Showing posts with label మైత్రేయ మహర్షి బోధనలు. Show all posts
Showing posts with label మైత్రేయ మహర్షి బోధనలు. Show all posts
మైత్రేయ మహర్షి బోధనలు - 145
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 145 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 108. దేవ దానవులు -2🌻
మనిషి యందు అయస్కాంత శక్తి వెనుక గల బలము సంకల్పము, బుద్ధియే అని ఎరుగవలెను. మహాత్ముల యందు, సద్గురువుల యందు ఈ రెండు బలములు దర్శనమిచ్చుచుండును. జాతిపిత యని అందరిచే గౌరవింపబడిన మహాత్మా గాంధి యందు కూడ ఈ దివ్య శక్తులే ప్రవేశించి, కార్యమును నిర్వర్తించినవి.
సంకల్పశక్తి వాడియైన బాణముకన్న పదునైనది. దానిని దిశా నిర్దేశము చేయునది బుద్ధి. బుద్ధి అధ్యక్షతన సంకల్పము నిర్వర్తింప బడవలె ననుటకు సంకేతమే గణపతి గురుత్వము, కుమారుని శిష్యత్వము. బుద్ధి అధిష్ఠించి, సంకల్పము నిర్వర్తింపబడినచో మానవుడు దివ్యత్వము నొందుచుండును. బుద్ధి లోపించినచో మానవుడు దానవుడగును. రామ రావణులకు, కర్ణార్జునులకు ఇదియే భేదము.
చివరి భాగము
సమాప్తము..... 🙏
🌹 🌹 🌹 🌹 🌹
07 Jul 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 144
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 144 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 108. దేవ దానవులు -1🌻
మానవులకు దైవమిచ్చిన వరము సంకల్ప బలము, బుద్ధి. సంకల్ప బలము మహిమ మానవులకు పూర్ణముగ తెలియదు. తెలిసిన సరిసమానమగు బుద్ధి బలము లేనప్పుడు రాక్షసులగుచున్నారు. సంకల్ప బలమునకు బుద్ధి బలము తోడై నిలచినచో మానవుని పురోగతి త్వరిత గతిని సాగగలదు. సంకల్పబలము కుమారుని వంటిది. బుద్ధిబలము గణపతి వంటిది. గ్రహ పరముగ సంకల్ప బలము కుజగ్రహము నుండి, బుద్ది బలము బృహస్పతి నుండి, మానవులకు లభించు చుండును.
పై కారణముగనే తెలిసిన వారైన హిందువులు శివతనయుని పార్వతీ తనయుని ప్రార్థింతురు. పూర్వకాలమున సంకల్పము కలిగిన మానవులు పర్వతములను సైతము అట్టి బలముచే కదిలించుట, స్థలమార్పు చేయుట వంటివి గావించినారు. అది ప్రస్తుతము మహాత్మ్యముగ కనపడ వచ్చును. అది మహాత్మ్యము కాదు, మాగ్నటిజమ్ అయస్కాంతశక్తి.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
05 Jul 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 143
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 143 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 107. రహస్య భాషణము -2🌻
యతీశ్వరుడొకడు తరచు జంతువులతో మాటాడుచుండెడి వాడు. యతి చిలుకలను చూచి యిట్లనుచుండెను. “ప్రచారకుడా! "చిలుక పలుకులు పలుకుదువు, కులుకుతు తిరిగెదవు, చిలుక కొట్టుడు, కొట్టెదవు, భవిష్యత్తున తప్పక మత ప్రచారకుడవు కాగలవు. అతడు నీ వలనే ప్రదర్శకుడే. ఆచార్యుడు కాడు కదా! కులుకుచు తిరుగును. చిలుక కొట్టుడు కొట్టుచుండును. చిలుక పలుకులు పలుకు చుండును. మీ బోటి వారి వలన సంఘమున కేమియు ప్రయోజనము లేదు. వ్యర్థ జీవనులు”.
