సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 40

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 40 🌹 
40 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగ మాయ - 3 🍃 

289. ఈ మాయా శక్తి యందు కోట్లకొలది రేణువులు ఉత్పత్తి, స్థితి, లయములను పొందుచుండెను. చిత్‌ బ్రహ్మము మాయా శక్తిచే ఆవరింపబడి ఉన్నది. చిదణువు నుండె సృష్టి ఏర్పడుచున్నది. వడ్లగింజ పొట్టుచే మూయబడినట్లు జీవుని మాయా ఆవరించియున్నది. 

290. తల్లి గర్భమున శిశువుకు పూర్ణ జ్ఞానముండును. ఆ స్థితిలో తాను తన పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపకర్మలను తలచుకొనుచూ, పశ్చాత్తాప పడుచూ, ఈ జన్మలోనైనా జ్ఞానముతో సత్కర్మలతో జీవింతునని తలచుకొనుచూ, దుర్గంధ సహితమైన మలమూత్ర నరక కూపమునందు వసించుచుండును. అట్టి స్థితిలో వైష్ణవ మాయ కమ్మి శిశువు అధోముఖముగా తల్లి గర్భమునుండి భౌతిక ప్రపంచమున ప్రవేశించును. 

291. మాయతో ఆవరించి ఉన్న ఆత్మను దర్శించాలంటే జీవుడు తన చుట్టూ ఆవరించి ఉన్న మాయను జయించాలి. అపుడే ఆత్మ సాక్షత్కారమై జీవుడు ఆత్మను దర్శించును. జ్ఞాని అగును. జీవాత్మ పరమాత్మ ఒక్కటే. 

292. పదార్థములన్నియూ మూల ప్రకృతి నుండి ఉద్భవించి అందే లయమగుచున్నది. సమస్త ప్రాణికోటి ప్రళయకాలమున మాయ యందు అణగిఉండి, తిరిగి సృష్టి కార్యమున జన్మించును. కల్పారంభమున భగవంతుడు జీవులను మరల సృజించుచున్నాడు. కాని పరబ్రహ్మ మాయకు అంటనివాడు. 

293. బ్రహ్మకు పగలు ప్రారంభము కాగానే మాయవలన చరాచర ప్రపంచము తెలియుచున్నది. బ్రహ్మకు రాత్రి సమయము కాగానే మాయ లయమై జీవులు అందు అణగి ఉండును. అలానే జీవుడు పగలంతా కోతి వలె సంచరించుచుండును. రాత్రి సమయమున నిద్రించును. 

294. దేవతల, మానవుల కాల ప్రమాణము ఈ క్రింది విధముగా ఉండును. 
దేవతల కాలము మానవుల కాలము 
24 గంటలు 1 సంవత్సరము 
1 నెల 30 సంవత్సరాలు 
1 సంవత్సరము 360 సంవత్సరములు 
1 యుగము 12,000 సంవత్సరములు 
1 మహా యుగము 43,20,000 సంవత్సరములు 
కలియుగము : 4,32,000 సంవత్సరాలు 
ద్వాపరయుగము : 8,64,000 సంవత్సరాలు 
త్రేతాయుగము : 12,96,000 సంవత్సరాలు 
కృతయుగము : 17,28,000 సంవత్సరాలు 
మహా యుగము మొత్తము 43,20,000 సంవత్సరాలు 
1000 యుగములు బ్రహ్మకు 1 పగలు 
1000 యుగములు బ్రహ్మకు 1 రాత్రి 
అనగా 1000 þ 4,32,000 = 43,20,00,000 సంవత్సరాలు బ్రహ్మకు 1 పగలు. 
అలానే బ్రహ్మకు రాత్రి పగలు కలిసి 86,40,00,000 సంవత్సరాలు 1 రోజు. 
బ్రహ్మ యొక్క పగలు కల్పము 
బ్రహ్మ యొక్క రాత్రి ప్రళయము 
బ్రహ్మ యొక్క 30 రోజులు- బ్రహ్మకు 1 నెల 
బ్రహ్మ యొక్క 12 నెలలు - బ్రహ్మకు 1 సంవత్సరము బ్రహ్మకు 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుర్థాయము కావున బ్రహ్మ జీవితము కూడ పరిమితమైనదే అలానే మిగిలిన లోకములు. కేవలము పరబ్రహ్మ మాత్రమే శాశ్వతము. 

