మాస్టర్ ఇ.కె. గారి సందేశములు (Master E K garu Sandēśamulu)


MΞSSДGΞS FЯФM   1   ΓФ   122 . . .
CФMIИG SФФИ . . .

🅼🅴🆂🆂🅰🅶🅴🆂 🅵🆁🅾🅼   1   🆃🅾    122  . . .
🅲🅾🅼🅸🅽🅶 🆂🅾🅾🅽 . . .


------------------------------------ x ------------------------------------

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 123 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 శరీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు - 2 🌻

శ్రీకృష్ణుడు విద్యాభ్యాసమైన వెనుక గురువు (సాందీపని) కోరిన ప్రకారము పంచజనుని గర్భమున నున్న బాలకుని బ్రదికించి అతి భక్తితో గురుదక్షిణగా సమర్పించెను. 

గురువునకలవిగాని పని తాను భగవంతుడై చేసి పెట్టినను, భక్తితో సమర్పించి గర్వము పొందరాదని లోకమునకు నేర్పెను. తాను గురువును మించిన వాడని గురువు, లోకులు మెచ్చవలయును గాని తాను భావింపరాదని నేర్పెను. 

పంచేంద్రియములకు గోచరించు నట్టి వస్తువులను బట్టి సుఖేచ్ఛ పుట్టును. సుఖ దుఃఖములు పుట్టక తప్పవు. ఇంద్రియముల రూపమునను , ఇంద్రియార్థముల రూపమునను అస్తిత్వము చెందునది నారాయణుడే అని జ్ఞప్తియున్న వారికి సుఖ దుఃఖములుండవు. సుఖములు అప్రయత్నముగా సిద్ధించును.

✍🏼. మాస్టర్ ఇ.కె.🌻 
🌹 🌹 🌹 🌹 🌹

11.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 124 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు - 3 🌻

అవతారమూర్తి ధర్మసాధన మవలంబించుటలో లీలలు చూపి , ప్రవర్తనము ఇట్లుండవలయునని నేర్పును. అపుడెవడైన అహంకారి తాను దేవుడనని చెప్పుకొనదలచినచో తానును గురువు దగ్గర విద్యలు నేర్చుట మున్నగు మంచిపనులు చేసి తీరవలయును. చేసినచో వాని అహంకారము తీరి నిజముగా తాను ఆత్మస్వరూపుడని తెలుసుకొనును.

🌻 🌻 🌻 

యమము అను సద్గుణమును నిర్లక్ష్యము చేయుటవలన జరుగు దండమే యమదండము. దీని ప్రయోజనము పునః పరిశుద్ధియే. 

కూడబెట్టిన సంపదలతో సుఖములు అనుభవించుటయే సురలోకము. పుణ్యములకు ఫలితము దేహసౌఖ్యమైనపుడు యమ దండన తప్పదు. దానినుండి తప్పించుకొనుటకై ఇంద్రియములను, మనస్సును దమించుకొని పరబ్రహ్మమును చూడగోరువారు గడుసరులే గాని, మోక్షజీవులు కారు. 

ఆత్మసమర్పణ మార్గము నవలంబించి అంతర్యామి అడుగుజాడల ననుసరించు వారే సర్వోత్తములని భాగవత మతము. ఇందు పరిసర జీవుల సద్గుణములే నారాయణుని కల్యాణ గుణములుగా తెలియబడును. 

మహనీయుల జీవిత సన్నివేశములను ప్రసంగించుకొనుటయే నారాయణ గుణకథ అను అమృత ప్రవాహము.

...... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻 

🌹 🌹 🌹 🌹 🌹

12.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 125 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 శ్రీ కృష్ణుని లీలలు మనకు పాఠాలు - 4 🌻

యాదవులు కృష్ణునాశ్రయింపలేదు. కృష్ణుడాధారముగ తాము సాధింపదలచిన ఆదర్శములకై ఉపయోగించుకొనుటకు యత్నించిరి. అతడు వారికి కావలసిన సమస్త సంపదలను ఇచ్చెను. అవి వారిని రక్షింపలేక పోయినవి. 

నిజముగా కృష్ణునికాశ్రితులు పాండవులు. వారికి శాశ్వతమైన , స్థిరమైన రక్షణ మార్గము లభించెను. శత్రువులపై జయము , రాజ్యసంపద , ధర్మపాలనము , మోక్షము లభించినవి. 

పాండవుల కన్న శ్రీకృష్ణున కెక్కువ ఆశ్రితులు వానిని ప్రేమించిన వ్రజ గోపికలు . వారన్యమెరుగరు. వారికి తన నిరంతర సాన్నిధ్యము ప్రసాదించెను.

..... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

13.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 126 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

"చూచితిని, చూచితిని! సంసార మహాసముద్రము దాటుటనగా నేమో దర్శించితిని! ఆశ్రయించిన వారి నతడు రక్షించుట యెట్లో గమనించితిని. యోగుల హృదయమున నాతడెట్లుండునో గ్రహించితిని. అందరికిని చుట్టమనగా నెవరో తెలిసికొంటిని. మూడుకన్నులు గలవానికి గూడ అంతుపట్టని ఒంటరిగాడెవడో తెలిసికొంటిని. ముక్తిమార్గము చక్కగా దర్శించి సుఖము ననుభవించితిని."

సంసార సాగరము దాటుట యనగా జరుగుచున్న సంఘటనల నడుమనుండి వానిలో మునగక దర్శింపగలుగుటయే గాని , వానిని విడిచిపోవుటకు యత్నించుట కాదని, కృష్ణుని అవతారము వలన ఉద్ధవుడు గ్రహించెను‌.

✍🏼 మాస్టర్ ఇ.కె.🌻 
🌹 🌹 🌹 🌹 🌹

------------------------------------ x ------------------------------------

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 127 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : పద్మావతి దేవి 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సమర్పణ 🌻

తాను తరింపవలెనని జ్ఞప్తి యున్నవాడెవడును తరింపడు. అతడు గొప్ప సాధకుడు కావచ్చును గాని, తన సాధనకు తానే కేంద్రము.

తాను తరింపవలెనను బుద్ధి స్వలాభబుద్ధియగు స్వార్థమే యగును. దానిని సమర్పణము చేయని వాడెవ్వడు తరింపడు. 

సమర్పణ చేయుదమనుకొన్నను అనుకొనుట పోదు కనుక సమర్పణము జరగదు. దేవుని వేషమున తానే తన మనస్సున పగటి వేషగాడై నిలబడి సమర్పించు కొనుటయు, పుచ్చుకొనుటయు చేయును గనుక సమర్పణ జరుగదు. 

మహనీయుల మూర్తులను నారాయణుని మూర్తిగా ముచ్చటపడి ధ్యానింపవలెను. వారి సద్గుణముల యందు అభిలాష కలిగి వర్ణింపవలెను. అపుడప్రయత్నముగా సమర్పణ జరుగును. 

సమర్పించునట్టి మనస్సు తన యందు మేల్కొని యున్నంతవరకు సమర్పింపదు. మనస్సును మోసగించి అది లేనపుడు సమర్పణ జరుగునట్లు మార్గము తీర్చిదిద్దుకొన‌వలెనే గాని సమర్పణ సంకల్పము వలన కాదు.

ఈ సమర్పణ జరుగుటకు అంతకు ముందు సమర్పణ జరిగిన వారి సాంగత్యము ఆవశ్యకము. వారి సాంగత్యమున సమకూర్చిన వారిని కూడ నారాయణుని మూర్తులుగా తెలియవలెను.

..... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

15.Aug.2020

------------------------------------ x ------------------------------------


 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 128 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : పద్మావతి దేవి 
📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ధ్యానము - విశిష్టత 🌻

భాగవత మార్గమందలి సాధకులు సృష్టియందు నారాయణుని చరణకమలముల జాడలు గమనించుచు ధ్యానింతురు. ఇచట ధ్యానమప్రయత్నము. 

ఇతర సాధన మార్గములలో కన్నులు మూసికొని , ముక్కులు మూసికొని హృదయ పద్మమున నున్న పరబ్రహ్మమును ధ్యానించుట యుండును. 

దానివలన‌ నిష్ఠ కుదిరినపుడు కొన్ని క్షణములాత్మానందము వేయి మెఱపులు మెఱసినట్లు తళుక్కుమనును. అది ఎంత గొప్పదైనను ఇంద్రియ సుఖాదుల వలె క్షణికము. 

అట్లు గాక సృష్టిని నారాయణుని అడుగుజాడలుగ స్మరించువారికి అదే పరబ్రహ్మము కనుమూసినను, కనుతెరచినను తానే అయి నిత్యముగ భాసించును. 

"అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః", అని వేదమంత్రములు భాగవత మార్గమును గూర్చి అభయముద్ర పట్టియున్నవి. 

ఇట్లు ఇంద్రియములను , మనస్సును సొంతముగా దమించుకొని హృదయమున పరబ్రహ్మము దుకాణము పెట్టుకొనువారి మార్గము కన్న అట్లు సాధన చేయునట్టి తన్నే అంతర్యామికి‌ సమర్పణ చేసి శరణాగతి చెందు మార్గము శాశ్వతానందమిచ్చును.

✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

16.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. ⚛✮    మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 𝟣𝟤𝟫    ✮⚛ 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


బ్రహ్మజ్ఞానమనగా ఒక బాధ్యతయే గాని యొక పదవి కాదు. అది పొందిన వాడు బ్రహ్మవలె సృష్టిని చక్కబెట్టుచుండ వలయును. 

అందందు సంచరించుచు మానవుల అజ్ఞానము తొలగు మార్గములలో విహరింపవలెను గాని, దాని ననుభవించుచు కూర్చుండుటకు వీలులేదు. 

ఇట్టి బాధ్యతకు సిద్ధమైన వానికి మాత్రమే బ్రహ్మజ్ఞానము ప్రసాదింపబడునని భాగవతము ఉపదేశించుచున్నది.

✍🏼 మాస్టర్ ఇ.కె. 🌻
🌹 🌹 🌹 🌹 🌹

17.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 130 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సదవగాహన - 1 🌻

ఆధునిక మానవుడు ఎంతో అభివృద్ధిని విజ్ఞానశాస్ర్త పరముగాను, నాగరికత పరముగాను సాధించుచున్నాడు. 

ప్రాచీనులకన్న మిక్కిలి తెలివిగలవాడనని కూడ విర్రవీగుచున్నాడు. ధనము, అధికారము, విజ్ఞానము, ప్రసిద్ధి ఇట్టి విషయములు సాధించుటలో శ్రమించుచు, ఈ శ్రమకు ప్రయోజనమయిన ఆనందమును మాత్రము పొందలేకున్నాడు. 

తన స్వరూపమయిన ఆనందమునందు నిలుచుటకు అవరోధములుగా మానవ మనస్సునందు, వికారములు రేకెత్తి, అతని బ్రతుకు అను నావను తుఫానుతోడి సముద్రపు కెరటముల వలె ఊపుచున్నవి. 

నిజమునకు సమస్యలు తనకు వెలుపల లేవు‌ తనలోనే నెలకొనియున్నవి. ఉదాహరణకు, ఒరుల యందు జుగుప్స. ఇతరుల లోపముల యందే చూపు నిలిపి, వారి సద్గుణములను మరచుట వలన ఇట్టి జుగుప్స పెరుగును. 

విచిత్రమేమనగా, ఇతరుల యందు, తాను తెలివిగలవాడననుకొను మానవుడు ఏ దోషమును గమనించుచుండునో, ఆ దోషము తన యందే దృఢముగా దాగియుండును. 

జుగుప్స వలన, మానవుడు వివేకమను చూపును కోల్పోయి, గ్రుడ్డివాడగును. తనకు, ఒరులకు అడ్డుగోడలను కట్టుకొని వారితో సంఘర్షణకు తలపడును. దానితో భయభ్రాంతుడై, వినాశమును గొని‌ తెచ్చుకొనువాడగును. 

ఒకసారి మనస్సునందు ఇతరులపై దోషారోపణ చేయు తలంపు జనింపగనే, దానిని కొనసాగనీయక, వారిపై ప్రేమ, దయలను అనుభవించి, వారిని సదవగాహన చేసికొనుటకు యత్నింపవలెను. దానితో జుగుప్స క్రమముగా అదృశ్యమగును.

....✍ మాస్టర్ ఇ.కె.🌻 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

18.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 131 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. సదవగాహన - 2 🌻

అట్లే తోటి మానవులతో సత్సంబంధములు త్రెంచివేయు అంశములలో జుగుప్స తర్వాత ఎన్నదగినది "ఆత్మన్యూనతా భావము". దీని వలన నరుడు సంతోషమును చంపుకొనును. ఇతరులతో వ్యవహరించునపుడు, ఈ న్యూనతాభావమను రంగుటద్దపు జోడుతో చూచును. అవగాహన వక్రమగును. తన కన్నా అధికులని తాను తలంచువారిపై తిరుగుబాటు చేయ మనస్సు ఉద్రేకించును. ఇతరులలోని ఉన్నత విషయములను గుర్తింప నిరాకరించును. 

నిజమునకు, తాను సాధింపదలచిన‌ లక్ష్యము యొక్క స్థాయి కంటే తమ స్థాయి గొప్పదను ఎరుకయే ఈ న్యూనతకు హేతువగుచున్నది. ఆధ్యాత్మిక‌ సాధనా యానపథమున కొంతకాలము ఓటములు తాకక తప్పదు. అంతమాత్రము చేత, సాధకుడు తనను తాను అవమానింపబనిలేదు. నిస్పృహుడు కానక్కరలేదు. 

ఇట్టి ఓటములు, వెనుకంజలు తాత్కాలికములు మాత్రమే అని అతడు గుర్తెరుగవలెను. ప్రతి ఓటమి, వెనుకంజ విజయమునకు, ముందంజకు సోపానమే. తప్పుచేసినవాడు ఇక బాగుపడడనుట ప్రకృతి సూత్రము కాదు. ఎవనికయినను బాగుపడుటకును, సరిదిద్దుకొనుటకును ప్రకృతి వీలు కల్పించుచున్నది. 

ఏ మానవుడును ఇతరుల కన్నా ఎక్కువగా గాని, తక్కువగా గాని తనను గూర్చి తలంచుట అవివేకము. ప్రతివాడును అమృతపుత్రుడే. మానవుని సహజగుణములు దివ్యములే గాని అసురములు గావు‌ సత్సాంగత్యముతో, సత్కర్మాచరణముతో, సద్గురు స్మరణతో, సమిష్టి జీవనముతో సాధకుడు తన యందు దాగిన దివ్యగుణములను వికసింపజేసికొని, ముందజ వేయగలడు.

.....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹


19.Aug.2020

------------------------------------ x ------------------------------------

No photo description available.

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 132 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అంతర్యామి స్మరణ 🌻

ఈ బ్రహ్మసృష్టి యందు నారాయణుని అడుగుజాడలు గోచరించుట ప్రారంభమైనపుడు ఆ పాదపద్మములే తన్నాకర్షించును. ముక్కునకు పుష్పగంధమెట్లు ఆకర్షకమో, అదే విధముగా ఆకర్షించును. అంతర్యామి స్మరణ యందు మనస్సు నిలబడినచో తన దేహము దాని యందున్నదే కనుక అది వేరుగా గుర్తుండదు. 

భార్య, బిడ్డలు, మిత్రులు, బంధువులు మున్నగువారి దేహములును , అదివరకు తనవారనుకొని వ్యామోహపడుచున్న పరివారమెల్లరు నారాయణుని రూపములుగా తెలియబడుదురు. వారి ముఖములతని ముఖములుగ తెలియబడును కనుక అతడు విశ్వతోముఖుడై దర్శనమిచ్చును.

✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹


20.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 133 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రీకష్ణావతారము 🌻

కృష్టావతార తత్త్వమున అనేక కళలున్నవి. శ్రీకృష్ణుడు పాండవులకు ఆదర్శపురుషుడు. ధర్మరాజునకు గురువు, దైవము, ద్రౌపదికి‌ రక్షకుడు. కుంతీ దేవికి దిక్కు. కౌరవులకు రాజకీయ విజ్ఞానవేత్త. రాజలోకము దృష్టిలో ఆదర్శ రాయబారి. అర్జునునకు దేహమునకు, ఆత్మకు సారధి. కాని తనకు తాను మాత్రము క్రీడాపరుడైన శిశువు. 

కురు‌పాండవ‌ యుద్ధమును గాని, యాదవుల వినాశమును గాని వారించుటకు తనకు ప్రయోజనం లేదు. వారింపవలసిన మమకారము లేదు. తాను‌ కావలయును అని అనుకొన్నవారికి‌ కావలసినవాడు. జీవితమున సన్నివేశములను క్రీడగా నడిపి, దేహపరిత్యాగ క్రీడలో జగత్తునకు వెలుగుగా మైత్రేయునందు ప్రవేశించినవాడు. 

....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹


21.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 134 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఉద్ధవుడు - మైత్రేయుడు 🌻
ఉద్ధవునితో పాటు మైత్రేయుడు కూడ బ్రహ్మజ్ఞాన నిర్ణయమును పరిపూర్తిగా పొందెను. అతడును మానవదేహస్థితి విడిచి , చిరంజీవియై శ్రీకృష్ణుని ఆజ్ఞను పాలించుచు, లోకమున ఉద్ధవుని వలెనే సంచరించుచు, పరమగురువులలో ఒకడైనాడు. అతడు నిరంతరము విష్ణుని పరావరునిగా , కరుణామయునిగా తలచుచుండును.

🌻 🌻
భగవంతుని ధ్యానించుట మాని కర్మబంధములను తొలగించు కొనుటకు కుస్తీ పట్టుట వలన మనస్సు దైవేతర విషయమునందు చిక్కుకొనును. 

కర్మబంధము తొలగుట కూడ భగవంతుని అనుగ్రహ దృష్టియే యని తెలిసినవారికి అది తొలగిపోవును.

........ ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻 
🌹 🌹 🌹 🌹 🌹


22.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 134 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. జీవుని - నారాయణుని - నిద్ర _1 🌻

కల్పాంతమున తాను కూడ నిద్రలోనికి పోయినచో లోకములతో బాటు తాను గూడ నుండడు. అపుడు నారాయణుడు సృష్టికి మాత్రమే ఈశ్వరుడగును గాని సర్వేశ్వరుడు కాలేడు. నిద్రనుండి మెలకువ వచ్చిన తర్వాత తాముంటిమని జ్ఞప్తి గలిగి తమ ప్రకృతి ననుసరించి చరించువారు జీవులు. 

