సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 28

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 28 🌹
28 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 అమనస్క యోగము 🍃

189. అతి శక్తివంతమైన మనస్సుతో పరమాత్మతో ఐక్యమగుటయె అమనస్కము అని పేరు. యోగమునకు మరొక పేరు అమనస్కము. అదే జీవబ్రహ్మైక్యము. ఈ అమనస్క యోగము అతి రహస్యమైనది. ఇది తెలిసిన యోగి కృతార్ధుడగును.

190. ఇంద్రియములన్నియూ విషయ నివృత్తమైనచో అమనస్క రూపమైన ఆనంద సముద్రమునందు మనస్సు, గాలి వీచని చోట దీపము వలె నిశ్చలమై బ్రహ్మమును పొంది యుండును.

191. అమనస్క యోగములో యోగి నిత్య శుద్ధ చైతన్యమైన పరమాత్మను తానే అని ''తత్‌ త్వం అసి'' అను అనుభూతిని పొందును.

192. అమనస్క స్థితిలో యోగికి భోగ విషయములు, పదార్థములు, వాసనలు నశించిపోవును. ఈ జగత్తు మిథ్య అను నిశ్చయము కలుగును. ఆత్మజ్ఞానము పొంది మనస్సు క్షయించినంతనే జీవన్ముకుడగును. అజ్ఞానికి దేహము నశించినను మనస్సు క్షయింపదు. సాధకుడు మొదట మనస్సునే క్షయింప చేయవలెను.

193. అమనస్క స్థితిని పొందిన యోగి విషయ నివృత్తి పొంది ఆనంద రూపుడై ఉండును. సకలేంద్రియములు విషయ రహితమైన తక్షణం మనస్సు నశించును. అదియె అమనస్క స్థితి.

సాధకుడు సంకల్పములు, ఆశలు, విషయ స్మరణములు త్యజించవలెను. అన్నీ ఉన్నను చెవిటి, మూగ, గ్రుడ్డివాని వలె జీవించవలెను. సాక్షీభూతుడుగా ఉండటమే అమనస్క యోగము. అదియె అమనస్క స్థితి. అమనస్క యోగము అద్వైతమును సూచించును. జీవన్ముక్తుల విషయములో అది అమనస్క ముద్ర అగును. అదియే అద్వైత సిద్ధి.
🌹 🌹 🌹 🌹 🌹