Showing posts with label మాస్టర్ ఇ.కె. Show all posts
Showing posts with label మాస్టర్ ఇ.కె. Show all posts

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 160


🌹.   మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 160   🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. మహాపూర్ణవాణి 🌻

🥀. సంసారికి మోక్షం లేదు. ఇది తిరుగులేని సిద్ధాంతం, అయితే దీని భావం గృహస్థుకు మోక్షం లేదని కాదు. సంసారం అంటే భార్యాపిల్లలూ అని కాదు అర్థం. సంసారం అంటే కోరికలు. కోరికలు ఉన్న వానికి మోక్షం లేదు.

బాహ్యానికి గృహస్థుడుగా ఉన్నప్పటికీ కోరికలు లేకుండా ఉండగలిగితే వాడు సంసారి కాడు. వానికి మోక్షం కరతలామలకమే. బాహ్యానికి సన్న్యాసిగా ఉన్నప్పటికీ వానికి ఏమాత్రమైనా కోరికలుంటే వానికి మోక్షం గగనకుసుమమే.

వాడు సన్న్యాసీ కాడు, గృహస్థుడూ కాడు, సామాన్య సంసారీ కాడు భ్రష్టుడు‌. 🥀

🥀. మడి కట్టుకున్నాను అనీ, ఎవరైనా తగిలితే మైలపడిపోతున్నావు అంటున్నావు కదా, ఇతరులు తాకినంత మాత్రాన మైలపడే నీ మడిలో పటుత్వం ఏమి ఉంది! నీదే కనుక పటుత్వం ఉన్న మడి అయితే, నిన్ను తగిలిన వారంతా మడిపడాలి గాని, నీవు మైల పడరాదు. అంత పటుత్వమైన మడి నీలో ఉన్నది. అది నీవు గ్రహించుకోవటం లేదు.

హృదయాన్ని ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుకో! అందరినీ అన్నిటినీ నీ ఇష్టదైవం యొక్క మారు రూపాలుగా గుర్తించు-చాలు. ఇదే అసలైన పటుత్వం గల మడి.

ఇలా చెప్పాను గదా అని ఇక స్నానం చేయటం మానివేస్తావేమో, స్నానమూ మానరాదు, శాస్ర్తమూ, పెద్దలు విధించిన సత్కర్మలూ మానరాదు. సిద్ధి కలిగే వరకూ అవి చేస్తూ ఉండవలసినదే. కాని కేవలం బాహ్యకర్మలతోటే మడి, పవిత్రతా వస్తాయని మాత్రం భ్రమపడబోకు.

మడీ, పవిత్రతా గుణముల చేతనే రావాలి..

..... ✍️. మాస్టర్ ఇ.కె.🥀
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

18.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 159


🌹.   మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 159   🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. మోక్షము - వినాశము 🌻

నా పనులు అని వేరుగా కొన్నిటిని ఏర్పరుచుకొని నెరవేర్చుచుండుటయే అహంకారము. అహంకారము దేవుని పనికి సమర్పణమైనపుడు జన్మ సమస్తము చక్కగా నిర్వహింపబడును.

అదియే మోక్షము.

అట్లుగాక అహంకారమునకు సొంతపని అని వేరుగా ఏర్పడినచో దురహంకారమగును. దానివలన అసురత్వము , వినాశము కలుగును.

హిమాలయములలోని నదీ ప్రవాహములలో మంచుగడ్డలు పుట్టి , తేలుచు ప్రయాణము చేసి , కరగిపోవుచుండును. పుట్టుట, కరగిపోవుట అను స్థితులకు ముందు , తర్వాత ఆ ప్రవాహముండును. మంచుగడ్డ కట్టుకొనునపుడు దాని లోపల ప్రవాహజలమే గడ్డకట్టి యుండును. అట్లే దేహముల యందు నారాయణుడును.

మంచుగడ్డలు నీటిపై తేలుచున్నపుడు నీరుగా నున్న ద్రవ్యము ననుసరించి మంచుగడ్డగా నున్న అదే ద్రవ్యము ప్రవర్తించును. మంచుగడ్డ ప్రవహించు దిక్కు మున్నగునవి నీటి ప్రవాహము ననుసరించి యుండును. అనగా మంచుగడ్డలోని అదే ద్రవ్యమునకు పరాధీనత , నీటిలోని అదే ద్రవ్యమునకు స్వామిత్వము కలుగును.

అదే విధముగా త్రిగుణములతో బద్ధుడుగా జీవుడును , త్రిగుణాత్మక ప్రకృతికి ప్రభువుగా ఈశ్వరుడును వర్తించుచున్నారు. ఈ బద్ధస్థితి ఉన్నంత తడవును జీవునకు బోధపడదు. బోధపడుట యనగా ఈశత్వము నందు మేల్కొనుట.

.... ✍🏼 మాస్టర్ ఇ.కె. 🌻

🌹🌹🌹🌹🌹


17 Sep 2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 158


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 158 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


సంస్కృతంలో పరమప్రేమకే "భక్తి" అని పేరు. భక్తిని అభ్యాసము చేయు మార్గమునకే భక్తి యోగమని పేరు. మన తలంపులను పరిశుద్ధము గావించు కొనుటకును, వానికి చక్కని రూపు కల్పించుటకును, మన భావములతో సుందర శిల్పము సృజించుటకు భక్తియోగమే శ్రేష్ఠమయిన మార్గము.