వారు మరల నిద్రాసమయము వరకు మాత్రమే ఉందురు. నిద్రలో తాముండరు. ఉన్నపుడు కూడ తమ తెలివికి తాము అధిపతులు కాక , తమ స్వభావమునకు బద్ధులై, అసహాయులై జీవింతురు. 

అట్టి జీవులయందు అంతర్యామిగా నున్న నారాయణుడు ప్రకృతి కూడ అతీతుడే కాని బద్ధుడు కాడు.

.......... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

23.Aug.2020

------------------------------------ x ------------------------------------




🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 135 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. జీవుని - నారాయణుని - నిద్ర - 2 🌻 

నదిలో బిందె మునిగి పోయినపుడు బిందెలోని నీరు మాత్రమే బిందె ఆకారమునకు బద్ధము. నదిలోని నీరు బిందె కతీతము. అది బిందెలోనికి వచ్చుచు పోవుచున్నను ... వచ్చినపుడు బద్ధముగను, వెలువడి నపుడు అతీతముగను వర్తించుచుండును . బిందెయే ప్రవాహమున కధీనము. 

అట్లే నారాయణుడు జీవస్థితిగా బద్ధుడై అంతర్యామిగా అతీతుడై క్రీడించుచుండును. జీవులు అతని సృష్టి, స్థితి, లయముల కాల ప్రవాహమున పరాధీనులై వర్తింతురు.......

🌻 🌻 

జనన మరణములతో కూడిన సంసార జీవితమొక భయంకరమైన మహాసముద్రము. వివేకము లేక తమ పనుల యందు జనులు తాము నిమగ్నులై యుందురు. తమ పనులే తమ జ్ఞానమునకు సరిహద్దు. 

అట్టి స్వార్థమే యీ సముద్రమునకు తీరము‌. తమ పనులు నెరవేరుట, నెరవేరకుండుట అనునదే వెనుకకును , ముందుకును పరుగెత్తుచుండు అలలు.

మిత్రులు, భార్య, పుత్రులు మొదలగు రూపమున సముద్ర జంతువులైన చేపలు, తిమింగిలములు మొదలగునవి సంచరించుచుండును.

అట్టి సంసార మహాదముద్రము దాటగోరువారు అడ్డముగా దూకి ఈదినచో లాభములేదు. అథమ స్థితి చెంది సముద్ర గర్భమున పడిపోవుదురు . 

తెలివితో చక్కని నావ నిర్మించుకొని దిగవలయును. ఆ నావయే భగవంతునితో మనస్సును బంధించుకొనుట.

...... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

24.Aug.2020

------------------------------------ x ------------------------------------




🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 136 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. సువర్ణ సోపానములు -- Golden stairs 🌻

ఇట్టి దివ్యజ్ఞానమను వెలుగుతో కూడి‌న దేవాలయము చేరుట, అందు జీవించుట మన లక్ష్యము. దానిని మన హృదయమున ప్రతిష్ఠించుకొని, తన ప్రజ్ఞ అర్చకుడై క్రమముగ అందలి దేవుడుగా తానగుటయే నిజముగా ఆ దేవాలయమును చేరుటయగును. 

ఇందులకై జగద్గురువు ఇచ్చిన కళ్యాణమయమైన మార్గమునే బ్లావెట్ స్కీ మాత మరియొక మారు‌ మన కొరకు దర్శించి ప్రసాదించిన విధానమే ఈ సువర్ణ సోపానములు. 

సువర్ణసోపానము అనగా మంచివన్నె అని అర్థము. ఏడు వన్నెలకు మూలమైన శుద్ధమైన తెలుపే సువర్ణముగా, సూర్యోదయ సమయమున ఆ తెలుపే బంగరురంగుగా కనపడును. కనుక సువర్ణము భగవంతుని కళను సూచించును. శ్రీమాతను‌ "సువర్ణ" అందురు. 

కావున జగన్మాత వద్దకు, భగవంతుని సన్నిధికి చేర్చు సోపానములు ఇవి. సిద్ధి సువర్ణయోగము, సాధన కూడ భగవంతుని స్మరణలో దివ్యమై సువర్ణమగుచున్నది. కావున ఈ సాధన సోపానములు‌ కూడా సువర్ణమయములు. 

ఈ సోపానములను ఎక్కువానిలో తన వన్నె తొలగి, భగవంతుని మంచివన్నె అవతరించును. ఈ సువర్ణ సోపానములకు ధ్యాన యంత్రము ఒక వృత్తము నందు గల చతురస్రము. దీని రెండు కర్ణములు కలుపబడి యుండును. 

ఏమి లేనట్టి అనంతత్వము నుండి పరమాత్ముడు సూర్యోదయము, మిట్ట మధ్యాహ్నము, సూర్యాస్తమయము; అర్థరాత్రి, శుక్లాష్టమి, పూర్ణిమ, కృష్ణాష్టమి, అమావాస్య, సృష్టి, ప్రళయము, వీని మధ్య రెండు సంధులు అను చతుర్భుజములతో సృష్టి యందు అంతర్యామియై విష్ణుత్వమును చెంది, సూర్య కిరణముల ద్వారమున జీవులుగా దిగివచ్చుటను ఈ యంత్రము సూచించును. 

ఈ సువర్ణసోపానములు జాతి, కుల, మతాదులతో సంబంధములేనివి. సర్వదేశకాలములకు సంబంధించినవి బ్లావెట్ స్కీ ద్వారమున పరమగురువులు అందించిన శాశ్వత దివ్యజ్ఞానము అనుగ్రహింపబడ వలెనన్నచో ఈ సోపానముల మీదుగా సాధన చేయుట ఆవశ్యకము. 

లేనిచో ఆయా గ్రంథములందు ఉన్న వాక్యముల టీక, తాత్పర్యములు మాత్రమే తెలియును. వాని యందు నిహితమైన వేదమయమగు అంతర్యామి స్వరూపము అందదు. శ్రీకృష్ణుడు గీతలో వివరించిన దైవీసంపదకు ఇవి పోలును. 

నరునితో నారాయణుడు ఇట్లనెను. "నీవు దైవీసంపదతోనే జన్మించినవాడవు. ఆందోళన చెందకుము". అనగా ప్రతి‌ నరుడును తనలో అంతర్నిహితమైన ఈ దైవీగుణముల వికాసమునకై నిరంతర శ్రద్ధతో కూడిన సాధనను అభ్యసించవలెను. అపుడు నారదుడు (శ్రీరాముని) పరమపురుషుని గూర్చి వర్ణించిన కళ్యాణగుణమయమూర్తిని చేరుదుము.

..✍ మాస్టర్ ఇ.కె.🌻

(సోపానముల‌ పూర్తి వివరణముల కొరకు సువర్ణసోపానములు అను పుస్తకమును చదువగలరు)
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

25.Aug.2020

------------------------------------ x ------------------------------------





🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 137  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మానవజన్మము - విశిష్టత 🌻

జీవరాశులన్నింటిలోను తనది ఉత్తమ జన్మ అని మానవుడు భావిస్తూ ఉంటాడు. కారణమేమంటే వృక్షములను, జంతువులను కూడ తన అదుపులో పెట్టుకొని తనకు అనుకూలమైన విధంగా ఉపయోగించుకొనే మేధాశక్తి తనకున్నది.‌ దీని వలన అన్ని జీవరాశులను తన వశంలో పెట్టుకోగలడు మానవుడు. 

డార్విన్ మొదలైన శాస్ర్తజ్ఞులు కూడ మానవజన్మనే సర్వోత్తమమైనదిగా అభివర్ణించారు. కాని సనాతన ధర్మప్రవర్తకులైన ఋషులు మాత్రం మానవజన్మ అన్ని జీవులలోను దుర్లభమైనదని, అది చక్కని అవకాశమని చెప్పారు. 

మొదట మానవజన్మ‌ మనకెందుకు కలిగిందనే విషయాన్ని అవగతం చేసుకోవాలి.

కేవలం అన్నపానీయాదులు స్వీకరించడం, నిద్రించడం, స్ర్తీ పురుష సంయోగం ఇంతమాత్రమే అయితే జంతు జన్మకి మానవజన్మకి భేదమే లేదు. ఇన్ని లక్షల జీవరాశుల జన్మలు గడచి మానవ జన్మలోకి ప్రవేశించిన తరువాత తన జన్మకు ప్రత్యేక లక్ష్యమేది? దీనిని గుర్తించడం మానవుని మొదటి కర్తవ్యం. 

ఈ శరీరం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలైన ఉపకరణాలు మనకి ఇవ్వబడినవని తెలుసుకోవాలి.

వీటిని సద్వనియోగపరచి ఇతర జీవుల యందు తనకు గల కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం మానవుని ప్రధాన లక్ష్యం. కేవలం తన మేధాశక్తిని ‌మాత్రమే ఆశ్రయించి తద్వారా ఇతర జీవులను తన‌ వశంలో పెట్టుకునే ప్రయత్నం రాక్షసత్వమే అవుతుంది. 

