అంతర్యామి - అప్రమత్తత

అంతర్యామి - అప్రమత్తత


అప్రమత్తత అంటే జాగ్రత్తగా ఉండటం. ఇది లోకంలో ఉన్న మానవాళికే కాదు, సకల ప్రాణులకూ అవసరం. ప్రపంచంలో ప్రమాదాలెప్పుడూ పొంచి ఉంటాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా ముంచుకువస్తుందో ఎవరికీ తెలియదు. ముందుగా ఊహించడం కష్టం కనుక ప్రతి ప్రాణీ సదా అప్రమత్తంగా ఉండటమే శ్రేయస్కరం.

ప్రమాదాలు రెండు విధాలు. మానవ ప్రమేయం లేకున్నా దైవికంగా జరిగేవి మొదటిరకం. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీలు, తుపానులు, సుడిగాలులు, వరదలు మొదలైనవన్నీ దైవికంగా జరిగేవి. మానవుల తప్పుల వల్ల జరిగేవి రెండోరకం. దైవిక ప్రమాదాలను ముందుగా ఊహించడం సాధ్యం కాదు గనుక అవి సంభవించినప్పుడు మనిషి జాగ్రత్తగా వాటినుంచి సురక్షితంగా బయటపడటానికి యత్నించాలి. కానీ మనిషి తెలిసో తెలియకో చేసే తప్పులవల్లా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటికి కారణం మనిషిలో అప్రమత్తత లోపించడమే. ఇది శోచనీయం.

మనిషి సర్వకాలాల్లో తన క్షేమాన్ని భావిస్తూ ఉండాలి. అందుకే పెద్దలు ఎప్పుడూ మంచి భావాలనే ఆహ్వానించాలంటారు. సద్భావన వల్ల మనసు అనుకూల మార్గంలో ప్రయాణిస్తుందని మనస్తత్వవేత్తలు అంటారు. అందుకే ఋగ్వేదం- ‘మంగళకరమైన భావాలను అన్ని దిక్కుల నుంచి ఎల్లవేళలా ఆహ్వానించండి’ అని చెబుతోంది. కనుక మనిషి నిరంతరం మంచిని తలుస్తూ ఉండాలి.

శరీరం స్వాధీనంలో ఉన్నప్పుడే, ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ఆత్మోన్నతి కోసం సాధన చేయాలని, సద్గుణాలను అలవరచుకోవాలని భర్తృహరి తన సుభాషిత త్రిశతిలో అన్నాడు. కొంపలంటుకొన్నప్పుడు నీళ్లకోసం బావిని తవ్వేవాడు మూర్ఖుడు కాక మరెవరు? రాబోయే కాలాన్ని క్షేమంగా గడపాలనుకొనే ప్రతి మనిషీ ముందుగానే మేలుకొని ప్రయత్నాలు ప్రారంభించాలి. ఇటుకపై ఇటుక పేర్చుకొంటూ పోతుంటేనే ఉన్నత భవనం రూపొందినట్లు- ఒక్కొక్క మంచి పనిని నిత్యం చేసుకుంటూ ముందుకు సాగితేనే మనిషి హాయిగా మనగలుగుతాడన్నది మహనీయుల ఉపదేశం!

సమయం వచ్చినప్పుడు చూద్దాంలెమ్మని కొందరు సమయాన్ని వృథా చేస్తుంటారు. ఎప్పుడు ఆపద వస్తే అప్పుడే మేల్కొంటామనుకుంటే, ఒక్కోసారి మనిషికి ఆలోచించే సమయం దొరకదు. చెరువుకట్ట తెగిపోకముందే ఆనకట్టను దృఢంగా చేయడం అవసరం.

ముఖ్యంగా కొందరు విద్యార్థులు సంవత్సరం అంతా వృథాగా కాలక్షేపం చేసి, పరీక్షల సమయంలో చదువుకొందామనుకొంటారు. పరీక్షలు సమీపిస్తున్నకొద్దీ ఆందోళన పెరిగి, తగిన సమయం లభించక ఫలితాల్లో విఫలం చెందుతుంటారు. ఈ పద్ధతి శ్రేయస్కరం కాదు. ఒక్కొక్క నీటిబొట్టు పడుతూ ఉంటేనే కుండ పూర్తిగా నిండుతుంది. అలాగే నిత్యం అప్రమత్తతతో చేసే నిర్విరామకృషి వల్లనే విజయలక్ష్యం సునాయాసంగా సాధ్యమవుతుంది. ముందుగానే మేల్కొని కృషి చేయడం ఉత్తమ పద్ధతి. ప్రమాదం సంభవించినప్పుడు మేల్కొని ఆపదనుంచి గట్టెక్కడం మధ్యమ పద్ధతి. కొంపలు అంటుకుపోతున్నా గాఢనిద్రలో ఉంటూ, ఏ మాత్రం స్పందించక పోవడం అధమ పద్ధతి. ఏ పద్ధతి అనుసరణీయమో తేల్చుకోవలసింది మనిషే.
మనిషి అప్రమత్తంగా జీవించేందుకు సూర్యుణ్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆరునూరైనా, నూరు ఆరైనా సూర్యుడు సకాలంలోనే ఉదయిస్తాడు. తగిన సమయంలోనే అస్తమిస్తాడు. సూర్యుణ్ని చూసి క్రమశిక్షణను నేర్చుకోవాలి. క్రమశిక్షణతోనే అప్రమత్తత సాధ్యం.

మానవులు అపజయాలను పొందడానికి అప్రమత్తత లోపించడమే ప్రధాన కారణం.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

మనసే దైవం

మనసే దైవం


జీవుడి మనసు శక్తిమంతమైన దేవత. దానిలో పుట్టే ప్రతి ఆలోచనా దేవతే. ఆలోచనలు అనంతం. కనుక దేవతలు, ఆలోచనా రూపంగా అసంఖ్యాకం. జీవుడు తన మనసును లొంగదీసుకోగలిగితే, దేవతలను జయించినట్లే. దేవతలను శాసించగలిగినవాడు, నిలువరించగలిగినవాడు, సిద్ధ, శుద్ధ మనస్వియై దివ్యమనస్కుడై ఉంటాడు. కనుక మనసు దైవమేనంటుంది, బృహదారణ్యకోపనిషత్. ఈ పని సాధించుకోని మనసు దయ్యమే! అంటే దయలేనిదన్నమాట. ఆలోచనను యధాతథంగా అనుభవించటం వలన, పరిణామము, సంస్కారము ఎరుగని ఆలోచనలన్నీ విపరీత మనసుగా రూపొంది, దయారహితంగా ఆవిష్కృతమౌతుంది. అది చేసే, చేయించే పనులన్నీ అర్థరహితంగా, వ్యధాభరితంగా వుంటయ్.

అమ్మ పలుకులు కలకండలై...
అమ్మ అడపాదడపా అన్న మాటలన్నీ తేటగా, తెల్లంగా, అచ్చు తెలివిని తెలుపుతుంటయ్. మనసును జయించిన, మనోతీత స్థాయిలో అమ్మ పలుకులన్నీ కలకండలై ఆపాతమాధుర్యాన్ని, ఆలోచనామృతాన్ని అందిస్తయ్. "ఏడుస్తూ అనుభవించేవాడు, నవ్వుతూ అనుభవించేవాడి దగ్గరకు సలహా కోసం వస్తాడు'' అంటుంది అమ్మ. అంటే అనుభవించటంలో తేడా వున్నదే కానీ, అనుభవించటం యిద్దరికీ వుందని స్పష్టం చేస్తూ, యిద్దరి మనఃస్థితులను తెరిచి చూపిస్తుంది. ఇద్దరికీ మనసుంది. కాకపోతే ఒకరు ఎరిగీ, మరొకరు ఎరుగకా అనుభవిస్తున్నారు.