భావబలమే అంతిమ శక్తి. మన నుండి దేనినయినను, ఇది కల్పింపగలదు. సముచిత పథము‌ కల్పింపబడినచో, అది మనకును, ఒరులకును స్వర్గమును సృజించి, మనలను దైవ సామ్రాజ్యమున నిలుపును. అనుచితముగా కల్పింప బడినపుడు, దీని వలన రాజ్యములు వినాశమునకు గురియగును. దానితో మానవ జీవితము వికారమయిన శిథిలముల కట్టయగును‌.

అసలు, తలంపు అనునది ఎట్లు ఆవిర్భావమొందునో పరిపూర్ణముగా అవగతము చేసికొందుము గాక. మనలో తలంపు, కల్పింపబడిన పిమ్మట, ఒక తలంపు నెలకొనునని మనము ఎరుగుదుము.

ఇది మన మనస్సులో పయనము గావించుచు, ఒక నిండయిన అభిప్రాయముగా రూపొందును‌ అంతట, వ్యక్తీకరణమును కాంక్షించును. అందులకు గాను ఒక వాక్యమును ఎంపిక చేసికొనును.

అంతట పదములను ఎంపిక చేసికొని, వాక్యముగా కూర్పుచేయును. అప్పుడు మాత్రమే, మనకు తెలిసిన భాషకు సంబంధించి, మన స్మృతి పథమును బట్టి, ఆవశ్యకములగు ధ్వని సంపుటులను ఎన్నుకొనును.

అపుడు వాక్యముగా ఉచ్చరితమై బాహ్యమున వెలువడును. దీనినే మనము "ఉచ్చరిత వాక్యము" అని అనుచున్నాము...

........ .✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

16 Sep 2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 157



🌹.   మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 157   🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భావ బలము - 5 🌻

నాలో పరమప్రేమ నెలకొన్నచో, నిన్ను‌ నేను అభిమానించునెడల, నిన్ను‌ నా వస్తువు వలె భావించి బంధింప ఇష్టముండదు. నీపై పెత్తనము చెలాయింప ఇష్టముండదు. దీనికి కారణము, నీ యందే నా అభిమానము కాని, నిన్ను నా వస్తువును వలె గావించుకొనుట యందుగాదు. ఇపుడు, నీ సాన్నిధ్యములో నేను ఆనందించెదను. ఇదియే నాకు కలుగు హితము. నీవు దగ్గరలేనపుడు, నిన్ను గూర్చిన స్మృతుల తీపి నాకు దక్కును.

నీ సాన్నిధ్యము వలన నాకు కలుగు ఆనందము, నా జీవితములో నిర్వర్తించు‌ సమస్త కార్యములకును తన పరిమళమును వెదజల్లును. మనచే ప్రేమింపబడిన వ్యక్తి కనపడినపుడు గాని, అతని గూర్చి తలంపు మన మనస్సున మెదలినగాని, ఈ లోకమునందలి సర్వమును దివ్యగానమగును‌.

గులాబీలకు గల ముళ్ళను మనము పట్టించుకొనము. గులాబీనే అభిమానించెదము. పరమప్రేమ సామ్రాజ్యమున‌ ఒరుల సద్గుణములతోనే మనకు ప్రమేయము గావున, మనలోపములకు గులాబీలకు గల ముండ్లకు వాటిల్లు ఫలితమే ప్రాప్తించును. అనగా అవి పట్టించుకొనబడవు. గులాబీలను గాంచి ఆనందింప వలసి యుండుట వలన, ముళ్ళ యెడల భీతి చెందుటకు మనకు సమయము చాలదు. మన చుట్టు ఉన్న వారిలో కొందరు ఆవేశపరులయిన వారుండవచ్చును. వారి ప్రవర్తన పశుత్వముతో గూడి ఉన్నపుడు, దాని యెడల మనస్సునుంచక, తటస్థముగా ఉండుట అభ్యసింపవలెను.

ఈ అభ్యాసము దృడపడవలెనన్నచో, పరమ ప్రేమ ద్వారమున, మనచుట్టు ఉన్న సత్పురుషుల సాన్నిధ్యములో ఆనందించుటయే మార్గము.......

✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

15 Sep 2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 156


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 156  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భావ బలము - 4 🌻

ఇంకొక యధార్థమేమనగా, ఉద్వేగమనునది ఉప్పెన కెరటములుగా మార్పు చెందుచుండును. భక్తి అట్లు గాక, నిశ్చల జలముల వలె మన యందు నిండిపోవును.

స్పూర్తితో పుష్టినొందిన భక్తి (పరమ ప్రేమ) అనభూతి కలిగిన వానిలో దృక్పథము మార్పు చెందుట జరుగదు. నాకు, నీ యెడల ప్రేమను అసత్యపు పేరుతో ఉద్వేగపూరితమైన సంగమున్నచో, అది తప్పక‌ మిక్కిలి ధృడమై తీరును.

