సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 38

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 38 🌹 
38 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 యగ మాయ - 1 🍃 

271. యోగాభ్యాసకుని ప్రథమ కర్తవ్యము ప్రకృతి స్వరూపమైన మాయలో తాను ఎలా చిక్కుకున్నది, దాని లక్షణములు, స్వభావము, దాని నుండి ఎలా బయటపడాలి అను విషయమును తెలుసుకొనుట. 

272. గాఢాంధ కారమైన మాయా స్వరూపమును తెలుసుకొని, అది ఎలా మన యొక్క జ్ఞానమును, ప్రజ్ఞ, వివేకము, ఆలోచనను, మనస్సును, చిత్తమును కప్పి వేయుచున్నదో గ్రహించవలెను. 

273. మాయను జయించుట సులభము కాదు. మునిపుంగవుడైన నారదుడు కూడా శ్రీవిష్ణువు యొక్క మాయలో ఎలా క్షణములో సంసారము, భార్య, పిల్లలు, సుఖ సంతోషాలకులోనై దుఃఖమును అనుభవించాడో మనకు తెలుసు. 

274. మానవ సృష్టి ఆరంభమునందు ఈ మాయా తత్త్వమును గూర్చి యోగులు చర్చిస్తూ దాని నుండి బయటపడు మార్గమును, సాధనా విధానమును మనకు అందించి ఉన్నారు. సాధారణ మానవుడు దీనిని తొలగించుకొనుట కష్టము. 

275. మాయ అనగా మోహము, భ్రాంతి, భ్రమ, కల అని సాధారణముగా భావిస్తుంటాము. కానీ మాయయె ఎరు. మూల ప్రకృతియె మాయ. ఇది సత్యము కాదు. అసత్యము కాదు. స్వరూప జ్ఞానము మరచుటయె మాయ. సత్వ రజ స్థమోగుణములు మాయ నుండియె ఏర్పడుచున్నవి. లేనిది ఉన్నట్లు భ్రమ పడుటయె మాయ. సమస్యలు, వాసనలు, చంచలత్వము, విషయ సంస్కారములు మున్నగునవన్నియూ ఏకమైనదియె మాయ యగును. ఆశ, ఆసక్తి, ప్రీతి, బంధము, ఆకర్షణ, వ్యామోహములుగా మాయ వ్యక్తమగును.

276. ఈ పదునాలుగు లోకములు, దేవత్వము, మానవత్వము, సంకల్ప, రూప నామములు, ప్రకృతి పురుషులు సుఖ దుఃఖములు, అనుభవములన్నియూ మాయలోని భావములే. 

277. స్వప్నములో ఏనుగులు, గుర్రములు, స్త్రీలు, పదవులు, సంభాషణలు మొదలగునవి స్వప్నము పూర్తి అయిన తర్వాత జాగ్రదావస్థలో మాయమగును. అలానే ఇప్పుడు ఎరుకలో ఉన్న ఈ శరీరము, ఇల్లు, భార్యా, పుత్రులు, ప్రపంచము ప్రతి క్షణము, రోజురోజుకు, జన్మజన్మకు కొంతకాలమునకు ఎలా లేకుండా పోవునో ఇవన్నియూ మాయలో తోచినవే. 

278. సృష్టి రహస్యములు తెలిసినవాడే సత్య జ్ఞాని. మోక్ష పదవులు, లోక భ్రాంతులు, దేహ భ్రాంతులు కేవలము స్వప్నతుల్యములు, మాయలోని భావములు. ఏ క్షణమున మనిషికి జ్ఞానోదయము కలుగునో ఆ క్షణమునే మాయ అంతమై పోవును. అవన్నియూ లేనివే అగును. కాని జీవుడు మాయకు అధీనుడు. ఈశ్వరుడు మాయను జయించినవాడు. సత్వరజోతమో గుణములను పొరలు తొలగినప్పుడే జీవుడు బ్రహ్మమగుచున్నాడు. 

279. భక్తి, వైరాగ్య సాధనలతో, ఆత్మను శరణుజొచ్చిన మాయను దాటవచ్చు. భగవదాశ్రయము, శరణాగతి, ఆత్మ చింతన అభ్యాసం చేసినప్పుడే మాయను దాటగలము. 

280. శరీరములోని వివిధ భాగములు, నాడులు, షడ్చక్రములు, కుండలిని, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, త్రిగుణములు ఇవన్నియూ పరస్పర ఆధారములై తమ తమ ధర్మములను నిర్వర్తించుచున్నవి. అలానే ఆత్మ, అంతరాత్మ, జీవాత్మ, పరమాత్మలు కూడా మాయా శబలితమై వర్తించుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