Showing posts with label Magh Masam. Show all posts
Showing posts with label Magh Masam. Show all posts

మాఘమాసం స్నాన మహత్వం - సువ్రతుడి వృత్తాంతం / The Significance of Bathing in the month of Magha - The Story of Suvrata


🌹 మాఘమాసం స్నాన మహత్వం - సువ్రతుడి వృత్తాంతం 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 The Significance of Bathing in the month of Magha - The Story of Suvrata 🌹
Prasad Bhardwaj



శుక మహర్షి ఒకప్పుడు పరీక్షిత్తు మహారాజుకు మాఘ మహాత్మ్యాన్ని గురించి చెప్పిన కథను సూత మునీంద్రుడు శౌనకాదులకు చెప్పాడు. మాఘ మాసంలో చేసే స్నాన, దాన, వ్రతాదులు అత్యంత పుణ్యఫలాలను ఇస్తాయని చెబుతూ, అందుకు ఉదాహరణగా సువ్రతుడు అనే బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు: పూర్వం నర్మదాతీరంలోని సోమనాథం అనే అగ్రహారం ఉండేది.

ఆ అగ్రహారంలో సజ్జనులైన బ్రాహ్మణులు నిత్య వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ, యజ్ఞ యాగాదులు జరిపేవారు. నిత్యం వేదఘోషతో అలరారే ఆ అగ్రహారం సర్వసుభిక్షంగా తులతూగుతూ ఉండేది.

ఆ అగ్రహారంలో సువ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగాలను; జ్యోతిష తర్క మీమాంసాది శాస్త్రాలను; సంగీతం, శిల్ప, నృత్యాది చతుష్షష్టి కళలను సాంగోపాంగంగా నేర్చుకున్నవాడై, మంత్రశాస్త్రంలో నేర్పరి అయి ఉండేవాడు. ఇవే కాకుండా, తత్త్వ, యోగ శాస్త్రాలను అభ్యసించి, పద్నాలుగు దేశ భాషలలో మాట్లాడటం, చదవడం, రాయడంలో నైపుణ్యం కలిగి ఉండేవాడు.ఇన్ని విద్యలు నేర్చిన సువ్రతుడికి అంతులేని ధనాశ ఉండేది. నేర్చిన విద్యలన్నింటినీ ధనార్జన కోసమే వినియోగించేవాడు. యజ్ఞ యాగాది క్రతువులతో పాటు శుభాశుభ సందర్భాలలో కర్తలు ఇచ్చే గోదాన, హిరణ్య దానాదులు సహా తిలదాన, లవణదానాల వంటి అన్ని రకాల దానాలనూ స్వీకరించేవాడు. అలా విశేషంగా ధనం కూడబెట్టాడు. విశేషంగా వస్తు వాహనాలను సమకూర్చుకున్నాడు.

అంతటితో సంతృప్తి చెందక దానంగా స్వీకరించిన గోవులను అంగడిలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. మిగులు ధనాన్ని అవసరంలో ఉన్నవారికి అప్పులుగా ఇచ్చి, అక్రమంగా వడ్డీలు గుంజేవాడు. ఎంత సంపాదించినా, భార్యా పిల్లల కోసమైనా సక్రమంగా ఖర్చు పెట్టేవాడు కాదు. తాను అనుభవించేవాడు కాదు. మితిమీరిన లోభంతో ఇలా లక్షలాది వరహాల ధనాన్ని పోగు చేశాడు.కాలక్రమేణా సువ్రతుడు వృద్ధుడయ్యాడు. కాళ్లు చేతులు పట్లు సడలి; కళ్లు కనిపించక, చెవులు వినిపించక శరీర యాతనతో రోజులు వెళ్లదీస్తూ ఉండేవాడు. అలాంటి దశలో కూడా తాను తినక, ఒకరికి పెట్టక కాలం గడప సాగాడు. సంపాదించి పోగు చేసిన ధనాన్ని ఎక్కడ దాచిపెట్టాడో కనీసం భార్యా కుమారులకైనా చెప్పేవాడు కాదు.

అగ్రహారంలో యజ్ఞయాగాదులు జరుగుతున్నట్లు తెలుసుకున్నప్పుడల్లా, శక్తిలేక మూలపడటం వల్ల అక్కడ తనకు దక్కాల్సిన దానాలు దక్కకుండా పోతున్నాయని బాధపడుతూ ఉండేవాడు.సువ్రతుడు మూలపడటం వల్ల కుటుంబ ఆదాయానికి గండిపడింది. ఇల్లు గడవడం కష్టమైంది. చివరకు అన్న వస్త్రాదులకు కూడా లోటు ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పకుండా ఉన్నందుకు భార్య, కొడుకులు, కోడళ్లు సువ్రతుడిని నానా రకాలుగా నిందించేవారు. కనీసం ఇంటి ఖర్చుల మేరకైనా డబ్బు తీసి ఇమ్మంటే ఇచ్చేవాడు కాదు. పైగా, 'మీరంతా దయ్యాల్లా దాపురించారు. నా ఇంటి నుంచి వెళ్లిపోండి' అంటూ కుటుంబ సభ్యులందరినీ తిట్టిపోసేవాడు.