మరియు అతి ధృడమైన ద్వేషమును కలిగించకుండ యుండదు. ఉద్వేగబంధితుడగు జీవుడు పశుప్రాయుడే‌, సెలవు రోజున తన ప్రియ స్నేహితుడు అతని వేరొక స్నేహితునితో కలిసి చరించుట గాంచినచో ఫలితమేమి? తనకు, అవతలి వాని యెడల గల ప్రేమకు ఫలముగా, అసూయా రోషములతో దుఃఖించుట దక్కును. ఇది ఉద్వేగముతో కలుషీకృతమైన ప్రేమ యొక్క ఫలితము.

ఉద్వేగము వలన అవతలి వ్యక్తులను వస్తువులను మనకు చెందిన వానిగా భావించి చిక్కులలో పడుట జరుగును.

పరమప్రేమ రూపమయిన భక్తి వలన మనవి అనబడు వానిని చివరకు మనలను గూడ సమర్పించుకొనుట జరుగును. పశుపద్ధతిలో మనము అవతలి వానిని ఇష్టపడినచో, వానిని మనకు చెందిన వస్తువుగా ‌భావించుట జరుగును. మనము అనుకొన్న మంచి పద్ధతిలో అవతలి వాడు నడువ వలెనని ఆశించుట జరుగును. ఈ పద్ధతి వట్టి మూర్ఖత యగును.

అవతలివాడు, తనదయిన రీతిలో తాను వర్తింపనారంభింపగనే, మనలో తీవ్రమగు కఠిన ప్రతిక్రియ ఉప్పతిల్లును.

అంతటితో వానిని ద్వేషింప ఆరంభింతుము. ఇట్లగుటకు కారణమేమి? అవతలి వానిని మనము ప్రేమించుటయే. ఇట్టి ప్రేమ నిజమైన ప్రేమ అగునా? ఇదియు ద్వేషమను కాలుష్యముతో గూడిమదై సంగమగుచున్నది. మన ప్రేమకు గురిఅయిన వానిని ద్వేషించుటకు కారణము, ఉద్వేగముచే ప్రేరేపింపబడిన భావముల శక్తియే...
...✍ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

14 Sep 2020


మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 155



🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 155  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భావ బలము - 3 🌻

దౌర్భాగ్య వశమున, మన నరులలో 98% మంది, ఉద్వేగమునందే బ్రతుకుచు, ఉద్వేగమను మాలిన్యము నుండియే తలంపులను ఉద్భవింప జేయుచున్నారు. ఫలితమెప్పుడును, తిరిగి ఉద్వేగముతోడి స్పందనయే గదా.

అధిక రుచికరమైనది ఏదయిన, ఉద్వేగము యొక్క స్థానమున వెలయ కున్నచో ఈ విపత్తు నుండి బయటపడుట సాధ్యము కాదు. మనలో ఉద్వేగము యొక్క స్థానము గొనవలసినది ఏది? పెద్దలు దీనినే స్పూర్తి అనుచున్నారు.

మనము ఉదాత్తమైన దాని నుండి స్పూర్తి నందినచో మన ఉద్వేగములు క్రమముగా క్షాళితములగును మట్టి రేణువులు, అడుగున నిలిచి, నిర్మల జలములు బయటపడుటకు అవకాశము కలుగును. స్వర్ణ రసాయన శాస్త్రవేత్త దీనినే పరిశుద్ధీకరణ విధానమని పేర్కొనెను. మన యందు ఈ విధానము అమలు జరిగినచో అవతలి వారి స్పందనయు పరిశుద్ధముగానే ఉండును.

పరిశుద్ధి చెందిన జలములలో ఏదయిన సంచలనమును కలిగించినను, ఎట్టి అవక్షేపమును అడుగునకు జేరదు. రంగు మార్పు జరుగదు.

మనలో ఇట్లు పరిశుద్ధీకరణము చెందిన అనుభూతి యొక్క వాహికను పెంపొందించుకొననగును. అనగా, అనుభూతి తన ద్వారమున అందుకొననగు వాహిక అను మాట. ఇట్టి స్థితినే 'స్పూర్తి' అందురు.

ఇట్టి స్థితిలో మన సంబాషణ, అవతలి వానిలో ఉద్వేగమును గాక, పరమప్రేమ రూపమగు భక్తిని ప్రేరేపించును. భక్తికి, ఉద్వేగమునకు గల వ్యత్యాసము పరిశుద్ధ జలములకు మట్టితో గూడిన మురికి నీటికి గల వ్యత్యాసము వంటిదే. భక్తి అనునది, మన దృక్పథమును ఉదాత్తము గావించి, మనకు అనుభూతినందించును.....
✍ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

13 Sep 2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 154


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 154 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భావ బలము - 2 🌻

ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు. ఇతరులకు మనము ప్రతికూలపు ఆలోచనను అందించినచో మనకు కూడా వారి నుండి ప్రతికూలపు ఆలోచనయే ఎదురగాక తప్పదు.

