🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 157 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. భావ బలము - 5 🌻
నాలో పరమప్రేమ నెలకొన్నచో, నిన్ను నేను అభిమానించునెడల, నిన్ను నా వస్తువు వలె భావించి బంధింప ఇష్టముండదు. నీపై పెత్తనము చెలాయింప ఇష్టముండదు. దీనికి కారణము, నీ యందే నా అభిమానము కాని, నిన్ను నా వస్తువును వలె గావించుకొనుట యందుగాదు. ఇపుడు, నీ సాన్నిధ్యములో నేను ఆనందించెదను. ఇదియే నాకు కలుగు హితము. నీవు దగ్గరలేనపుడు, నిన్ను గూర్చిన స్మృతుల తీపి నాకు దక్కును.
నీ సాన్నిధ్యము వలన నాకు కలుగు ఆనందము, నా జీవితములో నిర్వర్తించు సమస్త కార్యములకును తన పరిమళమును వెదజల్లును. మనచే ప్రేమింపబడిన వ్యక్తి కనపడినపుడు గాని, అతని గూర్చి తలంపు మన మనస్సున మెదలినగాని, ఈ లోకమునందలి సర్వమును దివ్యగానమగును.
గులాబీలకు గల ముళ్ళను మనము పట్టించుకొనము. గులాబీనే అభిమానించెదము. పరమప్రేమ సామ్రాజ్యమున ఒరుల సద్గుణములతోనే మనకు ప్రమేయము గావున, మనలోపములకు గులాబీలకు గల ముండ్లకు వాటిల్లు ఫలితమే ప్రాప్తించును. అనగా అవి పట్టించుకొనబడవు. గులాబీలను గాంచి ఆనందింప వలసి యుండుట వలన, ముళ్ళ యెడల భీతి చెందుటకు మనకు సమయము చాలదు. మన చుట్టు ఉన్న వారిలో కొందరు ఆవేశపరులయిన వారుండవచ్చును. వారి ప్రవర్తన పశుత్వముతో గూడి ఉన్నపుడు, దాని యెడల మనస్సునుంచక, తటస్థముగా ఉండుట అభ్యసింపవలెను.
ఈ అభ్యాసము దృడపడవలెనన్నచో, పరమ ప్రేమ ద్వారమున, మనచుట్టు ఉన్న సత్పురుషుల సాన్నిధ్యములో ఆనందించుటయే మార్గము.......
No comments:
Post a Comment