🌹 అరుదైన మరకత శివలింగం కలిగి ఉన్న చందిప్ప మరకత సోమప్ప ఆలయం విశిష్టత - భాగ్య నగరానికి అతి సమీపంలో ఆరోగ్య ప్రదాత 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Chandippa Marakata Somappa Temple, which has a rare marakata Shivalinga, is special – very close to Bhaghya Nagara, a provider of health 🌹
Prasad Bharadwaj
భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు. ఈ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లి ప్రత్యేకమైంది. ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు శివుడు. పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. చందిప్ప మరకత సోమప్ప విశేషాలెన్నో.
శివలింగం.. పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అందులోనూ మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అరుదైన ఆ మరకత లింగం కొలువై ఉన్న చందిప్ప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ముచుకుంద నది ఒడ్డున ఉందీ క్షేత్రం. క్రీస్తు శకం 1076-1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనం ద్వారా తెలుస్తున్నది. క్రీ.శ.1101 సంవత్సరం కార్తిక శుద్ధ పంచమి.. గురువారం నాడు ప్రతిష్ఠ ఉత్సవం జరిగిందని అదే శాసనంలో స్పష్టంగా లిఖించారు. దాదాపు 920 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన శివాలయం కాలపరీక్షకులోనై శిథిలమైపోయింది. పదిహేనేండ్ల కిందట కొందరు భక్తులు పూనుకొని పునరుద్ధరించారు. నూతన గర్భాలయాన్ని నిర్మించారు.
ఆరోగ్య ప్రదాత - పర్లిలోని వైద్యనాథ జ్యోతిర్లింగానికి, చందిప్ప మరకత లింగానికి చాలా పోలికలు ఉన్నాయని చెబుతారు పండితులు. చందిప్ప శివయ్యను పూజిస్తే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అసలే శివుడు అభిషేక ప్రియుడు. ఐదు సోమవారాలు కానీ, ఐదు పౌర్ణములు కానీ, ఐదు మాస శివరాత్రులు కానీ మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలూ నెరవేరుతాయని విశ్వాసం. పౌర్ణమినాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేసిన వారికి వైకుంఠప్రాప్తి తథ్యమని చెబుతారు. అంతేకాదు బ్రాహ్మీ ముహూర్తంలో.. అభిషేకిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని స్థానిక ఐతిహ్యం.
భైరవం.. క్షేత్రపాలం
ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్ర పాలకుడు. ఆలయ ప్రాంగణంలో వెలిసిన కాలభైరవుడు ఆవరణను వెయ్యి కండ్లతో రక్షిస్తూ ఉంటాడని చెబుతారు. ఆదివారం కాలభైరవుడిని పూజిస్తే సమస్త గ్రహదోషాలూ తొలగిపోతాయని స్థల పురాణం. అంతేకాదు శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని ప్రతీతి. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం కొన్నేండ్ల కిందటి వరకూ నిరాదరణకు గురైంది. పండుగలప్పుడు తప్ప భక్తులు వచ్చేవారు కాదు. 2007లో శివరాత్రి సందర్భంగా ఒక భక్తుడు ఆలయంలో అభిషేకం చేశాడు. అప్పుడు శివలింగంపై ప్రసరించిన సూర్యకిరణాలు పరావర్తనం చెందడంతో దానిని మరకత లింగంగా గుర్తించాడు. తర్వాత చందిప్ప చరిత్ర తెలుసుకొని భక్తుల సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరించాడు. శ్రావణం, కార్తిక మాసాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ వాసులు వారాంతంలో వెళ్లిరావడానికి అనువైన క్షేత్రమిది. మానసిక ఒత్తిళ్లతో కూడిన జీవితంలో ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన మనోబలాన్ని ప్రసాదిస్తుంది.
చందిప్ప క్షేత్రం హైదరాబాద్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది . శంకర్‌పల్లి వరకు బస్సులో వెళ్లాలి. అక్కడి నుంచి చందిప్పకు ఆటోలు ఉంటాయి. తప్పక దర్శించుకుని శివుని అనుగ్రహానికి పాత్రులు అవుదాం..
ఓం నమఃశివాయ 🙏
🌹 🌹 🌹 🌹 🌹