ఇట్టి వ్యవహారము, ఇరువురు వ్యక్తుల నుడమ వాటిల్లినచో, దాని ప్రభావము సమాజముపై అంతగా ఉండదు. కాని, ఇట్టిదే రెండు వర్గములకో, జాతులకో, దేశములకో ప్రాతినిధ్యము వహించు ఇరువురు వ్యక్తుల నడుమ వాటిల్లినచో ఫలితము వినాశకరమగును.

సంగ్రామము పేరున, మానవ చరిత్ర పుటలలో చాలా బాధాకరములయిన గుణపాఠములు లిఖింపబడినవి. ప్రతి యుద్ధము గూడ, నరుడను జీవిలోని పశుప్రవృత్తి యొక్క చేవ్రాలు మాత్రమే. అనగా మృగ ప్రాయమైన బాధ్యతారహిత పథమున ఆలోచనలను, దృక్పథములను ఉద్భవింపజేయుటయే.

ప్రసార కేంద్రము నుండి వెలువడు ఒకే కార్యక్రమమును ఎవరి రేడియో అయినను స్వీకరించును. ఉద్వేగము వలన మనలో ఒక తలంపు పుట్టగనే, ఇతరులలోను అది ఉద్వేగమునే ప్రేరేపించును. అవతలి వ్యక్తి, ఉద్వేగమును అంతయు తనలోన సంలీనము గావించుకొన్నవాడయితే తప్ప, ఇది యథార్థము.

దౌర్భాగ్య వశమున, మన నరులలో 98% మంది, ఉద్వేగమునందే బ్రతుకుచు, ఉద్వేగమను మాలిన్యము నుండియే తలంపులను ఉద్భవింప జేయుచున్నారు. ఫలితమెప్పుడును, తిరిగి ఉద్వేగముతోడి స్పందనయే గదా..

...✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

12.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 153


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 153  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 1 🌻

సామరస్యమునకు అనుకూలమగు ఆలోచనను ఉద్భవింపజేసినచో, అది అవతలి వారిలోను ఇట్టి అనుకూల దృక్పథమునే జనింపజేయును. అంతట వారు కూడ అనుకూలమగు ఆలోచనలనే మనకు అందించుట జరుగును. తిరిగి మనలోను సామర్యసానుకూల దృక్పథమే ప్రేరేపితమగును. విధానమంతయు ఒక స్వయం పరితృప్త వలయము వలె పనిచేయును.

దాని‌ వలన మనస్సు నిర్మాణాత్మకముగను, సృజనాత్మకముగను అగును. ఈ విషయము తెలియుటకు ముందు, బాధ్యతను ఎరుగని ప్రవృత్తితో తలంపులను ఉద్భవింపజేయుట మూలమున మనము మనకును, ఇతరులకును హాని కలిగించిన వారమైతిమి.

మానవజాతి ఒక్కుమ్మడిగా మానవ ప్రపంచమును సంఘర్షణ దిశగా తోయుచున్నది. ఎల్లరును సంఘర్షణలో దిగబడినవారే. ఆలోచనలను బాధ్యతా రహితముగా ఉద్భవింప జేసిన దాని ఫలితముగాదా ఇది. ఇతరులలోను, మనలోను దృక్పథములను జనింపజేయుటలో అజ్ఞానముతో వ్యవహరించుట‌ వలన ఫలితము గాదా ఇది. ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు..

..✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

11.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 152



🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 152  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


ఏ నరుడైనను స్వల్పకాలము దేనిని గూర్చి వాదనలోనికి దిగినను రోషము, పంతములు కలుగును. అనగా బాధ కలుగును. అది కలిగినంత కాలము వాని ఆయుర్దాయము వ్యర్థమై పోయి‌నట్లే.

ఏ నరుఁడే నొక నిమిషం
బైన వృథావాదగతిని హరిపదకమల
ధ్యానానందుఁడు గాడే
నా నరునకు నాయు వల్ప మగు మునినాథా!

వయస్సు‌ను బట్టి రోగము , ముసలితనము మున్నగు లక్షణములు వచ్చుట సిద్ధులయందు పనిచేయదు.

మనస్సు , ఇంద్రియములు స్థూలదేహమునకు కోరికల రూపమున దాస్యము చేయుచున్నచో రోగము, ముసలితనము కనిపించును.

అట్లుగాక ఇంద్రియములు , మనస్సు , బుద్ధి యోగమున భగవంతుని యందు వసించుట అభ్యాసమైనచో దేహము కూడ వానిమనుసరించి జీవింపవలసి వచ్చును. అప్పుడు రోగము, వయస్సు పనిచేయవు.

......... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

10.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 151



🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 151  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. సర్వాంతర్యామి 🌻

లోకమున దుఃఖమునకు కారణము ఎవ్వరని మానవులు అనేక సిద్ధాంతములను కనిపెట్టిరి. తమకు సుఖదుఃఖములను ఇచ్చు ప్రభువుగా దేవునిపై కొందరు నిందారోపణము చేసిరి.

