ: అవస్థలన్నింటిలో తురీయావస్థ ఉన్నతమైనది. సమాధి స్థితి పొందిన సాధకుడు ఆనందమయ జ్యోతి స్వరూపుడగుచున్నాడు. అదియె తురీయము. అభ్యాస యోగము స్థిరపడినచో ఏర్పడిన నిస్సంకల్ప స్థితియె తురీయము. మేల్కొని ఉన్నను, సుషిప్తిలో ఉన్నను తురీయ స్థితిని అనుభవించవలెను. ఆ స్థితిని పొందుటకు అహంకారం విడువ వలెను. సమత్వము పొంది దృఢ చిత్తము కల్గి ఉండవలెను. తురీయ స్థితి నిలకడ పొందినపుడు ఒకప్పుడు జాగ్రత్తు స్వప్నం వలె కనబడును. అందులో భిన్నత్వములోనూ అద్వైత భావనలు నిలకడ పొందవలెను. జాగ్రత్తు సుషుప్తివలె ఉన్నవాడు విదేహ ముక్తుడు.

259. తురీయ స్థితి సదా స్వీయ జ్ఞానము చింతించుట వలన ఏర్పడును. బ్రహ్మనిష్ఠయందు చలించకుండుట, స్వప్నంలోనే స్వప్న విషయము స్వీయ జ్ఞాపకము ఉండుట, గాఢ నిద్రలో నిద్రించుటను తెలియుటయే గాక తురీయ స్థితిలో ఆత్మ జ్ఞానము కలిగి ఉండవలెను. అదియె తురీయ స్థితి. ఈ స్థితిలో ద్వంద్వ రహితుడై సదా బ్రహ్మమునే ధ్యానించుచూ తరువాత విదేహ ముక్తి పొంది పరమాత్మలో లీనమగును.
🌹 🌹 🌹 🌹 🌹


13.Apr.2019

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 35


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 35 🌹
35 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 వసనలు 2 🍃

245. (మనిషి) జీవుడు జనన మరణములందు శరీరములు మారి పోయినప్పటికి, తన యొక్క వాసనలు మాత్రము అలానే ఉంటాయి. దానిని కారణ శరీరము అంటారు. వాటిని ఈ జన్మలోనే సత్కర్మల ద్వారా క్షయింప చేసుకోవాలి.

246. వాసనలు సత్కర్మల ద్వారా పూర్తిగా క్షయించినప్పుడు అతనికి పునఃజన్మ ఉండదు.

247. మానవులకు భార్య, పుత్ర, ధన, ధాన్యాదులందు, విషయములందు, ప్రాపంచిక వస్తువులందు ఆశ ఉన్నచో అవే మరు జన్మకు బీజములుగా ఉండి జనన మరణములకు కారణమగుచున్నవి.

248. మాయా ప్రభావము వలన జీవుడు అజ్ఞానముచే మాయను తెలుసుకోలేక మరణ కాలములో కూడా ఆ వాసనలు మరువకుండుటచే అవి అతని పునర్జన్మలకు కారణమగుచున్నవి.

249. ఎవరు వాసనలు అను త్రాళ్ళచే బంధింపబడి ఉన్నారో, వారందరు ఆశాపాశమున తగుల్కొని వాటికి వశులై ఉన్నారో అట్టి వారు తాళ్ళచే బంధింపబడిన పశువులవలె లోకములోనికి ఈడ్వబడతారు. వాసనారాహిత్యమే అమనస్కము.

250. వాసనలు లేని సాధకుని లక్షణములు: ఆశరాహిత్యము, నిర్భయము, సమత్వము, జ్ఞానము, నిష్కామత్వము, నైష్కర్మ్యము, సౌమ్యత, నిర్వికల్పము, ధీరత్వము, మైత్రి, సంతోషము, మృదుత్వము, మృదుభాషణము మొదలగున్నవి.

251. వాసనల ఫలితము: మహాదుఃఖము, రాగద్వేషములు, సంసార బంధనములు, దృశ్యపదార్థముల సంగమము, మోహము మొదలగునవి.

252. వాసనా రాహిత్య ఫలితములు: వాసనా రాహిత్యము శ్రేష్ఠమైన యోగ లక్షణము. శాంత స్థితి. మోక్షపదమును పొందును. మనస్సు సంకల్ప రహితమగును. అమనస్క స్థితిలో మనస్సు ఆత్మయందు లయమగును. అతడు కర్మలు చేసినను, చేయకున్నను సచ్చిదానంద స్థితిలో ఉండును. ముక్తుడగును.

253. వాసనా క్షయమునకు యోగ సాధన: ఎట్టి వారికైనను వాసనలు జయించుట చాలా కష్టము. అయినను వాసననలు జయించిన యోగులు కలరు. అందుకు మార్గము చిరకాలము యోగసాధన. లేనిచో సంసార వాసనలు, పూర్వ వాసనలు నశించవు. మిగిలిన సంస్కారములు మరుజన్మకు కారణమగును. వాసనలు ఆత్మతో ఏకము చేసిన, మనో నాశము, వాసన క్షయము కల్గి ఫలితములు లభించును. వాసనా బీజము నశించునంతవరకు అభ్యాసం చేయవలెను. బియ్యపు గింజపై పొట్టు, రాగి పాత్రపై చిలుమును ప్రయత్నపూర్వకముగా తొలగించునట్లు, హృదయ మందలి అజ్ఞానవాసనను తొలగించవలెను. అందుకు ప్రాప్తించిన, ప్రాప్తించని భోగములను త్యజించవలెను. చీడ పురుగులవలె నున్న వాసనలను వృద్ధికానివ్వక, నిరంతర అభ్యాసంతో వాసనలను నశింపచేయవలెను. వేరు మార్గము లేదు.