295. భ్రాంతి తొలగించుటకు సాధకుని కర్తవ్యములు:- భగవత్‌ ధ్యానము. ధ్యానము వలన జ్ఞానము లభించి భ్రాంతి తొలగును. అపుడు భగవత్‌ ప్రాప్తి లభించును. నిరంతర సాధన, పురుష ప్రయత్నము, శాస్త్ర పఠనము, ఆధ్యాత్మిక విచారణ, దైవ స్మరణ, భక్తి శ్రద్ధల ద్వారా భ్రాంతి తొలగును. స్వస్వరూప జ్ఞానము (ఆత్మ దర్శనం) వలన మాయ తొలగును. మాయను మాయతోనే నశింపజేయవలెను. నిరంతర యోగాగ్నిలో మాయ భస్మం అగును.
🌹 🌹 🌹 🌹 🌹


17.Apr.2019

ఉన్నత విలువలు - వాటి క్షీణత వల్ల మనకు లభించే ఫలితాలు

🌹 *ఉన్నత విలువలు - వాటి క్షీణత వల్ల మనకు లభించే ఫలితాలు* 🌹

*పూర్వం సాహిత్యం విలువలు కలిగి ఉండేది. అది ఈనాడు అంతగా ఉన్నట్టు కనబడదు. సృష్టి కూడా ఉన్నతంగా ఎన్నో దివ్యమైన సంకల్పములుతో ఏర్పడినదే అమరత్వంగా. కానీ క్షీణత దాని లక్షణముగా ఆయిపోయింది పదార్ధ జగతిలో.*

*ప్రతీ దాని లోనూ ఈ నశ్వర సిద్ధాంతం కనబడుతుంది. పుట్టిన ప్రతివాడు కల్మష రహితంగానే ఉంటాడు. నెమ్మదిగా తనవి కాని వాటిని సొంతం చేసుకుని ఆట మొదలు పెట్టి, అనేక దుఃఖ అనుభవములతో కూడి తొలగిపోతాడు. సాధనలు అంతే. మొదలు పెట్టినప్పుడు అతి ఉత్సాహం, నెమ్మదిగా నిరాశకు గురవుతారు. పట్టుదల కనిపించదు. సంకల్పం నుంచి విముఖులవుతారు.*

*ఈ జీవితానికి వచ్చే ముందు ఆత్మల లోకంలో శపధాలు చేస్తారు. తరువాత నానా విధ ఆలోచనలు. అందుకే దైవం స్థిరమైన బుద్ధి కలిగిన వారి కోసం కాగడా పెట్టి వెతుకుతాడు. వారికే పరిణామక్రమము లో ఉన్నతినిస్తాడు. మరి ఆయన స్థిరమైన వాడు కదా అందుకే.*

*దృఢ సంకల్పమే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆధ్యాత్మిక పధంలో.*

*మంచి విలువలతో ప్రారంభం అయిన ఎన్నో ఆత్మికమైన సంబంధాలు కూడా చివరికి సాధారణ మానవీయ విలువలకు తరువాత ఆసురీ విలువలకు పడిపోతున్నాయి.*

*సాధనాపరమైన విషయాలు వరకూ సంభాషణలు వుంటే అవి ఉద్ధరణకు సహాయ పడతాయి. ఏ విషయంలో అయినా క్షీణతకు దారి తీసే అంశాల పట్ల అందరూ జాగురూకులై ఉండాలి.*

*మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మీరు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం “మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు” మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదానికి మీరే కారణం అన్న బాధ్యతను తీసుకోవాలి. మీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మీ ఆలోచన లేక భావాలు మూలంగా జరుగుతాయి. మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని తప్పుగా భావించవద్దు. మీ భవిష్యత్తును ఎంతో పాజిటివ్ గా సృష్టించుకోండి. ధ్యానము మరి ఊహా శక్తి ద్వారా.*

          *దేని గురించైనా మీలో నెగిటివ్ భావాలు వస్తున్నట్లయితే, ఒక్క క్షణం ఆగి మీ అంతరాత్మను అడగండి, “దీనివల్ల నేను ఏమి నేర్చుకోవాలో ?” అని.*

    *మీరు ఉన్నత లక్ష్యాల కోసం పని చేస్తున్నప్పుడు, పట్టు విడవకుండా, ఎంతో ఇష్టంతో, స్థిరంగా పనిచేయవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక లక్ష్యాలు అత్యున్నత లక్ష్యాలు.*
🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*

సవికల్ప - నిర్వికల్ప సమాధి అంటే ?

🌹 సవికల్ప - నిర్వికల్ప సమాధి అంటే ? 🌹

నిర్వికల్ప సమాధి స్థితి ఉన్నతమైన ఏకాగ్రతతో ఏవిధమైన భావములు లేకుండా సాధన చేసి సిద్దిపొందిన ఒకానొక స్ధితి.