మానవ జన్మము చక్కని శిక్షణ శిబిరము. మొదట తన‌ కుటుంబ సభ్యులతో మొదలై క్రమంగా వ్యాప్తి చెంది సామాజిక జీవనంలోకి‌ ప్రవేశించి అనేక సన్నివేశముల రూపంలో ప్రకృతి నుంచి‌ ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు మానవుడు. 

అటుపైన తన కోసం తాను జీవించడమే కాకుండా లోకహితం కోరి పని చేయడం మొదలుపెట్టాలి. అప్పుడే వ్యక్తిగతమనే బంధం నుంచి విముక్తుడవుతాడు.

అప్పుడు అప్రయత్నంగానే లోకహితం కోసం పనిచేయగలిగే సామర్థ్యం ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాగ అయినప్పుడే మానవుడు ఉత్తమ మానవుడుగా ఆవర్భవిస్తాడు....

...✍ మాస్టర్ ఇ.కె.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

26 Aug 2020

------------------------------------ x ------------------------------------




🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 138  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. జీవుని - నారాయణుని - నిద్ర - 3 🌻 

ఇక జీవుని కన్న నారాయణుడెట్లు అతీతుడనగా జీవులకు నిద్ర క్రమ్మును. నారాయణుడు నిద్రయందు అభిలాష పడును. అనగా నిద్రా స్థితిలో కూడ నిద్రాభిలాషయే గాని, జీవులు పొందునట్టి మొద్దునిద్ర కాదు.
....... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻


🌻. గురువు 🌻
గురువనగా అయస్కాంతము. శిష్యుడనగా ఇనుప ముక్క. అయస్కాంతపు సాన్నిధ్యముచే ఇనుపముక్క అయస్కాంతము అగుచున్నది.ఇనుమునకు అయస్కాంతము సాన్నిధ్యము ఇచ్చినదే కాని అయస్కాంత తత్త్వమును ధారపోయలేదు. 

అట్లే గురువు శిష్యునకు తన భావములను, నమ్మకములను, ఆచారములను రుద్దడు. రుద్దుట రాజకీయ లక్షణము అది పార్టీలు, మతములు మార్చుటకు పనికి వచ్చును. కాని శిష్యుని గురువుగా సృష్టించుటకు పనికిరాదు. జీవునికి దైవముగా రెండవజన్మము ఇచ్చుటకు పనికిరాదు. 

ఇనుములో అయస్కాంత ధర్మము నిద్రాణమై యున్నది. దానిని మేల్కొలుపుటకు మాత్రమే అయస్కాంతము తన సాన్నిధ్యమును ప్రసాదించును. అట్లే గురువు ప్రయోగించినది ఉద్బోధము (Induction) అను ప్రక్రియే గాని, బోధ (Conduction) అను పద్ధతి కాదు..
.....✍ మాస్టర్ ఇ.కె.🌻 

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె 

27 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 139   🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భాగవతము-అనుభూతి 🌻

కలి యుగమున కష్టజీవనులకు కావలసినది అనుభూతి. అది భగవంతునికి సంబంధించినది. దీనిని‌‌ కొంత ఇచ్చినను, విజ్ఞానమెక్కువగా ఉన్న గ్రంథములు చదివినపుడు కలియుగ మానవుల మనస్సు అనుభుతి నుండి విజ్ఞాన శాఖల మీదికి చెదరిపోవును. 

పాండిత్యమను వలలో చిక్కి, గుణదోష‌ విమర్శ అను సంకెళ్ళలో బంధింపబడుట‌ జరుగును. మరియు పొట్టపోసికొనుట, డబ్బు సంపాదించుటయే ప్రధాన లక్ష్యములుగా బ్రతుకు సాగించు ‌కలియుగ మానవులు తమ కర్తవ్యములను, వృత్తివిధులను, ధర్మమును డబ్బు సంపాదించి తమ కోరికలు తీర్చుకొనుటకు‌ సాధనములుగనే పరిగణింతురు. డబ్బు, గృహావసరములను కర్తవ్యపాలనము, ధర్మాచరణమునకై సమన్వయింప‌ జాలరు. 

కావున, ధర్మము ‌కన్నా ధనము, అధికారము,‌ కీర్తి, ఐహికముగా పైకి వచ్చుట వీటికే ప్రాధాన్యమొసగి మందబుద్ధులయి, జడులై‌ అల్పాయుష్కులగుట తప్పదు. వీరికి కావలసినవి సుఖశాంతులు. కాని సుఖశాంతులను ఏ విషయమొసంగునో, ఇవి ఎట్లు లభించునో‌ వీరికి తెలియదు. 

సుఖశాంతులను కలిగించునది దైవానుభూతి‌ ఒక్కటే. ఇట్టి అనుభూతికి‌ సులభము, తీయనైన బోధయుండవలయును. 

వేదాంత గ్రంధములకు‌ ఇట్టి సమర్థత లేదు. ఇంద్రియముల ఆకర్షణకు లోనై‌ జీవించువారిని ఈ అనుభూతిని అందించుటకు‌ అంతకన్నా‌ గొప్పదయిన, మధురమయిన‌ ఆకర్షణ వైపు లాగవలెను. అందుకే నారదుడు వ్యాసునకు భాగవతమును ఉపదేశించి వ్రాయించెను...

... ..✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

28 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 140  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

సృష్టిలో ఒక్కొక్క డొక్కొక్క విధముగా వర్తించును. ఎందరిని గూర్చి తెలిసికొన్నను , ఎన్ని శాస్త్ర రహస్యములు నేర్చినను , తెలిసికొన వలసినది మిగిలియే యుండును. 

వాని యందు సర్వాంతర్యామిగా నున్న తత్త్వమొక్కటే గనుక దాని వైపునకు మనస్సు మరలింపజేయ గలిగినచో తెలియవలసినది మరియొకటి యని యుండదు. ఆ మార్గమలవాటు పడిన వెనుక మరియొకటి ఏదియును మనస్సునాకర్షింపదు‌.

🌻. ఆశీర్వచనం 🌻

నేను ఏనాడు దేనికి భయపడలేదు 
మీరు భయపడకుందురు గాక!
నా పెదవులపై ఏనాడు చిరునవ్వు చెదరలేదు... 
అట్టి చిరునవ్వుతో మీరూ ఉందురు గాక!

శక్తులూ, సామర్థ్యాలు, తెలివీ తేట
సత్కర్మాచరణకు వినియోగించి 
ధన్యులగుదురు గాక!... 

"నేను" అనే ఒకే వెలుగులో మీరు
మేల్కాంచి "నా" వెలుగులో నడచెదరు గాక!  ............✍ మాస్టర్ ఇ.కె. 🌻 

------------------------------------ x ------------------------------------


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 141  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ధ్రువము, ధ్రువుడు 🌻

ఉత్తర , దక్షిణ ధ్రువముల నుండి దూసికొని నిలబడు రేఖగా ధ్రువుడు నిలబడును. అతనికి దిగువగా సప్తర్షి మండలముండును. 

ధ్రువుడు ఒక ఆత్మప్రదక్షిణము చేయు బిందువును అధిష్ఠించినట్లూహింపగా ఆ ప్రదక్షిణ కాలము భూమిపై నున్న జీవులకు ఇరువదియారు వేల (26,000) సంవత్సరములుగా భాసించును. ఒక్కొక్క నక్షత్రమున వేయి సంవత్సరములు చొప్పున సంచారము చేసినట్లు భాసించును. 

భూమి చుట్టును భూమధ్యరేఖ కెదురు ఆకాశమున గ్రహములు చరించు చక్రమున్నది. దానినే రాశిచక్రమందురు. దానిని ఇరువది యేడు సమభాగములు చేయగా నక్షత్ర చక్ర మేర్పడును. ఒక పరిభ్రమణము పూర్తి చేయుటకు అనగా ఇరువది ఏడవ నక్షత్రమున ప్రవేశించుటకు ఇరువది ఆరువేల సంవత్సరములు పట్టును. 

ఈ మానములు భూమి తన ధ్రువము చుట్టును తిరుగుచుండుట వలన ఏర్పడుచున్నవి. ఈ పరిభ్రమణముకు నడుమ నిలబడు రేఖగా ధ్రువుడు స్థానము గొనును. అన్నియు పరిభ్రమించుచున్నను కేంద్రమగు ఈ రేఖ పరిభ్రమింపదు గనుక ధ్రువము లేక ధ్రువుడు అనబడును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె 

30.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 142 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. ఆరోగ్యము 🌻

మనస్సు నందు ఏర్పడే సంకల్పాలు, వికల్పాలు ప్రాణశక్తిని సంచాలనం చేస్తే ఆ‌ ప్రాణశక్తి యొక్క వైఖరిని అనుసరించి మన శరీరంలోని భాగాలు నిర్మాణమై పని చేస్తాయి. 

కనుక మన ఆరోగ్యము అను స్థితి మన మనస్సు, ప్రాణశక్తి, భౌతిక శరీరమునకు మధ్యనున్న సమన్వయముపై ఆధారపడి ఉంటుంది. అందువలన మానసిక ఆరోగ్యము చాలా ముఖ్యము. 