రోజులు గడిచే కొద్ది పరిస్థితులు గడ్డుగా మారుతుండటంతో సువ్రతుడు ధనం దాచిన చోటు కనిపెట్టాలని ఇంటిల్లిపాది కలసి ఇల్లంతా వెదికారు. చివరకు ఒక బోషాణంలో దాచిన డబ్బు కనిపించింది. ఇక ఆనాటి నుంచి సువ్రతుడి కుటుంబ సభ్యులు ఆ డబ్బును స్వేచ్ఛగా ఖర్చుపెడుతూ, ముప్పూటలా సుష్టుగా భోజనాలు చేస్తుండేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉంటే, ఒకనాటి రాత్రివేళ సువ్రతుడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నవాళ్లను తాళ్లతో కట్టేసి, ఇంట్లో ఉన్న డబ్బును, చేతికందిన విలువైన వస్తువులను దోచుకున్నారు. దొంగలు ఇల్లంతా దోచుకుంటూ ఉండటం చూసి సువ్రతుడు బిగ్గరగా రోదిస్తూ, సొమ్మసిల్లిపోయాడు.

తెల్లవారుతూ ఉండగా సువ్రతుడికి స్పృహ వచ్చింది. మళ్లీ ఏడుపు మొదలుపెట్టాడు. 'ఎన్నో తుచ్ఛమైన దానాలు పట్టి ఎంతో ధనం సంపాదించాను. నేనూ తినలేదు, ఎవరికీ పెట్టలేదు. దానంగా స్వీకరించిన గోవును విక్రయించడం మహాపాపం. అయినా, దానంగా లభించిన ఎన్నో గోవులను అంగడిలో డబ్బుకు అమ్ముకున్నాను. దాన ధర్మాలకు ఖర్చు చేయని ధనం దొంగలపాలవుతుంది. నా కర్మ ఇలా కాలింది. ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఫలమేమి? ధనాన్ని పోగు చేయాలనే లక్ష్యంతో దేవర్షి పితృతర్పణాలను కూడా ఏనాడూ సమర్పించలేదు. గురువులకు దక్షిణలివ్వలేదు.

నా లోభత్వమే నన్నింతకు దిగజార్చింది. ఇప్పుడు ఏ పుణ్యకార్యం చేద్దామన్నా, ఉన్న డబ్బంతా దొంగలపాలైంది. ముదిమితో ఒంట్లోని జవసత్త్వాలు ఉడిగిపోయాయి. కశ్మీర దేశంలో నేను చదువుకుంటున్నప్పుడు అక్కడ పండితుల వద్ద మాఘపురాణం విన్నాను. మాఘస్నానం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఈ స్థితిలో నేను చేయదగ్గ పని మాఘస్నానం మాత్రమే' అనుకున్నాడు.కొడుకులను చేరబిలిచి, తాను చేసిన పాపాలన్నీ ఏకరువు పెట్టి, పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనను మాఘస్నానం కోసం నర్మదా తీరానికి తీసుకుపోవలసిందిగా కోరాడు. 'మాఘే నిమగ్నాస్సలిలే సుశీతే విధూత పాపా స్త్రి దివం ప్రయాంతి' అని మాఘపురాణం చెబుతోంది.

మాఘమాసంలో చన్నీటి స్నానం చేసినవారికి పాపాలు నశించి, స్వర్గప్రాప్తి కలుగుతుంది.

అందువల్ల నన్ను నర్మదా తీరానికి తీసుకువెళ్లండి' అని కొడుకులకు చెప్పాడు.కొడుకుల సాయంతో నర్మదా తీరానికి చేరుకున్న సువ్రతుడు మాఘమాసంలో పదిరోజులు పవిత్ర స్నానం ఆచరించాడు. ఒకనాడు యథావిధిగా నర్మదానదిలో స్నానం ముగించుకుని, గట్టు మీదకు వచ్చి, దక్షిణముఖంగా పడుకుని గోవిందనామ స్మరణ చేస్తూ, ప్రాణాలు విడిచాడు. అతడి కుమారులు చూస్తుండగానే, దివ్యవిమానంలో దేవదూతలు అక్కడకు వచ్చారు. సువ్రతుడిని తీసుకుని వారు స్వర్గానికి బయలుదేరారు. మాఘస్నానం ఫలితంగా సువ్రతుడు స్వర్గప్రాప్తి పొందాడు.

ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹

Facebook: https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2065481047571699

మాఘ పూర్ణిమ, శ్రీ లలితా జయంతి శుభాకాంక్షలు Greetings on Magha Pournami, Sri Lalitha Jayanthi



🌹 మాఘ పూర్ణిమ, శ్రీ లలితా జయంతి శుభాకాంక్షలు అందరికి Magha Pournami, Sri Lalitha Jayanthi Greetings to All.🌹

🍀 ఈ మాఘ పూర్ణిమ, శ్రీ లలితా జయంతి, థైపూసం ఉత్సవం, రవి పుష్య యోగం, సర్వార్థ సిద్ధి యోగం కలిసి వచ్చిన అరుదైన యోగం! అపమృత్యు దోషం నివారణకు అనుకూలం. బ్రహ్మాండ పురాణ రహస్యం. 🍀
ప్రసాద్‌ భరధ్వాజ

🍀 This Magha Purnima is a rare and auspicious occasion, coinciding with Sri Lalita Jayanti, Thaipusam festival, Ravi Pushya Yoga, and Sarvartha Siddhi Yoga! It is favorable for the removal of the Apamrityu Dosha (premature death affliction). A secret from the Brahmanda Purana. 🍀
Prasad Bharadwaj


మఘా నక్షత్రంలో చంద్రుడి సంచారాన్ని మాఘ పౌర్ణమి గా జరుపుకుంటారు. ఈ ఏడాది మాఘ పౌర్ణమి 2026 ఫిబ్రవరి 1వ తేదీన వచ్చింది. మాఘ పూర్ణిమ చంద్రుని శక్తి గరిష్టంగా ఉండే పవిత్రమైన రోజు. నదీ స్నానం తప్పక చేయాలి, ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం కోటి జన్మల పాపాలు తొలగిస్తుంది అని శాస్త్ర వాక్యం. ప్రయాగ లో మాఘ పౌర్ణమి రోజున సమస్త దేవతలు స్నానం చేస్తారు,ఆ నీటిలో దైవ శక్తి అపరిమితంగా ఉంటుంది,కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం ఎంత గొప్పదో మాఘ పౌర్ణమి రోజున స్నానం అంతకు పది రెట్లు విశిష్టమైంది, వీలైతే నది, కుదిరితే సముద్రం, లేదా ప్రయాగ స్నానం చేయండి,లేదా ఇంట్లోనే గంగా యమున మొదలైన నదులను స్మరిస్తూ సూర్యోదయం లోగా నే స్నానం చేయాలి.

ఈ ఏడాది వచ్చే మాఘ పౌర్ణమి అరుదైన యోగంతో వచ్చింది. అయితే ఎప్పుడైనా మఘ నక్షత్రం చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి రోజు చేసే పరిహారం అపమృత్యు దోషం నుంచి కాపాడుతుందట. అలాగే ఆయుష్షును పెంచుతుందట. అలాగే మిగతా గ్రహాలన్నీ ఒక్కొక్కటి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళుతున్నాయి. ఫిబ్రవరిలో చూస్తే పంచగ్రహ కూటమి 12 నుంచి 15 రోజులు ఉంటుంది. అయితే.. మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే సూర్యుడిని, అమ్మవారిని ప్రార్థిస్తారో.. వారికి ఆయుష్షు పెరగడంతో పాటు మానసిక రుగ్మతలు, ఆరోగ్య సమస్యలు తొలగుతాయి.

శ్రీ లలితా దేవి భండాసుర సంహారం కోసం దేవతలు చేసిన మహాయగం నుండి ఆవిర్భవించిన రోజు ఈ మాఘ పౌర్ణమి. సాధారణంగానే పౌర్ణమి రోజున లలితా ఆరాధన ఎంతో గొప్ప ఫలాలు ఇస్తుంది, అందులోనూ యోగం తో కూడిన, మాఘ పౌర్ణమి రోజున రాత్రి వేళ చంద్రబింబం పాలలో చూస్తూ అందులో లలితా దేవిని ధ్యానిస్తూ లలితా సహస్ర నామాలు చదివితే ఎలాంటి కోరిక అయిన వెంటనే తీరుతుంది ఇది బ్రహ్మాండ పురాణం చెప్పిన గొప్ప రహస్యం.

మఖ నక్షత్రం వచ్చినప్పుడు అమ్మవారిని పూజించడంతో పాటు పితృదేవతారాధన చేయడం అత్యంత శుభప్రదం. పితృదేవతారాధన వల్ల కలిగి ప్రయోజనం ఏమిటంటే.. జన్మయోగంలో పిశాచ యోగం పట్టడం, దోషాలు కలగడంతో పాటు ఇంట్లో ఉండే నెగిటివ్‌ ఎనర్జీ తగ్గి దేవతాశక్తి పెరుగుతుంది. ఇవి జరగాలంటే మాఘ పౌర్ణమి రోజు అమ్మవారి ఆరాధనతో పాటు పితృదేవతారాధన ఖచ్చితంగా చేయాలట. ముఖ్యంగా మఖ నక్షత్రం రోజు చేసే పితృదేవారాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే మఖ నక్షత్రానికి పితృదేవతలను అధిదేవతలుగా చెబుతారు.

