Showing posts with label అంతర్యామి. Show all posts
Showing posts with label అంతర్యామి. Show all posts

అంతర్యామి - అప్రమత్తత

అంతర్యామి - అప్రమత్తత


అప్రమత్తత అంటే జాగ్రత్తగా ఉండటం. ఇది లోకంలో ఉన్న మానవాళికే కాదు, సకల ప్రాణులకూ అవసరం. ప్రపంచంలో ప్రమాదాలెప్పుడూ పొంచి ఉంటాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా ముంచుకువస్తుందో ఎవరికీ తెలియదు. ముందుగా ఊహించడం కష్టం కనుక ప్రతి ప్రాణీ సదా అప్రమత్తంగా ఉండటమే శ్రేయస్కరం.

ప్రమాదాలు రెండు విధాలు. మానవ ప్రమేయం లేకున్నా దైవికంగా జరిగేవి మొదటిరకం. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీలు, తుపానులు, సుడిగాలులు, వరదలు మొదలైనవన్నీ దైవికంగా జరిగేవి. మానవుల తప్పుల వల్ల జరిగేవి రెండోరకం. దైవిక ప్రమాదాలను ముందుగా ఊహించడం సాధ్యం కాదు గనుక అవి సంభవించినప్పుడు మనిషి జాగ్రత్తగా వాటినుంచి సురక్షితంగా బయటపడటానికి యత్నించాలి. కానీ మనిషి తెలిసో తెలియకో చేసే తప్పులవల్లా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటికి కారణం మనిషిలో అప్రమత్తత లోపించడమే. ఇది శోచనీయం.

మనిషి సర్వకాలాల్లో తన క్షేమాన్ని భావిస్తూ ఉండాలి. అందుకే పెద్దలు ఎప్పుడూ మంచి భావాలనే ఆహ్వానించాలంటారు. సద్భావన వల్ల మనసు అనుకూల మార్గంలో ప్రయాణిస్తుందని మనస్తత్వవేత్తలు అంటారు. అందుకే ఋగ్వేదం- ‘మంగళకరమైన భావాలను అన్ని దిక్కుల నుంచి ఎల్లవేళలా ఆహ్వానించండి’ అని చెబుతోంది. కనుక మనిషి నిరంతరం మంచిని తలుస్తూ ఉండాలి.

శరీరం స్వాధీనంలో ఉన్నప్పుడే, ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ఆత్మోన్నతి కోసం సాధన చేయాలని, సద్గుణాలను అలవరచుకోవాలని భర్తృహరి తన సుభాషిత త్రిశతిలో అన్నాడు. కొంపలంటుకొన్నప్పుడు నీళ్లకోసం బావిని తవ్వేవాడు మూర్ఖుడు కాక మరెవరు? రాబోయే కాలాన్ని క్షేమంగా గడపాలనుకొనే ప్రతి మనిషీ ముందుగానే మేలుకొని ప్రయత్నాలు ప్రారంభించాలి. ఇటుకపై ఇటుక పేర్చుకొంటూ పోతుంటేనే ఉన్నత భవనం రూపొందినట్లు- ఒక్కొక్క మంచి పనిని నిత్యం చేసుకుంటూ ముందుకు సాగితేనే మనిషి హాయిగా మనగలుగుతాడన్నది మహనీయుల ఉపదేశం!

సమయం వచ్చినప్పుడు చూద్దాంలెమ్మని కొందరు సమయాన్ని వృథా చేస్తుంటారు. ఎప్పుడు ఆపద వస్తే అప్పుడే మేల్కొంటామనుకుంటే, ఒక్కోసారి మనిషికి ఆలోచించే సమయం దొరకదు. చెరువుకట్ట తెగిపోకముందే ఆనకట్టను దృఢంగా చేయడం అవసరం.

ముఖ్యంగా కొందరు విద్యార్థులు సంవత్సరం అంతా వృథాగా కాలక్షేపం చేసి, పరీక్షల సమయంలో చదువుకొందామనుకొంటారు. పరీక్షలు సమీపిస్తున్నకొద్దీ ఆందోళన పెరిగి, తగిన సమయం లభించక ఫలితాల్లో విఫలం చెందుతుంటారు. ఈ పద్ధతి శ్రేయస్కరం కాదు. ఒక్కొక్క నీటిబొట్టు పడుతూ ఉంటేనే కుండ పూర్తిగా నిండుతుంది. అలాగే నిత్యం అప్రమత్తతతో చేసే నిర్విరామకృషి వల్లనే విజయలక్ష్యం సునాయాసంగా సాధ్యమవుతుంది. ముందుగానే మేల్కొని కృషి చేయడం ఉత్తమ పద్ధతి. ప్రమాదం సంభవించినప్పుడు మేల్కొని ఆపదనుంచి గట్టెక్కడం మధ్యమ పద్ధతి. కొంపలు అంటుకుపోతున్నా గాఢనిద్రలో ఉంటూ, ఏ మాత్రం స్పందించక పోవడం అధమ పద్ధతి. ఏ పద్ధతి అనుసరణీయమో తేల్చుకోవలసింది మనిషే.
మనిషి అప్రమత్తంగా జీవించేందుకు సూర్యుణ్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆరునూరైనా, నూరు ఆరైనా సూర్యుడు సకాలంలోనే ఉదయిస్తాడు. తగిన సమయంలోనే అస్తమిస్తాడు. సూర్యుణ్ని చూసి క్రమశిక్షణను నేర్చుకోవాలి. క్రమశిక్షణతోనే అప్రమత్తత సాధ్యం.

