సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 51

 


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 51 🌹 
51 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 పరాణాయామము - 1 🍃 

380. మనిషి, అనారోగ్యానికి కారణము ప్రాణ సంచారము. శరీరములో సమానముగా ప్రసరించకుండుట అని గ్రహించాలి. అందుకు కారణము చిత్త ఏకాగ్రత లేకపోవుట. చంచల మనస్సు, రజోగుణ విజృంభణ కారణముగా ప్రాణ సంచారము సమస్థితిలో జరుగుట లేదు. 

381. ప్రాణాయామము అభ్యాసము ద్వారా ఎక్కువ తక్కువలుగా నున్న ప్రాణశక్తిని, లోపములను తెలుసుకొని సమస్థితిలో ఉంచుకొని వివిధ కేంద్రాలకు పంపిణి చేయుట జరుగుతుంది. అపుడు అనారోగ్యము తొలగిపోవును. 

382. యోగ సాధనలో ప్రాణాయామము ఒక అంశము. యోగం యొక్క అష్ఠాంగములలో ప్రాణాయామము ఒక అంగము మాత్రమే. స్థిర ప్రాణము నుండి చంచల ప్రాణావస్థకు దిగినవాడి పేరు జీవుడు. తిరిగి స్థిర ప్రాణుడగుటయే ఆత్మ స్థితి. 

383. ప్రాణాయామము ద్వారా సాధకుడు భౌతిక ప్రాణశక్తులను వశపర్చుకొని ఉశ్చ్వాస నిశ్వాసముల గతిని క్రమపర్చును. యోగమునకు ప్రాణాయామము మొట్టమొదటి ఆవశ్యకత. 

384. ప్రాణాయామము అనగా ప్రాణ ''నిగ్రహత'' అని అర్థము. ఉశ్చ్వాస నిశ్వాసములను తగ్గించుటయే ప్రాణాయామ ముఖ్య ఉద్దేశము. ప్రాణవాయువును అపానములో చేర్చుటే ప్రాణాయామము. ప్రాణాన్ని వశంచేసుకోవటమే ప్రాణాయామము యొక్క ముఖ్య ఉద్దేశము. క్రమముగా ప్రాణమును బిగబట్టుచూ చేయు సాధన ప్రాణాయామాభ్యాస మనబడును. అనేక శారీరక వ్యాయామములు శరీరమునకు చెందినవి. ప్రాణాయామము ఉశ్చ్వాస నిశ్వాసములకు సంబంధించిన వ్యాయామము. 

385. అపానవాయువు నందు ప్రాణ వాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమము చేయుటే ప్రాణాయామము. యమనియమాలలో ఇది 4వది. 

386. ప్రాణాయామములో పూరక, రేచక, కుంభకములు కలవు. 1) బయటి వాయువును లోపలకు పీల్చుట పూరకమందురు. ఇదియె ఉశ్చ్వాసము. ప్రాణమును హోమము చేయుటను పూరకమందురు. రేచకమనగా లోపలి వాయువును ముక్కురంధ్రముల ద్వారా బయటకు వదులుట. ఇదియె నిశ్వాస క్రియ. కుంభకమనగా లోపలకు పీల్చిన గాలిని, వెంటనే బయటకు వదలక వీలైనంత సేపు నిలిపి ఉండుటను పూరక కుంభకమంటారు. గాలిని వదలిన తరువాత వెంటనే పీల్చక, నిలిపి ఉంచుటను రేచక కుంభకమని అంటారు. ఈ రెంటిని అంతఃకుంభకమని, బాహ్యకుంభకమని కూడా అంటారు. బాహ్య కుంభకాన్ని శూన్యక కుంభకమని కూడా అంటారు. 

387. కుంభక ప్రాణాయామములో గాలి పీల్చినపుడు ప్రాణవాయువు శరీర అంతర్భాగములకు లోతుగా వెళ్ళి అందున్న కణజాలముకు శక్తినొసంగును. అలానే రేచక కుంభకములో లోతైన అంతర్భాగములో గల చెడు పదార్థములను సేకరించి బయటకి నెట్టివేయును. కావున పూరకము వలన కణజాలము శక్తివంతము, రేచకము వలన చెడు తొలగి శరీరమంతయు ఆరోగ్యవంతమగును. 

388. పూరక రేచక కుంభకముల వలన శరీరాంతర్భాగములో గల వెన్నెముకలో ఉన్న ఇడ, పింగళ, సుషుమ్న నాడులు చైతన్యవంతమై మూలాధారములో ఉన్న కుండలిని ఊర్ధ్వముఖమై సహస్రారములో ప్రవేశింపజేయును. శివ శక్తుల సమ్మేళనము ఏర్పడి బ్రహ్మానంద స్థితి కల్గి ముక్తికి మార్గము ఏర్పడును. 

389. పూరక రేచక కుంభకములతో పాటు కేవల కుంభకము ఒకటి కలదు. అందులో పూరకంతో రేచకంతో పనిలేకుండా అకస్మాత్తుగా శ్వాసను కుంభించి బిగబెట్టినచాలు. దీని వలన శరీరము కాయకల్పమగును. ఆయుర్వృద్ధి అగును. 

390. 2 నయనేంద్రియముల మధ్య, 2 ముక్కు ద్వారముల యొక్క పై భాగమున, ఈ మూడు కలిసే కూడలిని భ్రూమధ్యము (త్రివేణి సంగమము) అని అంటారు. శ్వాస ఎడమ కుడి ముక్కు రంధ్రముల ద్వారా ఆడుచుండును. ఈ రెండును భ్రూమధ్యమున చేరి ఒక చోట కలసి అచట నుండి సహస్రారమునకు చేరును. అచట కుండలిని శక్తిని ప్రజ్వలింపజేయును. ఆవేడిమికి బ్రహ్మ కపాలమునందు గల అమృతము కరిగి చుక్కలుచుక్కలుగా కారుచుండును. అదే ఆనంద స్థితి. జ్యోతి స్వరూపమును దర్శించు స్థితి.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #BookofDzyan #Theosophy

28 Apr 2019