🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
6 వ భాగము
🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻 5. పురుష ప్రయత్నము - 1 🌻
వశిష్ఠుడు రామునుద్దేశించి, ఇంకను ఏమి చెప్పుచున్నాడంటే, పురుష ప్రయత్నము వలననే, జ్ఞానము లభించుచున్నది. జ్ఞానము వలన జీవన్ముక్తి లభించును.
పురుషాకారము అనగా మనోవాక్కాయములందు చరించుట. అనగా ఏది ఆలోచిస్తామో అది మాట్లాడుట, ఏది చెబుతామో అది చేయుట. అలా కానిచో అది గతి తప్పుట. శాస్త్రానుసారము, ఎవరేది కోరునో వారది పొందును. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి వారి పురుషాకారముల వలననే సృష్టి, స్ధితి, లయ కారకులయ్యారు. పురుష ప్రయత్నము, శాస్త్ర విరుద్ధమైన కార్యము లాచరించినపుడు, వ్యధలనుభవించవలసి వచ్చును.
ఉదా:సూర్యచంద్రులు, తమ గతి తప్పినపుడు, ప్రళయము సంభవించును. అలానే విద్యుక్త ధర్మము ననుసరించకపోయిన, దుష్ఫలితము సంభవించును. మంచి కర్మల వలన చెడు నశించును. ఒకవేళ సత్కర్మ చేసినప్పటికి ఫలితము చెడుగానున్న, చెడు సంస్కారములు బలముగానున్నట్లు భావించవలెను. అపుడు సత్కర్మలు ఆపకుండా కొనసాగించిన సత్ఫలితములు కల్గును.
శరీరము అస్ధిరము. మరణము నీడ వలె వెంటాడుచున్నదని ఎల్లపుడు భావించుచుండవలెను. ముముక్షువు పురుషాకారమున మొదట సాధన చతుష్టయము ననుసరించవలెను.
సత్ శాస్త్ర విధిననుసరించి, సత్ సంగమొనర్చి, సదాచార పూర్వకముగ నొనర్చిన కర్మయే, సంపూర్ణ ఫలప్రదమగును. అనర్ధ హేతువగు సోమరి తనము లేకున్న దొడ్డ ధనికుడో లేక పండితుడో కాని వాడెవడు. సోమరి తనము వలనే భూమండలము మూర్ఖులతో దరిద్రులతోను నిండి యున్నది. అదృష్టమన్న దానిని కూడ నమ్మరాదు. సాధనయే జీవుని యుద్ధరించునది. ఈ జన్మమున యొనర్చిన అశుభకర్మలు ప్రాయశ్చిత్తాది కర్మల వలన శుభములుగ మారునట్లు, పూర్వకర్మలు కూడ పురుష ప్రయత్నము వలన, శుభప్రదములుగ మార్చవచ్చును. కష్టపడి ఆర్జించిన విత్తమంతయు నష్టమైన, మరల పొందుటకు ప్రయత్నింపవలెను గాని దుఃఖించుట అనుచితము.
జయించ వీలు లేని మృత్యువును గూర్చి ప్రతి దినము దుఃఖించుచుండ మృత్యువు ఆగునా! అందువలన పౌరుషము నాశ్రయించి, సాదుసంఘశాస్త్ర విచారము వలన చిత్తశుద్ధిని పొంది సంసార సాగరమును దాటవలెను.
ఏ పురుషుడైనను, పురుష ప్రయత్నము వలన ప్రాప్తకర్మలను అణగదొక్కిన సుఖ, దుఃఖములను దాటగలడు. పురుషాకారమును విడిచి ''ఎవరో నన్ను ఉద్ధ్రించగలరు'' అని తలచువాడు వ్యర్ధుడు.
ఎన్ని సమస్యలు వచ్చినను, రాగద్వేషములన్నియు సిద్ధించును.
శుశ్రూష, స్వాధ్యాయము, సాధుసంగమము, శ్రవణాదుల వలన చిత్తమును, కలుషరహిత మొనర్చి, ఆత్మోద్ధరణకు పాటుపడవలెను.
పరలోకమున అనుభవించగా మిగిలిన ప్రాప్తకర్మనే, అదృష్టమని, దైవమని అనవచ్చును.
పురుష ప్రయత్నము వలన ఫలము అరచేతిలోని ఉసిరిక వలె లభించును. మూర్ఖుడే పురుష ప్రయత్నము వీడి, అదృష్టముపై ఆధారపడును.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్