సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 35


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 35 🌹
35 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 వసనలు 2 🍃

245. (మనిషి) జీవుడు జనన మరణములందు శరీరములు మారి పోయినప్పటికి, తన యొక్క వాసనలు మాత్రము అలానే ఉంటాయి. దానిని కారణ శరీరము అంటారు. వాటిని ఈ జన్మలోనే సత్కర్మల ద్వారా క్షయింప చేసుకోవాలి.

246. వాసనలు సత్కర్మల ద్వారా పూర్తిగా క్షయించినప్పుడు అతనికి పునఃజన్మ ఉండదు.

247. మానవులకు భార్య, పుత్ర, ధన, ధాన్యాదులందు, విషయములందు, ప్రాపంచిక వస్తువులందు ఆశ ఉన్నచో అవే మరు జన్మకు బీజములుగా ఉండి జనన మరణములకు కారణమగుచున్నవి.

248. మాయా ప్రభావము వలన జీవుడు అజ్ఞానముచే మాయను తెలుసుకోలేక మరణ కాలములో కూడా ఆ వాసనలు మరువకుండుటచే అవి అతని పునర్జన్మలకు కారణమగుచున్నవి.

249. ఎవరు వాసనలు అను త్రాళ్ళచే బంధింపబడి ఉన్నారో, వారందరు ఆశాపాశమున తగుల్కొని వాటికి వశులై ఉన్నారో అట్టి వారు తాళ్ళచే బంధింపబడిన పశువులవలె లోకములోనికి ఈడ్వబడతారు. వాసనారాహిత్యమే అమనస్కము.

250. వాసనలు లేని సాధకుని లక్షణములు: ఆశరాహిత్యము, నిర్భయము, సమత్వము, జ్ఞానము, నిష్కామత్వము, నైష్కర్మ్యము, సౌమ్యత, నిర్వికల్పము, ధీరత్వము, మైత్రి, సంతోషము, మృదుత్వము, మృదుభాషణము మొదలగున్నవి.

251. వాసనల ఫలితము: మహాదుఃఖము, రాగద్వేషములు, సంసార బంధనములు, దృశ్యపదార్థముల సంగమము, మోహము మొదలగునవి.

252. వాసనా రాహిత్య ఫలితములు: వాసనా రాహిత్యము శ్రేష్ఠమైన యోగ లక్షణము. శాంత స్థితి. మోక్షపదమును పొందును. మనస్సు సంకల్ప రహితమగును. అమనస్క స్థితిలో మనస్సు ఆత్మయందు లయమగును. అతడు కర్మలు చేసినను, చేయకున్నను సచ్చిదానంద స్థితిలో ఉండును. ముక్తుడగును.

253. వాసనా క్షయమునకు యోగ సాధన: ఎట్టి వారికైనను వాసనలు జయించుట చాలా కష్టము. అయినను వాసననలు జయించిన యోగులు కలరు. అందుకు మార్గము చిరకాలము యోగసాధన. లేనిచో సంసార వాసనలు, పూర్వ వాసనలు నశించవు. మిగిలిన సంస్కారములు మరుజన్మకు కారణమగును. వాసనలు ఆత్మతో ఏకము చేసిన, మనో నాశము, వాసన క్షయము కల్గి ఫలితములు లభించును. వాసనా బీజము నశించునంతవరకు అభ్యాసం చేయవలెను. బియ్యపు గింజపై పొట్టు, రాగి పాత్రపై చిలుమును ప్రయత్నపూర్వకముగా తొలగించునట్లు, హృదయ మందలి అజ్ఞానవాసనను తొలగించవలెను. అందుకు ప్రాప్తించిన, ప్రాప్తించని భోగములను త్యజించవలెను. చీడ పురుగులవలె నున్న వాసనలను వృద్ధికానివ్వక, నిరంతర అభ్యాసంతో వాసనలను నశింపచేయవలెను. వేరు మార్గము లేదు.

నిజానికి వాసనా క్షయమనగా ద్వైత భావన నశించుట, అద్వైత భావన నిలుచుట, సంసారము స్వప్న తుల్యమగుట. ఇట్టి లయ యోగమే ప్రధానము.
🌹 🌹 🌹 🌹 🌹

12.Apr.2019