యతి కోతిని చూచి యిట్లనుచుండెడివాడు “విధ్వంసకుడా! నీవనుభవింప లేవు. ఇతరుల ననుభవింప నీయవు. సర్వమును ధ్వంసము చేయుదువు. నీవు నిజముగ కోతివే. నీ నుండి మానవులు పుట్టుట అసత్యము. కాని మానవుల నుండి నీవు నిత్యము పుట్టు చుందువు. నీవు యితరుల శ్రమను ధ్వంసము చేయుటయే పనిగ పెట్టుకున్నావు.” యతి బోధలు ఆకాశ తరంగములలో చేరి భూమి చుట్టును నేటికిని పరిభ్రమించుచున్నవి. చెవులున్న వారికి వినబడగలవు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
03 Jul 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 142
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 142 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 107. రహస్య భాషణము - 1🌻
యతీశ్వరుడొకడు తరచు జంతువులతో మాటాడుచుండెడి వాడు. అతని నివాసము ఒక వనప్రదేశమున నుండెడిది. ఆ వనమందు తేనెపట్లు యున్నవి. చీమలు పెట్టిన పుట్టలున్నవి. రామచిలుక లుండెడివి. ఇన్నిటితోపాటు కోతి యొకటి యుండెడిది. యతి వానితో తరచు సంభాషించు చుండెడి వాడు. అతడు చీమలతో యిట్లను చుండెను. "శ్రామికులారా! మీ పరిశ్రమ నెవరు గుర్తింతురు. మీ పరిశ్రమ కారణముగనే ఉన్నతోన్నతమైన మహానగరములు నిర్మింప బడచున్నవి. విష సర్పములు అందుచేరి మిమ్ములను పారద్రోలుచున్నవి.”
అతడు తేనెటీగలను చూచి యిట్లు సంబోధించుచుండెను. "జ్ఞానులారా! శ్రమకోర్చి, స్వాధ్యాయము కావించి, జాతి ఉన్నతికై మాధుర్యమును పోగుచేయుచున్నారు. అట్లు ప్రోగు చేయుటలో గల మాధుర్యము మిమ్ము ఈ కార్యమున నిలిపినది. జాతి మీరందించు మాధుర్యమును అంగళ్ళలో అమ్ముకొనుచున్నారే, కాని అనుభవించుట లేదు. మీ శ్రమా మాధుర్యము యీ జాతి కబ్బదు. ఐనను మీరు కొనసాగించు శ్రమ దైవమునకు ప్రీతి కలిగించుచున్నది. అట్లే కానిండు.”
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
01 Jul 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 141
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 141 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 106. విచికిత్సలు - 2🌻
హాస్యమునకు పలికిన మాటలలో సత్యముల ప్రయత్నముగ బయల్పడును. ఈ సదస్సుల యందు ప్రజలు విశ్వాసమును కూడ కోల్పోయెదరు. కంటి తుడుపు సదస్సులే కాని మరియొకటి కాదను భావన కూడ వ్యక్తమగుచుండును. ఉదాహరణకు ప్రజాస్వామ్యమని ప్రస్తుత శతాబ్దముల యందు మీరు చేయు కేకలు మిన్నంటుచున్నవి కాని మచ్చునకైనను మానవ సంఘములలో ప్రజాస్వామ్యము గోచరింపదు.
సదస్సులు, విచికిత్సలు, తీర్మానములు, ఉల్లంఘనలు జాతి జీవనశైలియై నిలచినది. త్రికరణ శుద్ధి, దీక్షాయుత జీవనము మృగ్య మైనప్పుడు, వ్యక్తికిని సంఘమునకు కీడేగాని మేలు జరుగదు. పై కారణముగ నా అనుయాయులకును తెలియజేయు విషయమొక్కటే! తెలిసినది ఆచరింపుడు. విచికిత్సలు విసర్జింపుడు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
29 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 140
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 140 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 106. విచికిత్సలు - 1🌻
మీ మానవ సంఘము నందు అధికారమును గూర్చి, హక్కులను గూర్చి, సహకారమును గూర్చి సుహృత్ భావమును గూర్చి అనేకానేక విచికిత్సలు జరుగుచుండును. అట్లే పేదరిక నిర్మూలనమును గూర్చి అనారోగ్య పరిస్థితులను గూర్చి, రోగములను గూర్చి ఆరోగ్యమును గూర్చి సదస్సులు జరుగు చుండును. సంఘమందలి సమస్త సమస్యలను గూర్చి, కోట్లాది ధనము ఖర్చుచేయుచు భౌగోళికముగ విచికిత్సలు జరుగుచుండును. సదస్సులలో తీర్మానములు కూడ చేయుచుందురు. ఆచరణ అంతంతమాత్రమే.