తప్పు చేయుట అనగా హాని కల్గించుటయే తన చెడునడవడిని సరిచేసికొనుట తన చేతిలోని పనియే. దానిని అంగీకరించుటకు భయపడి తనకన్న శక్తిమంతమైనదేదో తన చేత చేయించుచున్నదని నమ్ముట దౌర్భల్యముగాని సత్యముకాదు.

జీవుడు మంచిగా గాని, చెడుగా గాని ప్రవర్తించుటకు గ్రహస్థితులు కారణమని సిద్ధాంతము చేసికొందురు. ఆత్మ వంచనము చేసికొనుచున్నారు. చేసిన కర్మయొక్క ఫలమే మనచేత నిత్యము మంచి చెడ్డ పనులు చేయించుచున్నదని కొందరు నిర్ణయింప జూచుచున్నారు.

కొందరి ప్రకారము సృష్టి అంతయు స్వాభావికముగా జరుగుచున్నది. దీనిని గ్రహించుట సాధ్యము కాదు నిరోధించుటకు అధికారము లేదు. మానవుని ప్రవర్తనలో గల మంచి చెడ్డలు కూడ స్వాభావికముగా జరుగుచున్నవని వారి మతము. దీని వలన ఒకరితో ఒకరు కలహించుకొని జాతి నశించును. ఇతరుల వలన మనకు దుఃఖము కలిగినపుడు వారు చేసిరని దుఃఖింప పనిలేదు.

తర్కమునకు, నిర్ణయమునకు లొంగని వాడు సర్వాంతర్యామి. వాని లీలయే సర్వము. ఇంతకన్నా సత్యము లేదు..

........ ✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

09.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 150



🌹.   మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 150   🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻

మహనీయులు దేవుని అస్తిత్వమునందు‌ శరణాగతి చెంది, జీవయాత్ర సాగింతురు. వీరు తమ‌ హృదయములందు ఎనిమిది అంగుళముల‌ కొలత కలిగిన దివ్యదేహునిగా సర్వాంతర్యామిని ధ్యానింతురు.

అనగా ఎనిమిది ప్రకృతులలోని వానిని తెలియుదురు. చూపుడు వ్రేలు‌ కొలతగా హృదయమున శ్రీహరిని ధ్యానింతురు. అనగా చూపడు వ్రెలితో ఎవ్వనిని చూపినను, ఏ వస్తువును చూపినను, వాని యందు భగవంతుడు జ్ఞప్తి రావలెనుగాని ఆయా వ్యక్తులు, వస్తువులు‌గాదు.

స్వామిని చతుర్భుజుడుగా ధ్యానింపవలెను. అనగా తాను నిలబడిన తావున నుండి నాలుగు దిక్కుల వరకు కనుపించునంతమేర దేవుని బాహువులు రక్షించుచున్నవని తెలియవలెను. మందర ధారియగు కూర్మమూర్తిగా భావింపవలెను. అనగా జగత్తును ధరించు‌ శక్తిగా తెలియవలెను.

దేవుని గూర్చి మనకు ఎంత గొప్ప అభిప్రాయమున్నను, అది అభిప్రాయమే గాని దేవుడు కాదని గ్రహింపవలెను. సాధన చేయుచున్నప్పుడు కలుగు స్వప్న సాక్షాత్కారములు మున్నగు అనుభవములకు మురిసి పొంగినచో, ఇంక ఆ పైకి పోవుట జరుగదు. ఇట్టివి మన కోరికల సాక్షాత్కారములే కాని, దేవుని సాక్షాత్కారములు గావు. భగవంతుని‌ సాక్షాత్కారమనగా సృష్టిలోని జీవుల రూపములోని సాక్షాత్కారమే. మిగిలినదంతయు జీవులల్లుకొన్న పాండిత్యమనియు తెలియవలెను..

.✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

08.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. విషువత్ - 2 🌻

(21st March)

సంవత్సరాదిని నిర్ణయించుటకు వేదఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈ దినమును స్థాపించెడి వారు. ఈ బిందువునుండి సమస్త ఖగోళ గణితములను లెక్కించెడివారు.

ఈ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్యరేఖపై కొంచెము వెనుకకు నడుచుచుండును. ఈ నడచుటనే గవామయము అను యజ్ఞముగా వేద ఋషులు గుర్తించిరి.

ఈ బిందువుతోపాటు సంవత్సరాది కూడ వెనుకకు నడచుచుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి.

'నల్లలేడియందు దృష్టి నిలిపి వింటియందెక్కు పెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరుగెత్తుచున్న పినాకపాణి వలె నున్నావు.' అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును.

నాటకము మొత్తము నందును చాంద్ర సంవత్సరము యొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చాంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను.

ఈ బిందువునకై భూమధ్యరేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి‌ ధ్రువుని కాలముననే పుట్టినది.

....✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

07.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 148



🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 148  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. విషువత్ - 1 🌻

(21st March)

దక్షిణాయనము నుండి ఉత్తరాయణమునకు సూర్యుడు సంవత్సరమున కొకమారు భూమధ్యరేఖను ఖండించును. ఆ ఖండించిన దినమును విషువత్పుణ్యకాల మందురు. ఇది ప్రతి సంవత్సరము మార్చి 21 వ తేదీనాడు జరుగును.