ఎరిగిన వాడు ఎదురొడ్డటం లేదు. ఎదిరించటం లేదు. ఆదమరచటం లేదు. అప్రమత్తంగా వున్నాడు. దైవీమయమైన మనసుతో అనుభవిస్తూనే, అనుభవాన్ని సాక్షిగా చూస్తున్నాడు. మనసుపరంగా దివ్యత్వాన్ని, అనుభవపరంగా నిరామయంగా, సాక్షీభూతంగా నిలవటంతో నిర్వికారంగా వుండగలుగుతున్నాడు.

కనుక ఆ స్థితిలో ఆనందమూ లేదు, ఆవేదనా లేదు. ఎరగని వాడు సమస్త అవస్థలకు లోఐ, దేనినీ పూర్తిగా అనుభవించలేని స్థాయిలో సంచరిస్తాడు. వైపరీత్యం, ఉద్వేగం, బాధ, భయం, దుఃఖం, పట్టరాని ఆనందం, గట్టు తెలియని మమకారం, అణచుకోలేని అహంకారం, అంతమెరుగని అసూయ, అస్పష్టత, అనాచారం వంటి ప్రతికూల శక్తులకు లోనై మనసు దయ్యమై నిరంతర చింతకు గురౌతాడు.

సంకల్పరాహిత్యం ఎక్కడ?
ఎరిగినవాణ్ణి ఎరగని వాడు కలుసుకున్నప్పుడు మొదటివాడు రెండోవాడికి ఉపశమనం కలిగిస్తాడు, దారి చూపిస్తాడు, క్షణకాలమైనా దుఃఖం నుండీ దూరం చేయగలుగుతాడు. "అమ్మా! సంకల్పరాహిత్యమంటే ఏమిటి?'' అని అడిగినపుడు "అంటే సంకల్పంలోంచే పుడుతున్నపుడు, ఆ సృష్టంతా ఆగకుండా జరుగుతున్నపుడు, సంకల్పము-సృష్టి ఎడతెగకుండా అవుతున్నపుడు, సంకల్పరాహిత్యానికి అవకాశం లేదు. కనుక సృష్టిస్తున్న వాడికి వున్నదంతా సంకల్పసాహిత్యమే. ఎందుకంటే వాడు, వాడి మనసు దైవతం కాబట్టి. అందునా వాడి సృష్టంతా నిస్వార్థం.

జీవుడి మనసు ఆ స్థాయిది కాదు కనుక, ఆలోచనలన్నీ స్వార్థపరం, స్వగతం కనుక, సాధనాక్రమంలో జీవుడు మనసును నిగ్రహించుకుని, నెమ్మదించుకుని, వేగ ఆవేగాలను తగ్గించుకుని, స్వార్థాన్ని త్రుంచుకుని, ఆలోచనలను పరగతం చేయగలిగితే, సంకల్పరాహిత్యం కలుగుతుంది.

అది ఒక సిద్ధి. దానిని అన్ని వేళలా అస్పృహతో నిలబెట్టుకోగలిగితే, సంకల్పరాహిత్యం స్థిరమౌతుంది. ఇదంతా అనుకునే వేదాంతం కాదు. మనసును దాటిన నిర్మల భావనా స్థితి. పరిమిత మమకారమే మానవత్వం. మితి ఎరుగనిదే అమిత మనసే భగవంతుడు. అంతా తానే అయినపుడు, తనకేంటే భిన్న వస్తువు మరొకటి లేదన్నపుడు, మనసు దైవమౌతున్నది.

భిన్నత్వంలో చలించే మనసే మానవత్వం. భిన్నత్వం నుండి ఏకత్వంలోకి జరిగే ప్రయాణమే సాధన. ఆ ప్రయాణం సజావుగా సాగాలంటే మనసు, దైవీ సంపదను పొందాలి. ధైర్యం, అంతశ్శుద్ధి, తత్త్వజ్ఞానం, దాతృత్వం, నిగ్రహం, త్యాగం, స్వాధ్యాయం, తపస్సు, అహింస, అపరిగ్రహం, సత్యవాక్కు, ధర్మాచరణ, అక్రోధం, ప్రశాంతత, ప్రసన్నత, దయ, అనాసక్తి, మృదుత్వం, నిశ్చలమనసు, తేజస్సు, క్షమ, సహనం, సమభావం, సమన్వయం, కృతజ్ఞత...వంటి దైవీగుణాలను నియమం చేసుకోవాలి. అపుడు దైవీమయ మనసు, రాహిత్యం వైపు తొంగిచూస్తుంది. ఎందుకంటే, ఎంత సాధన చేసినా, కదంవనం వరకు వెళ్లగలిగిన స్థితి ఏర్పడ్డా, మనోమృగం తన కదలికలను ఆపదు.

మనసు దైవీకం
అంతా చూడటంలోనే వున్నది. అనుకోవటంలోనే వున్నది. ఈ రెండూ మనసుతో ముడిపడే వున్నయ్. కాబట్టి మనసుని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంటికి తాళం సరిగా వేయకుండా దొంగలు పడ్డారంటే ఎట్లా? మనసును సరిచేసుకుండా, మనసు స్థితిని తెలుసుకోకుండా, మనసును దైవంగా మార్చుకోకుండా, దైవం కనబడటం లేదనుకోవటం సరైనదేనా? జరగవలసినదంతా లోపల జరగవలసి వుండీ, బయటే వెదుకులాట ఆపకుండా ఆడుతుంటే జరిపిస్తున్నవాడు దొరికేనా? మూలంలో మనసును కలిపి వుంచగలిగితే, మూలం తెలిసి, లీల, లయం, మహిమ, అనుగ్రహం ఒక్కటిగా అనిపిస్తయ్.

దేవీ శక్తులు - దశ మహావిద్యలు : 1

దేవీ శక్తులు - దశ మహావిద్యలు : 1
                                                                                               
 
నేలనతికి బతుకుతున్న, నింగినంత వెతుకుతున్న
నేనెవ్వరు? నేనెవ్వరు?
కాగితాల కూరుకున్న, ఊపిరితో ఊగుతున్న
నేనెవ్వరు? నేనెవ్వరు?
నిద్రనించి తేరుకుని, నిద్రలోకి జారుకునే
నేనెవ్వరు? నేనెవ్వరు?

అని ఎన్నోసార్లు అనిపిస్తుంది . అనుదిన చైతన్య ప్రవాహం వెనుక కాల వ్యోమాతీతమైన విధిని నియంత్రించే శక్తి ఏదో అనిపిస్తుంది. దేన్ని ఆరాధిస్తే అన్నిటిని ఆరాధించినట్టవుతుందో అదే పరబ్రహ్మ శక్తి, దాన్నే అందరు సర్వగత చైతన్యము అన్నారు. జన్మనివ్వడం, సృష్టించడం అనేవి స్త్రీత్వం యొక్క అద్భుత తత్వం కనుక ఆ మూల శక్తి ని 'అమ్మ ' గా సేవించారు. గుణాతీత తత్వాన్ని అమ్మ అన్నా, నాన్న అన్నా లేక మరో పేరుతో పిలిచినా ఒకటే కదా! ఆ సర్వశక్తిని అనేకులు అనేక విధాలుగా ప్రార్ధించారు.