నిర్వికల్ప సమాధి స్థితిలో మనస్సు నిశ్చలముగా  వుంటుంది కనుక. అపుడు సాధకుడు ఆనంద స్థితిలో మునిగి, ఏవిధమైన శబ్దములు, వస్తువులు లేకుండా వాటి అతీతముగా; గాలి లేని చోట నిశ్చలముగా వెలిగే దీప శిఖ వలె ఆత్మలో  లీనమై వుంటుంది.

సవికల్ప సమాధికి నిర్వికల్ప సమాధి ఏవిధముగా వేరైనదో ఇపుడు తెలుసుకుందాము.

సవికల్ప సమాధి అనేది సాధకులు కొద్ది రోజులు సాధనలో సాధకునికి  దొరికే  ఒక చిన్న స్థితి.
ఆ స్థితికే చాలా మందకి యోగ భ్రష్టత్వం కలుగుతుంది. అలా కలుగకుండా ఎవ్వడు సాధన చేయునో వాడే నిర్వికల్ప సమాది సిద్దుడు. నిర్వికల్ప సమాది సిద్ది కలిగిన   యోగి  రుద్ర సమానుడు.  కనుక నిర్వికల్ప సమాధి స్థితిని స్థిరముగా సాధన చేసిన మనస్సు బంధనాలకు కారణమైన జ్ఞానేంద్రియాల నుండి విముక్తి చెందుతుంది. ఎపుడైతే మనస్సు భౌతిక ప్రపంచము నుండి విముక్తి పొందుతుందో అపుడు నిర్వికల్ప సమాధి స్థితి గాలి లేని చోట నిశ్చలముగా వెలిగే దీపము వలె ఏవిధమైన చలనము లేకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది.

గాలి లేని కుండలో నిశ్చలముగా వెలిగే దీపము వలె యోగి యొక్క మనస్సు స్థిరమై ఏకాగ్రతలో సాధన చేయగలుగుతాడు.
ఇచట ఏ వస్తువులు, కోరికలు లేని స్థితిలో శబ్దాలకు వస్తువులకు అతీతముగా సాధన జరుగును. అపుడు ఆత్మ యొక్క ఉన్నతమైన అనుభూతి ఏర్పడుతుంది.

మాయకు, అజ్ఞానానికి అతీతముగా ప్రాపంచిక చింతనలు లేని పరమానంద స్థితిని అనుభవిస్తూ శాశ్వతము, పుట్టుక, అంతములేని ఆత్మానుభూతిని యోగి అనుభవిస్తాడు. ఆ సమయములో సాధకుడు సువాసనలు వెదజల్లుతూ రసానూభూతిలో (ఆత్మానూభూతి) ఓలలాడుతుంటాడు. అట్టి రసానూభూతి వలన సాధకుడు తాను ఆత్మానందం  అవిస్తుంటాడు. అంతే కాకుండా అతడు ఆ రసానూభూతి వలన తనను తాను ఎంతో కాలము అదుపులో ఉంచుకోన లేకుండును.అట్టి సమయమున గురువు చాలా అవసరం సుమా.

ఈ నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నతమైన ఏకాగ్రత ఏర్పడి సాధకుడు తన నిజమైన జీవాత్మను తెలుసుకొన గలుగుతాడు. ఈ స్థితిలో మనసు యొక్క పనులు ఆగిపోతాయి. బ్రహ్మానంద స్థితిని తెలుసుకొంటాడు. ఇట్టి స్థితిని అసంప్రజ్ఞ సమాధి స్థితి అని కూడా అంటారు.

ఈ సమయములో కర్త, కర్మ, క్రియల సంబంధము ఉండదు. ఒక రాయి ఏవిధముగా నిశ్చల స్థితిలో ఉంటుందో అదే విధముగా ఈ సమాధి స్థితిలో సాధకుడు ఉంటాడు. కారణము మనసు పనిచేయదు. కాని దానిని గాఢ నిద్రతో పోల్చరాదు. గాఢ నిద్రలో కూడా ద్వంద్వ స్థితి ఉండదు. రెంటికి తేడా ఏమిటంటే- గాఢ నిద్రలో ఆత్మ జ్ఞానముండదు కాని నిర్వికల్ప సమాధి స్థితిలో ఆత్మ జ్ఞానము యొక్క ఎఱుక ఉంటుంది. అదే దివ్యానంద స్థితి.

ఏ స్థితిలో అయితే కోరికలన్ని పూర్తిగా తొలగిపోతాయో అపుడు యోగి రాయి వలె నిశ్చలుడవుతాడు. అయితే గాఢ నిద్ర ఆత్మిక స్థితి మాత్రము కాదు.