ఆరోగ్యమనే స్థితే అసలు మనకి సహజ స్థితి. దానిని చెదరకుండా చూచుకొనుటయే మనము ప్రధానముగా అవలంబించవలసినది అని ఆయుర్వేద శాస్ర్తము తెలియజేస్తుంది. ప్రకృతి ధర్మాలను అనుసరించే ఏ శాస్ర్తమైనా దీనినే ప్రతిపాదించింది. నిత్యజీవితంలో ఏ విధానాన్ని అవలంబిస్తే ఈ ఆరోగ్యస్థితి చెదరకుండా ఉంటుందో ఆ విధానాన్ని 'స్వస్థవృత్తము' అను పేరుతో ఆయుర్వేద శాస్ర్తము మనకు అందించింది. 

కాని ప్రస్తుతము మానవజాతి ఈ విధానాన్ని అంగీకరించలేని హీన స్థితిలో ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే అనారోగ్యంతో పోరాటం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది. ఇప్పటి వైద్యరంగంలో దీని వలన పరష్కారం లేదనేది సుష్పష్టము...

....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

31.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 143  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సప్తర్షి మండలము - కాలగణనము 🌻

ధ్రువము చుట్టును నక్షత్ర మండలము మొలత్రాడుగా భూమధ్యరేఖ వెంట తిరిగివచ్చుటకు ఇరువదియారువేల (26,000) సంవత్సరములు పట్టును. 

సప్తర్షులు నక్షత్ర మండలమున కెదురుగా ఒకమారు తిరిగి వచ్చినట్లు కనిపించుటకు ఇరువదియారు వందల (2,600) సంవత్సరములు పట్టును. 

ఇందు శతాబ్దుల , సహస్రాబ్దుల కొలతలు కొలుచుటకు వీలగును కనుక యుగములలో జరిగిన కథలను కొలుచుట కిదియే ఆధారము. 

ఉదాహరణకు : " ఆసన్ మఖాసు , మునయః యుధిష్ఠిరే, శాసతి పృథివీం " అని వరాహమిహిరా చార్యులు చెప్పిరి. మఖా నక్షత్రమున సప్తర్షులుండగా యుధిష్ఠిరుడు భూమిని పాలించెనని యర్థము. దీనిని బట్టి "షట్ ద్విక పంచద్వియుతః , శకకాలస్తస్య రాజ్ఞస్య " అని వరాహమిహిరుడు యుధిష్ఠిరుని కాలమును సాధించెను. శకకాలమైన శాలివాహన శకమునకు 2526 సంవత్సరములకు పూర్వము యుధిష్ఠిరుడు పరిపాలించెనని సాధించెను. 

దీనిని బట్టి కలియుగమునందు ఇప్పటి కెన్ని సంవత్సరములు గడచినవో తెలియును. ధర్మరాజు పరిపాలన అంతమగుటతో కలియుగ మారంభించెను. ఈ గణనము నాధారముగా గొనియే ఇప్పటి పంచాంగ కర్తలు కలియుగ సంవత్సరములను నిర్ణయించుచున్నారు. 

ఈ విధముగా ధ్రువుని , వాని‌ననుసరించు సప్తర్షులను ఆధారముగా గొని , యే యుగమందలి కథల కాల నిర్ణయమునైనను చేయవచ్చును. 

పురాణమందలి కథల కాలమిట్లే నిర్ణయింపబడెను.

భూమిపై పరిభ్రమణము ననుభవించు వారి కందరికిని పునర్జన్మ లుండును. ధ్రువుడు పరిభ్రమింపడు కనుక అతనికి పునర్జన్మ ముండదు.

...... ✍🏼 మాస్టర్ ఇ.కె. 🌻
ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

01 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 144  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ప్రకృతి - జీవనము 🌻

ప్రకృతిని గమనించుకొనుచు జీవితమును నడిపించినచో మార్పులను ఏ విధముగా అర్థము చేసికొనవలెనో తెలియును. 

ఆకలి పుట్టినపుడు అన్నము తినవలెనని తెలియును. వెంటనే అన్నము తిన్నచో కర్తవ్య నిర్వహణము అనబడును. 

లేక వేదాంతమో వాణిజ్యమో అంతకన్నా ముఖ్యమని ఆలస్యము చేసినచో, మనము ఏర్పరచుకొనిన‌ కార్యక్రమము కర్తవ్యము‌ కాకపోవును. 

మన ఇష్టము, అభిమానము వేరు. మనతో పనిచేయుచున్న‌ ప్రకృతి వేరు. ప్రకృతిలో పొరపాటుండదు. ఇష్టాఇష్టములలో పొరపాట్లుండును. వేదాంతము‌ ఎంత గొప్పదియైనను, ఆహారమునకు‌గల వేళలు అంతకన్నా గొప్పవి కాకపోవచ్చును గాని అంతకన్నా సత్యములు. 

అయితే ఒకమారు సర్వాంతర్యామి స్మరణము కలిగించు కథలను ఆత్మతో గ్రోలుటకు అలవాటు పడినవాడు లోకవృత్తాంతములైన ఇతర కథలను గ్రోలుటకు యత్నము చేయడు. అవి వానికి గరళము గ్రోలుట వలె నుండును.

........✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

02 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 145 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భక్తిసాధనా రహస్యములు 🌻

భక్తునకు తనవారు, తనవి అనబడు వారు ప్రత్యేకముగా ఉండరు. ఎల్లరును భగవంతుడను సూర్యుని కిరణములే. ఎల్ల ప్రదేశములు బృందావనములే. వీరికి లోకమే స్వాదు కావ్యము. పాత్రధారులగు జీవులెల్లరు, సూత్రధారి అగు దేవుని రూపములే. 

భగవదర్పిత హృదయమున ఇహవాంఛ భస్మమగును. కర్తవ్యములు, వృత్తులు మాననక్కర లేదు. ఇవియెల్లను ఈశ్వరార్పితములు గావలెను. వానికి రస స్పర్శ‌కలుగును.

శరీరమునకు, ఇంద్రియాదులకు క్రమశిక్షణ ఒసగవలెను. సాధన ఒక్కరుగా గాక, సమిష్టిగా గావించుట మేలు. తన చుట్టు ఉన్నవారిలోను, వారి చేష్టలలోను, పరిసర వాతావరణములోను, పరిస్థితులలోను విష్ణునే దర్శింపవలెను.

ఎంతమంచిదయినను, మనము కోరినచో వ్యామోహమై నిలిచి అడ్డగించును. ధర్మపథమునకు ఆత్పార్పణము గావలెను. 

ఒక రూపమును విడిచియుండ లేకుండుట భక్తిగాదు. మనస్సు, బుద్ధియు, తనువును, మమత విడిచి మర్మము ఎరుగక అంతర్యామికిచ్చి మనుగడ సాగించినచో మన బ్రతుకని యుండదు. అది ఆయనదే అగును. సాధకుని కథ, దేవుని కథ అగును.

భక్తి సాధనలో‌ ప్రేమయే ప్రధానము. జ్ఞానమన్న స్వామికరుణయే. 

భగవన్నామమును, గుణములను కీర్తించుచు పుణ్యక్షేత్ర దర్శనము గావించుట‌ సాధనకు ఉపకరించును.

గురువు యొక్క లేక ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించుటయేగాని చర్చించుట సాధనకు అడ్డుగా నిలుచును.

శివుడన, విష్ణువన, శక్తియన‌ ఒకే పరతత్త్వము యొక్క వివిధములగు రూపములే అను వేదభావనతో‌ దర్శింపనగును.

~~మనలోని స్వభావమే సర్వాంతర్యామికి సమర్పితమైనపుడు దివ్యమగును..

....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

03.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 146  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సంస్కృతి - సమానత 🌻

సమానత అంటే అన్ని జాతులందు, అన్ని సంస్కృతులందు గల ఏకత్వాన్ని దర్శించి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పనిని త్రికరణ శుద్ధిగా చేయడమేగాని మన సంస్కృతిని, సంస్కారాన్ని వదులుకొనడం కాదు. 

మన దేశము, మన సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించడం, మెచ్చుకొనడం సమానతకు భంగకరం (anti-secular) అని భావించడం హాస్యాస్పదం. 

అనాది కాలం నుండి ఇతర ఖండాలలో మన భారతీయ సంస్కృతికి ఎంతో పేరు, ప్రతిష్ఠలున్నాయి. ఈనాటికి ఎందరో పాశ్చాత్య ఖండవాసులు భారతదేశం రావడం, ఇక్కడి సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసి ఆచరిచడం అదృష్టంగా భావిస్తారు. 

నేడు ప్రపంచ దేశాల మానవులను పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ పుణ్యభూమి యందే దొరుకుతుందనేది నిస్సందేహము. 

అయితే మనదేశం ప్రస్తుతం అనేక సమస్యలలో కూరుకుని ఉన్నది కదా అని సందేహం రావొచ్చు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. 

ఈ దేశ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మతమనే మసిపూసిన అద్దంలో నుంచి చూసి తిరస్కరించడం ప్రధాన కారణం. అన్ని రంగాల్లోను పాశ్చాత్య సంస్కృతిని ఆదర్శంగా తీసికొని వారి నుంచి అవి, ఇవి యాచించడం, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవడం మొదలైన ఎన్నో కారణాలున్నాయి. 

అంతేకాక బ్రిటీషు పాలనకు ముందు ప్రతి గ్రామంలో ఉన్న అన్ని వర్ణాలవారు ఐకమత్యంతో ఒకే కుటుంబ సభ్యులు వలె పరస్పరత్వంతో మెలిగేవారు. అందరిమధ్య సామరస్యభావన, సమానత అప్రయత్నంగా నెలకొని ఉండేవి. 