విచికిత్స ఎక్కువ, ఆచరణ తక్కువ. ఈ విచికిత్స జాతికి ప్రధానమైన రుగ్మతగా మాకు గోచరించు చుండును. సదస్సులు నిర్వహించి, విచికిత్సచేసి, కారణములు వెదకి, తీర్మానములు చేసి, వాటిని ఉల్లంఘించుట చేయుదురు. 'ఉల్లంఘించుటకే కదా తీర్మానములు !' అను భావము కూడ హాస్యముగ మీరు వ్యక్తము చేయుదురు. అందు సత్యము సమృద్ధిగా నున్నదని గమనింపవలెను.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
27 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 139
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 139 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 105. సదాచారము🌻
మానవజాతి యందు లెక్క లేనన్ని అస్వస్థతలున్నవి. లక్షల సంవత్సరముల నుండి, అజ్ఞానము కారణముగ జాతి యొనర్చిన దుష్కృత్యములు జాతి కర్మగ స్థిరపడి మానవుని బాధించుచున్నవి. మోటు మనుషుల కన్న సున్నితమైన మనస్సు గలవారికే, వ్యాధుల బాధ యెక్కువ. అందున దైవము ధర్మము, దయ, సత్యము, సత్కర్మ అను గుణములు నాశ్రయించిన వారికి వ్యాధుల ఆటుపోట్లు మరింత ఎక్కువగ నుండును. వారి శరీర ధాతువులు అహింసా మార్గమున సున్నితమగు చుండగ, వాతావరణ మందలి కాలుష్యము వారిని అంటుట సులభ మగుచుండును.
కావున అట్టివారు సామాన్యులకన్న కొంత భిన్నమైన ఆహార వ్యవహారాదులను ఏర్పరచుకొనవలసి యుండును. ఆచారము పేరున పెద్దలు ఈ రక్షణ కల్పించిరి. సదాచార మందు యిట్టి శ్రేయస్సు యిమిడి యున్నదని సాధకులు గ్రహించ వలెను. శుచి, శుభ్రత, దైనందిన దైవప్రార్థన, సదాచారములోని భాగములు. వీనిని అశ్రద్ధ చేయుట తగదు. మానవ సమాజమున ధార్మిక సంపత్తి కలవారు సదాచారము నవలంబించుటలో చాల వ్యాధుల నుండి పరిరక్షించు కొనగలరు. సదాచారము విషయమున అశ్రద్ధ గలవారు కంటినొప్పి, పంటి గొప్పి, అజీర్తి, ఇత్యాది బాధలకు తరచు గురి కాగలరు. సత్సాధకులు దీనిని గమనించుదురు గాక!
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
25 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 138
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 138 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 104. కలుపు మొక్కలు - 2🌻
సామాన్య మానవుల విషయమున కుర్చీ నుండి పడక వరకు సొంతము చేసుకొను బుద్ధి మిక్కుటముగ నుండును. అట్టి స్థితిలో క్రొత్తవారు చేరునపుడు ఆదరించి తాము చేయుచున్న పనిలో ప్రవేశము కల్పించి తమలో కలుపుకొనుటకు చాల పెద్ద మనస్సు అవసరము. ఇట్టి పెద్ద మనస్సున్న వారే బృందములో పెద్దవారు. లేనివారు బృందము యొక్క ఆయుర్దాయమునకు తెలియక గండి కొడుదురు.
నూతనముగ వచ్చిన వారిలో గల సామర్థ్యమును, నైపుణ్యమును గుర్తించి తగు రీతిని వారికిని కార్యక్రమముల యందు బాధ్యత ఏర్పరచుట సహకారమునకు సంకేతము. సహకారము లేని సంగములు, బృంద జీవనములు, నామ మాత్రములై సదాశయమను విత్తనమునకు జన్మించిన కలుపు మొక్కలుగ భాసించును. సహకార ఉద్యమమునకు ఇవి వెక్కిరింతై గోచరించును.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
23 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 137
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 137 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 104. కలుపు మొక్కలు - 1🌻
యాంత్రిక జీవనమున జీవము తక్కువ. సహజీవనమున జీవమెక్కువ. సహజీవనము సరియగు మార్గమున నడచినచో, దివ్య జీవనమునకు అవకాశమేర్పడును. దివ్యజీవనమునకు ఉత్సహించి కొన్ని కుటుంబములొకచోట జేరి జీవించుటకు ప్రయత్నింతురు. దైనందిన కార్యక్రమముల నేర్పరతురు. ఉత్సాహముతో కార్యక్రమ ములు నిర్వర్తించుచుండగ, కాలక్రమమున అట్టి జీవనము కూడ యాంత్రికమగు అపాయము కలదు.