లోకంబులు, లోకేశులు
లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వడు
ఏకాకృతి వెలుగు నతని నే పూజింతున్
(భాగవతము)

యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తయై నమో నమః
(దుర్గా సప్త శతి)

ఎక్కడైనా ఒక చోట ఉండేదాన్ని పట్టుకుంటాం - చేపపిల్లల్ని పట్టినట్టు పట్టి ఎక్వేరియంలో పెంచుకుంటాం. మరి మహా సముద్రంలో దూకి తిమింగలాన్ని పట్టుకుంటామా, పెంచగలమా? అందుకే అందరిలో ఉండే పరబ్రహ్మ శక్తిని ఆకళింపు చేసుకోవడం నిజంగా సులభం కాదు. అన్నిటిని వ్యాపించిన ఆ శక్తి అణుశక్తి లాంటిది. అతి  చిన్నది, అత్యంత తీవ్రమైనది అయినా అతీతమైనది. సరే మన పరిధిలో దీన్ని గణించడానికి ఒకటే కొలమానం పనిచేయకపోవచ్చు. సరే వ్యోమం అంటే దిక్కులని ఆధారంగా తీసుకుంటే పది దిక్కులని పదిశక్తులుగా విభజిస్తే ఆ పదిశక్తులని 'దశ మహా విద్యలు ' అని చెప్పొచ్చు. మంత్ర శాస్త్రంలో పురుష దేవతా మంత్రాలని మంత్రాలని, దేవీ మంత్రాలని విద్యలని అనడం పరిపాటి. ఈ పది దేవీ శక్తులని దశావతారాలతో పోల్చారు కొందరు. కానీ ఇవి దశావతారాలు కావు. The ten great cosmic powers.ఇవి బ్రహ్మ విద్యలుగా గుర్తించి, దేవతా శక్తులుగా పూజించి అనుగ్రహాన్ని పొందారు, శక్తివంతులయ్యారు కొందరు.  వాళ్ళని వీళ్ళని ఏదో చేయాలనే మూర్ఖత్వంతో తన అంతః శత్రువులని జయించక తమ కాలాన్ని, తపః శక్తిని వృధా చేసుకున్నారు కొందరు. విధిని, జీవన గతిని నిర్ధారించే, అన్నిటిని ధరించే ఆ శక్తి మాత్రమే శరణాగతికి అర్హమైనది - ఏ పేరుతో మనం పిలిచినా......

వాటి మంత్ర శక్తి తీవ్రతని బట్టి, వాటి అపరిమిత శక్తిని బట్టి దశ మహా విద్యలుగా పిలవబడే ఈ శక్తులు సిద్ధులచే చాలా రహస్యంగా ఉంచబడ్డాయి. బౌద్ధంలో కూడా ఇవి సుప్రసిద్ధములు. ఈ ఆధునిక యుగంలో వీటిని పూర్వం కన్నా ఎక్కువ మంది ప్రచారం చేయడం, భారత దేశంలోనే కాక ప్రపంచమంతటా సాధన చేయడం జరుగుతోంది . లభించే ఈ జ్ఞానాన్ని మనం కొంత జాగ్రత్తగా గ్రహించడం అవసరం. తత్వం అర్ధం కాకుండా కేవలం మంత్ర జపం వల్ల వీటి అనుగ్రహం కలగక పోవచ్చు. వీటి చిత్రాలు ఇంకా విచిత్రాలుగా ఉంటాయి. చిత్రకారులు తమకి తెలిసిన అర్ధంలో బొమ్మలు గీయడం , భక్తులు వాటిని తొందర తొందరగా పెట్టేసుకోవడం జరుగుతోంది. వీటిని మామూలు చిత్రాలు గా గీయడం సరికాదు. ఈ దశ మహావిద్యలని 'ఎబ్ స్త్రాక్ట్ ' గా నిజమైన దివ్య మనో 'చిత్రాలు ' గా దర్శించడం మంచిది. అందుకే దేవతా యంత్రాలు 'జ్యామెట్రిక్ రిప్రజెంటేషన్ 'గా ఈ దేవతలని అర్ధం చేసుకుందుకు ఉపయోగపడతాయి.

ఇంతకీ దశ మహావిద్యలంటే ఏవి?

1. కాళీ
2. తార
3. త్రిపుర సుందరి
4. ధూమావతి
5. భువనేశ్వరి
6. భైరవి
7. ఛిన్నమస్త
8. మాతంగి
9. బగళాముఖి
10. కమలాత్మిక

అనేక దశాబ్దాల పాటు వీటి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలని, అర్ధాలని, అంతరార్ధాలని తెలుగు వారికి అందించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావుల సమక్షంలో దశ మహా విద్యల సాధన చేసి అందులో ఉన్న శక్తి కేవలం గ్రంథాలుగా కాక నిజంగా చూపించిన వారు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. వారు వ్రాసిన ఉమా సహస్రాన్ని అమ్మ వారికి అంకితం చేసినప్పుడు అన్నారుట, " అమ్మా ! ఈ రచన నీకు నచ్చినట్లయితే నాకు తెలియజెయ్యి. ఏ భాగం నీకు నచ్చక పోతే ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను " అని. అలా ఆయన ఆ మహా గ్రంధాన్ని చదవడం మొదలు పెట్టే సరికి, ఆ అమ్మ వారు కరుణాసముద్రయై ప్రతి పద్యానికో మెరుపు ఆకాశంలో చూపించిదిట. అంతటి దివ్య శక్తిని దర్శనీయంగా చూడడానికి ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశ మహావిద్యలు దేన్ని సూచిస్తాయి అని సందేహం వస్తుంది. వీటి చిత్రాలు, విగ్రహాలు కూడా అన్నీ సౌమ్యం గా ఉండవు. ఉదాహరణకి కాళీ విగ్రహం ఎప్పుడూ ముండ మాలతో, ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది. మరి ఈ కాళికే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెర్రి వాడైన కాళి దాసుకి కవిత్వాన్నిచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది. అమ్మ ఒక సారి కోపంగా ఉంటుంది. ఒక సారి సంతోషంగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తే ఒకటి పీకుతుంది కూడా. అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెరిగిన వారెవ్వరు? ప్రేమ అనేది ఒక అపురూపమైన తత్వం. తిట్టుకున్న, కొట్టుకున్నామ్స ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి.

ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.

కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి .

కాలం మనకి అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే అనంత బయొలాజికల్ క్లాక్ లో నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గం చూపగలడు. అంతరాళం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిని శక్తి. ఇది అర్ధం కావాలంటే శ్రీ కృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగల మనో తరంగ విశ్వసృష్టి స్పందన. దీన్ని తారా దేవి తెలియజేయ గలదు. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపంలో ఆద్యా శక్తులుగా ఉపాసించడమే దశ మహా విద్యల స్వరూపం. అందుకే వీటిలో ఒక మౌలిక భావ సముదాయం ఉపాసనగా ఉంటుంది. సాధారణంగా వీటిని ఉపాసించే వారు వీటి విస్తృత పరిధిని జ్ఞాపకంలో పెట్టుకుని ఉంటారు. పట్టు పంచ కట్టుకుంటేనే పవిత్రత, తలస్నానం చేస్తేనే మనిషి అని కాకుండా (అంటే లేకపోతే కాదని కాదు సుమా) ఇంకొంచెం విభిన్నంగా బ్రహ్మత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది అర్ధం కావాలంటే ఇంకో ఉదాహరణ హిమాలయాల్లో ఉండే యోగులని చూస్తే, వాళ్ళు రోజూ ఏ విధంగా పూజ చేస్తూ ఉండి ఉంటారు? మానస సరోవర ప్రాంతాల్లో ఉండే సాధకులు, శంభలగా టిబెట్లో పిలవబడే, షాంగ్రీలా అని చైనాలో కొలవబడే, శంభల గ్రామం అని భవిష్యపురాణంలో చెప్పబడిన ప్రాంతాలలో యోగులు ఎలా ఉంటారు? అక్కడ 'పవిత్రత ' తాలూకు నిర్వచనం ఏమిటి. వాళ్ళ భోజనపు అలవాట్లేమిటి? వస్త్రధారణ ఏమిటి, అసలు దాని ప్రాశస్త్యం వాళ్ళ దృష్టిలో ఏమిటి? నిజంగా శివపార్వతులు మనకి కనిపిస్తే వాళ్ళు ఏ బట్టల్లో ఉండి ఉంటారు?  ఇలాంటి వేల ప్రశ్నల జవాబులు కలిపితే కానీ బ్రహ్మత్వ స్వరూపం తాలూకు స్వరూపం ఆవగింజంత అర్ధం కాదు.

వేల పర్వతాలంతకన్నా ఎక్కువ వేదాలు. అవి అర్ధం కావేమోనని వాటి సారం ఉపనిషత్తులు. వాటి సారం అనుభవేక సారం కావాలని ఉపాసనలు. ఉపాసనా సిద్ధికి ఉపదేశాలు, మంత్రాలు. అప్పటికి అర్ధం కావేమోనని భజనలు, ప్రార్ధనలు. అవీ రావేమో నని పండగలు, పబ్బాలు. ఇంకెంత చెప్తారు ఋషులు?

దృశ్యం సర్వమనాత్మా స్యాద్ దృగేవాత్మా వివేకినః
ఆత్మా నాత్మా వివేకోయం కధితో గ్రంధ కోఠిభిః
(ఆత్మా నాత్మ వివేకము - శ్రీ ఆది శంకరులు)

ఈ విశ్వంలో మనకి కనిపించే ఈ సమస్త పదార్ధాలూ అనాత్మయే! అంటే ఆత్మ కానివే. వీటిని చూసే వాడు మాత్రమే ఆత్మ. అంటే బ్రహ్మ అని అర్ధం. ఆ బ్రహ్మత్వాన్ని నిరాకార రూపంగా సాధన చేయగల వారు యోగ శాస్త్రాన్ని (పతంజలి) అవలంబించి ఆ దివ్యశక్తిని అనుభవేకవేద్యం కావించుకున్నారు. అలా కాక నిరాకారము సర్వాకార స్వరూపం కనుక, ఆ శక్తి యోగులకి, ద్రష్టలకు దేవతామూర్తిగా - గాయత్రి వంటి బ్రహ్మ స్వరూపిణిగా అగుపించినపుడు ఆమె రూపాన్ని, మంత్ర స్వరూపాన్ని వారు మనకి అందించారు. అందుకే మంత్ర జపం చేసే ముందు కొందరు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. అందులో అర్ధం తమలో ఆ మంత్రాన్ని దాన్న తత్వాన్ని విలీనం చేసుకోవడమే! మంత్రంలో ఒకటిగా, ఆ శక్తిలో ఒకటిగా తమ చేతులలో (కర్మ పరికరములు కరములు కనుక), వేళ్ళలో ఆ శక్తి స్వరూపాలను ఆవాహన చేస్తున్నాము. దాన్ని కరన్యాసము అని అంటున్నాము.

ఓం తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః
భర్గో దేవశ్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః
ధీయోయోన జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః
ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః

దశమహా విద్యల్లో మొదటిది కాళి. కాలమనే మాటలోంచి పుట్టినది కాళి. ఈమె అవతరణని గురించి వేదములలో, దేవి భాగవతంలో, పురాణములలో ఎన్నో కధలున్నాయి. రామకృష్ణ పరమహంస ను అనుగ్రహించినది, వివేకానందుడిని భరత భూమికి ప్రసాదించిన శక్తి ఈమే. సృష్టి ఆరంభంలో మహా విష్ణు నాభి కమలం నుంచి బ్రహ్మ ఉదయించాడుట. విష్ణువు నిద్రావశుడై ఉండగా ఆయన చెవిలోంచి పుట్టిన మధుకైటభ రాక్షసులు బ్రహ్మను బాధించడం మొదలుపెట్టారు. వారినేమీ చేయలేక విష్ణువును లేపడానికి ప్రయత్నించి విఫలుడై మహామాయను, కాల స్వరూపిణి అయిన కాళిని స్తుతించగా ఆమె అవతరించి విష్ణువుని లేపింది రాక్షసులని సమ్హరించడానికి శక్తి నిచ్చింది. ఇంకొక కధలో మహా ప్రళయ కాలాన సమ్హార శక్తియైన కాళి మహా తాండవం చేస్తున్నది. ఆమె పాద ఘాతములకు లోకములు తల్లడిల్లి పోతున్నాయి. పరమశివుడు లోకరక్షణార్ధమై ముందుకు వచ్చి, "దేవీ! నీ పాదఘట్టనకి సమస్త బ్రహ్మాండములు కదలి పోతున్నాయి. అవి ఇంక తట్టుకోజాలవు. ఇక నా దేహం పైనే కాలు మోపు" అన్నాడుట శివుడు. ఆ మాటనంగీకరించి ఆమె శివుడిపై నిలుచుంది. ఈమెను భారత దేశంలోనూ, ప్రపంచమంతటా నేడు ఉపాసిస్తున్నారు. కాళీ సాధన ఒక ప్రత్యేక సాధన. అందరికి అర్ధమయ్యేదీ అతిసులువైనదీ కాదని యోగులు తెలియజేస్తున్నారు. ప్రకృతి సహజ స్వరూపిణియైన ఈమె అనుగ్రహంతో అనేక దేవతా తత్వాలను తెలుసుకోవచ్చును. ఈ మార్గంలో ప్రవేశించే వారు తప్పకుండా నిస్వార్ధపరులైన గురువులను అడిగి ఈ తత్వాన్ని అధ్యాత్మిక రూపంగా అవగాహన చేసుకున్నాకే మొదలుపెట్టడం అవసరం.