బ్రిటీషు వారి 'విభజించి పాలించడము' (Divide and Rule) అనే పద్ధతి వలన వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా గజిబిజి చేయబడింది. అప్పటి నుండి గ్రామ వాసుల మధ్య సామరస్యం దెబ్బతిన్నది.

....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె 

04.Sep.2020

------------------------------------ x ------------------------------------




🌹.   మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 147   🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻

సృష్టిలోనున్న భగవంతుని మరచి, అందలి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తి యందుంచుకొనినవాడు మత్తుడై ఇంద్రియార్థములను గూర్చిన చింతలలో నిమగ్నుడై జీవించును. 

దినములు గడచి పోవుచుండునే గాని, జీవించుటకు తీరుబడి యుండదు. అనగా అంతర్యామిని స్మరించుట ఉండదు. చిత్తశాంతి లభింపక ఆశల వెంట పరుగెత్తుచుండును.

క్రమముగా వ్యాధి, ముసలితనము, ఇతరులపై పట్టుదలలు, తన పరాజయములు, ఆశాభంగములు మున్నగు దుష్టశక్తులు యమదూతలై పొడుచు చుందురు.

దుఃఖపరంపరలతో జీవితమును ఈదవలసి వచ్చును కనుక, నిప్పుల గుండమును ఈదుచున్నట్లుండును. ఈ స్థితినే వైతరణి యందురు పరిస్థితుల రూపములలోని‌ అంతర్యామిని మరచి, పరిస్థితులకు లొంగిచేయకూడని పనులు అనేకములు చేయుటతో శిక్షానుభవము తప్పదు.

రోగముల రూపమును యమదూతలు దేహమున మంటలు మండింతురు. శస్ర్తచికిత్సల రూపమున ముక్కలుగా ‌కోయుదురు. (కృతాంతుని భటులు వీరు. కృతాంతుడు అనగా చేసిన కర్మలకు ఫలితములు ఇచ్చువాడు. యముడనగా అధర్మము ‌నుండి ధర్మమార్గమునకు నియమించునట్టి నిర్మల ధర్మస్వరూపుడు.).

...✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

05.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 148  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ 


🌻. విషువత్ - 1 🌻

(21st March)

దక్షిణాయనము నుండి ఉత్తరాయణమునకు సూర్యుడు సంవత్సరమున కొకమారు భూమధ్యరేఖను ఖండించును. ఆ ఖండించిన దినమును విషువత్పుణ్యకాల మందురు. ఇది ప్రతి సంవత్సరము మార్చి 21 వ తేదీనాడు జరుగును. 

ఆ దినమున భూమధ్యరేఖపై నిలిచి కొలిచినచో అహోరాత్రములు సమభాగములుగా నుండును. ఈ బిందువును వేదములలో , పురాణములలో యజ్ఞమృగము అందురు. మృగమనగా వెదుక బడునది అని అర్థము.

ఈ బిందువే సౌర సంవత్సరమునకు సంవత్సరాది.

................. ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻 
🌹🌹🌹🌹🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

06.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ 


🌻. విషువత్ - 2 🌻

(21st March)

సంవత్సరాదిని నిర్ణయించుటకు వేదఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈ దినమును స్థాపించెడి వారు. ఈ బిందువునుండి సమస్త ఖగోళ గణితములను లెక్కించెడివారు. 

ఈ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్యరేఖపై కొంచెము వెనుకకు నడుచుచుండును. ఈ నడచుటనే గవామయము అను యజ్ఞముగా వేద ఋషులు గుర్తించిరి. 

ఈ బిందువుతోపాటు సంవత్సరాది కూడ వెనుకకు నడచుచుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి. 

'నల్లలేడియందు దృష్టి నిలిపి వింటియందెక్కు పెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరుగెత్తుచున్న పినాకపాణి వలె నున్నావు.' అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును. 

నాటకము మొత్తము నందును చాంద్ర సంవత్సరము యొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చాంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను. 

ఈ బిందువునకై భూమధ్యరేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి‌ ధ్రువుని కాలముననే పుట్టినది.

....✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

07.Sep.2020

------------------------------------ x ------------------------------------




🌹.   మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 150   🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻 

మహనీయులు దేవుని అస్తిత్వమునందు‌ శరణాగతి చెంది, జీవయాత్ర సాగింతురు. వీరు తమ‌ హృదయములందు ఎనిమిది అంగుళముల‌ కొలత కలిగిన దివ్యదేహునిగా సర్వాంతర్యామిని ధ్యానింతురు.

అనగా ఎనిమిది ప్రకృతులలోని వానిని తెలియుదురు. చూపుడు వ్రేలు‌ కొలతగా హృదయమున శ్రీహరిని ధ్యానింతురు. అనగా చూపడు వ్రెలితో ఎవ్వనిని చూపినను, ఏ వస్తువును చూపినను, వాని యందు భగవంతుడు జ్ఞప్తి రావలెనుగాని ఆయా వ్యక్తులు, వస్తువులు‌గాదు. 

స్వామిని చతుర్భుజుడుగా ధ్యానింపవలెను. అనగా తాను నిలబడిన తావున నుండి నాలుగు దిక్కుల వరకు కనుపించునంతమేర దేవుని బాహువులు రక్షించుచున్నవని తెలియవలెను. మందర ధారియగు కూర్మమూర్తిగా భావింపవలెను. అనగా జగత్తును ధరించు‌ శక్తిగా తెలియవలెను. 

దేవుని గూర్చి మనకు ఎంత గొప్ప అభిప్రాయమున్నను, అది అభిప్రాయమే గాని దేవుడు కాదని గ్రహింపవలెను. సాధన చేయుచున్నప్పుడు కలుగు స్వప్న సాక్షాత్కారములు మున్నగు అనుభవములకు మురిసి పొంగినచో, ఇంక ఆ పైకి పోవుట జరుగదు. ఇట్టివి మన కోరికల సాక్షాత్కారములే కాని, దేవుని సాక్షాత్కారములు గావు. భగవంతుని‌ సాక్షాత్కారమనగా సృష్టిలోని జీవుల రూపములోని సాక్షాత్కారమే. మిగిలినదంతయు జీవులల్లుకొన్న పాండిత్యమనియు తెలియవలెను..

.✍ మాస్టర్ ఇ.కె.🌻 
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

08.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 151  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. సర్వాంతర్యామి 🌻

లోకమున దుఃఖమునకు కారణము ఎవ్వరని మానవులు అనేక సిద్ధాంతములను కనిపెట్టిరి. తమకు సుఖదుఃఖములను ఇచ్చు ప్రభువుగా దేవునిపై కొందరు నిందారోపణము చేసిరి. 

తప్పు చేయుట అనగా హాని కల్గించుటయే తన చెడునడవడిని సరిచేసికొనుట తన చేతిలోని పనియే. దానిని అంగీకరించుటకు భయపడి తనకన్న శక్తిమంతమైనదేదో తన చేత చేయించుచున్నదని నమ్ముట దౌర్భల్యముగాని సత్యముకాదు. 

జీవుడు మంచిగా గాని, చెడుగా గాని ప్రవర్తించుటకు గ్రహస్థితులు కారణమని సిద్ధాంతము చేసికొందురు. ఆత్మ వంచనము చేసికొనుచున్నారు. చేసిన కర్మయొక్క ఫలమే మనచేత నిత్యము మంచి చెడ్డ పనులు చేయించుచున్నదని కొందరు నిర్ణయింప జూచుచున్నారు. 

కొందరి ప్రకారము సృష్టి అంతయు స్వాభావికముగా జరుగుచున్నది. దీనిని గ్రహించుట సాధ్యము కాదు నిరోధించుటకు అధికారము లేదు. మానవుని ప్రవర్తనలో గల మంచి చెడ్డలు కూడ స్వాభావికముగా జరుగుచున్నవని వారి మతము. దీని వలన ఒకరితో ఒకరు కలహించుకొని జాతి నశించును. ఇతరుల వలన మనకు దుఃఖము కలిగినపుడు వారు చేసిరని దుఃఖింప పనిలేదు. 

తర్కమునకు, నిర్ణయమునకు లొంగని వాడు సర్వాంతర్యామి. వాని లీలయే సర్వము. ఇంతకన్నా సత్యము లేదు.. 

........ ✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

09.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 152  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


ఏ నరుడైనను స్వల్పకాలము దేనిని గూర్చి వాదనలోనికి దిగినను రోషము, పంతములు కలుగును.  అనగా బాధ కలుగును. అది కలిగినంత కాలము వాని ఆయుర్దాయము వ్యర్థమై పోయి‌నట్లే.

ఏ నరుఁడే నొక నిమిషం
బైన వృథావాదగతిని హరిపదకమల
ధ్యానానందుఁడు గాడే
నా నరునకు నాయు వల్ప మగు మునినాథా!

వయస్సు‌ను బట్టి రోగము , ముసలితనము మున్నగు లక్షణములు వచ్చుట సిద్ధులయందు పనిచేయదు. 

మనస్సు , ఇంద్రియములు స్థూలదేహమునకు కోరికల రూపమున దాస్యము చేయుచున్నచో రోగము, ముసలితనము కనిపించును. 

