🌹 కార్తీక అమావాస్య - శుభ ముహూర్తం, పూజా విధానం, పితృ అనుగ్రహం పొందేందుకు జపించాల్సిన శక్తివంతమైన మంత్రం ఇదే! 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Kartik Amavasya - Auspicious time, method of worship, and this is the powerful mantra to chant to get ancestral blessings! 🌹
Prasad Bharadwaj
మన పూర్వీకులను స్మరించుకోవడానికి, వారిని పూజించడానికి కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషంతో బాధపడుతున్న వారు ఈ రోజున వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి.
శుభ ముహూర్తం
దృక్ పంచాంగం ప్రకారం.. మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిథి ఈ ఉదయం 9:43 నిమిషాలకు ప్రారంభమౌతుంది. గురువారం మధ్యాహ్నం 12:16 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, కార్తీక అమావాస్యను గురువారం నాడు ఆచరిస్తారు. కొందరు మాత్రం అమావాస్య తిథి ప్రకారం నేడే దీన్ని జరుపుకొంటారు. కార్తీక అమావాస్య నాటి బ్రహ్మ ముహూర్తాన్ని అత్యంత శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. తెల్లవారు జామున 5:01 నుండి 5:54 నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో పవిత్ర నదీ స్నానాలు చేయడం, దానధర్మాలు చేయడం శ్రేష్ఠమని పండితులు సూచిస్తున్నారు.
కార్తీక అమావాస్య శుభ ముహూర్తం - 2025
అమావాస్య తిథి ప్రారంభం: గురువారం ఉదయం 9:43 AM
తిథి ముగింపు: మధ్యాహ్నం 12:16 PM
బ్రహ్మముహూర్తం: తెల్లవారుజామున 4:00 AM - 5:54 AM
అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో చేసిన పూజ, దానాలు, నది స్నానాలు అనేక రెట్లు పుణ్యఫలితాలను ఇస్తాయంటారు.
🍀 కార్తీక అమావాస్య పూజా విధానం - ఇలా చేసుకుంటే శుభ ఫలితాలు 🍀1. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.
2. వీలైతే నది స్నానం చేయడం ఉత్తమం.
3.రాగి పాత్రలో నీళ్లు, కొద్దిగా పాలు, సింధూరం, ఎర్ర పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి.
4.శివ-కేశవులను స్మరిస్తూ పుష్పాలు, పసుపు, కుంకుమ, చందనం, అక్షింతలు సమర్పించాలి.
5.నైవేద్యం పెట్టి దీపారాధన చేయాలి.
కార్తీక అమావాస్య నాడు తప్పక జపించాల్సిన శక్తివంతమైన మంత్రం
పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషాలను తగ్గించుకోవడానికి ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు-
"ఓం పితృదేవతాయ నమః"
ఈ మంత్రాన్ని పవిత్రతతో, భక్తితో జపిస్తే పూర్వికుల ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
🍁 తర్పణాలు 🍁పూజ తర్వాత, అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం వదలాలి. గంగాజలాన్ని వినియోగించడం అత్యంత శ్రేష్టం. అది సాధ్యం కాని వాళ్లు నీరు, నల్ల నువ్వులు, పచ్చి పాలను రాగి లేదా ఇత్తడి పాత్రలో కలిపి శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దక్షిణం వైపు ముఖం చేసి కూర్చుని, చేతిలో నీరు తీసుకుని, సంకల్పం చెప్పుకుని, మీ పూర్వీకులను స్మరిస్తూ నీటిని సమర్పించాలి. "ఓం పితృ దేవతాయై నమః" అనే మంత్రాన్ని జపించాలి. చివరగా, అవసరమైన వారికి ఆహారం లేదా ఆహార పదార్థాలను దానం చేయాలి.
అలాగే, సాయంత్రం తులసికోట దగ్గర పిండి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయని, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు.
🌹🌹🌹🌹🌹