మానవులేర్పరచుకొన్న ఆశ్రమము లన్నియు కాలక్రమమున యాంత్రికములై నిర్జీవమగుచున్నవి. అట్లుకాక సజీవమై యుండవలెనన్నచో, సంఘమున నూతన సభ్యులు
చేరుచుండవలెను. నూతన కార్యక్రమములు కూడ సృజనాత్మకముగ నేర్పరచు కొనుచుండ వలెను, క్రొత్తవారి నంగీకరించుటకు ఉన్న వారికి పెద్ద మనసుండ వలెను. మానవుని మనస్సు, ప్రతి విషయమునందును స్థిరపడు టకు ప్రయత్నము చేయుచుండును. యతీశ్వరులు సైతము రాత్రులకన్న ఒక ప్రదేశమున నున్నచో మనస్సచ్చట స్థిరపడుటకై యత్నించునని భావించి, సంచారము చేయుచుందురు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
21 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 136
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 136 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 103. సూటి మార్గము🌻
ఆత్మ విచారము తామర తంపరయై, అడవివలె పెరిగినపుడు, ఆధ్యాత్మిక మార్గములు అగమ్యగోచరమగును. సామాన్యునికి, దిక్కుతెలియని స్థితి ఏర్పడును. పలువురు, పలు రకములుగ చేయు ఉద్భోధనలు తికమకపెట్టును. ఆత్మ సాధకునకు మార్గము తెలియక కలవరము మొదలగును. అంతయు అయోమయమగును. ఇట్టి సమయములలో పరిష్కారమొక్కటే. బాహ్యమగు విషయములను విసర్జించి, నీ హృదయమున నీవు, దైవమును చూడుము. నీ హృదయమునందే అతడున్నాడు. అచటనే వెదకుము.
అందరితోను హృదయసంబంధమే కలిగియుండుము. దైవము హృదయున సన్నిహితమగు మిత్రుడు. అతనికి గల ప్రేమ అపరిమితము. అది సామాన్యముగ బయట దొరకదు. అరుదుగ బాహ్యమున కూడ అతడు తన ప్రేమను జీవుల రూపమున రుచి చూపించుచుండును. అంతరంగమున అది ఎప్పుడును లభ్యమే. హృదయ సంబంధమే నిజమగు దైవ సంబంధము. ఇతరములన్నీ బంధములే గాని సంబంధములు కాజాలవు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
19 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 135
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 135 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 102. బృందము - జీవము - 2 🌻
వృక్షము కూడ పెద్ద, చిన్న, బుల్లి కొమ్మలతో అలరారు చుండును. ఒక బృందమున వృద్ధులకు, స్త్రీలకు, పురుషులకు పిల్లలకు ప్రత్యేక కార్యక్రమములుండవలెను. అందరు కలిసి పాల్గొను కార్యక్రమములు కూడ ఉండవలెను. ఏకత్వమందు భిన్నత్వము, భిన్నత్వమందు ఏకత్వము గమనించి తదనుగుణముగ కార్యక్రమముల నేర్పరచు బృంద గణపతి, బృందములకు సరియైన పురోగతి నందించ గలడు.
