🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 54 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 18 🌻
చాలామంది ఏమనుకుంటుంటారంటే, వివాహం చేసుకుని పిల్లల్ని కనటం ఒక్కటే సంసారం అని అనుకుంటూ వుంటారు. కానీ నిజానికి ఇప్పుడు చెప్పినటువంటి కామోపభోగములు అన్నీ కూడా సంసారమే.
నువ్వు వివాహం చేసుకున్నావా? చేసుకోలేదా? అనేది కాదు అక్కడ ప్రాధాన్యత. శరీరమును ధరించావు అని అంటేనే, నీకు కామోపభోగం వుండక తప్పదు.
కాబట్టి, అట్టి శరీర పద్ధతి ఏదైతే వుందో, ఆ శరీరమును ధరించి వున్నప్పటికీ, జగత్తు యందున్నటు వంటి అశాశ్వతమైనటువంటి దృష్టి నిలబెట్టుకున్నవాడై, ఈ అరిషడ్వర్గములను ఎవడైతే సమూలముగా నిరసిస్తాడో, స్మృతి పూర్వకంగా నిరసిస్తాడో, వాసనతో సహా నిరసిస్తాడో, నిర్వాసనా మౌన పద్ధతిని ఆశ్రయిస్తాడో, నిష్కామ కర్మను ఆశ్రయిస్తాడో, నిష్క్రియాపరుడై వుండకుండా వుంటాడో,.... సక్రియాత్మకుడై వుండాలి, సామన్య ధర్మాన్ని నడుపుతున్నవాడై వుండాలి.
సామన్యమైన కర్మాచరణ, కర్తవ్య కర్మాచరణగా చేస్తున్నవాడై వుండాలి, ఏకకాలంలో సాక్షీభూతుడై వుండాలి.
అట్లా ఎవడైతే జీవితాన్ని నిలబెట్టుకో గలుగుతాడో, బాలన్సు [balance] చేసుకోగలుగుతాడో, సమత్వస్థితిలో నిలుపుకో గలుగుతాడో, సమదర్శన పద్ధతిగా వుంటాడో, శాంత సమరస సత్క్రియా శీలుడై వుంటాడో, వాడు మాత్రమే పరతత్వమునకు సంబంధించినవి కావని కూడా వదలగలుగుతాడు.
వీటన్నింటిని కూడా పరతత్వం దృష్ట్యా, నువ్వు అందవలసినటు వంటి, పొందవలసినటువంటి, లక్ష్యమైనటువంటి, ఆత్మనిష్ఠా, బ్రహ్మనిష్ఠా, పరబ్రహ్మనిర్ణయమనే పరతత్వమును ఆశ్రయించేటటు వంటివి కావు కాబట్టి ఇవి, వీటిని నిరసించాలి. నీవంటి ఉత్తమ గుణములు కలవాడు దొరకుట దుర్లభము.
సులభము, దుర్లభము అని రెండు పదాలు ఎక్కడికక్కడ మనకి వేదాంతంలో లభిస్తూ వుంటాయి. సులభము అంటే, ‘సులభము’ అంటే ఏంటి? సు-లభ్యత. ఎక్కడ పడితే అక్కడ లభించేది.
ఎక్కడ పడితే అక్కడ సులభంగా లభించేది. కష్టపడకుండా పొందగలిగినది ఏదైతే వుంటుందో, దానికి సులభం అని పేరు. కష్టపడైనా సంపాదించగలిగేది ఏదైతే వుంటుందో అది దుర్లభం. నువ్వు ఎన్ని కష్టాలైన సరే పడి దానిని సంపాదించాలి. అప్పుడు దానిని దుర్లభం అంటాం.
ఏ కష్టం పడకుండా లభించేది వుందనుకోండి దాన్ని సులభము అని అంటాము. అర్థమైందా అండీ? కాబట్టి, ఎంత కష్టమైనా సరే మానవుడు, ఈ ఆత్మనిష్ఠకి, ఈ బ్రహ్మనిష్ఠకి, ఈ పరబ్రహ్మ నిర్ణయం అనే పరతత్వాన్ని పొందడానికి కావలసిన అధికారిత్వమును పొందడానికి, ఎన్ని కష్టాలు పడైనా సరే, తనని తాను ఈ జగదాశ్రయ తత్వమునుంచీ, జగదాశ్రయ ఆకర్షణ నుంచీ, అరిషడ్వర్గ ఆకర్షణ నుంచీ, త్రిగుణ మాలిన్యం నుంచీ, తనని తాను బయటపడ వేసుకోవాలి.
“ఉద్ధరేత్ ఆత్మనాత్మానాం ఆత్మాన మవసాధయేత్” - ఎవరికి వారు ప్రయత్న శీలురై బయట పడాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్తున్నారు.
నీవు తెలిసికొన దలచిన ఆత్మతత్త్వం గురించి చెప్పుచున్నాను వినుము. ఆత్మ అతి సూక్ష్మ మగుట చేత సులభముగా తెలియబడక పోవుటచే దుర్ధర్శుడనబడును. ఈ ఆత్మ ప్రాణుల బుద్ధిగుహ యందు ప్రవేశించి గుప్తముగా యున్నది. శబ్దాది విషయముల చేత మరుగుపరచబడియున్నది.
సనాతనమైన ఆ ఆత్మను ధీరుడైన విద్వాంసుడు ఆధ్యాత్మ యోగచేత తెలిసికొనును. అనగా శబ్దస్పర్శాది విషయముల నుండి ఇంద్రియములను మరల్చి చిత్తమును ఆత్మయందు ప్రవేశపెట్టుటయను యోగము ద్వారా ఆత్మను తెలిసికొనును.
అట్టి ఆత్మసాక్షాత్కారమైన వారు హర్షశోకములు మొదలగు ద్వంద్వములను విడచి నిర్వికారస్థితి యందు ఉండెదరు. ఆత్మ తమ బుద్ధి గుహయందే వున్నప్పటికినీ విషయాదులతో కూడుకొని యుండు సాధారణ మానవులు తెలిసికొనలేక యున్నారు. - విద్యా సాగర్ స్వామి
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
15.Sep.2020
No comments:
Post a Comment