ఆ దినమున భూమధ్యరేఖపై నిలిచి కొలిచినచో అహోరాత్రములు సమభాగములుగా నుండును. ఈ బిందువును వేదములలో , పురాణములలో యజ్ఞమృగము అందురు. మృగమనగా వెదుక బడునది అని అర్థము.

ఈ బిందువే సౌర సంవత్సరమునకు సంవత్సరాది.

................. ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹🌹🌹🌹🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

06.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 147



🌹.   మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 147   🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻

సృష్టిలోనున్న భగవంతుని మరచి, అందలి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తి యందుంచుకొనినవాడు మత్తుడై ఇంద్రియార్థములను గూర్చిన చింతలలో నిమగ్నుడై జీవించును.

దినములు గడచి పోవుచుండునే గాని, జీవించుటకు తీరుబడి యుండదు. అనగా అంతర్యామిని స్మరించుట ఉండదు. చిత్తశాంతి లభింపక ఆశల వెంట పరుగెత్తుచుండును.

క్రమముగా వ్యాధి, ముసలితనము, ఇతరులపై పట్టుదలలు, తన పరాజయములు, ఆశాభంగములు మున్నగు దుష్టశక్తులు యమదూతలై పొడుచు చుందురు.

దుఃఖపరంపరలతో జీవితమును ఈదవలసి వచ్చును కనుక, నిప్పుల గుండమును ఈదుచున్నట్లుండును. ఈ స్థితినే వైతరణి యందురు పరిస్థితుల రూపములలోని‌ అంతర్యామిని మరచి, పరిస్థితులకు లొంగిచేయకూడని పనులు అనేకములు చేయుటతో శిక్షానుభవము తప్పదు.

రోగముల రూపమును యమదూతలు దేహమున మంటలు మండింతురు. శస్ర్తచికిత్సల రూపమున ముక్కలుగా ‌కోయుదురు. (కృతాంతుని భటులు వీరు. కృతాంతుడు అనగా చేసిన కర్మలకు ఫలితములు ఇచ్చువాడు. యముడనగా అధర్మము ‌నుండి ధర్మమార్గమునకు నియమించునట్టి నిర్మల ధర్మస్వరూపుడు.).

...✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

05.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 146


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 146  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సంస్కృతి - సమానత 🌻

సమానత అంటే అన్ని జాతులందు, అన్ని సంస్కృతులందు గల ఏకత్వాన్ని దర్శించి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పనిని త్రికరణ శుద్ధిగా చేయడమేగాని మన సంస్కృతిని, సంస్కారాన్ని వదులుకొనడం కాదు.

మన దేశము, మన సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించడం, మెచ్చుకొనడం సమానతకు భంగకరం (anti-secular) అని భావించడం హాస్యాస్పదం.

అనాది కాలం నుండి ఇతర ఖండాలలో మన భారతీయ సంస్కృతికి ఎంతో పేరు, ప్రతిష్ఠలున్నాయి. ఈనాటికి ఎందరో పాశ్చాత్య ఖండవాసులు భారతదేశం రావడం, ఇక్కడి సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసి ఆచరిచడం అదృష్టంగా భావిస్తారు.

నేడు ప్రపంచ దేశాల మానవులను పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం ఈ పుణ్యభూమి యందే దొరుకుతుందనేది నిస్సందేహము.

అయితే మనదేశం ప్రస్తుతం అనేక సమస్యలలో కూరుకుని ఉన్నది కదా అని సందేహం రావొచ్చు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.

ఈ దేశ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మతమనే మసిపూసిన అద్దంలో నుంచి చూసి తిరస్కరించడం ప్రధాన కారణం. అన్ని రంగాల్లోను పాశ్చాత్య సంస్కృతిని ఆదర్శంగా తీసికొని వారి నుంచి అవి, ఇవి యాచించడం, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవడం మొదలైన ఎన్నో కారణాలున్నాయి.

అంతేకాక బ్రిటీషు పాలనకు ముందు ప్రతి గ్రామంలో ఉన్న అన్ని వర్ణాలవారు ఐకమత్యంతో ఒకే కుటుంబ సభ్యులు వలె పరస్పరత్వంతో మెలిగేవారు. అందరిమధ్య సామరస్యభావన, సమానత అప్రయత్నంగా నెలకొని ఉండేవి.

బ్రిటీషు వారి 'విభజించి పాలించడము' (Divide and Rule) అనే పద్ధతి వలన వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా గజిబిజి చేయబడింది. అప్పటి నుండి గ్రామ వాసుల మధ్య సామరస్యం దెబ్బతిన్నది.

....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

04.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 145



🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 145 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భక్తిసాధనా రహస్యములు 🌻

భక్తునకు తనవారు, తనవి అనబడు వారు ప్రత్యేకముగా ఉండరు. ఎల్లరును భగవంతుడను సూర్యుని కిరణములే. ఎల్ల ప్రదేశములు బృందావనములే. వీరికి లోకమే స్వాదు కావ్యము. పాత్రధారులగు జీవులెల్లరు, సూత్రధారి అగు దేవుని రూపములే.

