సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 33



🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 33 🌹 
33 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ


🍃 అహంకారము 2 🍃 

229. నరకాసురుడు, భస్మాసురుడు, దుర్యోధనుడు, కార్తవీర్యార్జునుడు, శిశుపాలుడు, పరశురాముడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, మహిషాసురుడు ఇలా అనేక మంది అహంకారమువలననె అణచివేయబడిరి, నశించిరి.

230. అహంకార లక్షణాలు:ధన మదము, విద్యా మదము, జాతి, భోగ, శీల, రూప, బల, జ్ఞాన, కీర్తి, రాజ మదములు, ఇవన్నీ అహంకార లక్షణములె.

231. అహంకారము మూడు రకములు:
1.ఉత్తమ అహంకారము: ఇందు వ్యక్తి తానే పరమాత్మనని తనకంటే అన్యమెదీ లేదని భావించును.
2. అతిసూక్ష్మమైన వాడను తాను అని తాను అవయవ రహితుడనని భావించుట శుభ ప్రధ అహంకారము.
3. మూడవదైన లౌకిక అహంకారములో దేహమె నేనని తలచును. ఇది బంధానికి సంసార వృక్షానికి మూలమైనది. దీనిని విసర్జించవలెను. ఇది దుఃఖ హేతువు.

232. అహంకారము వలన బాధలు పెరుగును. అశాంతి, దుఃఖము, ఒంటరి తనము, వినాశనము, అనర్ధములు, పునర్జన్మలు, మాయ, అంధకారము, అనేక విపత్తులు, భయము, స్వార్థము, విషయాసక్తి, దుష్కర్మలు, నిర్దయ, శత్రుత్వము, వ్యామోహాలు పెంపొందును.

233. అహంకారమును జయించాలంటే అహంకారాన్నె ఆయుధంగా వాడాలి. ముల్లును ముల్లుతోనూ, వజ్రాన్ని వజ్రంతోనే ఛేదించినట్లు, అహంకారమును అహంకారముతోనే జయించాలి. మోక్షమునకు అహంకారము ప్రతిబంధకము. ఆత్మ స్వరూపమును స్మరించుట, విషయముల యెడల రాగ ద్వేషముల యెడల విముఖత, ఆధ్యాత్మిక గ్రంధ పఠనము, శ్రవణము, విచారణ, గురుబోధ, సాధు సంగమము వలన అహంకారము నశించును. సత్య, ఆత్మ జ్ఞానము వలన అహంకారము నశించును. అహంకారి యొక్క మాటలు, ప్రార్థనలు, క్రియలు భగవంతునికి చేరవు. ఆత్మార్పణయె అహంకార క్షయము.

234. ఫలితాన్ని ఆశించకుండా నిరంతర యోగ సాధన చేయుట వలన అహంకారము నశిస్తుంది. స్వార్థ రహిత, ఫలాపేక్ష రహిత, వాంచా రహిత కార్యములు నిర్వహించుట వలన అహంకారము తొలగి అపార శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