అట్లుగాక ఇంద్రియములు , మనస్సు , బుద్ధి యోగమున భగవంతుని యందు వసించుట అభ్యాసమైనచో దేహము కూడ వానిమనుసరించి జీవింపవలసి వచ్చును. అప్పుడు రోగము, వయస్సు పనిచేయవు.

......... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

10.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 153  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 1 🌻 

సామరస్యమునకు అనుకూలమగు ఆలోచనను ఉద్భవింపజేసినచో, అది అవతలి వారిలోను ఇట్టి అనుకూల దృక్పథమునే జనింపజేయును. అంతట వారు కూడ అనుకూలమగు ఆలోచనలనే మనకు అందించుట జరుగును. తిరిగి మనలోను సామర్యసానుకూల దృక్పథమే ప్రేరేపితమగును. విధానమంతయు ఒక స్వయం పరితృప్త వలయము వలె పనిచేయును. 

దాని‌ వలన మనస్సు నిర్మాణాత్మకముగను, సృజనాత్మకముగను అగును. ఈ విషయము తెలియుటకు ముందు, బాధ్యతను ఎరుగని ప్రవృత్తితో తలంపులను ఉద్భవింపజేయుట మూలమున మనము మనకును, ఇతరులకును హాని కలిగించిన వారమైతిమి. 

మానవజాతి ఒక్కుమ్మడిగా మానవ ప్రపంచమును సంఘర్షణ దిశగా తోయుచున్నది. ఎల్లరును సంఘర్షణలో దిగబడినవారే. ఆలోచనలను బాధ్యతా రహితముగా ఉద్భవింప జేసిన దాని ఫలితముగాదా ఇది. ఇతరులలోను, మనలోను దృక్పథములను జనింపజేయుటలో అజ్ఞానముతో వ్యవహరించుట‌ వలన ఫలితము గాదా ఇది. ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు..

..✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

11.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 154 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భావ బలము - 2 🌻 

ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు. ఇతరులకు మనము ప్రతికూలపు ఆలోచనను అందించినచో మనకు కూడా వారి నుండి ప్రతికూలపు ఆలోచనయే ఎదురగాక తప్పదు.

ఇట్టి వ్యవహారము, ఇరువురు వ్యక్తుల నుడమ వాటిల్లినచో, దాని ప్రభావము సమాజముపై అంతగా ఉండదు. కాని, ఇట్టిదే రెండు వర్గములకో, జాతులకో, దేశములకో ప్రాతినిధ్యము వహించు ఇరువురు వ్యక్తుల నడుమ వాటిల్లినచో ఫలితము వినాశకరమగును. 

సంగ్రామము పేరున, మానవ చరిత్ర పుటలలో చాలా బాధాకరములయిన గుణపాఠములు లిఖింపబడినవి. ప్రతి యుద్ధము గూడ, నరుడను జీవిలోని పశుప్రవృత్తి యొక్క చేవ్రాలు మాత్రమే. అనగా మృగ ప్రాయమైన బాధ్యతారహిత పథమున ఆలోచనలను, దృక్పథములను ఉద్భవింపజేయుటయే. 

ప్రసార కేంద్రము నుండి వెలువడు ఒకే కార్యక్రమమును ఎవరి రేడియో అయినను స్వీకరించును. ఉద్వేగము వలన మనలో ఒక తలంపు పుట్టగనే, ఇతరులలోను అది ఉద్వేగమునే ప్రేరేపించును. అవతలి వ్యక్తి, ఉద్వేగమును అంతయు తనలోన సంలీనము గావించుకొన్నవాడయితే తప్ప, ఇది యథార్థము. 

దౌర్భాగ్య వశమున, మన నరులలో 98% మంది, ఉద్వేగమునందే బ్రతుకుచు, ఉద్వేగమను మాలిన్యము నుండియే తలంపులను ఉద్భవింప జేయుచున్నారు. ఫలితమెప్పుడును, తిరిగి ఉద్వేగముతోడి స్పందనయే గదా..

...✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

12.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 155  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భావ బలము - 3 🌻 

దౌర్భాగ్య వశమున, మన నరులలో 98% మంది, ఉద్వేగమునందే బ్రతుకుచు, ఉద్వేగమను మాలిన్యము నుండియే తలంపులను ఉద్భవింప జేయుచున్నారు. ఫలితమెప్పుడును, తిరిగి ఉద్వేగముతోడి స్పందనయే గదా. 

అధిక రుచికరమైనది ఏదయిన, ఉద్వేగము యొక్క స్థానమున వెలయ కున్నచో ఈ విపత్తు నుండి బయటపడుట సాధ్యము కాదు. మనలో ఉద్వేగము యొక్క స్థానము గొనవలసినది ఏది? పెద్దలు దీనినే స్పూర్తి అనుచున్నారు. 

మనము ఉదాత్తమైన దాని నుండి స్పూర్తి నందినచో మన ఉద్వేగములు క్రమముగా క్షాళితములగును మట్టి రేణువులు, అడుగున నిలిచి, నిర్మల జలములు బయటపడుటకు అవకాశము కలుగును. స్వర్ణ రసాయన శాస్త్రవేత్త దీనినే పరిశుద్ధీకరణ విధానమని పేర్కొనెను. మన యందు ఈ విధానము అమలు జరిగినచో అవతలి వారి స్పందనయు పరిశుద్ధముగానే ఉండును. 

పరిశుద్ధి చెందిన జలములలో ఏదయిన సంచలనమును కలిగించినను, ఎట్టి అవక్షేపమును అడుగునకు జేరదు. రంగు మార్పు జరుగదు. 

మనలో ఇట్లు పరిశుద్ధీకరణము చెందిన అనుభూతి యొక్క వాహికను పెంపొందించుకొననగును. అనగా, అనుభూతి తన ద్వారమున అందుకొననగు వాహిక అను మాట. ఇట్టి స్థితినే 'స్పూర్తి' అందురు. 

ఇట్టి స్థితిలో మన సంబాషణ, అవతలి వానిలో ఉద్వేగమును గాక, పరమప్రేమ రూపమగు భక్తిని ప్రేరేపించును. భక్తికి, ఉద్వేగమునకు గల వ్యత్యాసము పరిశుద్ధ జలములకు మట్టితో గూడిన మురికి నీటికి గల వ్యత్యాసము వంటిదే. భక్తి అనునది, మన దృక్పథమును ఉదాత్తము గావించి, మనకు అనుభూతినందించును.....
✍ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

13 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 156  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భావ బలము - 4 🌻 

ఇంకొక యధార్థమేమనగా, ఉద్వేగమనునది ఉప్పెన కెరటములుగా మార్పు చెందుచుండును. భక్తి అట్లు గాక, నిశ్చల జలముల వలె మన యందు నిండిపోవును. 

స్పూర్తితో పుష్టినొందిన భక్తి (పరమ ప్రేమ) అనభూతి కలిగిన వానిలో దృక్పథము మార్పు చెందుట జరుగదు. నాకు, నీ యెడల ప్రేమను అసత్యపు పేరుతో ఉద్వేగపూరితమైన సంగమున్నచో, అది తప్పక‌ మిక్కిలి ధృడమై తీరును. 

మరియు అతి ధృడమైన ద్వేషమును కలిగించకుండ యుండదు. ఉద్వేగబంధితుడగు జీవుడు పశుప్రాయుడే‌, సెలవు రోజున తన ప్రియ స్నేహితుడు అతని వేరొక స్నేహితునితో కలిసి చరించుట గాంచినచో ఫలితమేమి? తనకు, అవతలి వాని యెడల గల ప్రేమకు ఫలముగా, అసూయా రోషములతో దుఃఖించుట దక్కును. ఇది ఉద్వేగముతో కలుషీకృతమైన ప్రేమ యొక్క ఫలితము.

ఉద్వేగము వలన అవతలి వ్యక్తులను వస్తువులను మనకు చెందిన వానిగా భావించి చిక్కులలో పడుట జరుగును. 

పరమప్రేమ రూపమయిన భక్తి వలన మనవి అనబడు వానిని చివరకు మనలను గూడ సమర్పించుకొనుట జరుగును. పశుపద్ధతిలో మనము అవతలి వానిని ఇష్టపడినచో, వానిని మనకు చెందిన వస్తువుగా ‌భావించుట జరుగును. మనము అనుకొన్న మంచి పద్ధతిలో అవతలి వాడు నడువ వలెనని ఆశించుట జరుగును. ఈ పద్ధతి వట్టి మూర్ఖత యగును. 

అవతలివాడు, తనదయిన రీతిలో తాను వర్తింపనారంభింపగనే, మనలో తీవ్రమగు కఠిన ప్రతిక్రియ ఉప్పతిల్లును. 

అంతటితో వానిని ద్వేషింప ఆరంభింతుము. ఇట్లగుటకు కారణమేమి? అవతలి వానిని మనము ప్రేమించుటయే. ఇట్టి ప్రేమ నిజమైన ప్రేమ అగునా? ఇదియు ద్వేషమను కాలుష్యముతో గూడిమదై సంగమగుచున్నది. మన ప్రేమకు గురిఅయిన వానిని ద్వేషించుటకు కారణము, ఉద్వేగముచే ప్రేరేపింపబడిన భావముల శక్తియే...