థైపూసం : ఇది తమిళుల ఉత్సవం, తారకాసుర సంహారం కోసం జన్మించిన సుబ్రహ్మణ్య స్వామికి పార్వతి దేవుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చిన రోజు. జ్ఞాన సిద్ధికి, ఈ రోజున తమిళ నాట విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు.

సర్వార్థ సిద్ధి & సిద్ధ యోగం: మీరు చేసే ఏ ప్రయత్నానికైనా విజయాన్ని చేకూర్చే అద్భుత ఘడియలు ఇవి.

🍀 మాఘ పౌర్ణమి రోజు పాటించాల్సిన పరిహారాలు 🍀

ఈ మాఘ పూర్ణిమ రోజున స్వయంపాకం దానం చేయడం, గోశాల దగ్గరకు వెళ్లి గోవులకు మేత వేయడం, వీలైనంత వరకు ధ్యానం చేయడం, తెల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వడంతో పాటు మాఘ పౌర్ణమి రోజు క్షేత్ర దర్శనం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజు అమ్మవారి మంత్ర సాధన చేయడం విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. త్వరగా మంత్ర సిద్ధి జరుగుతుంది. పౌర్ణమి రోజున అమ్మవారి మంత్రాలతో పాటు గణపతి మంత్రాలను పఠించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.

ఈ రోజు చేసే చిన్న దానమైనా, పూజ అయినా కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కనుక యధాశక్తి పూజ,ధ్యానం,జపం, స్నానం చేయడం ఉత్తమం, ఈరోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభప్రదం, అనేక దేవాలయాలలో లక్ష్మి నరసింహ కళ్యాణం జరుగుతుంది ఈరోజు. కనుక ఆధ్యాత్మికముగ ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ గొప్ప సమయాన్ని వినియోగించుకొని దైవానుగ్రహం పొందండి.

🌹🌹🌹🌹🌹

మాఘ శుక్ల ప్రదోషం.. Magha Shukla Pradosham...


🌹 మాఘ శుక్ల ప్రదోషం.. ఆర్థిక కష్టాలు తీరాలంటే ! పూజ, ముహూర్తం 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Magha Shukla Pradosham... To overcome financial difficulties! Puja and auspicious time 🌹
Prasad Bhardwaj


మాఘ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలోని మొదటి పక్షంలో వచ్చే ప్రదోష వ్రతం 2026, జనవరి 30వ తేదీ శుక్రవారం నాడు వస్తోంది. శుక్రవారం నాడు వచ్చే ఈ ప్రదోషాన్ని 'భృగు వార ప్రదోషం' లేదా 'శుక్ర ప్రదోషం' అని పిలుస్తారు. శివుని అనుగ్రహంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే వారికి ఈ రోజు ఒక గొప్ప అవకాశంగా ఆధ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు.

పూజకు అనుకూలమైన ముహూర్తం

ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయ సమయంలో ఉండే అత్యంత పవిత్రమైన గడియలు. జనవరి 30న సాయంత్రం 06:10 గంటల నుండి రాత్రి 08:42 గంటల వరకు పూజకు అత్యంత అనుకూలమైన సమయం ఉంది. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయడం లేదా శివాలయ సందర్శన చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.

ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి

శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు, అలాగే ప్రదోషం శివునికి ప్రీతికరమైనది. ఈ రెండింటి కలయిక వల్ల 'శుక్ర ప్రదోషం' నాడు పరమశివుడిని భక్తిశ్రద్ధలతో కొలిచే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. దారిద్ర్యం నశించి, ఇంట్లో ఐశ్వర్యం, సౌభాగ్యం చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా అప్పుల బాధల నుండి విముక్తి పొందాలనుకునే వారికి ఈ వ్రతం ఎంతో మేలు చేస్తుంది.

మహిళలకు సౌభాగ్య ప్రదాయిని

మహిళలు ఈ శుక్ర ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల దీర్ఘ సుమంగళీ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కుటుంబంలో కలహాలు తొలగిపోయి, సుఖసంతోషాలు నెలకొంటాయి. సాయంత్రం వేళ శివపార్వతులను పూజించి, నేతి దీపం వెలిగించడం వల్ల మంగళకరమైన ఫలితాలు కలుగుతాయి.

🌹🌹🌹🌹🌹

మాఘ వినాయక చతుర్థి, తిల చతుర్ధి, కుంద చతుర్ధి శుభాకాంక్షలు Greetings on Magha Vinayaka Chaturthi, Tila Chaturthi, and Kunda Chaturthi


🌹 మాఘ వినాయక చతుర్థి, తిల చతుర్ధి, కుంద చతుర్ధి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Happy Magha Vinayaka Chaturthi, Tila Chaturthi, and Kunda Chaturthi to everyone 🌹

Prasad Bharadwaj



మాఘ వినాయక చతుర్థి పూజా విధానం Magha Vinayaka Chaturthi & Pooja Procedure


🌹 మాఘ వినాయక చతుర్థి, తిల చతుర్ధి, కుంద చతుర్ధి నాడు ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి..! పూజా విధానం. జనవరి 22.. 🌹