నిజానికి వాసనా క్షయమనగా ద్వైత భావన నశించుట, అద్వైత భావన నిలుచుట, సంసారము స్వప్న తుల్యమగుట. ఇట్టి లయ యోగమే ప్రధానము.
🌹 🌹 🌹 🌹 🌹

12.Apr.2019

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 34

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 34 🌹 
34 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 వసనలు 1 🍃

235. వాసన అనునది ఒక భయంకరమైన, అంధకారమైన వికారములతో కూడి; మానవునకు సుఖదుఃఖములు, రాగద్వేషములు, పునర్జన్మలకు కారణమవుతాయి.

236. వాసనలు మాయాజాలము పిశాచములవలె జన్మ జన్మలుగా వెంబడించి మనిషిని మింగి వేయచున్నవి. ప్రతి సాధకుడు తీవ్రముగా విచారణ అభ్యాసము ద్వారా వాటి స్వభావములను తెలుసుకొని ఎవరికి వారు తమ జన్మలను, సంస్కారములను ఉద్ధరించుకొనవలెను. ఇదే సృష్టి రహస్యము, జన్మ రహస్యము, మాయాతత్వము.

237. వ్యక్తి ఎంత పండితుడైనను, గొప్ప జాతి వారైనను, వాసనల వలననె బంధింపబడి పునఃజన్మలకు ఈడ్వబడుచున్నాడు. జననమరణ హేతువైన సంస్కారముల నుండి విడుదలయినవాడే ధీరుడనబడును.

238. పంచేంద్రియములు, మనస్సు ద్వారా విషయ భోగములపై వ్యామోహము కల్గిన మనిషికి దుఃఖము కలుగుచున్నది.

239. వాసనలకు పుట్టుక, ఆది లేదు. అనాదిగా ఇది మానవుని వెంబడిస్తూ ఉన్నాయి. ఇవి వాటంతట అవె నశించవు. అది నశించాలంటే యోగ సాధన, యోగ విజ్ఞానము, సత్‌గ్రంధ పఠనము, దృఢ చిత్తముతో వాటి రహస్యమును తెలుసుకొని అంతము చేయాలి.

240. ఈ భౌతిక శరీరము వాసనలచే నిండియున్నది. మానవ దేహముచే, ఇంద్రియములచే, సూక్ష్మ శరీరములు చేయు కర్మల ఫలితములే వాసనలు. పూర్వవాసనలు ప్రారబ్ధాను భవమునిచ్చునప్పుడు సంస్కారములని పిలువబడును. జన్మ జన్మలుగా వెంబడించు కోరికలు, అలవాట్లు, అభ్యాసములతో కూడిన సంస్కారములు ఒకదానితో ఒకటి పెనవేసుకొనిపోయి బలపడి వాసనా రూపములుగా ఉంటున్నవి.

241. వాసనలు మూడు రకములు: 1) కర్మ వాసనలు 2) స్మృతి మాత్ర వాసనలు 3) కర్మలను అనుభవించుట వలన కలుగునవి (ఆగామి).

242. అనేక జన్మలందు అభ్యాసము చేతను, సంసార బంధముల చేతను, భోగముల చేతను, కోరికలు మొదలగు లౌకిక కార్యములే వాసనలగుచున్నవి.

243. విషయ వాసనలనే విషము, అవిద్యా, అజ్ఞానము వలన ప్రోగై దృఢపడి వాటితో నిండిన ఈ శరీరమే శాశ్వతమని భావన కలుగుటచే, అజ్ఞానములో కర్మలకు, బద్ధులగుచున్నారు.

244. వాసనలు అనేక రకములు.
1.లోకవాసన: అనగా లోకముచే గుర్తింపబడవలెనని కోరిక.
2.శాస్త్రవాసన: తాను గొప్ప శాస్త్రవేత్తననే భావన.
3. దేహవాసన: దేహమునందు ప్రీతి.
4.శుద్ధవాసన: సాధన ద్వారా తనలోని దుర్గుణములను వదలివేయుట.
5.అశుద్ధవాసన: కామ క్రోధాదుల ద్వారా, వస్తు భోగముల ద్వారా ఏర్పడునది.
6. శుభవాసన: సాధన ద్వారా శుద్ధుడై శాశ్వతమైన మోక్షమునకు అర్హుడగుట.
7. సంచితవాసన: గత జన్మల వాసనలే సంచిత వాసనలు.
8. ప్రారబ్ధవాసన: తన యొక్క తన పూర్వికుల ద్వారా ఏర్పడిన వాసన ఈ జన్మలో వెంటవచ్చును.
9. ఆగామివాసన: కొత్తగా చేసినది రాబోవు జన్మలకు ప్రోగుపడినది.
10. ఇహలోక వాసనలు: ఈ లోకములోని ప్రసిద్ధ దృశ్యముల భావనలు.
11. పరలోక వాసనలు: సత్కర్మల ద్వారా పుణ్యలోక(స్వర్గ), దుష్కర్మల ద్వారా పాపలోక (నరక) అనుభవముల వాసనలు.

🌹 🌹 🌹 🌹 🌹