నిర్వికల్ప సమాధి స్థితిలో సాధకుడు సత్యాసత్యములకు, మంచి చెడులు మొదలగు ద్వంద్వాలకు తేడా తెలుసుకొని ఉంటాడు. అట్టి స్థితిలో సాధకుడు ప్రాపంచిక వ్యవహారాలన్నింటికి అతీతుడై ఉంటాడు. ఈ స్థితి పూర్తిగా బంధన రహితమైనట్టిది.

ఎందువలనంటే అతనికి: ప్రకృతి పురుషులకు అనగా ప్రపంచము బ్రహ్మానికి తేడా తెలిసి ఉంటుంది.

ఎవరైతే పూర్తిగా ప్రాపంచిక విషయములందు విరాగియై ఉంటాడో అతడే ఇట్టి సమాధి స్థితిని పొందగలిగి ఉంటాడు. అతడు అత్యంత శక్తి వంతుడై అన్నింటి విషయాన్ని సాధించ గలుగుతాడు. ఈ సమాధి స్థితిలో అన్ని విధములైన ఆలోచనలు, భావనలు తొలగిపోయి కేవలం బ్రహ్మానందములో లీనమై ఉంటాడు.

అది ఎలాంటి స్థితి అంటే ఖాళీ కుండను ఆకాశంలో ఉంచినపుడు, ఆ కుండ లోపల, బయట ఏమీ లేనపుడు, మరియు అది ఎలాంటిదంటే అది పూర్తిగా సముద్రములో ఆ కుండను ముంచినపుడు దానిలోపల, బయట పూర్తిగా నీటితో నిండిన స్థితి. అనగా ఏమీ లేని స్థితి మరియు అన్ని ఉన్న స్థితి.

సమాధి సాధన ద్వారా సాధకుడు ఆత్మ దర్శనం పొందగలుగుతాడు. అదే ఎఱుకతో కూడిన ఆనంద స్థితి. ఈ సాధన బాహ్య వస్తువు యొక్క సహాయముతో కూడా చేయవచ్చు. అట్టి సాధన ద్వారా బ్రహ్మము యొక్క స్థితిని ఎవరైన గ్రహించవచ్చు. బ్రహ్మము, ఆత్మ ఒక్కటే.

మొదటి రకం సమాధి అనగా సవికల్ప సమాధి. బాహ్య వస్తు సహాయంతో సాధించవచ్చు. దానికి అంతర వస్తు సహాయము కూడా తీసుకొనవచ్చు. ఈ సమాధిలో పేరు, ఆకారము వేరుగా ఉన్నప్పటికి స్వచ్ఛమైన బ్రహ్మము మాత్రము ఒక్కటే.

సవికల్ప సమాధిలో బాహ్యమైన సూర్యుడు మొదలగువానిపై ధ్యాస ఉంచి సాధన చేయవచ్చు. అంతర్గతమైన కోరికలపై ధ్యాస ఉంచి సాధన చేయవచ్చు. అనగా సూర్యుని తన కోర్కె తీర్చుటకు ప్రార్థన చేయవచ్చు. కనిపించే వస్తువు పేరు వేరువేరైనప్పటికి పట్టించు కొనవలసిన పనిలేదు. ఎందువలనంటే సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ యొక్క ఎఱుక ఉంటుంది. వస్తువు యొక్క ఆకారము అప్పటికి నిజమైన శాశ్వతమైన బ్రహ్మమే, అసలైన సత్యము.

ప్రతి వస్తువుకు మూడు లక్షణాలుంటాయి. 1. అది ఉన్నది. 2. కనిపించేది. 3. ఆకర్షణ. ఇతర మార్పులు, పేర్లు, ఆకారములు సాధకుడు తన మనస్సును స్వచ్ఛమైన బ్రహ్మపై కేంద్రీకరించినపుడు మార్పు చెందే పేర్లు, ఆకారములను పట్టించుకోకూడదు. ఇందులో బాహ్యమైన శబ్దమును ఆధారము చేసుకొని సవికల్ప సమాధి స్థితిని సాధన చేయుట తెలుపబడింది.

ఈ స్థితిలో గతము, వర్తమానము, భవిష్యత్తులోనూ మార్పు లేని; సమయము, ప్రదేశముతో సంబంధము లేని సవికల్ప సమాధిని వ్యక్తం చేయుట జరుగుతుంది. ఇది పేరు వస్తువుపై చేసే సవికల్ప సమాధి స్థితి కంటే ఉన్నతము. మరియు నిర్వికల్ప సమాధి స్థితి కంటే అల్పము అయినది. ఈ స్థితిపై రెండింటికి సంబంధము ఉన్నది.