కలకత్తాలో దక్షిణ కాళి ఆలయం

"ఇంత శక్తి వంతమైన దేవతను మీరెందుకు పూజిస్తున్నారు ? మీకు కాళిని పూజిస్తే ఏమి కలుగుతుంది? " అని ఒకాయన ఒక యోగిని అడిగారుట. ఇది కలకత్తాలో దక్షిణ కాళి ఆలయంలో జరిగింది. అందుకాయన చెప్పారుట, "మానవులలో విజయం సాధించాడినికున్న మొదటి విఘ్నం వాళ్ళ భయం. చేసే ప్రతి పనిని, విషయాన్ని బూతద్దంలో చూసుకుని ఏమవుతుందో అని భయపడుతూ జీవితాంతం భయానికి బానిసలై అనుక్షణం ఛస్తూ ఉంటారు. అలాంటి భయాన్ని దూరంచేసే నిర్భయ శక్తి ఆ కాళి. ఆమె రూపం అందుకే అలా ఉంటుంది. అంతటి రూపాన్ని రోజూ పూజిస్తూ, నిరంతరం దర్శించే సాధకుడికి ఇంకేమి భయం కలుగుతుంది? దేన్ని చూసినా అంతకన్న తక్కువే! అందుకని సాధకుడిలో జీవితాన్ని ఎదుర్కునే విజయాన్ని సాధించే శక్తి కలుగుతుంది. దుర్గా సప్త శతిలో కూడా చండికా దేవి శక్తి మూడు రూపాలుగా రాక్షస సమ్హారం చేస్తుంది - కాళి, లక్ష్మి, సరస్వతి అంటున్నాము. కాళికా దేవి ఇఛ్చా శక్తి స్వరూపిణి. అంటే విల్ పవర్ పెంచుతుంది. లక్ష్మీ దేవి క్రియా శక్తి స్వరూపిణి. అంటే వర్క్ ఫోర్స్. సరస్వతి దేవి జ్ఞాన శక్తి స్వరూపిణి. అంటే పవర్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. బెంగాలులో శ్రీ రామప్రసాద్ అనే మహా భక్తులు ఉండేవారు. ఆయన గురించి ఎన్నో కధలు ప్రచారంలో ఉన్నాయి. కాళికా దేవి వీరింట్లో చిన్న బాలికగా తిరుగుతుండేదిట. ఆయన నులక మంచం అల్లుతుంటే రెండో వైపు ఆయన కూతురులాగా కూర్చొని తానూ నులక ఆయనకి అందిస్తుండేదిట. ఇది చూసినవారెంత అదృష్టవంతులో! ఏ తల్లి సృష్టి తంత్రులను కాలంతో మెలిపెట్టి అల్లుతోందో - ఆమె నులక మంచం అల్లడం.. " అని నవ్వారాయన.

"మీరు కాళీ సాధన ఎలా చేసారు? ఎలా మొదలు పెట్టారు? " అని అడిగారు ఆ సాధకులు. దానికా యోగి ఇలా సమాధానమిచ్చారు.

"ప్రపంచం లో ఆనందానికి మూలం - ప్రేమ. అదిలోపించినపుడు కలిగేది బాధ. మనుషుల కర్మలు, సాధన, సంపాదన అన్నీ ప్రేమ కోసమే కదా! ఎవరికి వారు వారు ప్రేమించిన వాళ్ళకోసం సంపాదించి, ఆహార వసతులు ఆనందాలు ఏర్పాటుచేస్తారు. అందుకు ఒక్కోసారు ఇంకోళ్ళను బాధపెడుతుంటారు. ఈ మహా చక్రం చిత్రమైనది. సరే నా విషయానికి వస్తే నాకు చాలా ఏళ్ళ కిందట ఎన్నో సమస్యలుండేవి. రోజూ ఆ బాధలు పడలేక పోయేవాడిని. ఎవరు లేనప్పుడు కన్నీళ్ళు కూడా వస్తుండేవి. ఎవరికి చెప్పాలో కూడా తెలిసేది కాదు. అప్పుడు నాకు ఒక గురువు పరిచయమయ్యారు. ఆయన కాళీ మంత్రం ఉపదేశించారు. ఏమండి మరి కాళి ని ఉపాసించాలంటే ఏం చెయ్యాలి ఎక్కడకి వెళ్ళాలి? అని అడిగాను. అందుకాయన చెప్పారు ఎక్కడో ఒక చోటే కూచుని ఉంటే ఆమె సర్వశక్తియైన కాళి ఎలా అవుతుంది? నువ్వెక్కడుంటే కాళి అక్కడే ఉంటుంది. నీతోనే ఉంది అని గుర్తించడం ఉపాసన. 'ఉపాసన ' అంటే 'ఉప ' (దగ్గరగా) , 'ఆసన ' (కూచోడం, ఉండడం). ఆ దేవత దగ్గరఏ ఉండడం ఆమె ఉపాసన అన్నమాట. కాళి అనే ఆ మహా ఇఛ్చాశక్తి మనతోనే ఉండడం 'ఉపాసన ', మనలోనే ఉండడం 'సిద్ధి '. మనం ఆమె స్థితి (మండలం) కి చేరడం 'సాక్షాత్కారం '. ఇది అర్ధమైన నేను కాళీ సాధన మొదలు పెట్టాను. నాలో అనవసరమైన విచారం, అ

"స్వామీ ! ఏమిటి మిమ్మల్ని భూతం పట్టిందా ? అది వదిలి పోయిందా ...అది ఏం భూతం ? నిజంగా దెయ్యాలూ, భూతాలు పడతాయా?! " అని ఆశ్చర్యం గా అడిగాడు ఆ సాధకుడు.

దానికా యోగి పక పకా నవ్వి, ఆత్మీయంగా చూసి చెప్పారు, "భూతం అంటే మరేమీ కాదు, భూతమైనది - భూత కాలానికి చెందింది. అంటే గతం అన్నమాట. మనం చాలా సార్లు భూతకాలంలో జరిగిందాన్ని ఒకటే తల్చుకుని బాధపడుతుంటాం. ఒక పట్టాన ఒదలలేక విచారిస్తూ ఆ తలంలో బుర్ర ఉండి పోయి అమూల్యమైన ప్రస్తుతాన్ని, అతి విలువైన భవిష్యత్ ని పాడు చేసుకుంటాం. అదే 'భూతం ' పట్టడం అన్నమాట. అందరికి ఇది ఎప్పుడో అప్పుడు తారసపడుతుంది. దాన్ని నేను కూడా కాళీ శక్తితో (భూతాన్ని ఖాళీ చేయించి) జయించి, జీవితరంగంలో పోరాడి అంతరంగాన్ని, ప్రపంచాన్ని గెలిచాను. డబ్బు, పేరు అన్నీ తీవ్రం గా సంపాదించాను. నేను ఆనందంగా ఉండడం మొదలు పెట్టాక అన్నీ వస్తున్నాయని గ్రహించాను."

"స్వామీ! చూస్తుంటే ఇది మీ మనోశక్తికి సంబంధిన విజయంలా ఉంది. ఇందులో ఉపాసన, మంత్ర బలం పని చేసాయంటారా? " అని అడిగాడు సాధకుడు.

"ఖచ్చితం గా గ్రహించావు. నీలో శక్తిని ముందు నువ్వు నిద్ర లేపు. భయంలేకుండా సంకల్ప బలం తో నువ్వు చాలా చెయ్యగలవు. ఆపైన కావాల్సిన అవకాశాలని, అదృష్టాన్ని అమ్మ ఇస్తుంది. అన్నీ వచ్చాక నాకూ అనుమానం వచ్చింది. ఇదంతా నా ప్రతిభేనేమోనని. అసలు అమ్మవారు ఎక్కడ ఉంది అని. హిమాలయాలనించి కేరళ దాకా గురువులను చూసాను. వారితో సన్నిహితంగా తిరిగాను.కోట్లలో జపాలు, హోమాలు చేసాను. అపుడు అర్ధమైంది విషయం ఏమిటో..ఆ మూల పరబ్రహ్మత్వం తత్వమేమిటో..." అన్నారు ఆ యోగి.

"స్వామీ! మీరు కొంచెం ఒక చిన్న విషయం చెప్పాలి. స్వశక్తితో మీరు చాలా కష్టపడి ఏవో సాధించారు బాగుంది. ఉపాసన చేసారు బాగుంది. మరి ఇదంతా చేసింది ఆ తల్లి కదా, అది నిర్ధారణ చేసుకున్నారా, ఆమెను గురించి తెలుసుకున్నారా?" అని అడిగాడు సాధకుడు.

