సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 31

 



🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 31 🌹 
31 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 చత్తము ఒక మాయా చక్రము 3 🍃 

211. చిత్తము ఆత్మ జ్ఞానము చేతను, పరమాత్మ చింతన చేతను నిండియుండిన దానిని ఆధ్యాత్మిక చిత్తము అంటారు. అట్టి చిత్తములో భక్తి, సమర్పణ, అనన్య సాధన, కర్మల సమర్పణ, అసూయ లేకుండుట, అహంకార రహితము మొదలగు లక్షణములతో కూడి ఉంటుంది.

212. ప్రాపంచిక భావములు, దృశ్యములు, వస్తువులు, శబ్దములు, భోగములు, వికారములతో నిండి ఉండును.

213. చిత్త లక్షణములు: సంకటములో పడదోయుట, గాఢాంధకారము, భ్రమ, సంసారము, ద్వేషము, కామము, క్రోధము, విశ్రాంతి, స్వప్న, శారీరక ఆసక్తి, రాగము, సమస్త ఇంద్రియములకు నాయకుడిగా ఉండును.

214. చిత్తమును జయించాలంటే సూక్ష్మ బుద్ధి అవసరము. ఆత్మ దృష్టి, నివృత్తి సాధన ద్వారా చిత్తమాలిన్యమును నశింపజేయాలి.

215. అంతఃకరణ వృత్తులను అవగాహన చేసుకుంటూ దానిని నిరోధించవలెను. చిరకాలము ఆత్మ యందె మనస్సును లగ్నం చేయాలి. అందుకు నిరంతర అభ్యాసము చేయాలి.

216. నాశికాగ్రములో చిత్తాన్ని ఏకాగ్రము చేస్తే దివ్య పరిమళాలు వ్యక్తమవుతాయి. బ్రహ్మనాదాలు వినిపిస్తాయి, పదార్థములు లేకనే రుచులు, వాసనలు తెలుస్తుంటాయి. అష్టాంగ మార్గాలను అభ్యాసం చేసిన చిత్త మాలిన్యాలు తొలగుతాయి. ప్రాణాయామం అందుకు బాగా తోడ్పడుతుంది. దివ్యానుభవాలు, దివ్యానందము కలుగుతుంది.

217. బుద్ధిచే చిత్తమును విచారణ చేసి నిరోధించవలెను. చిత్తమును చిత్తము చేతనే నిరోధించవలెను. చిత్త వృత్తులను నిరోధించినప్పుడే మనస్సు నశించును. లేనిచో సంసార బంధములు ఏర్పడును.

218. ఈ జగత్తు అభావమని భావించి చిత్తము నశింపజేయు యోగ సాధనయె చిత్త క్షయము. ఆలోచన, విచారణ, జిజ్ఞాస అను మంత్రములతో, ఔషధములతో చిత్తమును చంపివేయవలెను. నిర్మల చిత్తమే పరమాత్మ. మనస్సు ఏర్పడటానికి మూలము చిత్తము.

219. సాధనా మార్గములు: శాస్త్ర పఠనము, పురుష ప్రయత్నము, శ్రవణము, నిరంతర సాధన, విచారణ, గురుశుశ్రూష, సజ్జన సాంగత్యము ఆత్మావలోకన, మనోనిగ్రహము, వైరాగ్యము, దృఢ నిశ్చయము అవసరము.

220. చిత్తము నశించిన వారి లక్షణములు: జ్ఞానాగ్నిచే పాపము క్షయించును. మైత్రి, కరుణ, సంతోష లక్షణములు, కోపము క్షీణించుట, వాసనాగ్రంథులు క్రమముగా విచ్ఛిన్నమగుట, మోహము తొలగుట, దుఃఖము తగ్గిపోవుట, లోభము పారిపోవుట, ఇంద్రియములు విషయ రహిత మగుట, కామము శిధిలమగుట, సమత్వ బుద్ధి, భోగాసక్తి నశించుట జరుగును.
🌹 🌹 🌹 🌹 🌹

08.Apr.2019