సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 47

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 47 🌹
47 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 4 🍃

353. ఆత్మ జ్ఞానము, అజ్ఞానము తొలగిన ప్రాప్తించును. స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన కాంతి, జ్ఞానము ఆత్మనుండియె ప్రకాశించును. ఆత్మ తత్త్వ బోధనచే, ఆత్మను పొందవచ్చును. పొగచేత నిప్పు, దుమ్ముచేత అద్దము, మాయచేత గర్భస్థ శిశువు కప్పబడి ఉన్నట్లు, కామముచేత ఆత్మజ్ఞానము కప్పబడి ఉన్నది.

354. ఆత్మదర్శన ఫలితములు:-

1. కర్మలు చేసినను అవి అంటవు.
2. సుఖ,దుఃఖ జనన మరణాది బ్రాంతులు నశించును.
3. భయము, మరణ భయము తొలగిపోవును.
4. వీర్యము, బుద్ధి, తేజస్సు వృద్ధి పొందును.
5. బాహ వ్యాపారమున చంచలముగా కనిపించినప్పటికి అంతరమున మేరు పర్వతమువలె నిశ్చలముగా ఉండును.
6. అహంకారము నశించి, మానసిక వ్యాధులు తొలగును. శరీర ప్రారబ్ధముండును.
7. శాపములు, పాపదృష్టి వీరిపై ప్రభావం చూపలేవు. మానసిక చింతలుండవు.
8. దుఃఖములు, మనోవ్యాధి తొలగును.
9. శాశ్వత సుఖము, పరమశాంతి ప్రాప్తించును.
10. చిత్త భ్రమ తొలగి, చిత్త శాంతి లభించును.

355. ఆత్మదర్శనమునకు సాధనా మార్గములు:

1. ప్రతి క్షణము, భుజించుచున్నను, నిద్రించుచున్నను, కూర్చున్నను, నడుచుచున్నప్పుడు ఎల్లవేలల ఆత్మవిచారణ చేయుచుండవలెను.
2. జనకుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, భగీరదుడు మొదలైన యోగులు నిరంతరము యోగ సాధన చేసిన వారే.
3. శ్రీ వసిష్టులవారి శ్రీ యోగవాసిష్టము, ఆత్మ జ్ఞానము పొందుటకు తోడ్పడును.
4. అనంత దీక్ష, సాధన, నిష్ఠ, మానసికశక్తి ద్వారా కృషి చేయవలెను.
5. అంతరాత్మ ప్రేరణతో ఆత్మను తెలుసుకోవలెను. ఆత్మయె ప్రేరణ.
6. ఆత్మ గ్రంథ పఠనము ద్వారా పొందునదికాదు.
7. దుష్ప్రవర్తన, అశాంతి, ఏకాగ్రత లేనివాడు ఆత్మను పొందలేడు.
8. కోరికలు లేనివాడు, దుఃఖరహితుడు, వాంఛారహితుడు, ఇంద్రియ శుద్ధి కలవాడు, మనోక్షయము, చిత్త శుద్ధి కలవాడు మాత్రమే ఆత్మను తెలుసుకొనగలడు.
9. శారీరక, మానసిక దుర్బలుడు ఆత్మను పొందలేడు. కార్యదక్షత, ఆరోగ్యము, నమ్మకము నిరంతర సాధన కలవారిని ఆత్మ వరించును.
10. అంతరాత్మ యందే పరమాత్మను దర్శించవలెను. ముముక్షువు, శాంతుడు, సమాధి నిష్టుడు, సూక్ష్మ బుద్ధి కలవాడు, దివ్య దృష్టి కలవాడు, సంకల్ప శక్తి కలవాడు మాత్రమే ఆత్మను పొందగలడు.
11. అనుభవజ్ఞుడైన గురువును పొంది ఆత్మ రహస్యము తెలుసుకొని అనుభూతి పొందవలెను.
12.ఆత్మను పొందాలంటే విచారణ, అభ్యాసము, స్వానుభవము, శాస్త్ర జ్ఞానము, గురువాక్యము వీని సమన్వయము వలననే ఆత్మావగాహన కలుగును. స్త్రీలు, పురుషులు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, శూద్రులు, ఛండాలురు, బాలురు, వృద్ధులు, యవ్వనులు, వ్యాధిగ్రస్తులు మొదలగువారందరు ఆత్మ విచారణ చేయవచ్చు.
13. ఆత్మ దర్శనమునకు ఉపయోగపడనివి: వస్తు సంపద, ధనము, మిత్రులు, బంధువులు, తీర్థయాత్రలు, నదీస్నానములు మొదలగునవి.
14. ఆత్మను కేవలము సూక్ష్మ బుద్ధిచేతనే తెలుసుకొనుటకు వీలగును. అంతన్నేత్రంతో హృదయ భాగమున సహజముగా ఏకాగ్రతతో ఆత్మను ధ్యానించి భగవత్‌ సాక్షాత్కారము పొందవచ్చు. భగవంతుని స్వరూపము నిర్వికారము, నిరాకారము. అందువలన సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన వలననే పరమాత్మను పొందవచ్చు. కాని నిర్గుణోపాసన అసాధ్యము. సగుణోపాసన చేయగా చేయగా, అది నిర్గుణోపాసనకు దారి తీయును.

 

🌹 🌹 🌹 🌹 🌹