నిర్వికల్ప సమాధి స్థితిని ఎలా సాధన చేయాలో చెబుతా వినండి.

స్థిరత్వములేని మనస్సు సర్వదా అన్ని విషయములపై చలిస్తూ ఉంటుంది. అట్టి మనస్సు సమాధి స్థితిలో దివ్యానందాన్ని పొంది నిర్వికల్ప సమాధి స్థితిలోకి చేరుకుంటుంది. ఆ స్థితిలో సాధకుడు 6 విధములైన సమాధి స్థితులను అనుభవిస్తాడు.

సాధకుని మనస్సు పూర్తిగా బ్రహ్మములో నిమగ్నమై ఉంటుంది. అతడు పూర్తిగా నిర్వికల్ప స్థితిలో ఉంటాడు. ప్రకృతి వస్తువులు, ఇతర ఆలోచనలన్ని ఆ స్థితిలో ఉండవు. ఆ స్థితి ఎలాంటిదంటే గాలిలేని చోట నిశ్చలముగా వెలిగే దీపము లాంటిది. ఈ ఆనంద స్థితికి కారణము సాధకుడు బ్రహ్మ జ్ఞానాన్ని పూర్తిగా అవగతము చేసుకొనుటయే. జీవాత్మ, బ్రహ్మము ఒక్కటే.

మనస్సును ఏకాగ్రత చేసినపుడు అది అన్ని విధములైన మార్పులను గ్రహించి అవన్ని బ్రహ్మములోని భాగములేనని తెలుసుకొన గలుగుతుంది. అలా కానిచో మనస్సు పూర్తిగా అస్థిర స్థితిలో ఉంటుంది. మరల; వస్తువు మీద మనస్సుని ఏకాగ్రం చేసినపుడు వచ్చే అన్ని విధములైన వికల్పములు జీవాత్మ యొక్క చర్యలని గ్రహిస్తుంది. ఎందువలనంటే అతడు బ్రహ్మజ్ఞానము పొంది యుందుట వలన అవన్నీ జీవాత్మలోని భాగములని అర్ధమవుతుంది.

సమాధి స్థితిని ఏవిధమైన అడ్డంకులు లేకుండా నిరంతరము అనుభవించాలి. అపుడు మాత్రమే సాధకుడు ఉన్నత జ్ఞానమును పొందగలడు.

అందువలన నిరంతర సాధన ద్వారా సర్వ వస్తువుల మీద ప్రేమను నిరంతరముగా పొందగల్గును. నిరంతర సమాధి సాధన ఫలితముగా అది క్రమముగా క్షణంలో సమాధి స్థితిలోకి వెళ్లగల్గె స్థితి ఏర్పడుతుంది.

అపుడు సాధకుడు ప్రతి విషయము (వస్తువు)లోను బ్రహ్మన్ని గుర్తించుట జరుగుతుంది. అట్టి స్థితిలో శారీరక బంధనముల నుండి విడివడి ఉన్నతమైన జీవాత్మలో ఉండుటచే ఏ వస్తువును దర్శించినప్పటికి అందులో బ్రహ్మాన్ని దర్శించి సమాధి స్థితిలోకి చేరుట జరుగుతుంది.

శారీరక బంధనాల వలన తాను వ్యక్తినని కులము, స్త్రీ, పురుష భేదము కల్గి వుంటుంది. వేదాంత జ్ఞానము ద్వారా సాధకుడు తనలో అంతర్గత భావనలన్ని అహంభావమువలన   నేనని గ్రహించి బాహ్య వస్తువులన్నియూ ఆత్మ సాక్షితో పరిశీలించుట జరుగుతుంది. పైన తెల్పినట్లు నిరంతర సమాధి సాధన ద్వారా బ్రహ్మ జ్ఞానము కల్గి వుండుటచే, సాధకుడు, వస్తువులు, భావనలు బాహ్యాభ్యంతరములలో అన్నింటిలో బ్రహ్మాన్ని దర్శించగల్గుతాడు. పేర్లు, ఆకారాలు అన్ని కూడా బ్రహ్మములోని భాగాలేనని, తాను చూసిన ప్రతి దాంట్లో బ్రహ్మాన్ని చూడగలుగుతాడు.

అందుకు, ముందు బ్రహ్మ జ్ఞానమును గూర్చిన పూర్తి అవగాహన కృషి ద్వారా చేసి ఉండుటచే తరువత సహజ సిద్ధముగా సమాధి స్థితిలోకి తలచిన వెంటనే వెళ్ళగల్గుతాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్