ఆ యోగి చిరునవ్వు నవ్వి, "ఇంకా తెలుసుకుంటున్నాను. ఎన్నో తెలుసనుకుంటున్న వారు కూడా ఇంక తెలుసుకుంటున్నారని తెలుసుకున్నాను" అని కళ్ళు మూసుకుని దేవిని ప్రార్ధించారు దేవి సప్త శ్లోకితో ఇలా..

దేవీత్వం భక్తి సులభే సర్వకార్య విధాయని
కలౌహి కార్య సిధ్ధ్యర్ధముపాయం బ్రూహి యత్నతఃఅ ...

అంతలో గాలిలోంచి ఒక తులసి మాల వచ్చి ఆ యోగి వళ్ళో పడింది. యోగి కళ్ళు తెరిచి చూసారు. నవ్వి, అలా చిత్రంగా గాలిలోంచి పడ్డ ఆ మాలని "కాళీ ప్రసాదం , సాధన చేసుకో !" అని ఆ సాధకుడికి ఇచ్చి లేచి వెళ్ళిపోయారు. సాధకుడు చాలా సేపటి దాకా తేరుకో లేదు. ఆ మాల ఎక్కడిది అని ఇప్పటికి అలోచిస్తూనే ఉన్నాడు. ఆ చుట్టు పక్కల జన సందోహంలో ఎవరైనా విసిరేసారేమో అని 'లాజికల్' గా కూడా అలోచించాడు. ఆ కాళి కే తెలియాలి ఏది ఎక్కడినుండి వస్తుందో మళ్ళీ ఎక్కడికి వెడుతుందో!

సాధనా పరిక్రమ - 1

సాధనా పరిక్రమ - 1

 హంస జయము - అతీంద్రియ అనుభవములు - అనుభూతులు :

 హంస అనగా ప్రాణము. ప్రాణము లపై సంయమము పొందుట, హంస జయసాధన. హంస జయ సిద్ధి ప్రాప్తించినచో ..... శ్వాస, ప్రశ్వాసలు లేకుండా..... ఎంత సమయం అయినా ఉండవచ్చు. శవాసన సాధన తొందరగా ప్రాప్తించుటకై హంస జయము ఆవశ్యకము.

      దీర్ఘ ప్రాణాయామం ద్వారా హంస జయము సాధ్యమగును.  కేవల కుంభకము - హంస జయము... వీటిలో అంతరం ఉన్నది. కేవల కుంభక అవస్థ ద్వారా, సాధకుడు సమాధి అవస్థలోకి పోవచ్చును. కానీ హంస జయ అవస్థ ద్వారా సాధకుడు, సమాధి అవస్థలోకి వచ్చునా?  అయినచో అక్కడ స్థిరముగా ఉండునా అన్నది చెప్పలేము. హంస జయ అవస్థ శరీర నియంత్రణకు చెందిన ఉచ్ఛ అవస్థ. ఈ అవస్థ శరీరమునకు సంబంధించినదే. కేవల కుంభకావస్థ శరీర భావమునకు అతీతమైనది.

    ప్రాణ జయ సాధన చేయగలిగిన సాధకునకు, హంస జయ సాధన  సాధ్యమగును. హంస జయము ఒక విధమైన కేవల కుంభకావస్థ, అయిననూ.....కేవల కుంభకావస్థ యందు అధిక సమయం ఉండుట వలన సమాధి అవస్థ ప్రాప్తించును. దేహ భావ రహితావస్థ... కేవల అవస్థయే. ఇది ఆత్మ సాక్షాత్కారము నిచ్చెడి అవస్థ.

      హంస జయము హఠయోగము నందలి ఒక ఉచ్ఛ అవస్థ. ప్రాణాయామ అభ్యాసం లేకుండా హంస జయము ప్రాప్తించదు. కానీ కేవలం కుంభకా వస్థ, ప్రత్యేకమైన సాధన లేకుండగానే తీవ్రమైన విచారణ ద్వారా కూడా ప్రాప్తించును. హంస జయ అవస్థలో కేవలము శ్వాస ప్రశ్వాసలు స్తంభించును.

      కానీ కేవల అవస్థలో..... శ్వాస ప్రశ్వాసలు, రక్త సంచారము, కోసికల ఉత్పత్తి ..... ఇత్యాది శరీర క్రియలన్నీ ఆగిపోవును. హంస జయ అవస్థలో మనస్సు, బుద్ధి క్రియాత్మకంగా ఉండును. కానీ కేవల అవస్థలో మనోబుద్ధులు శాంత మగును.

      ఈ అవస్థ శరీరమునకు అతీతమైన ఉచ్చ జ్ఞానావస్థ.

 శవాసన సాధనలో .....హంస జయము ఆవశ్యకము. అయితే శవాసన సాధన కేవల కుంభకావస్థ కంటే నిమ్నమైనది. కేవల కుంభక అవస్థ ద్వారా .....సాధకునకు గహనమైన ధ్యానము ద్వారా..... "సమాధి" అవస్థ ప్రాప్తించును.

     కేవల కుంభకం అవస్థ అనేది ఒక అవస్థయే గాని శూన్యావస్థ కాదు.నిర్వికల్ప అవస్థ కంటే అతీతమైనది "శూన్యావస్థ". ఇది ఒక అవస్థా రహిత అవస్థ.

అష్టావక్రగీత 5వ అధ్యాయం

అష్టావక్రగీత   5వ అధ్యాయం

అష్టావక్ర ఉవాచ

5.1
న తే సంగోఽస్తి కేనాప్ప కిం శుద్ధస్త్యక్తుమిచ్ఛసి|
సంఘాతవిలయం కుర్వన్ ఏవమేవ లయం వ్రజ||

 నీకు దేనితోను సంగము లేదు. శుద్దుడవు  అయిన నీవు దేనిని వదలకోరుదువు? దేహము, మనసు, వాసనల కూటమిని నశింపచేయుచు లయమును పొందుము మనస్సును అపి వేయుము

 5.2
 ఉదేతి భవతో విశ్వం వారిదేరిన బుద్బుదః|
ఇతి జ్ఞాత్వైకమాత్మానం ఏవమేవ లయం వ్రజ||



 సముద్రమునుండి బుడగలవలె నీనుండియే విశ్వము ఉదయించుచున్నది. ఈ విధముగా
– ఒక్కటిగాఉండు ఆత్మను తెలిసి, ఆ విధముగనే లయమును పొందుము మనసును
ఆపివేయుము.

5.3
ప్రత్యక్ష మప్యవాస్తుత్వాత్ విశ్వం నాస్త్యమలే త్వయి|
రజ్జుసర్ప ఇవ వ్యక్తం ఏవమేవ లయం వ్రజ||



 విశ్వము ఇంద్రియములకు ఎదురుగా అగుపించుచున్నాను, యదార్థమైన వస్తువు
కానందువలన - లేనీదే. నిర్మలమైన నీయందు  (విశ్వము) త్రాడునందు పామువలె
తోచుచున్నది. ఆ విధముగనే అట్లు తెలిసి లయమును పొందుము మనసును
ఆపివేయుము

5.4
సమదుఃఖసుఖః పూర్ణ ఆశానైరాశ్యయోః సమః|
సమజీవితమృత్యుస్సన్ ఏవమేవ లయం వ్రజ||


సుఖ-దుఃఖములయందు సముడవై కొరత లేనివాడవై ఆశ -నిరాశలయందు సముడవై బ్రతుకు-చావులయందు సముడవై - ఆ విధముగనే అట్లు తెలిసి, లయమును పొందుము
మనసును ఆపివేయుము

                 5వ అద్యయము సమప్తం

మనసు సత్వంతో ఉండటమే... సామాన్య జీవనం !  సత్యానికి సోపానం !!

