దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 4. కూష్మాండ - లలితా త్రిపుర సుందరి దేవి Devi Navratra - Nav Durgas Sadhana - 4. Kushmanda - Lalita Tripura Sundari Devi

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 4. కూష్మాండ - లలితా త్రిపుర సుందరి దేవి 🌹

📚 . ప్రసాద్ భరద్వాజ


🌷. ప్రార్ధనా శ్లోకము :

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥

🌷. అలంకారము : శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి - ఆకాశం రంగు

🌷. నివేదనం : అల్లం గారెలు

🌷. మహిమ :

జ్ఞానరూపిణి,సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

సంసారమనే జగత్తు యొక్క అందాన్ని ఉదరాన ధరించే మాయారూపిణి .. ఈమె .

దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి ‘కూష్మాండ’ అనే పేరుతో విఖ్యాతి చెందింది.


🌻. సాధన :

ఈ జగత్తు సృష్టి జరుగక ముందు అంతటా గాఢాంధకారమే అలముకొని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసమాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టిరచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.

ఈమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్యమండలంలో నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీవ్యమానముగా వెలుగొందుతూ ఉంటాయి. ఈమె తేజస్సు నిరుపమానము. దానికి అదే సాటి. ఇతర దేవతాస్వరూపాలేవీ ఈమె తేజః ప్రభావములతో తులతూగలేవు. ఈమె తేజోమండల ప్రభావమే దశదిశలూ వెలుగొందుతూ ఉంటుంది. బ్రహ్మాండములోని అన్ని వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయయే.

ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్లనే ఈమె ‘అష్టభుజాదేవి’ అనే పేరుతో కూడా వాసిగాంచింది. ఈమె ఏడు చేతులలో వరుసగా కండలమూ, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో ‘కూష్మాండము’ అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు.

నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు కూష్మాండాదేవీ స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకొంటుంది. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది. కాబట్టి ఈ రోజు ఉపాసకుడు పవిత్రమైన, నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్నే ధ్యానిస్తూ పూజలు చేయాలి. భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడంవల్ల పరితృప్తయై ఈమె వారి రోగాలనూ, శోకాలనూ రూపుమాపుతుంది. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములూ, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందుతాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది.

శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవీస్వరూపంయొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి.

🌹 🌹 🌹 🌹 🌹


09 Oct 2021

09-OCTOBER-2021 MESSAGES




*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 3. చంద్రఘంట - అన్నపూర్ణ దేవి 🌹*
*📚 . ప్రసాద్ భరద్వాజ* 

🌷. ప్రార్ధనా శ్లోకము :
*పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।*
*ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥*

🌷. అలంకారము : అన్నపూర్ణ దేవి - లేత రంగు
🌷. నివేదనం : కొబ్బరి అన్నం 

🌷. మహిమ :
దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.

🌷. చరిత్ర :
దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది. 

ఈమె శరీర కాంతి బంగారు వన్నెలో మిలమిల లాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమర సన్నాహయై యుద్ధ ముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.

నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటా దేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.

ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.

ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడం వల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతో పాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. 

వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.

మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