అందరికిని వారి సహజ సమర్థతకు సరిపడు రీతిని కార్యక్రమములను రూపొందించ వలెను. ఒకరి కార్యక్రమములకు మరియొకరి కార్యక్రమములకు సహకారముండునట్లు కూడ ఏర్పాటు చేయవలెను. పై విధముగ యుక్తి యుక్తముగ బృందము నందు కార్యము లేర్పరచినచో వృక్షము వలె బృందము కూడ కలకాలము సమాజ సేవలందించ గలదు. ఈ జ్ఞానము లేక బృందములను నిర్మించుట వ్యర్థము. ఈ జ్ఞానమే, బృందములకు ప్రాణము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
17 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 134
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 134 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 102. బృందము - జీవము - 1 🌻
బృందములందు, స్త్రీలు, పురుషులు, పిల్లలు కలసిమెలసి మెలగవచ్చునా? లేక వారి మధ్య వ్యత్యాసము చూపవలెనా? తప్పక బృందమందు అందరును ఉండవచ్చును. కాని ప్రకృతి సిద్ధమగు కొన్ని వ్యత్యాసములు మన్నించుట శ్రేయస్కరము. ఒకే వృక్షమునకు వివిధమగు శాఖలున్నవి కదా! ఒక శాఖ తీరునకు మరియొక శాఖ తీరునకు వ్యత్యాసముండుట కూడ సహజమే అని గుర్తింపవలెను. వ్యత్యాసములతో కూడిన శాఖలతో ఒక వృక్షమున్నట్లే ఒక బృందమందు గల సభ్యుల మధ్య ఏకత్వమందు సహజమగు భిన్నత్వమును గుర్తించి మన్నింప వలెను.
పిల్లలు పిల్లలే, వారు పెద్దలు కారు. జీవ పరముగ పెద్దలే అయివుండవచ్చుగాని, దేహపరముగ, మానసిక పరముగ కారు. అట్లే పురుషులు పురుషులే. స్త్రీలు స్త్రీలే. పురుషులు, స్త్రీలు కాలేరు. స్త్రీలు, పురుషులు కాక సంఘమందు వృద్ధులుందురు. వారి జీవితానుభవము ఇతరులు తెలియవలసిన ఆవశ్యకత యున్నది. పెద్ద కొమ్మలు, చిన్న కొమ్మలు, రెమ్మలువలె వృద్ధులు, స్త్రీ పురుషులు, పిల్లలు కలసిన బృందమే అందము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
15 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 133
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 133 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 101. శిశు పోషణ - 3 🌻
పిల్లలకు రెండు విషయములు నేర్పుడు.
2. పిల్లలు పెరుగు, పరిసరములు ప్రత్యేకముగ నుంచు కొనవలెను. పట్టణములలో నెరిగిన వారికన్న పల్లెలలో పెరుగు వారు బలవంతులగుదురు. (ప్రాణ పరముగ, చేతనపరముగ) పల్లెలలో పెరిగిన వారికున్న వనములలో పెరిగినవారు, మరింత పటిష్ట వంతులగుదురు.
వనములలో విద్యాలయము లేర్పరచి మమకార పడక, చిన్నతనముననే ఆ విద్యాలయములకు పంపి సంస్కారవంతులగు ఉపాధ్యాయులచే విద్యలభ్యసింప చేసినచో తల్లిదండ్రులు తమ కర్తవ్యమును సక్రమముగ నిర్వర్తించిన వారగుదురు. లేనిచో గమ్యమును చేరు జీవులుగ కాక చర్విత చర్వణులై సంసార చక్రమున పడి జనన, మరణములకు లోబడు జీవులుగ నేర్పడుదురు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
13 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 132
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 132 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 101. శిశు పోషణ - 2 🌻
పిల్లలకు రెండు విషయములు నేర్పుడు.
1. వారిని తరచుగ మన ప్రదేశములకు, ఎత్తైన కొండ ప్రదేశములకు కొని పోవుచుండుడు. ఎత్తైన వృక్షముల క్రింద నివసింప చేయుడు. గడ్డి మొక్కలతోను, పువ్వులతోను, ప్రకృతి రంగులతోను కలిసి ఆడుకొననిండు, అట్టి ప్రదేశముల యందు, ప్రకృతినుండి విద్యుత్తు, ప్రాణము మిక్కుటముగ లభించును.
పదకొండు వందల అడుగుల పై ఎత్తుగల ప్రదేశములన్నియు, ప్రాణమయములే. విద్యుత్ మయములే. విద్యుత్తు తెలివిని పోషించగ, ప్రాణము దేహమును పోషించగలదు. చిన్నతనమున అడవులలో పెరిగిన పాండవులకు, అంతఃపురములలో పెరిగిన కౌరవులకు, ప్రాథమికముగ నేర్పడిన వ్యత్యాస మిదియే.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
11 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 131
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 131 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 101. శిశు పోషణ - 1 🌻
శిశుపోషణ విషయమున తల్లిదండ్రులు చేయు కృషి, మమకార పూరితము. ఆటబొమ్మలు, ఐస్క్రీమ్లు, చాక్లెట్లు, రంగురంగుల దుస్తులు, పాదరక్షలు అమర్చుటలో సతమతమగు తల్లి దండ్రులు, జీవపోషణకేమియు చేయుటలేదు. దేహపోషణము మాత్రమే చేయుచున్నారు.
