🌹మాస్టర్ కూత్హూమి బోధనలు🌹
🌴 క్రియ - పరిశ్రమ విలువ 🌴
పని యందు ప్రేమ ప్రధానము. పని లేనివాని జీవితము వృథా. పనికిరాని జల్సారాయుళ్ళు సృష్టి కపకారము చేయుచున్న వారే.
చెట్లు, పుట్ట, పాము, పంచభూతములు, దేవతలు అందరును పని యందు నిమగ్నులై యున్నారు. పని విలువ తెలిసిన వారికే పనియందు ప్రేమ కలుగును. విలువైన విషయములందు ప్రేమ కలుగుచుండును గదా!
బంగారము, వజ్రములు, ఆభరణములు, ఆస్తులు, మనకుపయోగపడు మనుషులు, సంస్థలు వీటన్నింటిని మనము ప్రేమింతుము. కారణము వాటి విలువ తెలియుటయే. కాని యివి యన్నియు లౌకికమైన విలువలు. పని విలువ తెలిసినవారు అలౌకిక శక్తులను కూడ ఆవాహనము చేసుకొను స్థితి యందుందురు.
ప్రాణము మన యందు అహర్నిశలు పనిచేయు చున్నది. అట్లే మెలకువ కలిగిన క్షణము నుండి నిద్రించువరకు ఏదో ఒక నిర్మాణాత్మక, సృజనాత్మకము అగు కార్యమున నిల్చి యుండుట, ఆ కార్యమును క్రతుబద్ధము చేయుట దీక్ష సాగవలెను. ఇట్టి వారియందు క్రియాశక్తి పరిపూర్ణముగ వికసించి పరిసరములకు తోడ్పడును.
ఇట్టి వారికే సోదర బృందమున అర్హత కలుగును. పనికిమాలిన విషయములు పది చర్చించుట కన్న పనికివచ్చు పనిచేయుట చాల ప్రధానము.
ఇట్టి పనికి ఫలితములతో సంబంధము లేదు. పనియే జీవమై పురోగతి కలిగించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్