...✍ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

14 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 157   🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భావ బలము - 5 🌻 

నాలో పరమప్రేమ నెలకొన్నచో, నిన్ను‌ నేను అభిమానించునెడల, నిన్ను‌ నా వస్తువు వలె భావించి బంధింప ఇష్టముండదు. నీపై పెత్తనము చెలాయింప ఇష్టముండదు. దీనికి కారణము, నీ యందే నా అభిమానము కాని, నిన్ను నా వస్తువును వలె గావించుకొనుట యందుగాదు. ఇపుడు, నీ సాన్నిధ్యములో నేను ఆనందించెదను. ఇదియే నాకు కలుగు హితము. నీవు దగ్గరలేనపుడు, నిన్ను గూర్చిన స్మృతుల తీపి నాకు దక్కును. 

నీ సాన్నిధ్యము వలన నాకు కలుగు ఆనందము, నా జీవితములో నిర్వర్తించు‌ సమస్త కార్యములకును తన పరిమళమును వెదజల్లును. మనచే ప్రేమింపబడిన వ్యక్తి కనపడినపుడు గాని, అతని గూర్చి తలంపు మన మనస్సున మెదలినగాని, ఈ లోకమునందలి సర్వమును దివ్యగానమగును‌. 

గులాబీలకు గల ముళ్ళను మనము పట్టించుకొనము. గులాబీనే అభిమానించెదము. పరమప్రేమ సామ్రాజ్యమున‌ ఒరుల సద్గుణములతోనే మనకు ప్రమేయము గావున, మనలోపములకు గులాబీలకు గల ముండ్లకు వాటిల్లు ఫలితమే ప్రాప్తించును. అనగా అవి పట్టించుకొనబడవు. గులాబీలను గాంచి ఆనందింప వలసి యుండుట వలన, ముళ్ళ యెడల భీతి చెందుటకు మనకు సమయము చాలదు. మన చుట్టు ఉన్న వారిలో కొందరు ఆవేశపరులయిన వారుండవచ్చును. వారి ప్రవర్తన పశుత్వముతో గూడి ఉన్నపుడు, దాని యెడల మనస్సునుంచక, తటస్థముగా ఉండుట అభ్యసింపవలెను. 

ఈ అభ్యాసము దృడపడవలెనన్నచో, పరమ ప్రేమ ద్వారమున, మనచుట్టు ఉన్న సత్పురుషుల సాన్నిధ్యములో ఆనందించుటయే మార్గము.......

✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

15 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 158 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


సంస్కృతంలో పరమప్రేమకే "భక్తి" అని పేరు. భక్తిని అభ్యాసము చేయు మార్గమునకే భక్తి యోగమని పేరు. మన తలంపులను పరిశుద్ధము గావించు కొనుటకును, వానికి చక్కని రూపు కల్పించుటకును, మన భావములతో సుందర శిల్పము సృజించుటకు భక్తియోగమే శ్రేష్ఠమయిన మార్గము. 

భావబలమే అంతిమ శక్తి. మన నుండి దేనినయినను, ఇది కల్పింపగలదు. సముచిత పథము‌ కల్పింపబడినచో, అది మనకును, ఒరులకును స్వర్గమును సృజించి, మనలను దైవ సామ్రాజ్యమున నిలుపును. అనుచితముగా కల్పింప బడినపుడు, దీని వలన రాజ్యములు వినాశమునకు గురియగును. దానితో మానవ జీవితము వికారమయిన శిథిలముల కట్టయగును‌. 

అసలు, తలంపు అనునది ఎట్లు ఆవిర్భావమొందునో పరిపూర్ణముగా అవగతము చేసికొందుము గాక. మనలో తలంపు, కల్పింపబడిన పిమ్మట, ఒక తలంపు నెలకొనునని మనము ఎరుగుదుము. 

ఇది మన మనస్సులో పయనము గావించుచు, ఒక నిండయిన అభిప్రాయముగా రూపొందును‌ అంతట, వ్యక్తీకరణమును కాంక్షించును. అందులకు గాను ఒక వాక్యమును ఎంపిక చేసికొనును. 

అంతట పదములను ఎంపిక చేసికొని, వాక్యముగా కూర్పుచేయును. అప్పుడు మాత్రమే, మనకు తెలిసిన భాషకు సంబంధించి, మన స్మృతి పథమును బట్టి, ఆవశ్యకములగు ధ్వని సంపుటులను ఎన్నుకొనును. 

అపుడు వాక్యముగా ఉచ్చరితమై బాహ్యమున వెలువడును. దీనినే మనము "ఉచ్చరిత వాక్యము" అని అనుచున్నాము...

........ .✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

16 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.   మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 159   🌹 

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. మోక్షము - వినాశము 🌻 

నా పనులు అని వేరుగా కొన్నిటిని ఏర్పరుచుకొని నెరవేర్చుచుండుటయే అహంకారము. అహంకారము దేవుని పనికి సమర్పణమైనపుడు జన్మ సమస్తము చక్కగా నిర్వహింపబడును. 

అదియే మోక్షము. 

అట్లుగాక అహంకారమునకు సొంతపని అని వేరుగా ఏర్పడినచో దురహంకారమగును. దానివలన అసురత్వము , వినాశము కలుగును.

హిమాలయములలోని నదీ ప్రవాహములలో మంచుగడ్డలు పుట్టి , తేలుచు ప్రయాణము చేసి , కరగిపోవుచుండును. పుట్టుట, కరగిపోవుట అను స్థితులకు ముందు , తర్వాత ఆ ప్రవాహముండును. మంచుగడ్డ కట్టుకొనునపుడు దాని లోపల ప్రవాహజలమే గడ్డకట్టి యుండును. అట్లే దేహముల యందు నారాయణుడును.

మంచుగడ్డలు నీటిపై తేలుచున్నపుడు నీరుగా నున్న ద్రవ్యము ననుసరించి మంచుగడ్డగా నున్న అదే ద్రవ్యము ప్రవర్తించును. మంచుగడ్డ ప్రవహించు దిక్కు మున్నగునవి నీటి ప్రవాహము ననుసరించి యుండును. అనగా మంచుగడ్డలోని అదే ద్రవ్యమునకు పరాధీనత , నీటిలోని అదే ద్రవ్యమునకు స్వామిత్వము కలుగును. 

అదే విధముగా త్రిగుణములతో బద్ధుడుగా జీవుడును , త్రిగుణాత్మక ప్రకృతికి ప్రభువుగా ఈశ్వరుడును వర్తించుచున్నారు. ఈ బద్ధస్థితి ఉన్నంత తడవును జీవునకు బోధపడదు. బోధపడుట యనగా ఈశత్వము నందు మేల్కొనుట.

.... ✍🏼 మాస్టర్ ఇ.కె. 🌻

🌹🌹🌹🌹🌹


17 Sep 2020

------------------------------------ x ------------------------------------





🌹.   మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 160   🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. మహాపూర్ణవాణి 🌻

🥀. సంసారికి మోక్షం లేదు. ఇది తిరుగులేని సిద్ధాంతం, అయితే దీని భావం గృహస్థుకు మోక్షం లేదని కాదు. సంసారం అంటే భార్యాపిల్లలూ అని కాదు అర్థం. సంసారం అంటే కోరికలు. కోరికలు ఉన్న వానికి మోక్షం లేదు. 

బాహ్యానికి గృహస్థుడుగా ఉన్నప్పటికీ కోరికలు లేకుండా ఉండగలిగితే వాడు సంసారి కాడు. వానికి మోక్షం కరతలామలకమే. బాహ్యానికి సన్న్యాసిగా ఉన్నప్పటికీ వానికి ఏమాత్రమైనా కోరికలుంటే వానికి మోక్షం గగనకుసుమమే. 

వాడు సన్న్యాసీ కాడు, గృహస్థుడూ కాడు, సామాన్య సంసారీ కాడు భ్రష్టుడు‌. 🥀

🥀. మడి కట్టుకున్నాను అనీ, ఎవరైనా తగిలితే మైలపడిపోతున్నావు అంటున్నావు కదా, ఇతరులు తాకినంత మాత్రాన మైలపడే నీ మడిలో పటుత్వం ఏమి ఉంది! నీదే కనుక పటుత్వం ఉన్న మడి అయితే, నిన్ను తగిలిన వారంతా మడిపడాలి గాని, నీవు మైల పడరాదు. అంత పటుత్వమైన మడి నీలో ఉన్నది. అది నీవు గ్రహించుకోవటం లేదు. 

హృదయాన్ని ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుకో! అందరినీ అన్నిటినీ నీ ఇష్టదైవం యొక్క మారు రూపాలుగా గుర్తించు-చాలు. ఇదే అసలైన పటుత్వం గల మడి. 

ఇలా చెప్పాను గదా అని ఇక స్నానం చేయటం మానివేస్తావేమో, స్నానమూ మానరాదు, శాస్ర్తమూ, పెద్దలు విధించిన సత్కర్మలూ మానరాదు. సిద్ధి కలిగే వరకూ అవి చేస్తూ ఉండవలసినదే. కాని కేవలం బాహ్యకర్మలతోటే మడి, పవిత్రతా వస్తాయని మాత్రం భ్రమపడబోకు. 

మడీ, పవిత్రతా గుణముల చేతనే రావాలి..

..... ✍️. మాస్టర్ ఇ.కె.🥀
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

18.Sep.2020

------------------------------------ x ------------------------------------












No comments:

Post a Comment