మరికొందరు, ఆవేశముతో దైవ మంత్రములు, స్తోత్రములు, శతకములు, పిల్లలపై రుద్ది, వారు వల్లించునపుడు గర్వపడుచున్నారు. పిల్లలకు మంచి విషయములు నేర్పుచున్నామని, తెలియక అహంకార పడుచున్నారు. నిజముగ పిల్లల యందాసక్తి మీకున్నచో వారికి రెండు విషయములు నేర్పుడు.
సశేషం…..
🌹 🌹 🌹 🌹 🌹
09 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 130
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 130 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 100. మైత్రేయ మార్గము🌻
జీవితమున విజయములు కలుగుచున్న కొద్ది బాధ్యతలు పెరుగును. ఉత్తమమైన పరీక్ష యందు జయము పొందిన వాడు ఉత్తమమైన బాధ్యతను చేపట్టుటకే పరీక్ష. ఉత్తమమగు శక్తి గలవారు ఆ శక్తిని కార్యనిర్వహణమున నిలిపి జగత్ కళ్యాణమగు కార్యములను చేయుదురు. ఉత్తమమగు బుద్ధి వికాశము కలిగినప్పుడు అందుండి జన్మించు సిద్ధులకు, బాధ్యతలను పెంచునే గాని తగ్గించవు. ఉత్తములకు బాధ్యత మెండు. ఉత్తమ పురుషుడగు శ్రీరాముని జీవనము బాధ్యతామయమే.
బాధ్యత యందు రుచి గలవారే ఉత్తమత్త్వము కొఱకు నిజముగ పాటుపడుచుందురు. హక్కులకు పాటుపడు వారు, ప్రపంచమున ఉత్తమపదవు లందున్నను వానిని నిలుపుకొనలేరు. బాధ్యత, ఉత్తమత్త్వము రెండును బొమ్మ బొరుసుల వంటివి. బాధ్యతకే ఎగబ్రాకుట మైత్రేయ మార్గము. హక్కులకై పోరాడుట కలిమార్గము.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
07 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 129
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 129 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 99. సమయస్ఫూర్తి - 2🌻
కార్యములకు కాలము నిర్ణయించు వారు, కాలము ననుసరించుటలో సూక్ష్మ లోకము నందు వారికి తెలియకయే మార్గమును పటిష్టము గావించు కొనుచున్నారు. విఘ్నములను లోయలపై తెలియకయే సూక్ష్మమగు వంతెనలను నిర్మించు కొనుచున్నారు. కాలానుగుణ్యముగ జీవితమును నడుపుకొను వారిని కాలమే అన్ని సమస్యల నుండి ఉద్ధరించును.
సమస్యలు కలిగినపుడు తగు స్ఫూర్తి నిచ్చును. ధర్మజుడట్లే నడచెను. యక్ష ప్రశ్నల సమయమున, నహుష ప్రశ్నల సమయమున, స్వర్గారోహణ సమయమున, అతని కందిన పరిష్కారము, అతని స్ఫూర్తి నుండి కలిగిన పరిష్కారమే. ఆ స్ఫూర్తి సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి, కాలము యొక్క అనుగ్రహమే. సమయపాలనమే వలసిన దీక్ష.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
05 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 128
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 128 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 99. సమయస్ఫూర్తి - 1🌻
కార్యములకు శుభలగ్నములు, తేదీలు నిర్ణయించు కొనుట వానిని సకాలమున పూర్తి గావించు కొనుట ఒక క్రమశిక్షణ. దైనందిన జీవితమున నిదురలేచుటకు, స్నానాదికములను గావించు కొనుటకు, దైవప్రార్థనలు నిర్వర్తించుకొనుటకు, దైనందిన కార్యముల కొరకు ఆహార విహారముల కొరకు కాలనిర్ణయము జరుగవలెను. కాలమును నిర్ణయించి పాటించిన వారికి సంకల్పబలము పెరుగును. బలము సంకల్పసిద్ధిని కూడ నిచ్చును.