🍀 వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోలేని వాళ్లు.. అంతే ఫలితం రావాలంటే మాఘ వినాయక చతుర్ధి రోజున వినాయకుడిని పూజించాలి. ఇది కూడా వినాయక చవితి. 🍀

ప్రసాద్ భరద్వాజ


🌹 Performing these rituals on Magha Vinayaka Chaturthi, Tila Chaturthi, or Kunda Chaturthi will bring all auspicious blessings! Pooja procedure. January 22nd.. 🌹

🍀 Those who are unable to perform Ganesh Pooja on Ganesh Chaturthi can worship Lord Ganesha on Magha Vinayaka Chaturthi to receive the same benefits. This is also a Ganesh Chaturthi. 🍀

Prasad Bharadwaj



మాఘ మాసం విష్ణుమూర్తికి, సూర్యనారాయణ మూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. మాఘ మాసంలో శుక్ల పక్షంలో చవితిని లేదా చతుర్ధిని.. మాఘ వినాయక చతుర్ధి అంటారు. తిల చతుర్ధి, కుంద చతుర్థి పేర్లతో కూడా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన రోజు అని పండితులు చెబుతున్నారు. జనవరి 22.. గురువారం.. మాఘ శుక్ల చతుర్థి తిథి వచ్చింది.

ఈ మాఘ శుక్ల చతుర్ధిని తిల చతుర్ధి అని పిలుస్తారు. ఆరోజు తిలలు అంటే నువ్వులు దానం ఇస్తే కోటి సార్లు తిలలు దానం చేసిన ఫలితం కలుగుతుంది. మామూలు సమయంలో నువ్వులు దానం ఇచ్చిన ఫలితం కంటే కోటి రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. అది తిల చతుర్ధికి ఉన్న ప్రాధాన్యత. దేవాలయంలో నువ్వులు దానం ఇవ్వడం వల్ల మామూలు సమయంలో ఇచ్చిన నువ్వుల దానం కంటే కోటి రెట్లు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

మాఘ శుక్ల చవితి తిధిని కుంద చవితి లేదా కుంద చతుర్థి అనే పేర్లతో పిలుస్తారు. కుంద పుష్పములు అంటే మల్లె పువ్వులు. మల్లె పూలతో ఈశ్వరుడిని పూజించేటటువంటి చవితి కనుక దీన్ని కుంద చతుర్ధి అంటారు. ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం ఈశ్వరుడి శివ లింగ స్వరూపానికి కానీ ఈశ్వరుడి ఫోటోకి కానీ మల్లె పూలతో పూజ చేయండి. శివుడికి చిమ్మిలి నైవేద్యం పెట్టండి. దాని వల్ల జీవితంలో దంపతుల మధ్య గొడవలు ఉండవని, మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని పండితులు తెలిపారు. కుటుంబ జీవితం బాగుండాలంటే జనవరి 22న మల్లెపూలతో శివుడిని పూజించాలన్నారు.

మాఘ శుక్ల చవితి తిథికి మరో గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని మాఘ వినాయక చతుర్ధి అనే పేరుతో పిలుస్తారు. మాఘ వినాయక చతుర్ధి సంద్భంగా ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల పనులన్నీ సులభంగా పూర్తవుతాయో, ఆటంకాలన్నీ తొలగిపోతాయో, విఘ్నాలు ఉండవో, మాఘ వినాయక చతుర్ధి రోజున ఎలా పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి లేదా చతుర్ధిని మాఘ వినాయక చతుర్థి అంటారు. సహజంగా వినాయకుడు భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి రోజున పుట్టాడని, ఆ రోజు మనం అంతా వినాయక చవితి చేసుకుంటాం. అయితే, భాద్రపద మాసంలో మహిళలు రజస్వల దోషాల వల్ల, ఏటి సూతకాల దోషాల వల్ల, మైల వల్ల కానీ ఏ ఇతర ఆరోగ్య, వృత్తిపరమైన కారణాల వల్ల కానీ.. వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోలేని వాళ్లు.. వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకోలేని వాళ్లు.. ఆ రోజున వినాయకుడిని పూజిస్తే ఎంతటి అద్భుతమైన ఫలితం కలుగుతుందో.. అంతే ఫలితం రావాలంటే మాఘ వినాయక చతుర్ధి రోజున వినాయకుడిని పూజించాలి. అందుకే, మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చవితి లేదా చతుర్ధిని మాఘ వినాయక చతుర్ధి అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా వినాయక చవితే.


🌻 పూజా విధానం.. 🌻

ఇంట్లో గణపతి విగ్రహం లేదా ఫోటో ఉంటే గంధం, కంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతికి కొబ్బరి నూనె దీపం, 5 వత్తుల దీపం ఇష్టం. అలాగే గణపతికి ఎర్రటి పూలు, ఎర్రటి వస్త్రాలు అంటే ఇష్టం. ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీలతో గణపతిని పూజించాలి. గణపతి 108 నామాలు చదువుకోవాలి. అది చదువుకోలేని వాళ్లు గం గణపతయే నమ: అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించండి.

