🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 4 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
4 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻 3. అఖండ చైతన్య స్వరూపము  🌻

అందుకు జనకుడు తాను గ్రహించినది తన తండ్రి పల్కినది కాక వేరేదియు లేదనియు ''అఖండచైతన్య స్వరూపము, అద్వితీయమైన పరమాత్మ స్వరూపము ఒక్కటే వున్నదని, తక్కిన వన్నియు లేనివేనని, అజ్ఞాన సంస్కారములు నశించినచో వ్యక్తి ముక్తుడై స్వస్వరూపమును పొందునని'' పల్కెను. చిన్న వయస్సులోనే శుకుడు భోగములను అనుభవించకుండగనే, విరక్తిని ప్రకటించి, పూర్ణత్వమును సాధించి సర్వజ్ఞానమును పొంది, వేదవ్యాసుని కంటే, గురువగు తన కంటే అధికుడవైనట్లు జనకుడు పల్కెను. నీ మనోరధము సిద్దించినదని, నీవు పొందవలసినదంతయు పొందియెయుంటి, ముక్తుడవని తెల్పెను.

తదుపరి శుకుడు సంశయరహితుడై, నిష్కాముడై నిర్వికల్ప సమాధి యందు, పదివేల ఏడ్లుండి, తైలహీన మగుదీపము వలె, ఆత్మ స్వరూపమున నిర్వాణమందెను. అని విశ్వామిత్రుడు శుకుని చరిత్రను తెల్పెను.*
*శుకుని వలె శ్రీరామచంద్రుడు తెలుసుకొనవలసినదంతయు తెలుసుకున్నాడని, శ్రీరాముడు భోగములందు విరక్తుడైనాడని పల్కెను.

కామక్రోధాదుల నెవడు జయించునో వాడే ముక్తుడు. అయితే శ్రీరాముని చిత్త శాంతి కొరకు వశిష్ఠుడు అతనికి తత్వబోధన చేయవలెనని పల్కెను. తక్కిన ఋషి పుంగవులు విశ్వామిత్రునితో ఏకీభవించిరి.

శ్రీ వశిష్ఠులు విశ్వామిత్రుని వచనములను తలదాల్చి శ్రీరామునికి అఖండ ఆత్మజ్ఞానమును బోధించుటకు ఉద్యుక్తుడయ్యెను. కాని శ్రీరాముడు మోక్ష శాస్త్రమును బోధించుటకు ముందు తన సందేహమును తీర్చవలయునని ఇట్లు పల్కెను.

శుకుని తండ్రియైన వ్యాసమహర్షి సర్వజ్ఞుడైనను విదేహముక్తిని పొందలేదు. అతని కుమారుడైన శుకుడు ఏల నిర్వాణముక్తిని పొందగల్గెను. అందుకు వశిష్ఠుడు ఇట్లు పల్కెను. పరమాత్ముని చైతన్య శక్తి యందు లేచి, మరల లీనమగు బ్రహ్మండత్రసరేణువులు అసంఖ్యాకములు, త్రిభువన మండలములు కూడ అసంఖ్యాకములు. అలాంటి జగద్రేణువులను జీవన్ముక్త పురుషులైన శుకుని వంటవారు నమ్మరు. అందువలన వీరు విదేహముక్తులుగ పిలువబడతారు. అందుకు శ్రీరాముడు తృప్తి చెంది, తాను అఖండ బ్రహ్మత్వమును గ్రహించితినని తెల్పెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

No comments:

Post a Comment