🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
5 వ భాగము
🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻 4. సూక్ష్మశరీరము 🌻
తదుపరి వశిష్ఠుడు శ్రీరామునికి సూక్ష్మశరీరతత్వమును బోధించుచున్నాడు. ఏ ప్రాణియైనను, మృతి చెందినపుడు, జీవాత్మ సూక్ష్మశరీరము ధరించి హృదయాకాశమున వాసనామయములగు (సంస్కారములు) త్రిలోకములను గాంచుచుండును. నిజానికి ఈ జీవాత్మ జన్మాది వికార రహితుడగు పరబ్రహ్మము. మరణ సమయమున మానసమందు నిలబడు కోర్కెలలో నేది అగ్రగణ్యమో దానినే జీవు డనుభవించును. నిజానికి జగత్తుమిధ్య, అసత్యమైనది. ఈ విషయము మరణ సమయ మందు, జనన సమయమందు, హృదయాకాశమున అనుభూతమగును. అనగా మరణ వేదనలో తన సంస్కారములన్ని, అనుభూతికి వచ్చి అంతా భ్రమయని తోచును. కాని సంస్కారములు నశించవు.
జన్మ సమయములో గూడ, ఆ సంస్కారములు భ్రమయని తెలిసినప్పటికి జన్మించిన తరువాత, మాయ ఆవరించి తన గత సంస్కారములు అలానే వుండును. బ్రతుకు నందలి ఆశ, పుట్టుక, చావు అనుమిధ్యా ప్రపంచము నిజమని తలచును.
స్ధూల శరీరములో సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరములో కారణ శరీరము గలదు. ఈ మూడు శరీరములే సంసారమునకు కారణమగుచున్నవి.
సాధన ద్వారా ఈ మూడు శరీరములు దగ్ధమైనపుడే ముక్తి లభించును. ఈ సంస్కార తరంగములు నిద్రాసమయమందును, ప్రళయ సమయమందును చలనము లేక స్ధిరముగ వుండును. అది విశ్రాంతి సమయము. సృష్టి సమయము, స్వప్న సమయము లందు మరల భ్రాంతులు, తరంగములు లేచుచున్నవి. ఈ దేహత్రయములకు బ్రహ్మయే ఉపాధి. అందువలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు నశించగానే బ్రహ్మము మిగులును.
సంస్కారముల ననుసరించి జన్మ లభించును.
జనులు మాటి మాటికి పుట్టుచూ, చచ్చుచూ క్రమముగా సంస్కారములలోమార్పు తెచ్చుకొనుచు, చివరికి విదేహముక్తులగుదురు.
ఉదాహరణకు వ్యాసుడు ఈ బ్రహ్మయుగములో ముప్పది రెండవ వ్యాసుడు. అనగా పూర్వపు సృష్టులందు, ముప్పది ఒక్క వ్యాసులు చనిరి. ఇంకను వ్యాసులు ఎనిమిది పర్యాయములు జన్మించి, భారత ఇతిహాసములను, వేదవిభజనను ఎనిమిది పర్యాయములు చేసి భారత వంశమునకు కీర్తి దెచ్చి, పిదప విదేహముక్తుడై బ్రహ్మమును పొందును.
అలానే ప్రతి జీవి లక్షల జన్మములు ఎత్తి చివరకు ముక్తులు కావలసినదే. వివిధ జన్మలలో, ఇప్పుడున్న వారె అప్పుడు యధావిధిగ జన్మించి, సమకాలికులుగ వుందురు. అప్పుడప్పుడు విడివిడిగా గూడ జన్మింతురు. ఆయా జన్మలలో వారి వారి భార్య, బంధువులు, ఆయుర్ధాయము, జ్ఞానము ఒకే విధముగ ఇప్పుడున్నట్లే వుండును.
కేవలము ఒక్క తత్వజ్ఞాని మాత్రమే, వికల్పములు లేక పరమ శాంతుడై సంతృప్తుడై బ్రహ్మ పదమును పొందును. జ్ఞాని సదేహముక్తుడైనను, విదేహముక్తుడైనను ఒకటియె. ఈ రెండు ముక్తులును భిన్నములు కావు. సదేహముక్తునకు విషయ భోగములున్నచో, విదేహముక్తుని కంటే, తక్కువగ నెంచుకొనవచ్చును. అయితే విషయ భోగమందు రసబోధ లేనందు వలన రెండును నిర్వాణముక్తి వంటివే. నీరు అలలుగా వున్నను, కదలకున్నను నీరు నీరే కదా! అలానే గాలి కదులుచున్నను, కదలకవున్నను గాలి గాలే కదా!.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్
No comments:
Post a Comment