సామాన్యమైన జీవనంలోనే జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. సామాన్యంగా అంటే అది అదేదో ప్రత్యేక పరిస్థితని, మన భౌతిక పరిస్థితులు అలా మార్చుకోవాలని కాదు. ఉన్న స్థితిని, ఏర్పడిన పరిస్థితిని అర్ధం చేసుకుంటూ వివేకంతో మనసును  సత్వగుణంలో ఉంచటమే సామాన్య జీవనం. అదే సత్యానికి సోపానం. ఆశ ఎంతపెద్దదైనా దానికి శాశ్వతత్వం లేదు. శాశ్వతమైనదాన్ని తెలుసుకోవడానికి ఆశతో పనిలేదు. ఇది అర్ధం చేసుకుంటే మనసు సత్వంతో సామాన్యంగా ఉంటుంది. మనసులో ఆశ, కోరిక, ఇచ్ఛ, ఆకాంక్షలు ఏవీ లేకుండా ఉన్నప్పుడు వ్యక్తమయ్యే జ్ఞానమే శాశ్వతంగా నిలిచి ఉండేది !

(నిర్వేదాష్టకాము మరియూ ఉపశమాష్టకము అను 9, 10 ప్రకరణలు సమాప్తము).

సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 16

Image result for madam blavatsky
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 16 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃. అనన్యయోగము 🍃

80. దృఢమైన యోగ సాధనను అనన్య యోగము అందురు. ఒక వ్రతము మాదిరిగా నిత్యము నిరంతరం ఆటంకము లేకుండా పురుష ప్రయత్నంతో చేయు సాధననే అనన్య యోగం అంటారు.

81. అనేకమైన అంతులేని ఆపదలు, అష్టకష్టములు, విఘ్నములు ఏర్పడినను యోగులు తమ సాధన యందు ఏ మాత్రము చలించక నిరంతర అభ్యాసము చేయుచుందురు. దానినే అనన్యయోగమందురు.

82. కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన యోగములలో అనన్య యోగమును ఏదో ఒక దాని యందు జోడించిన, ఆ యోగమునకు అనంత శక్తి చేకూరి త్వరిత ఫలితము లభించును. అనన్య యోగము ఒక ప్రత్యేకమైన యోగపద్ధతి కాదు.

83. ఏదో కొంత కాలము కొన్ని రోజుల సాధన కాకుండా నిరంతరము ఆత్మ యందు చిత్తమును, మనస్సును లగ్నం చేయుట వలన క్రమముగా అనన్య యోగము సిద్ధించును.

84. ఇతర ప్రాపంచిక పదార్థములపై ఆసక్తి చూపక నిరంతరము పరమాత్మ యందే ధ్యాస కలిగి సాధన చేయుటయె అనన్య యోగము.
🌹 🌹 🌹 🌹 🌹

అష్టావక్రగీత అధ్యాయము 6

**అష్టావక్రగీత  అధ్యాయము 6*
    
జనక ఉవాచ
6.1
*ఆకాశవదనంతోఽహం ఘటవత్ ప్రాకృతం జగత్*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
నేను ఆకాశమువలె అనంతము. జగత్తు కుండవలె ప్రకృతికి సంబందించినది – అని
జ్ఞానము. కనుక, దానిని జగత్తును వదులుట లేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు
లేదు.
6.2
*మహోదదివాహం స ప్రపంచో వీచ్చసన్నిభః*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
నేను మహాసముద్రమువలెను, ప్రపంచము అలవలెను ఉన్నవి - అని జ్ఞానము. కనుక,
దానిని జగత్తును వదులుటలేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు లేదు.
6.3
*అహం స శుక్తిసంకాశో రూప్యవద్విశ్వకల్పనా*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
నేను ఆలుచిప్పవలెను, విశ్వము అనునది కల్పింపబడి-తోచిన వెండివలెను ఉన్నవి - అని
జ్ఞానము. కనుక, దానిని జగత్తును వదులుట లేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు
లేదు.
6.4
*అహం వా సర్వభూతేషు సర్వభూతాన్యథో మయి*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
సర్వభూతములయందు నేను, నాయందు సర్వభూతములు ఉన్నవి - అని జ్ఞానము.
కనుక, దానిని జగత్తును వదులుట లేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు లేదు.  
             6వ అద్యయము సమాప్తం
_*మనసు సత్వంతో ఉండటమే... సామాన్య జీవనం !  సత్యానికి సోపానం !!*_
_*సామాన్యమైన జీవనంలోనే జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. సామాన్యంగా అంటే అది అదేదో ప్రత్యేక పరిస్థితని, మన భౌతిక పరిస్థితులు అలా మార్చుకోవాలని కాదు. ఉన్న స్థితిని, ఏర్పడిన పరిస్థితిని అర్ధం చేసుకుంటూ వివేకంతో మనసును  సత్వగుణంలో ఉంచటమే సామాన్య జీవనం. అదే సత్యానికి సోపానం. ఆశ ఎంతపెద్దదైనా దానికి శాశ్వతత్వం లేదు. శాశ్వతమైనదాన్ని తెలుసుకోవడానికి ఆశతో పనిలేదు. ఇది అర్ధం చేసుకుంటే మనసు సత్వంతో సామాన్యంగా ఉంటుంది. మనసులో ఆశ, కోరిక, ఇచ్ఛ, ఆకాంక్షలు ఏవీ లేకుండా ఉన్నప్పుడు వ్యక్తమయ్యే జ్ఞానమే శాశ్వతంగా నిలిచి ఉండేది !*_
_*(నిర్వేదాష్టకాము మరియూ ఉపశమాష్టకము అను 9, 10 ప్రకరణలు సమాప్తము).*_ 6*

🌹 సాధన కష్టమైన కార్యము కాదు 🌹

🌹 సాధన కష్టమైన కార్యము కాదు 🌹

సాధన విషయంలో ఆధ్యాత్మిక సాధకులకు అనేక విషయాలు తెలిసి ఉండినా, 'సాధన కష్టమైన కార్యము కాదు' అనే ముఖ్య విషయము మాత్రము చాలా మందికి తెలియదు. ఇక్కడే సాధకులు తెలియకుండానే బండ బరువును సాధనలో మోస్తూ ఉంటారు. ఇష్టమైన వ్యక్తిని మనం ప్రేమిస్తూ ఉన్నాము. ఇష్టమైన వారిని గూర్చి ఎవరైనా చెబుతూ ఉంటే శ్రద్ధగా వింటున్నాం. లేదా, మనమే ప్రేమతో పలుకుతున్నాం. ఇష్టమైన కార్యాలను శ్రద్ధతో, ఉత్సాహంతో చేస్తున్నాం. ఈ విషయాల్లో ఎక్కడా కూడా కష్టం తెలిసిరావటం లేదు. 

ఉదయించే సూర్యుని అందాన్ని చూస్తున్నాం. సముద్రంలో లేచిపడే అలలను చూస్తున్నాం. ఎత్తైన ఆలయగోపురాన్ని చూస్తున్నాం, పచ్చని పొలాలను, పర్వత శ్రేణులను చూచి ఆనందిస్తున్నాం. ఈ కార్యాలలో కష్టం ఉందా? లేదు. అయితే పరమాత్మ కొరకు మనం ఆచరించే సాధనలలో కూడా లేనట్లే. పువు్వలోని అందాన్ని చూడటానికైనా నేను కొద్దిగా ప్రయత్నించాలేమో గాని పరమాత్మను దర్శించటానికి ఆ మాత్రం ప్రయత్నం కూడా అవసరం లేదు. పరమాత్మ ఎవరో కాదు. మన స్వరూపమే. ప్రాణానికి ప్రాణమైనవాడు. మనసుకు మనసైనవాడు. మనసు వెనుక మహిమ తానై శోభించువాడు.

