సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 20

🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 20 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃. సాధనా చతుష్టయము - 2 🍃

103. ప్రాణవాయువును బ్రహ్మరంద్రమున నిల్పుటయే యోగధారణ. మనస్సును ఆత్మ స్థానమైన హృదయమున నిల్పి ఏకాగ్రతతో ధ్యానం చేయుటయే యోగధారణ. ఇందుకు ఈశ్వరానుగ్రహము లభించవలెను.

104. యోగులలో డంబాచారులు, ముముక్షువులను రెండు రకములు ఉందురు. డంబాచారులు వస్తువులపై, విషయముపై, ఆసక్తి కలిగి యుందురు. ముముక్షువులు ఇట్టి ప్రయత్నములు విడనాడి ఎల్లప్పుడు ఆత్మ చింతనలో ఉందురు. డాంబిక యోగులు కొందరు, వేషధారులు కొందరు, ఉపన్యాసకులు, తమగొప్పలు చెప్పుకొనేవారు; వీరు రుద్రాక్షలు ధరించి గంజాయి త్రాగుచు, కాషాయాంబరములు ధరించి యుందురు.

105. నిరంతర సాధన వలన యోగులకు యోగశక్తి లభించును. ఆ శక్తితో ప్రాణవాయువును భ్రూమధ్యమందు నిల్పి మనస్సుతో పరమాత్మను ధ్యానించవలెను.

106. యోగము యొక్క పరాకాష్ఠ యోగసిద్ధి పొందుటయే. సిద్ధిపొందిన వారు ఇక సాధన చెయవల్సిన అవసరము లేదు. వీరు జీవన్ముక్తులు. లోక కళ్యాణం కొరకు కార్యములు చేయుచుందురు. వీరికి పునర్జన్మలుండవు.

107. ఆధ్యాత్మికం అనగా భౌతిక విషయములలో మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, జీవుడు, పరమాత్మ, అనువిషయములను గూర్చి విశ్లేషించి, సాక్షియగుట. దీనినే ప్రత్యగాత్మ అందురు. ఇదే జీవుని యొక్క వాస్తవ రూపము. భోగములు, వాసనలు నశించేవే. అనగా క్షరములు. శాశ్వతము, శ్రేష్ఠము, నిర్మలము, నాశరహితమైన ఆత్మయే అక్షరము. అనగా నాశనము లేనిది.

108. యోగవిశిష్ఠతను గూర్చి పురాణ ఇతిహాసములు, ఉపనిషత్తులు, గీత, శ్రీయోగవాసిష్ఠము, పతంజలి యోగము, వ్యాసుని జ్ఞాన సిద్ధాంతములు, నారద భక్తి సూత్రములు, స్మృతులు, శ్రుతులు, మార్కండేయ, విష్ణుపురాణములు, భారత, రామాయణ, భాగవతములందు వివరింపబడినది.

109. యోగవిశిష్ఠత: ఇది పురుషార్థమగు మోక్షమును పొందుటకు మార్గము. బుద్ధి నిర్మలమగుటకు యోగాభ్యాసము అవసరము. ఇది శాశ్వతమైన జ్ఞాన భాండాగారము. సృష్టి ఆరంభమునుండి గంగా ప్రవాహము వలె నిరంతరము ప్రవహించుచున్నది. యోగజ్ఞానము జ్ఞానములన్నింటికి శ్రేష్ఠమైనవి. యోగి మానవులందరిలో గొప్పవాడు. సాధనలన్నింటిలో యోగసాధన గొప్పది. ఇది సాక్షాత్‌ భగవంతునిచే ప్రత్యక్షముగా ప్రకటింపబడినది. ఇది మోక్షప్రదాయిని. నొసటి వ్రాతను జాతకమును చెరిపివేయునది యోగము.

యోగము కుల, మత, జాతి, కాలము, దేశము మొదలగు వాటికి అతీతమై సర్వజనామోదమైనది. సాధన, నిష్ఠ, అనుష్ఠానము, సమన్వయ దృష్టి, ఆహార నియమములు, క్రమ శిక్షణ, సర్వులకు ఆచరణ యోగ్యము.
🌹 🌹 🌹 🌹 🌹