మానవులు అపజయాలను పొందడానికి అప్రమత్తత లోపించడమే ప్రధాన కారణం.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

పరమపద సోపానం

🌹 అంతర్యామి - *పరమపద సోపానం* 🌹

జీవితంలో ఏం కావాలనుకుంటారో అది చాలామందికి దక్కదు. దక్కకపోవడం సహజంగా బాధను కలిగిస్తుంది. దక్కినదాంట్లోనే ఆనందం వెతుక్కునేవారు మరోరకం. తృప్తి, అసంతృప్తి అనేవి మనుషుల ఆలోచనావిధానంలో ఉంటాయి. కొందరు నిరంతరం కావాల్సినదానికోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. ఏ పద్ధతిలో అన్నది ముఖ్యం. కోరిక ఉండాలి. దాన్ని నెరవేర్చుకునేందుకు కృషి జరగాలి. ఫలితం ఎలాగున్నా ప్రయత్నంలో మాత్రం ఆనందం పొందాలి. లక్ష్యసాధనలో పండుగ జరుపుకోవాలి.

గమ్యం చేరుకున్నప్పుడు ఆనందం ఎలాగూ ఉంటుంది. ఒకవేళ చేరుకోకపోయినా ఆ ప్రయాణంలోని కుతూహలాన్ని పరిపూర్ణంగా అనుభవించగలగాలి. ఆట ఆడటం ఒక రకమైన ఆనందాన్ని ఇస్తే, గెలుపు మరోరకమైన ఉత్సాహాన్ని నింపుతుంది. లోకంలో గెలుపునే ఆనందంగా తీసుకుంటారంతా. ప్రక్రియ, ప్రయాణం, ప్రయత్నం- మూడింటిలోనూ ఆనందముంటుందని గ్రహించాలి.

వైకుంఠపాళి అందరికీ పరిచయమున్న ఆట. పాములు, నిచ్చెనలు, పాచికలు వేయడం, ముందుకు అడుగులు వేయడం... మెట్టుమెట్టుకీ ఒక అనిశ్చితి, అనుమానం, ఆతురతతో కూడిన నిరీక్షణ. ఒక మజిలీ నుంచి మరో మజిలీకి చేరేసరికి అక్కడ నోరు తెరుచుకున్న పామో, పైకి చేర్చే నిచ్చెనో దర్శనమిస్తాయి. పాము నోట్లో పడకుండా తప్పించుకున్నప్పుడు ఒక నిశ్చింత. ఏది ఎప్పుడు ఎవరికి ప్రాప్తిస్తుందో తెలియదు. ఎవరు పరమపద సోపానాన్ని చేరుకుంటారోనని పాచికలు వేసిన ప్రతిసారీ ఒక ఉత్కంఠే. ప్రయాణం సుఖవంతమో, క్లిష్టతరమో ఎవరూ ఊహించలేరు. ఆడేవారి చేతిలో ఉన్నది పాచికలు వేయడం మాత్రమే. జరిగేదంతా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందనుకోవాలి.

అదృష్టం, దురదృష్టం అన్నవి జీవనక్రీడ సాగించే మనిషి చేతుల్లో లేదనే తాత్విక భావానికి వైకుంఠపాళి దర్పణం పడుతుంది. అందుకే దాన్ని మోక్షపటం అంటారు. మనిషి నిమిత్తమాత్రుడు. మనిషి జీవితంలో ఎదురయ్యే హెచ్చుతగ్గులు, ఆటుపోట్లు జూదంగా గోచరిస్తున్నప్పుడు మనిషి చేతిలో ఏముంది అనే సంశయం తలెత్తకమానదు. మనిషిని అవి నిస్సహాయస్థితిలోకి నెట్టివేసినట్లు అనిపిస్తుంది.

అన్నీ కలిసివస్తే అదృష్టవంతుడిగా చలామణీ అయ్యే మనిషి గెలుపును కేవలం తన ప్రతిభగా ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం?

ఆటలో పాల్గొనకపోతే సోమరితనం కలగడం ఒక్కటే కాదు. సరదా కోల్పోతారు. ఆడేవారి పక్కన కూర్చుని తిలకించడం, వారి ఆటను ఎగతాళి చేయడం సరైన పద్ధతి కాదు. తెలివైనవారు ఆటలో పాల్గొంటారు. ఫలితాలపైన దృష్టి నిలపకుండా ఆనందిస్తారు. జయాపజయాలు తమ అధీనంలో ఉండవని, సంభావ్యతను తెలుసుకుని మసలుకుంటారు.

దురదృష్ట సర్పాలు కిందకు పడేస్తుంటే, అదృష్టపు నిచ్చెనలు పైపైకి తీసికెళ్తుంటాయి. కొన్నిసార్లు సర్పం తోకభాగానికి పక్కనే అదృష్టపు నిచ్చెన అందలం ఎక్కించడానికి సిద్ధంగా ఉంటుంది. అదృష్టం చివరన దురదృష్టమూ పొంచి ఉంటుంది. మనిషికి ఎప్పుడు, ఏది ఎదురవుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికీ జీవితాంతం ఆశ్చర్యాలు... సాహసాలు, చర్య... ప్రతిచర్యల సమాహారమే జీవితం. మంచిపనుల సంచితాల ఫలితం నిచ్చెనలైతే, చెడు పనుల పర్యవసానం పాములుగా భావించాలి.

జీవితం ఎలా రూపుదిద్దుకుంటుందో, ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు.

మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించేవారు కొందరైతే, మనం గతంలో చేసుకున్నదాన్ని బట్టే ఈ స్థితి అని విశ్వసించేవారు మరికొందరు. ఈ వైకుంఠపాళిలో ఎవరూ ఏదీ ఊహించలేరు, నియంత్రించలేరు. ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామన్నదే ముఖ్యం. అదే జీవితసత్యం.