తూర్పున సూర్యోదయం జరుగుతూ ఉంటుంది. అభిముఖంగా బాటసారి నడుస్తూ ఉంటాడు. అతడు నడుస్తూనే ఉంటాడు. పుణ్యకాలం కాస్త కారిపోతుంది. ఏదో ఆలోచిస్తూ ముందుకుపోతూ ఉంటాడే గాని అందమైన సూర్యోదయాన్ని వీక్షించడు. కళ్లముందే కాంతులు దివ్యంగా పరచియున్నా, దర్శించి ఆనందించే భాగ్యానికి నోచుకోడు. ఉన్నది ఏదైనా తెలియకుండా ఉన్నంత వరకు ఆ ఉన్నది ఉండినా ప్రయోజనం ఉండదు. ''ఉన్నది-తెలియకుండా ఉన్నది.

అన్నీ జీవితంలో ఇలాగే ఉన్నాయి.  కష్టాలు లేనివారు ఎవరు ఈ ప్రపంచంలో? అలా ఉన్నట్లు తెలిసినవారు ఎందరున్నారు? కష్టాలు పడటం వేరు. వాటి పూర్వా పరాలను అర్థంచేసుకోవటం వేరు. ''ఎన్ని కష్టాలొచ్చినా అతడికి కనువిప్పు కలుగలేదు. బాధలు చుట్టుముట్టినా అతడి మనసు భగవంతుని వైపు మరలటం లేదు అని చాలా మంది అంటూ ఉండటం మీరు వింటూనే ఉంటారు.

బాధలున్న వారు బాధల నుండి విడిపడేందుకు అన్యులను ఆశ్రయిస్తారు కాని భగవంతుని వైపు ఎందుకు తిరుగుతారు? ఆకాశాన్ని మేఘాలు క్రమ్మినట్లు మనిషిని కష్టాలు చుట్టేస్తే, దిక్కుతోచక మనిషి దుఃఖించగలడేమో గాని ప్రార్థించగలడా? బోరున విలపించగలడేమో గాని తన హృదయావేదనను పరమాత్మకు వినిపించగలడా?

బాధలున్నంత మాత్రాన భగవంతుడు తెలిసిరాడు. బాధలను గుర్తించాలి. అర్థం చేసుకోవాలి. మన ప్రయత్నంతో గాని, ఇతరుల సహకారంతో గాని బ్రతుకులో బాధలు దూరం కావు అనే గొప్ప సత్యాన్ని బుద్ధి దర్శించగలగాలి. అంతేకాదు. జీవితంలో ఎదురయ్యే ఉపద్రవముల న్నిటినీ తొలగించి, అనంతానందమును ప్రసాదించే శక్తి పరమాత్మకే ఉంది అనే సత్య విషయం అర్థం కావాలి. అప్పుడే మనసు భగవంతుని వైపు తిరుగు తుంది. అంతవరకు కష్టాలు ఉంటాయి. కాని అర్థం కాకుండా ఉంటాయి. 

అర్థమైతే, సాధన కష్టం కాదు. ప్రేమకార్యాలలో కష్టాలుండవు. మనం ప్రేమించేవారికి, వారిపై మనకున్న ప్రేమకి పెద్ద తేడా లేదు. సాధ్యరూపుడైన పరమాత్మకు, పరమాత్మకు సంబంధించిన సాధనకు మధ్య కూడా పెద్ద తేడా లేదు. అది గ్రహించిన మరుక్షణం నుండి సాధన గాలిలాగ తేలిపోతూ ఉంటుంది. తేలికగా ఉంటుంది. ప్రతిక్షణం మనస్సులో పరమాత్మే తేలుతూ ఉంటాడు. ప్రపంచం మునుగుతూ ఉంటుంది. ''భావగ్రాహి జనార్దనః. మన భావాన్ని గ్రహించేవాడు భగవంతుడు. కాదు కాదు. మనభావాన్ని భగవంతుడే గ్రహించగలడు. తనకంటూ పరమాత్మకు భావాలు లేవు. కనుక నీ భావాలను అర్థం చేసుకుంటాడు.

ఇతరుల పరిస్థితి వేరు. వాళ్లు తమ భావాలను జోడించి మనల్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తారు. అందు చేతనే ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికి అర్థం కాకుండా మిగిలిపోతారు. పరమాత్మ నీ భావాల్ని గ్రహిస్తాడు. నీ మొరవింటాడు. నీ మాటల్ని ప్రేమతో ఆలకిస్తాడు. ఎలా పిలిచినా పలుకుతాడు. పరమాత్మ మెచ్చుకొనేటంతటి గొప్ప భాష మన వద్ద లేదు. మనం భావస్ఫూర్తితో ఏది పలికినా, అది పరమాత్మకు ప్రియంగా ఉంటుంది. నీ పలుకుల్లో వ్యాకరణ దోషాలున్నాయని పరమాత్మ నీకు దూరంగా పోడు. మనలోకి వ్యాకరణ వైభవాన్ని చూచి మనల్ని గుర్తించటానికి పరమాత్మ మేష్టారు కాదు. పరమాత్మకు కావలిసింది భాషావేత్తలు కారు. భక్తులు.  భక్తులలో భాషా వైభవం తొంగి చూడవచ్చు. భాష ఉన్నవారందరూ భక్తులు కాలేరు. మనం భక్తులం కావాలి. ఏం చేయాలి? భక్తి చేయాలి. ఇంకేం చేస్తాం? మరేదో చేస్తే మరొకర మవుతామేమోగాని భక్తులం ఎలా అవుతాము?

ఒక నిర్జన ప్రదేశంలో నడచి వెళ్తున్నాము. మార్గ మధ్యంలో ఒక చెట్టు క్రింద కూర్చుని కళ్లు మూసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. అప్పుడు మనమెక్కడున్నాం? చెట్టుక్రింద లేము. ఆలయంలో ఉన్నాం. పరమాత్మ మన మనస్సులో కదలిన క్షణాన మన దేహం దేవాలయం అవుతుంది. 'దేహో దేవాలయః ప్రోక్తః. దేహము దేవాలయంగానే ఉంది. కాని, తెలియ కుండా ఉంది. భక్తి చేయగానే తెలియనది తెలుస్తుంది.

దేహమున్నంత మాత్రాన అది దేవాలయం కాలేదు. భావన చేరితేనే, భక్తి భావన చేరితేనే దేహం ఆలయంగా శోభిస్తుంది.

పువు్వ అందంగా అగుపిస్తుంది. భావనతో దానిని పరమాత్మకు నివేదిస్తే అది ఆరాధనగా మారుతుంది. ''వేద్యం తెలిసి వస్తే, ఏది ఇచ్చినా 'నైవేద్యం అవుతుంది. ఫలపుష్పాలే కావు, పత్ర తోయాదులు కూడా నైవేద్యాలు. అవి కూడా చేతికి అందకపోతే, ఉన్న చేతుల్ని ఏకం చేసి 'నమః అనటమే. అది కూడా సమర్పణమే.     
🌹🌹🌹🌹🌹
🙏 ప్రసాద్