ఇలా పూజిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పూజ సమయంలో రెండు మంత్రాలను కచ్చితంగా చదువుకోవాలి. గం క్షిప్రసాదాయ నమ:, వక్రతుండాయ హుం.. ఒక్కో మంత్రాన్ని 21సార్లు చదువుకోవాలి. మీ పనుల్లో ఏడాది పాటు ఆటంకాలు ఉండవు. కోరికలు తొందరగా నెరవేరతాయి. సంకటనాసిక గణేశ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలని పండితులు తెలిపారు.

🌹🌹🌹🌹🌹

మూడు శతాబ్దాల తర్వాత కేరళలోని నీలా నదిపై జరిగే మహామఘ పండుగ – కేరళ కుంభమేళా The Kerala Kumbh Mela


🌹 మూడు శతాబ్దాల తర్వాత కేరళలో తొలిసారి మహామాఘ మహోత్సవం నీలా నది కేరళ కుంభమేళా 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 After three centuries, the Mahamagha festival is being celebrated for the first time in Kerala on the Nila River – the Kerala Kumbh Mela 🌹
Prasad Bharadwaj


కేరళలో దాదాపు మూడు శతాబ్దాల తర్వాత కుంభమేళా జరుగుతోంది. నీలా నది(Nila river) (భారతపుళ) తీరంలో కేరళ (Kerala) కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన' మహామాఘ మహోత్సవం' ప్రారంభమైంది.

మలప్పురం జిల్లా తిరునవయలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ఈ క్రతువును లాంఛనంగా ప్రారంభించారు. మాహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి మహారాజ్ నేతృత్వంలో మొదటి స్నానం నవముకుంద ఆలయ స్నాన ఘాట్‌లో జరిగింది. ఈ ఉత్సవాన్ని 270 ఏళ్ల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత పూర్తిస్థాయిలో నిర్వహించడం చెప్పుకోదగ్గ అంశం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. 1755లో ఈ కుంభమేళా జరిగినట్లు సమాచారం.

50 వేల మందికిపైగా నీలా నదిలో పవిత్ర స్నానాలు

ఫిబ్రవరి 3 వరకు కొనసాగే ఈ కుంభమేళా ఉత్సవానికి కేరళ, తమిళనాడు , కర్ణాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రోజుకు దాదాపు 50 వేల మందికిపైగా నీలా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. వేడుకల్లో భాగంగా కాశీ పండితుల ఆధ్వర్యంలో రోజూ సాయంత్రం నీలానది హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు కేరళ ఆర్టీసీ.. 100 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కేరళ సంప్రదాయ విద్య కలరిపయట్టు, యోగతో పాటు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ కుంభమేళాలో భాగమైన రథయాత్ర కు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది తమిళనాడులోని ఉడుమల్‌పేట సమీపంలోని తిరుమూర్తి కొండ నుంచి సోమవారం ఉదయం రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వం నిలిపివేసింది.

🌹 🌹 🌹 🌹 🌹


మాఘ మాసంలో నది స్నాన విధి మరియు విశిష్టత / Significance of Taking a Holy River Bath in the Magha Masam


🌹 మాఘ మాసంలో నది స్నాన విధి మరియు విశిష్టత : ఆధ్యాత్మిక పుణ్యఫలం – మోక్ష మార్గం Significance of Taking a Holy River Bath in the Magha Masam 🌹

ప్రసాద్ భరద్వాజ


మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తున్నప్పుడు నదులన్నీ గంగా నదితో సమానమైన పవిత్రతను పొందుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలంలో చేసే తెల్లవారుజాము స్నానాన్ని ‘బ్రహ్మ ముహూర్త స్నానం’ అంటారు. ఇలా చేయడం వల్ల గత జన్మ పాపాలు తొలగిపోవడమే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ముఖ్యంగా ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో త్రివేణి సంగమ స్నానం అత్యంత శ్రేష్టమని చెబుతారు. ఈ మాసంలో నదీ జలాలు దైవ శక్తిని కలిగి ఉంటాయని ప్రతి రోజూ స్నానం చేయలేకపోయినా కనీసం మాఘ పూర్ణిమ నాడైనా నదిలో మునక వేస్తే సకల శుభాలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

ఆరోగ్య రహస్యం – శాస్త్రీయ కోణం: నదీ స్నానం వెనుక లోతైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చలికాలంలో నదీ జలాలు ఖనిజ లవణాలతో నిండి ఉండి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. తెల్లవారుజామున చల్లని నీటిలో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యోదయానికి ముందు నదిలో మునిగినప్పుడు, గాలిలోని ఓజోన్ మరియు నీటిలోని ఔషధ గుణాలు చర్మ వ్యాధులను నివారిస్తాయి.

