నారద భక్తి సూత్రాలు - 95



🌹.  నారద భక్తి సూత్రాలు - 95  🌹 

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్ధాధ్యాయం - సూత్రము - 66

🌻 66. త్రిరూప భంగపూర్వకం నిత్య దాస్య

నిత్యకాంతా భజనాత్మకం ప్రేమ కార్యం ప్రేమైవ కార్యమ్ ॥

భక్తి మూడు రూపాలుగా తామసిక, రాజసిక, సాత్వికాలుగా ఉంటుంది. మరల సాత్విక భక్తిలో ఆర్త, అర్ధార్ధి, జిజ్ఞాసు భక్తి అని మూడు రకాలుగా ఉంటుంది.

ఇవన్నీ ఈ చెప్పిన క్రమంలో సోపానాలుగా చెసుకొని ఎక్కి దాటిపోయ పద్ధతిలో భక్తి సాధన ఉంటుంది. చివరకు భక్తి అనేది కేవలం భగవంతుని మీద ప్రేమ చాటడానికే అన్నట్లు స్థిరపడుతుంది. ఇట్టి కేవల భక్తిని సాధించడానికి యజమాని పట్ల సేవకుడు చూపే వినయ విధేయతలు మాదిరి ఉండాలి. దైవేచ్చ ప్రకారం బాధ్యతగా నడచుకోవాలి. ప్రతి ప్రాణిలోను భగవతుడిని దర్శించ గలగాలి. పరోపకార సేవలను భగవదర్పణగా, భగవదారాధనగా భావించాలి.

తన భక్తిని భగవంతుడు అంగీకరిసాడా ? అని అనుమానం రాకూడదు. “భగవంతుడి కోసం ఏమైనా ఇస్తాను, ఏమైనా చేస్తాను, ఎన్ని బాధలనైనా అనుభవిస్తాను” అనే త్యాగబుద్ధితో ఉండాలి.

భగవంతుని నుండి ఏమీ ఆశించ కూడదు, ఒక్క ప్రేమ తప్ప. తను మన ధనాలను అర్పణ చేసి, కర్తృభావం లేకుండా భగవత్సేవను కైంకర్య పద్ధతిగా చేయాలి. భగవంతునిమీద అమితమైన ప్రీతిని పెంచుకోవాలి. ప్రేమార్ధమే భగవంతుని ప్రేమించాలి.

ఈ విధంగా చేస్తే గౌణభక్తి ముఖ్యభక్తిగా మారుతుంది. ముఖ్యభక్తుడి విషయంలో భగవత్సేవలో కైంకర్యం, అకారణ ప్రేమ, ఇవన్నీ సహజంగానే ఉంటాయి, అప్రయత్నంగా జరుగుతాయి.

సాధన దశలో అడుగడుగునా భగవదనుగ్రహం ఉంటుంది. ముఖ్యభక్తుడిని పరాభక్తిలో స్టిరం చేసే భగవదనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది.

పరాభక్తి మాత్రం సాధన యొక్క ఫలితం కాదు. అది సిద్ధమై ఉన్నది. ముఖ్యభక్తి అయితే భక్తి ఫలంగా, ఆత్మ తత్తానుభవంగా సాధ్యమవుతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

15 Sep 2020

No comments:

Post a Comment