సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 34

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 34 🌹 
34 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 వసనలు 1 🍃

235. వాసన అనునది ఒక భయంకరమైన, అంధకారమైన వికారములతో కూడి; మానవునకు సుఖదుఃఖములు, రాగద్వేషములు, పునర్జన్మలకు కారణమవుతాయి.

236. వాసనలు మాయాజాలము పిశాచములవలె జన్మ జన్మలుగా వెంబడించి మనిషిని మింగి వేయచున్నవి. ప్రతి సాధకుడు తీవ్రముగా విచారణ అభ్యాసము ద్వారా వాటి స్వభావములను తెలుసుకొని ఎవరికి వారు తమ జన్మలను, సంస్కారములను ఉద్ధరించుకొనవలెను. ఇదే సృష్టి రహస్యము, జన్మ రహస్యము, మాయాతత్వము.

237. వ్యక్తి ఎంత పండితుడైనను, గొప్ప జాతి వారైనను, వాసనల వలననె బంధింపబడి పునఃజన్మలకు ఈడ్వబడుచున్నాడు. జననమరణ హేతువైన సంస్కారముల నుండి విడుదలయినవాడే ధీరుడనబడును.

238. పంచేంద్రియములు, మనస్సు ద్వారా విషయ భోగములపై వ్యామోహము కల్గిన మనిషికి దుఃఖము కలుగుచున్నది.

239. వాసనలకు పుట్టుక, ఆది లేదు. అనాదిగా ఇది మానవుని వెంబడిస్తూ ఉన్నాయి. ఇవి వాటంతట అవె నశించవు. అది నశించాలంటే యోగ సాధన, యోగ విజ్ఞానము, సత్‌గ్రంధ పఠనము, దృఢ చిత్తముతో వాటి రహస్యమును తెలుసుకొని అంతము చేయాలి.

240. ఈ భౌతిక శరీరము వాసనలచే నిండియున్నది. మానవ దేహముచే, ఇంద్రియములచే, సూక్ష్మ శరీరములు చేయు కర్మల ఫలితములే వాసనలు. పూర్వవాసనలు ప్రారబ్ధాను భవమునిచ్చునప్పుడు సంస్కారములని పిలువబడును. జన్మ జన్మలుగా వెంబడించు కోరికలు, అలవాట్లు, అభ్యాసములతో కూడిన సంస్కారములు ఒకదానితో ఒకటి పెనవేసుకొనిపోయి బలపడి వాసనా రూపములుగా ఉంటున్నవి.

241. వాసనలు మూడు రకములు: 1) కర్మ వాసనలు 2) స్మృతి మాత్ర వాసనలు 3) కర్మలను అనుభవించుట వలన కలుగునవి (ఆగామి).

242. అనేక జన్మలందు అభ్యాసము చేతను, సంసార బంధముల చేతను, భోగముల చేతను, కోరికలు మొదలగు లౌకిక కార్యములే వాసనలగుచున్నవి.

243. విషయ వాసనలనే విషము, అవిద్యా, అజ్ఞానము వలన ప్రోగై దృఢపడి వాటితో నిండిన ఈ శరీరమే శాశ్వతమని భావన కలుగుటచే, అజ్ఞానములో కర్మలకు, బద్ధులగుచున్నారు.

244. వాసనలు అనేక రకములు.
1.లోకవాసన: అనగా లోకముచే గుర్తింపబడవలెనని కోరిక.
2.శాస్త్రవాసన: తాను గొప్ప శాస్త్రవేత్తననే భావన.
3. దేహవాసన: దేహమునందు ప్రీతి.
4.శుద్ధవాసన: సాధన ద్వారా తనలోని దుర్గుణములను వదలివేయుట.
5.అశుద్ధవాసన: కామ క్రోధాదుల ద్వారా, వస్తు భోగముల ద్వారా ఏర్పడునది.
6. శుభవాసన: సాధన ద్వారా శుద్ధుడై శాశ్వతమైన మోక్షమునకు అర్హుడగుట.
7. సంచితవాసన: గత జన్మల వాసనలే సంచిత వాసనలు.
8. ప్రారబ్ధవాసన: తన యొక్క తన పూర్వికుల ద్వారా ఏర్పడిన వాసన ఈ జన్మలో వెంటవచ్చును.
9. ఆగామివాసన: కొత్తగా చేసినది రాబోవు జన్మలకు ప్రోగుపడినది.
10. ఇహలోక వాసనలు: ఈ లోకములోని ప్రసిద్ధ దృశ్యముల భావనలు.
11. పరలోక వాసనలు: సత్కర్మల ద్వారా పుణ్యలోక(స్వర్గ), దుష్కర్మల ద్వారా పాపలోక (నరక) అనుభవముల వాసనలు.

🌹 🌹 🌹 🌹 🌹