స్నాన విధి మరియు విశిష్టత : మాఘ స్నానాన్ని నదిలో చేయడం ఉత్తమం, కుదరని పక్షంలో ఇంట్లోనే నదులను స్మరిస్తూ స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలి దీపదానం చేయడం విశేష ఫలాన్ని ఇస్తుంది. పవిత్రమైన ఆలోచనలతో భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాకుండా ఆత్మను కూడా పవిత్రం చేస్తుంది.

🌹🌹🌹🌹🌹




🌹 River Bath Ritual and Its Significance in the Month of Magha Spiritual Merit and the Path to Liberation (Moksha) 🌹

- Prasad Bharadwaj


According to the Puranas, during the sacred month of Magha, when the Sun transits through Makara Rashi (Capricorn), all rivers are believed to attain the sanctity of the Ganga. The early-morning bath taken in this period is known as the Brahma Muhurta Snanam. Devotees believe that observing this sacred bath not only washes away sins from past births but also bestows the divine grace of Lord Vishnu.

Among all holy places, taking a dip at the Triveni Sangam in Prayagraj—the confluence of the Ganga, Yamuna, and the invisible Saraswati—is regarded as supremely auspicious. Scriptures proclaim that the waters during this month are infused with divine energy. Even if one cannot bathe daily, taking a holy dip at least on Magha Purnima is said to bring prosperity, purity, and spiritual upliftment.


Health Secrets – A Scientific Perspective

Beyond spiritual beliefs, river bathing in Magha holds profound health benefits. During winter, river waters are rich in natural minerals that rejuvenate the body. Bathing in cold water at dawn improves blood circulation and strengthens the immune system. Immersing in river water before sunrise exposes the body to ozone-rich air and the medicinal properties of flowing water, which help prevent skin ailments and promote overall vitality.


Ritual Method and Spiritual Importance

Taking the Magha bath in a river is considered ideal; if that is not possible, one may bathe at home while mentally invoking sacred rivers. After bathing, offering Arghya (water oblation) to Surya Bhagavan and performing Deepa Daanam (lamp offering) are said to yield special merit. When performed with purity of thought, devotion, and faith, this sacred bath purifies not only the body but also elevates the soul.

🌹🌹🌹🌹🌹


మాఘమాస స్నానం సర్వ పాపహరణం - విష్ణు ప్రీతికరం Maagh Masam ( Magh month as per the Indian Calendar)



https://youtube.com/shorts/dIOJFaDLGrY


🌹 మీకు మీ కుటుంబ సభ్యులకు మాఘమాస ప్రారంభ శుభాకాంక్షలు 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 మాఘమాస స్నానం సర్వ పాపహరణం - విష్ణు ప్రీతికరం MAAGHA MASAM 🌹
ప్రసాద్‌ భరధ్వాజ



తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share


🌹🌹🌹🌹🌹

మాఘమాసం The Month of Magh (of Indian Calendar)


🌹 మాఘమాసం విశిష్టత - మాఘమాసంలో సముద్ర, నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం పుణ్యప్రదం🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🌹 The significance of the month of Magha - Taking a bath in the sea or a river, chanting mantras, performing acts of charity, and reading Puranas during the month of Magha are considered meritorious. 🌹

Prasad Bharadwaj



చంద్రుడు మఖ నక్షత్రంలో కూడిన మాసం "మాఘమాసం". మఘం అంటే యజ్ఞం అని అర్థం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. ఇక మాఘం అంటే పాపాలను నశింప జేసేది. ఇది విష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది. అమ్మ వారికి కూడా అత్యంత ప్రీతికరం. శ్యామలా దేవి నవరాత్రులు అని చేస్తారు. ఈ మాఘమాసంలో ఆచరించే సముద్ర స్నానం, నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఇది పాప ప్రక్షాళనకు, ఆత్మ శుద్ధికి, మరియు దైవిక అనుగ్రహం పొందడానికి లభించిన అద్భుతమైన అవకాశం. మాఘ మాసం ఆధ్యాత్మిక ప్రగతికి, మానసిక శాంతికి, అనందానికి మరియు ఆరోగ్యానికి మార్గం సుగమం చేస్తుంది. మాఘమాసం త్రిమూర్త్యాత్మకం. పూర్ణిమ, అమావాస్య బ్రహ్మ స్వరూపాలు. శుక్లపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14రోజులు విష్ణుస్వరూపం. కృష్ణపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14రోజులు శివస్వరూపం. మాసం మొత్తం జగన్మాత స్వరూపం.

ఈ మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో సంచరిస్తాడు. మాఘ మాసం భగవంతుడితో మన సంబంధాన్ని బలపరచుకొని, పుణ్యాన్ని సంపాదించి, ప్రగతిశీలమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ మాసంలో ప్రప్రథమం చేయాల్సింది నదీ స్నానం. ఈ నదీ స్నానంతో పాపాలు హరిస్తాయని పురాణోక్తి.