కాలము విషయమున అశ్రద్ధ పనికి రాదు. అలసత్వముండ రాదు. నిర్ణీత సమయమునకు కార్యములు నిర్వర్తించువారు సమర్థులు కాగలరు. సర్వసమర్థతకు సమయ పాలనమే ముఖ్యము. సూర్యచంద్రులు, గ్రహగోళాదులు కాలమునే దైవముగ భావించి ప్రవర్తింతురు. అట్లే సమస్త దేవతలును. కాలమును వ్యర్థము చేయువారు, నిజమగు వ్యర్థులు. వారు ఊబినేలపై నడుచునటు వంటివారు. ఇట్టి వారియందు అశ్రద్ధ, సోమరితనము తెలియకయే పెరిగి, తామున్న స్థితి నుండి కూడ దిగజారుట జరుగును.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
03 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 127
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 127 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 98. అశ్వఘోషుడు - 2🌻
నిత్య జీవితమే ఒక సినిమా. దీనిని గమనించుట నేర్చినచో దాని దర్శకుడు. నిర్మాత యొక్క చాతుర్యము మనలను అబ్బుర పరచగలదు. ప్రకృతి యందుగాని, మానవుని ప్రవర్తనయందు గాని, అంతర్యామిని దర్శించుట, అందమును దర్శించుటే. అతని లీలలుయే పశుపక్ష్యాదులు, సమస్త మానవుల ప్రవర్తనలును. అంతర్యామి సృష్టి నుండి, సృష్టి జీవులనుండి తొంగి చూచుచుండును. తొణికిసలాడు చుండును. మిరుమిట్లు కొలుపుచుండును. దిగ్భ్రాంతి కలిగించు చుండును. భయభ్రాంతులను కూడ కలిగించు చుండును.
అతనిని చూచువారికి సృష్టి అందమే గోచరించును. అశ్వఘోషుడట్లు దర్శించి, స్పందించి, చిత్రించి జనసమూహములను ఉత్తేజపరచినాడు. అతడు కేవలము చిత్రకారుడు కాదు. తీవ్రమగు సాధకుడు. తాను దర్శించిన అంతర్యామి అందమును చిత్రముల బంధించు ప్రయత్నమున సిద్ధుడైనాడు. అతడు నిజమగు యుపాసకుడు. అందము తీరుతెన్ను లెరిగినవాడు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
01 Jun 2022
మైత్రేయ మహర్షి బోధనలు - 126
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 126 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 98. అశ్వఘోషుడు - 1🌻
యోగసాధన యందు తీవ్ర తపన కలవానిని 'అవకరుడు' అని బోధించెదము. అవకరమనగా వంకరయని అర్థము కాదు. 'అవకరుడన’గా సాధన రూపమున సమస్త మలినములను నిర్మూలించు కొనువాడు. అజ్ఞానమును, అసంగమను అస్త్రముతో ఖండించువాడు. అవకరణకు ప్రకృతి అందమే స్ఫూర్తినందించుచుండును. ప్రకృతి అందమును సృష్టియందు దర్శించగలవాడు సమర్థుడు. అశ్వఘోషుడు అట్లు దర్శించెను.
అశ్వఘోషుడు రహదారి కూడలిలో నిలబడి చిత్రలేఖనము చేసెడివాడు. అతని చిత్రములన్నియు సమకాలిక మానవులకు స్ఫూర్తి కలిగించుచుండెడివి. స్ఫూర్తి కలవారే స్ఫూర్తినందివ్వగలరు. అందము నారాధించుట వలన అశ్వఘోషున కట్టి స్ఫూర్తి కలిగినది. ఆట, పాట రంగులు ఆనందము కలిగించనిచో ఆ జీవికి స్ఫూర్తినందు అవకాశము తక్కువ. వాని కొఱకు ప్రత్యేకముగ మీరేర్పరచుకొనిన సినిమా థియేటర్లకు మేము కూడ అప్పుడప్పుడు (టిక్కెట్టు కొని) వచ్చుచుందుము. సినిమాలు దర్శించినపుడు, వాని ఆవశ్యకత జాతికి తగుమాత్రమే అనిపించుచుండును.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
30 May 2022
Subscribe to:
Posts (Atom)



















