🌹 31. గీతోపనిషత్తు - మత్సరత్వము - ప్రజ్ఞను సుప్రతిష్టము చేయుటకు ధర్మాచరణము దైవారాధనమని తెలియవలెను. దైవమును చింతించువాడు స్థితప్రజ్ఞుడగును. విషయములను చింతించువాడు సంసారి యగును 🌹
ఇంద్రియములను ఇంద్రియార్థముల వెంట పరిగెత్తకుండ నియమించుటకు భగవానుడొక ఉపాయమును తెలుపుచున్నాడు.
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా || 61 ||
ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషూపజాయతే |
సంగాత్సంజాయతే కామః కామాత్క్రోధోஉభిజాయతే || 62 ||
క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి || 63 ||
అది ఏమన దైవమునందు చిత్తమునకు రుచి ఏర్పరచుటయే. మనస్సు రుచిని కోరును. రుచించు విధముగ మనస్సునకు దైవము నందించవలెను. అపుడు మనస్సు దైవమున రుచి గొనును.
ఈ ఉపాయము తెలిసిన ఋషులు వివిధములైన రుచి మార్గముల నేర్పరచిరి. భజనము, సంకీర్తనము, పూజనము, శ్రవణము, అభిషేకములు, హోమములు, స్తోత్రములు మొదలగు వేలాది పద్ధతులను అందించుటలో ఋషులుద్దేశించిన దేమనిన, అందు జీవునకేది రుచించునో దాని ద్వారమున దైవమును రుచిగొని దైవాసక్తుగునని.
ఒక్కసారి దైవమునందాసక్తి ఏర్పడినచో అది ధర్మమునం దాసక్తిగ కూడ నేర్పడి క్రమశః ఇంద్రియముల నుండి తరింపు ఏర్పడును. 'మత్పరుడవై' యుండుము, అని భగవానుడు బోధించుటలో చక్కని ఉపాయము కలదు.
ప్రజ్ఞను సుప్రతిషసము చేయుటకు ధర్మాచరణము దైవారాధనమని తెలియవలెను. దైవమును చింతించువాడు స్థితప్రజ్ఞు డగును. విషయములను చింతించువాడు సంసారి యగును. దైవమునందాసక్తి దైవమును కోరును.
ప్రాపంచిక విషయములందాసక్తి వివిధ విషయములను కోరును. కోరిక తీరినచో మదము పెరుగును. తీరనిచో కోపము పెరుగును. రెండు విధములుగ అవివేకమావరించును. అవివేకము కారణముగ మోపు కలుగును. మోపు కారణముగ బుద్ధి నాశనము సంభవించును. అట్టివాడు సమ్మోహితుడై నశించును. ఈ విధముగ విషయవాంఛ పతనమును గావించును. కర్తవ్యమును మరచి కోరికను పెంచు కొనువారికి ఇట్టి వినాశము తప్పదని భగవంతుని హెచ్చరిక.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
15 Sep 2020
No comments:
Post a Comment