🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 12 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃. యోగి అనగా ఎవరు 🍃
26. యోగి అయిన వాడే యోగిని గూర్చి అర్థము చేసుకొనగలడు. ఆత్మ జ్ఞానము కొరకు నిరంతర సాధన చేయువాడే యోగి.
27. 'అహం బ్రహ్మాస్మి' అను భావముతో యోగ స్థితిలో అభ్యాసకుడు పరమాత్మను అనుభవంలోనికి తెచ్చుకొనును. అనాసక్తముగా అభ్యాసం చేయుచు జీవాత్మను పరమాత్మ యందు ఐక్యము చేయు సామార్థ్యము కలిగినవాడే యోగాభ్యాసకుడు.
28. ధైర్యంతో కూడిన బుద్ధిచే, మనస్సును మెల్లమెల్లగా, అంచలంచెలుగా, ప్రాపంచిక విషయ వస్తు, పదార్థ, భోగ విషయముల నుండి మరలించువాడు యోగి.
29. ఇంద్రియ పదార్థములపై అసక్తిలేని వాడై, కర్మల యందు త్యాగబుద్ధి కలవాడై, సంకల్ప, వికల్ప రహితుడైన వాడు యోగారూఢుడని పిలువబడును.
30. యోగభ్రష్టుడైనప్పటికి, ఇహపరములందు వినాశమును పొందక, మరణానంతర జన్మయందు ఉత్తమ కుటుంబమునందు జన్మించి యోగారూఢుడై జీవన్ముక్తిని పొందును. అతనికి గతజన్మల యోగ సాధన తోడ్పడును.
31. యోగి అయిన వాడు తపస్వుల కంటెను, శాస్త్రజ్ఞుల కంటెను, కర్మలు చేయువారి కంటెను సర్వ శ్రేష్టుడని గీతావాక్యము.
32. ఆత్మ ప్రాప్తిని పొందిన యోగి జ్ఞానియై, వికార రహితుడై, ఇంద్రియములను వశపర్చు కొన్న వాడై, మట్టి బంగారము లందు సమ భావన కలవాడై ఉండును.
33. యోగి జీవించి యుండగనే కామక్రోధాదులను అదుపులో ఉంచుకొని, భోగక్షయము కలిగి నిజమైన సుఖవంతుడుగా ఉండును.
34. ఆత్మ ప్రాప్తికై కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము లను అనుష్ఠించువారందరు యోగులే.
35. యోగి చిణీ ఛిణీ, కింకిణీ, శంఖు, వేణు, వీణా, తాళ, ఘంట, భేరి, మృదంగ, మేఘనాదములను దశ విధ శబ్దములను ఆనందముగా వినుచూ అమృతపానము చేయుచుండును. నాభియందు యోగాగ్ని పుట్టి సంచితకర్మలను భస్మం చేయును.
36. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు, యోగి ఇంద్రియములను నిరంతరము మరలించుకొని యుండును. అతని స్థితి గాలి వీచని చోట దీపము వలె నిశ్చలముగా ఉండునట్లు ఉండును.
37. వేద శాస్త్ర పఠనాభ్యాసములు, పూజలు, హోమములు, తపస్సు, వ్రతములు, ఉపవాసములు, దానములు, ఇంద్రియ సంయమముల వలన కలుగు పుణ్య సంపద అంతయు యోగి అప్రయత్నముగనే పొందును.
38. సత్కర్మల ద్వారా పొందు స్వల్ప పుణ్యము తాత్కాలికములు. అది అంతరించిపోవును. ఆత్మ ప్రాప్తి వలన కలుగు పుణ్యము అనంతము, శాశ్వతము. కావున బ్రహ్మ తత్త్వములను తెలిసిన యోగి బ్రహ్మమునే పొందును.
39. యోగమును శరణు వేడిన యోగి మాయను దాటుటయే గాక అతని యోగ క్షేమములు భగవంతుడే చూచుకొనును.
🌹 🌹 🌹 🌹 🌹
Date: 20/Mar/2019