మాఘ స్నానం: ఈ స్నానాలకి అధిపతి సూర్య భగవానుడు. కార్తీక గాలుల్లో చంద్రుడు ఓషది కారకుడై ఆరోగ్యం ఎట్లు కలిగించునో అట్లే రవి కూడా ఈ కాలమందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్నిస్తాడు. అందుకే స్నానానంతరం సూర్యునికి ఆర్గ్యం ఇస్తారు. ఇక ఈ స్నానాలు అఘమర్షణ స్నానఫలాన్ని ఇస్తాయి. పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి. శతగుణ ఫలాన్ని ఇస్తాయి.


"దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చl

ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనంll

మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవl

స్నానేనానేనమే దేవ యథోక్త ఫలదోభవll"


అనే శ్లోకం చదువుతూ మాఘ స్నానం చేయాలి. ఈ మాసం ఏ పారాయణ చేసిన అది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది.


అరుణోదయేతు సంప్రాప్తే, స్నానకాలే విచక్షణః

మాధవాంఘ్రి యుగం ధ్యాయన్ యః స్నాతి సురపూజితః


ఇలా బ్రహ్మ పురాణం చెబుతున్నది. అనగా, సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతలచేత పూజితుడుఅవుతాడు. ఇక, నక్షత్రాలు ఉండగా చేయడం ఉత్తమం. లేనప్పుడు చేయడం మధ్యమం. సూర్యోదయం తదుపరి చెస్తే అధమం.

ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మాఘమాసంలో మాఘపురాణం చదవడం వల్ల సమస్త పాపాలు తొలగుతాయని విశ్వాసం. అలాగే ఆధ్యాత్మిక చింతనకు ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైనది.

ఉత్తరాయణంలో ముఖ్యమైన పండుగలన్నీ ఈ మాఘమాసంలోనే వస్తాయి. ఈ మాసం శ్యామలా నవరాత్రులతో ప్రారంభం అవుతుంది. ఆపై వసంత పంచమి , రథ సప్తమి పండుగతో పాటు.. మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలు ఉన్నాయి. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, సూర్య భగవానుడితో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడంటంతో శివుడికి కూడా ఈ మాసం అత్యంత కీలకం. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు చాలా విశిష్టమైనవి. ఈ రోజున తరిగిన కూరలు తినరు. అలాగే ఈ నెలలో మాఘ గౌరి నోము, మాఘ ఆదివారం నోము వంటివి విశేషంగా ఆచరిస్తారు.

అలాగే, మాఘ శుద్ధ చతుర్థి అనగా వరచతుర్ధి, పగలు ఉపవాసం ఉండి గణపతిని పుజించి రాత్రి భుజించాలి. సాయంత్రం శివుని పూజ చేయాలి.

ఇక, మాఘశుద్ద పంచమి శ్రీ పంచమి. సరస్వతి అవిర్భవించిన రోజు. ఆనాడు అక్షరాభ్యాసం చేసుకున్నవారు అదృష్టవంతులు.

తదుపరి మాఘ శుద్ధ సప్తమి -రథ సప్తమి యనబడును. బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథం ఆకారాన్ని కలిగి యుండునని పురాణ వచనం. రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు. ఆనాటి నుండి రవికి భూమి దగ్గరవడం మొదలు ఆపై వేసవికాలం మొదలు. ఆనాడు ఆయన్ని పూజిస్తే రాజయోగాలు, ఆరోగ్యం, అదృష్టం కలుగుతుంది.

ఆపై మాఘ శుద్ధ అష్టమి భీష్మాష్టమి. ఆయన పరమపదించిన రోజు.

తదుపరి, మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి. కృష్ణుడిచే సత్యవ్రతుడు వరం పొందినరోజు. ఆనాడు ఆయన మోక్షం పొందిన రోజు. ఆనాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణువునకు ప్రీతి.

మరునాడు భీష్మ ద్వాదశి. ఆనాడు కృష్ణుడిలో లీనమైన రోజు.

ఆపై, మాఘ శుద్ధ పూర్ణిమ అంటే మహా మాఘి. దేవి శక్తి అపారమైనదిగా మారే రోజు.

ఆపై, మాఘ బహుళ చతుర్థి. సంకష్టహర చతుర్థి. ఆపై, మాఘ బహుళ చతుర్దశి. మహా శివరాత్రి పర్వదినం.

మాఘ మాసంలో సాధించే ఆధ్యాత్మిక పునరుద్ధరణ మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. మనకు ఎదురయ్యే అన్ని విఘ్నాలను అంగీకరించి, ఈ పవిత్ర మాసాన్ని గౌరవంగా జరుపుకోవడం అనేక పుణ్యాలను సంపాదించడానికి మరియు మన ఆధ్యాత్మిక జీవితం బలపడే దిశగా ముందుకు తీసుకెళ్లే మార్గం. మనం ఈ నెలలో నిరంతరం ధ్యానిస్తూ, పూజలు నిర్వహిస్తూ, భగవంతుని ఆశీస్సులు పొందే అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి.

🌹🌹🌹🌹🌹