🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 40 🌹
40 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 యగ మాయ - 3 🍃
289. ఈ మాయా శక్తి యందు కోట్లకొలది రేణువులు ఉత్పత్తి, స్థితి, లయములను పొందుచుండెను. చిత్ బ్రహ్మము మాయా శక్తిచే ఆవరింపబడి ఉన్నది. చిదణువు నుండె సృష్టి ఏర్పడుచున్నది. వడ్లగింజ పొట్టుచే మూయబడినట్లు జీవుని మాయా ఆవరించియున్నది.
290. తల్లి గర్భమున శిశువుకు పూర్ణ జ్ఞానముండును. ఆ స్థితిలో తాను తన పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపకర్మలను తలచుకొనుచూ, పశ్చాత్తాప పడుచూ, ఈ జన్మలోనైనా జ్ఞానముతో సత్కర్మలతో జీవింతునని తలచుకొనుచూ, దుర్గంధ సహితమైన మలమూత్ర నరక కూపమునందు వసించుచుండును. అట్టి స్థితిలో వైష్ణవ మాయ కమ్మి శిశువు అధోముఖముగా తల్లి గర్భమునుండి భౌతిక ప్రపంచమున ప్రవేశించును.
291. మాయతో ఆవరించి ఉన్న ఆత్మను దర్శించాలంటే జీవుడు తన చుట్టూ ఆవరించి ఉన్న మాయను జయించాలి. అపుడే ఆత్మ సాక్షత్కారమై జీవుడు ఆత్మను దర్శించును. జ్ఞాని అగును. జీవాత్మ పరమాత్మ ఒక్కటే.
292. పదార్థములన్నియూ మూల ప్రకృతి నుండి ఉద్భవించి అందే లయమగుచున్నది. సమస్త ప్రాణికోటి ప్రళయకాలమున మాయ యందు అణగిఉండి, తిరిగి సృష్టి కార్యమున జన్మించును. కల్పారంభమున భగవంతుడు జీవులను మరల సృజించుచున్నాడు. కాని పరబ్రహ్మ మాయకు అంటనివాడు.
293. బ్రహ్మకు పగలు ప్రారంభము కాగానే మాయవలన చరాచర ప్రపంచము తెలియుచున్నది. బ్రహ్మకు రాత్రి సమయము కాగానే మాయ లయమై జీవులు అందు అణగి ఉండును. అలానే జీవుడు పగలంతా కోతి వలె సంచరించుచుండును. రాత్రి సమయమున నిద్రించును.
294. దేవతల, మానవుల కాల ప్రమాణము ఈ క్రింది విధముగా ఉండును.
దేవతల కాలము మానవుల కాలము
24 గంటలు 1 సంవత్సరము
1 నెల 30 సంవత్సరాలు
1 సంవత్సరము 360 సంవత్సరములు
1 యుగము 12,000 సంవత్సరములు
1 మహా యుగము 43,20,000 సంవత్సరములు
కలియుగము : 4,32,000 సంవత్సరాలు
ద్వాపరయుగము : 8,64,000 సంవత్సరాలు
త్రేతాయుగము : 12,96,000 సంవత్సరాలు
కృతయుగము : 17,28,000 సంవత్సరాలు
మహా యుగము మొత్తము 43,20,000 సంవత్సరాలు
1000 యుగములు బ్రహ్మకు 1 పగలు
1000 యుగములు బ్రహ్మకు 1 రాత్రి
అనగా 1000 þ 4,32,000 = 43,20,00,000 సంవత్సరాలు బ్రహ్మకు 1 పగలు.
అలానే బ్రహ్మకు రాత్రి పగలు కలిసి 86,40,00,000 సంవత్సరాలు 1 రోజు.
బ్రహ్మ యొక్క పగలు కల్పము
బ్రహ్మ యొక్క రాత్రి ప్రళయము
బ్రహ్మ యొక్క 30 రోజులు- బ్రహ్మకు 1 నెల
బ్రహ్మ యొక్క 12 నెలలు - బ్రహ్మకు 1 సంవత్సరము బ్రహ్మకు 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుర్థాయము కావున బ్రహ్మ జీవితము కూడ పరిమితమైనదే అలానే మిగిలిన లోకములు. కేవలము పరబ్రహ్మ మాత్రమే శాశ్వతము.
295. భ్రాంతి తొలగించుటకు సాధకుని కర్తవ్యములు:- భగవత్ ధ్యానము. ధ్యానము వలన జ్ఞానము లభించి భ్రాంతి తొలగును. అపుడు భగవత్ ప్రాప్తి లభించును. నిరంతర సాధన, పురుష ప్రయత్నము, శాస్త్ర పఠనము, ఆధ్యాత్మిక విచారణ, దైవ స్మరణ, భక్తి శ్రద్ధల ద్వారా భ్రాంతి తొలగును. స్వస్వరూప జ్ఞానము (ఆత్మ దర్శనం) వలన మాయ తొలగును. మాయను మాయతోనే నశింపజేయవలెను. నిరంతర యోగాగ్నిలో మాయ భస్మం అగును.
🌹 🌹 🌹 🌹 🌹
17.Apr.2019
No comments:
Post a Comment