భగవదర్పిత హృదయమున ఇహవాంఛ భస్మమగును. కర్తవ్యములు, వృత్తులు మాననక్కర లేదు. ఇవియెల్లను ఈశ్వరార్పితములు గావలెను. వానికి రస స్పర్శ‌కలుగును.

శరీరమునకు, ఇంద్రియాదులకు క్రమశిక్షణ ఒసగవలెను. సాధన ఒక్కరుగా గాక, సమిష్టిగా గావించుట మేలు. తన చుట్టు ఉన్నవారిలోను, వారి చేష్టలలోను, పరిసర వాతావరణములోను, పరిస్థితులలోను విష్ణునే దర్శింపవలెను.

ఎంతమంచిదయినను, మనము కోరినచో వ్యామోహమై నిలిచి అడ్డగించును. ధర్మపథమునకు ఆత్పార్పణము గావలెను.

ఒక రూపమును విడిచియుండ లేకుండుట భక్తిగాదు. మనస్సు, బుద్ధియు, తనువును, మమత విడిచి మర్మము ఎరుగక అంతర్యామికిచ్చి మనుగడ సాగించినచో మన బ్రతుకని యుండదు. అది ఆయనదే అగును. సాధకుని కథ, దేవుని కథ అగును.

భక్తి సాధనలో‌ ప్రేమయే ప్రధానము. జ్ఞానమన్న స్వామికరుణయే.

భగవన్నామమును, గుణములను కీర్తించుచు పుణ్యక్షేత్ర దర్శనము గావించుట‌ సాధనకు ఉపకరించును.

గురువు యొక్క లేక ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించుటయేగాని చర్చించుట సాధనకు అడ్డుగా నిలుచును.

శివుడన, విష్ణువన, శక్తియన‌ ఒకే పరతత్త్వము యొక్క వివిధములగు రూపములే అను వేదభావనతో‌ దర్శింపనగును.

~~మనలోని స్వభావమే సర్వాంతర్యామికి సమర్పితమైనపుడు దివ్యమగును..

....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

03.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 144


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 144  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ప్రకృతి - జీవనము 🌻

ప్రకృతిని గమనించుకొనుచు జీవితమును నడిపించినచో మార్పులను ఏ విధముగా అర్థము చేసికొనవలెనో తెలియును.

ఆకలి పుట్టినపుడు అన్నము తినవలెనని తెలియును. వెంటనే అన్నము తిన్నచో కర్తవ్య నిర్వహణము అనబడును.

లేక వేదాంతమో వాణిజ్యమో అంతకన్నా ముఖ్యమని ఆలస్యము చేసినచో, మనము ఏర్పరచుకొనిన‌ కార్యక్రమము కర్తవ్యము‌ కాకపోవును.

మన ఇష్టము, అభిమానము వేరు. మనతో పనిచేయుచున్న‌ ప్రకృతి వేరు. ప్రకృతిలో పొరపాటుండదు. ఇష్టాఇష్టములలో పొరపాట్లుండును. వేదాంతము‌ ఎంత గొప్పదియైనను, ఆహారమునకు‌గల వేళలు అంతకన్నా గొప్పవి కాకపోవచ్చును గాని అంతకన్నా సత్యములు.

అయితే ఒకమారు సర్వాంతర్యామి స్మరణము కలిగించు కథలను ఆత్మతో గ్రోలుటకు అలవాటు పడినవాడు లోకవృత్తాంతములైన ఇతర కథలను గ్రోలుటకు యత్నము చేయడు. అవి వానికి గరళము గ్రోలుట వలె నుండును.

........✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

02 Sep 2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 143



🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 143  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సప్తర్షి మండలము - కాలగణనము 🌻

ధ్రువము చుట్టును నక్షత్ర మండలము మొలత్రాడుగా భూమధ్యరేఖ వెంట తిరిగివచ్చుటకు ఇరువదియారువేల (26,000) సంవత్సరములు పట్టును. 

సప్తర్షులు నక్షత్ర మండలమున కెదురుగా ఒకమారు తిరిగి వచ్చినట్లు కనిపించుటకు ఇరువదియారు వందల (2,600) సంవత్సరములు పట్టును. 

ఇందు శతాబ్దుల , సహస్రాబ్దుల కొలతలు కొలుచుటకు వీలగును కనుక యుగములలో జరిగిన కథలను కొలుచుట కిదియే ఆధారము. 

ఉదాహరణకు : " ఆసన్ మఖాసు , మునయః యుధిష్ఠిరే, శాసతి పృథివీం " అని వరాహమిహిరా చార్యులు చెప్పిరి. మఖా నక్షత్రమున సప్తర్షులుండగా యుధిష్ఠిరుడు భూమిని పాలించెనని యర్థము. దీనిని బట్టి "షట్ ద్విక పంచద్వియుతః , శకకాలస్తస్య రాజ్ఞస్య " అని వరాహమిహిరుడు యుధిష్ఠిరుని కాలమును సాధించెను. శకకాలమైన శాలివాహన శకమునకు 2526 సంవత్సరములకు పూర్వము యుధిష్ఠిరుడు పరిపాలించెనని సాధించెను. 

