శ్రీ శివ మహా పురాణము - 224


🌹 . శ్రీ శివ మహా పురాణము - 224 🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

49. అధ్యాయము - 4

🌻. కాముని వివాహము - 3 🌻

తద్బాహుయుగలం కాంతం మృణాల యుగలాయతమ్‌ | 
మృదు స్నిగ్ధం చిరం రాజాత్కాంతి లోహ ప్రవాలవత్‌ || 22

నీల నీరద సంకాశః కేశపాశో మనోహరః | 
చమరీ వాలభరవద్విభాతి స్మ స్మరప్రియః || 23

ఏతా దృశీం రతిం నామ్నా ప్రాలేయాద్రి సముద్భవామ్‌ | 
గంగామివ మహాదేవో జగ్రా హోత్ఫుల్ల లోచనః || 24

చక్రపద్మాం చారు బాహు మృణాల శకలాన్వితామ్‌ | 
భ్రూయుగ్మ విభ్రమవ్రాత తనూర్మి పరిరాజితామ్‌ || 25

సుందరములు, మృదువైనవి, సిగ్ధమైనవి అగు ఆమె బాహువులు తామర తూడుల వలె పొడవుగా నుండి బంగారు వన్నెతో పగడముల కాంతులతో అతిశయించి ప్రకాశించెను (22).

నల్లని మేఘముల వలె మనస్సును హరించే ఆమె కేశపాశము చమరీమృగము యొక్క గుబురైన తోకవలె భాసించెను (23).

వికసించిన నేత్రములు గల మన్మథుడు ఆ రతీ దేవిని, మహాదేవుడు హిమవత్పర్వతమునుండి పుట్టిన గంగను స్వీకరించెను (24).

ఆమె స్తనములనే పద్మములు కలిగినది, సుందర బాహువులనే తామరతూడులు గలది, కనుబొమల విరుపుల వరుసలనే పిల్ల కెరటములతో ప్రకాశించునది అగు సరస్సువలె విరాజిల్లెను (25).

కటాక్ష పాత తుంగౌఘాం స్వీయ నేత్రోత్పలాన్వితామ్‌ | 
తనులోమాంబు శైవాలాం మనోద్రుమవిలాసినీమ్‌ || 26

నిమ్న నాభిహ్రదాం క్షామాం సర్వాంగరమణీయకామ్‌ | 
సర్వలావణ్యసదనాం శోభమానాం రమామివ || 27

ద్వాదశాభరణౖ ర్యుక్తాం శృంగారైష్షోడశైర్యుతామ్‌ | 
మోహినీం సర్వలోకానాం భాసయంతీం దిశో దశ || 28

ఇతి తాం మదనో వీక్ష్య రతిం జగ్రాహ సోత్సుకః | 
రాగాదుపస్థితాం లక్ష్మీం హృషీ కేశ ఇవోత్తమామ్‌ || 29

ఆమె వాడి చూపులనే గొప్ప ప్రవాహము గలది, నేత్రములనే నల్ల కలువలు గలది, సన్నని రోమావళి అనే నీటినాచు, గలది, మనోవృత్తులనే వృక్షములతో (ఒడ్డుపై నున్నవి) ప్రకాశించునది (26).

తోతైన నాభి అనే సరస్సు గలది అగు నది వలె ప్రకాశించెను. సన్నని ఆ యువతి సర్వావయములయందు రమణీయముగా నుండెను. లావణ్యము ఆమె యందు నివాసముండెను. ఆమె లక్ష్మివలె ప్రకాశించెను (27).

పన్నెండు ఆ భరణములను ధరించి, పదునారు అలంకారములను చేసుకొని, సర్వలోకములను మోహింపజేయుచూ, పది దిక్కులను ప్రకాశింపజేయుచున్న (28)

ఆ రతిని చూచి, ప్రేమతో దగ్గరకు వచ్చి ఉత్తమమగు లక్ష్మిని విష్ణువు వలె, మన్మథుడు ఆమెను ఉత్సాహముతో స్వీకరించెను (29).

నోవాచ చ తదా దక్షం కామో మోద భవాత్తతః | 
విస్మృత్య దారుణం శాపం విధిదత్తం విమోహితః || 30

తదా మహోత్సవస్తాత బభూవ సుఖ వర్ధనః | 
దక్షః ప్రీత తరశ్చాసీన్ముముదే తనయా మమ || 31

కామోsతీవ సుఖం ప్రాప్య సర్వదుఃఖ క్షయం గతః | 
దక్షజాపి రతిః కామం ప్రాప్య చాపి జహర్ష హ || 32

రరాజ చ తయా సార్ధం భిన్న శ్చారు వచస్స్మరః | 
జీమూత ఇవ సంధ్యాయాం సౌదామిన్యా మనోజ్ఞయా || 33

ఇతి రతి పతిరుచ్చై ర్మోహయుక్తో రతిం తాం హృదుపరి జగృహే వై యోగ దర్శీవ విద్యామ్‌ |
రతిరపి పతిమగ్య్రం ప్రాప్య సా చాపి రేజే హరిమివ కమలా వై పూర్ణ చంద్రో పమాస్యా || 34

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామవివాహవర్ణనం నా మ చతుర్థోsధ్యాయః (4).

అపుడు మిక్కిలి మోహితుడై యున్న మన్మథుడు బ్రహ్మచే ఈయబడిన దారుణమగు శాపమును ఆనందములో నుండుటచే మరచి, దక్షునితో చెప్పలేదు (30).

వత్సా! అపుడు సుఖమును వర్ధిల్ల జేయు మహోత్సవము ప్రవర్తిల్లెను. తన కుమార్తె యొక్క ఆనందమును చూచి, దక్షుడు మిక్కిలి సంతసిల్లెను (31).

కాముడు మిక్లిలి సుఖమును పొందెను. ఆతని దుఃఖములన్నియూ తొలగిపోయెను. దక్షుని కుమార్తె యగు రతి కూడ కాముని పొంది ఆనందించెను (32).

సుందరముగా మాటలాడు మన్మథుడు ఆమె గూడి, సంధ్యాకాలమునందు సుందరమగు మెరపుతో గూడిన మేఘము వలె ప్రకాశించెను (33).

మిక్కిలి మోహముతో కూడిన మన్మథుడు రతిని, యోగి ఆత్మ విద్యను వలె, హృదయ సింహాసనమునందధిష్ఠింప జేసెను. పూర్ణచంద్రుని వంటి ముఖము గల లక్ష్మి హరిని వలె, రతి గొప్ప భర్తను పొంది మిక్కిలి ప్రకాశించెను (34).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు రెండవది యగు సతీఖండములో కామ వివాహ వర్ణనమనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

15 Sep 2020

No comments:

Post a Comment