సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 23

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 23 🌹 
23 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మనస్సు దాని వికారములు - 2 🍃 

130. కర్మ యను వృక్షమునకు మనస్సే బీజము. శ్వాసను నిలిపిన తలంపులు పుట్టవు. విషయములు, తలంపులు, సంకల్పములు, దృశ్యములు, శబ్దములు, భోగములు ఇవన్నీయూ ప్రారంభమున ఆనందముగా సుందరముగా తోచినను చివరకు భయంకరమైన తామరవలె దుఃఖమును కలుగుజేయును.

131. దుష్ట సంకల్పములచే మనస్సు అల్పత్వమును పొందినది. ఈ సంకల్పములు మనిషికి మనిషికి మధ్య భిన్నముగా నుండును.

132. చిత్తము నుండి మనస్సు ఏర్పడుతుంది. ''నేను''కు మనస్సుకు సూక్ష్మ భేదము ఉన్నది. మనస్సు ఇంద్రియములు, బుద్ధి, పంచప్రాణములు, శరీరము ఇవన్నీ సూక్ష్మ భూతముల వల్ల ఏర్పడినవి. ఇవి జడము.

133. శరీరము ఒక రథము గాను. మనస్సు పగ్గాలు, బుద్ధి సారధి, ఇంద్రియాలు అశ్వాలు, విషయాలు మార్గాలు, ఆత్మ రధికుడుగా సూక్ష్మ భూతముల కలయిక వల్ల ఏర్పడినవి. ఇందులో ఆత్మ ఒక్కటే చైతన్యము మిగిలినవి ఆత్మ వలన చైతన్యవంతమైనవి.

134. మనస్సును శుద్ధ, అశుద్ధ అను రెండు విధములుగా వర్ణించవచ్చు. శుద్ధ మనస్సుకు ఆశలుండవు, దేని యందు ఇచ్ఛవుండదు, కోర్కెలు లేనిది, ఆత్మ యందు ఐక్యమై ఉండును. అశుద్ధ మనస్సు బంధములు, ఆశలు, కోరికలు కల్గి ఉండును. శుద్ధ మనస్సుతో అశుద్ధ మనస్సును శుద్ధి చేయవచ్చును దానినే సాధన అందురు.

135. ఏ ఇతర ఆలోచనలు లేని మనస్సును అనన్య మనస్సందురు. పరమాత్మను అనన్య మనస్సుతోనే ప్రార్థించవలెను.

136. పురుష ప్రయత్నము, నిరంతర సాధన, భక్తి శ్రద్ధలు కల్గి, గురువు బోధతో సూక్ష్మ విషయములు గ్రహించి, అనన్య చిత్తముతో పరమాత్మను సేవించవలెను.

137. నీరు కలపని పాలవలె స్వచ్ఛమై మనస్సుతో సర్వకాల సర్వావస్థలయందు పరమాత్మ స్మరణతో వున్న, అట్టి వారిని అనన్య మనస్కులందురు.

138. మనస్సు యొక్క గుణములు, లక్షణములు, వేగము, విహారము, చంచలత్వము, లోకవ్యవహారములందు ఆసక్తి, అబద్ధము, ఈర్ష్య, కోపము, అజ్ఞానము, విచక్షణా జ్ఞానము లేకపోవుట, భ్రాంతి, చింతన, ఆలోచన, భోగప్రాప్తి, వార్థక్య, మరణముల భ్రాంతి కలిగినది. దుర్వాసనలతో కూడి, సంసార సాగరమను వృక్షమునకు మూలకారణము మనస్సు. జనన మరణముల హేతువైనది మనస్సు. మనస్సు ఎప్పుడు విషయాలను ద్వంద్వాలుగా విభజించి చూస్తుంది. మనస్సు పూర్వ జ్ఞాన జ్ఞాపకాలమీద ఆధారపడి ఉంటుంది. తెలిసినదాని నుండి తెలిసిన దానికి కదులుతూ ఉంటుంది. తెలియని ఆత్మాను భవమును గుర్తించదు. అందువలన యోగము అవసరము.

139. మనస్సు సత్వ,రజో, తమో గుణములు కలిగి ఉన్నది. తమస్సు వలన అజ్ఞానము, రజోగుణము వలన కోరికలు క్రోధము. సత్వ గుణము వలన పవిత్రత ప్రశాంతత కలిగి యుండును. మనస్సు లేని యెడల మనలో మిగిలి వున్నది ఆత్మయె. ఆత్మయే సర్వకాల సర్వావస్థలలో నిత్యమై ఉన్నది. కాలావస్థలు లేనప్పుడు కూడా ఉన్నది ఆత్మయె.
🌹 🌹 🌹 🌹 🌹