దీనిని బట్టి కలియుగమునందు ఇప్పటి కెన్ని సంవత్సరములు గడచినవో తెలియును. ధర్మరాజు పరిపాలన అంతమగుటతో కలియుగ మారంభించెను. ఈ గణనము నాధారముగా గొనియే ఇప్పటి పంచాంగ కర్తలు కలియుగ సంవత్సరములను నిర్ణయించుచున్నారు. 

ఈ విధముగా ధ్రువుని , వాని‌ననుసరించు సప్తర్షులను ఆధారముగా గొని , యే యుగమందలి కథల కాల నిర్ణయమునైనను చేయవచ్చును. 

పురాణమందలి కథల కాలమిట్లే నిర్ణయింపబడెను.

భూమిపై పరిభ్రమణము ననుభవించు వారి కందరికిని పునర్జన్మ లుండును. ధ్రువుడు పరిభ్రమింపడు కనుక అతనికి పునర్జన్మ ముండదు.

...... ✍🏼 మాస్టర్ ఇ.కె. 🌻
ధ్రువోపాఖ్యానము
🌹 🌹 🌹 🌹 🌹


01 Sep 2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 140


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 140  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

సృష్టిలో ఒక్కొక్క డొక్కొక్క విధముగా వర్తించును. ఎందరిని గూర్చి తెలిసికొన్నను , ఎన్ని శాస్త్ర రహస్యములు నేర్చినను , తెలిసికొన వలసినది మిగిలియే యుండును.

వాని యందు సర్వాంతర్యామిగా నున్న తత్త్వమొక్కటే గనుక దాని వైపునకు మనస్సు మరలింపజేయ గలిగినచో తెలియవలసినది మరియొకటి యని యుండదు. ఆ మార్గమలవాటు పడిన వెనుక మరియొకటి ఏదియును మనస్సునాకర్షింపదు‌.

🌻. ఆశీర్వచనం 🌻

నేను ఏనాడు దేనికి భయపడలేదు
మీరు భయపడకుందురు గాక!
నా పెదవులపై ఏనాడు చిరునవ్వు చెదరలేదు...
అట్టి చిరునవ్వుతో మీరూ ఉందురు గాక!

శక్తులూ, సామర్థ్యాలు, తెలివీ తేట
సత్కర్మాచరణకు వినియోగించి 
ధన్యులగుదురు గాక!... 

"నేను" అనే ఒకే వెలుగులో మీరు
మేల్కాంచి "నా" వెలుగులో నడచెదరు గాక!  ............✍ మాస్టర్ ఇ.కె. 🌻 

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 139




🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 139   🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భాగవతము-అనుభూతి 🌻

కలి యుగమున కష్టజీవనులకు కావలసినది అనుభూతి. అది భగవంతునికి సంబంధించినది. దీనిని‌‌ కొంత ఇచ్చినను, విజ్ఞానమెక్కువగా ఉన్న గ్రంథములు చదివినపుడు కలియుగ మానవుల మనస్సు అనుభుతి నుండి విజ్ఞాన శాఖల మీదికి చెదరిపోవును.

పాండిత్యమను వలలో చిక్కి, గుణదోష‌ విమర్శ అను సంకెళ్ళలో బంధింపబడుట‌ జరుగును. మరియు పొట్టపోసికొనుట, డబ్బు సంపాదించుటయే ప్రధాన లక్ష్యములుగా బ్రతుకు సాగించు ‌కలియుగ మానవులు తమ కర్తవ్యములను, వృత్తివిధులను, ధర్మమును డబ్బు సంపాదించి తమ కోరికలు తీర్చుకొనుటకు‌ సాధనములుగనే పరిగణింతురు. డబ్బు, గృహావసరములను కర్తవ్యపాలనము, ధర్మాచరణమునకై సమన్వయింప‌ జాలరు.

కావున, ధర్మము ‌కన్నా ధనము, అధికారము,‌ కీర్తి, ఐహికముగా పైకి వచ్చుట వీటికే ప్రాధాన్యమొసగి మందబుద్ధులయి, జడులై‌ అల్పాయుష్కులగుట తప్పదు. వీరికి కావలసినవి సుఖశాంతులు. కాని సుఖశాంతులను ఏ విషయమొసంగునో, ఇవి ఎట్లు లభించునో‌ వీరికి తెలియదు.

సుఖశాంతులను కలిగించునది దైవానుభూతి‌ ఒక్కటే. ఇట్టి అనుభూతికి‌ సులభము, తీయనైన బోధయుండవలయును.

వేదాంత గ్రంధములకు‌ ఇట్టి సమర్థత లేదు. ఇంద్రియముల ఆకర్షణకు లోనై‌ జీవించువారిని ఈ అనుభూతిని అందించుటకు‌ అంతకన్నా‌ గొప్పదయిన, మధురమయిన‌ ఆకర్షణ వైపు లాగవలెను. అందుకే నారదుడు వ్యాసునకు భాగవతమును ఉపదేశించి వ్రాయించెను...

... ..✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

28 Aug 2020