సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 44

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 44 🌹
44 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 1 🍃

325. ఆత్మదర్శనం పొందాలంటే: ఆత్మ అనగా నేమి, దాని స్థానము దాని లక్షణము, జీవాత్మ,పరమాత్మ అను విషయములను గుర్చి తెలుసుకోవాలి.

326. జీవాత్మ పరమాత్మను పొందుటయే యోగము. అందుకు అంతర్‌ దృష్టితో అంతర్ముఖమై సాధన చేయాలి. ఆత్మ నిర్మలము, అనాది, శాశ్వతము, నాశరహితము. అంతర్‌ ప్రజ్ఞయే దాని రూపము. ప్రకాశవంతమైన వెలుగు, జ్యోతి దర్శనము. ఆత్మయే బ్రహ్మము.

327. పురుషుడు, క్షేత్రజ్ఞుడు, సర్వసాక్షి, వికార రహితుడు, పంచ జ్ఞానేంద్రియములకు, పంచ భూతములకు, అతీతమైనది, పరమాత్మ అంశయైనది ఆత్మ. స్వానుభవములో ఆత్మకు పరమాత్మకు భేదములేదు. ఆత్మ లక్షణము సచ్చిదానందము.

328. భౌతిక వస్తువైన ఒక మంచు ముక్కను తీసుకున్నచో అది వేడికి కరిగి నీరవుతుంది. ఇంకనూ వేడి చేసిన అది అగ్నిగా మారి ఆవిరై సూక్ష్మమై వ్యాపిస్తుంది. అది వాయువులో కలిసి వాయువుగా ఇంకా విస్తరిస్తుంది. ఆ వాయువు ఆకాశములో కలుస్తుంది. ఆకాశము అనేక రకాలైన మూలకములతో నిండి ఉంటుంది. మొదట మనం తీసుకున్న మంచు ముక్క ఇపుడు మూలకములుగా విడిపోయింది. ఆ మూలకములు అణువులుగా విడిపోతాయి. అణువులు పరమాణువులుగానూ, ఆ పరమాణువులు గౌతమ బుద్ధుని వివరణ ద్వారా కలాపములుగానూ, ఆ కలాపములు మరల విడిపోయి అష్ట కలాపములుగానూ విడిపోయి వాటి యందు అవే తిరుగాడు చుండును. ఆ అష్టకలాపమునే శివమందురు. అందులో 8 కలాప అణువులు తమ చుట్టూ తాము తిరుగాడు చుండును. దీనినే శివతాండవము అంటారు. ఒక అష్టకలాపములో 8 సూక్ష్మాతి సూక్ష్మమైన కలాపాలుంటాయి. అవి నాట్యమాడుతూ ఉంటాయి. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన అష్ట కలాపాలకు మూలము బ్రహ్మము.

329. బ్రహ్మం సర్వకాల సర్వావస్థలయందు ఏకం, నిత్యం, విమలం, అచలమై సర్వే సర్వత్రా విస్తరించి ఉన్నది. అట్టి బ్రహ్మం ఒకానొకప్పుడు సృష్టి చేయాలనే సంకల్పం చేసుకున్నప్పుడు, ఆ సంకల్పం యొక్క వత్తిడికి స్పందనలు బయలుదేరి అవి తమ చుట్టూ తాము తిరుగుతూ అష్టకలాపములుగా రూపొంది, అవి కలాపములుగానూ, కలాపములు పరమాణువులుగానూ, పరమాణువులు అణువులుగానూ, అణువులు మూలకములుగానూ, మూలకములు ఆకాశముగానూ, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఏర్పడినది.

330. భూమికి వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశానికి వినికిడి అను పంచ తన్మాత్రలు ఏర్పడినవి. ఇట్లు బ్రహ్మము విశ్వమంత వ్యాపించి తాను అన్నింటి యందు అంతర్లీనమై సాక్షిగా అంటక వున్నది. ఈ విషయమంతా సాధన ద్వారా, యోగము ద్వారా అవగాహన చేసుకొనుటయే జ్ఞానము. అట్టి జ్ఞానమే బ్రహ్మము (ప్రజ్ఞానం బ్రహ్మ).

331. సాక్షిగా సర్వత్ర విస్తరించి ఉన్న ఆత్మ, సాధన ద్వారా యోగిగా వ్యక్తమగుచూ, సాధనలో ముందుకు నడుస్తూ, తానే గురువై సాధన కొనసాగించుటకు తోడ్పడును.

332. ఆత్మ ప్రకాశము ద్వారానే జగత్తు ప్రకాశింపబడుచూ ప్రకాశించుచున్నది. ఈ జగత్‌ అంతయూ ఆత్మచే పరిపూర్ణమై యున్నది. అహం అను అహంభావంతో తానే జ్ఞానరూపమై విరాజిల్లు చున్నది.

333. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ బ్రహ్మానికి ప్రతినిధులై సృష్టి స్థితి లయ కారకులై జగత్తును పాలించుచున్నారు. వారిని తెలుసుకొని వారి ద్వారానే బ్రహ్మమును పొందవచ్చు.

334. మానవులు చేసిన పుణ్య పాప కర్మలు ఆత్మకు అంటవు. ఎట్లనగా, భూమిపై పడిన సూర్య కిరణములకు, భూమిపై గల శుద్ధ అశుద్ధ వాసనలు అంటవు. ఆత్మయె సత్యానంద పరబ్రహ్మము.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment